నీ ప్రశ్నకు నీవే జవాబు తెలుసుకో!

నీ దాహం తీరాలంటే నీవే నీటిని తాగాలి.
నీ ఆకలి తీరాలంటే నీవే అన్నం తినాలి.
నీ అలసట తీరాలంటే నీవే నిద్రపోవాలి.
నీ ప్రశ్నకు నీవే జవాబు కనుగొనాలి.

ఏదో ఒకటి సాధించాలంటే ఎన్నో పుస్తకాలను చదవాలి. ఇంటర్వ్యూలలో ఎన్నెన్నో ప్రశ్నలకు జవాబులు చెప్పాలి. సభల్లో సమావేశాల్లో సత్కారాలు పొందాలంటే శ్లోకాలు, పద్యాలు రావాలి. వాటికి తోడు కంచుకంఠం, వాక్చాతుర్యం ఉండాలి. రాజకీయాల్లో రాణించాలంటే ఇంటింటికీ తిరిగి, అందరికీ దండాలు పెట్టాలి. వాగ్దానాలు చేయాలి, డబ్బులు వెదజల్లాలి. ఇతర అభ్యర్థులపై బురద చల్లాలి, అవసరమైతే వెన్నుపోటు పొడవాలి, ఆ తరవాత అధికారం పొందాలి. ఆపైన ప్రతిపక్షం వారు బురద చల్లితే ఓర్పుగా, నేర్పుగా ప్రజల నుంచి క్లీన్ చిట్ పొందాలి. ఇంతా చేసి పైపైకి ఎగబ్రాకితే దేశ ప్రధానిగానో, అధ్యక్షునిగానో కావచ్చు. అయితే మనశ్శాంతి, కంటినిండా నిద్ర దక్కుతాయో లేదో చెప్పలేం.

కలెక్టర్లు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, కవులు, పండితులు, కోటీశ్వరులు, కటిక దరిద్రులు... అందరూ స్వచ్ఛమైన భక్తితో పూజించే పదవిని, శాశ్వతానందాన్ని పొందిన శ్రీరమణమహర్షి చేసినదల్లా ఒకేఒక్క చిన్న ప్రశ్నకు జవాబును స్వయంగా కనుగొనటమే. దానికోసం ఎక్కడికీ పోవలసిన పనిలేదు. డ బ్బు ఖర్చు చేయవలసిన పనిలేదు, పుస్తకాలను చదవాల్సిన అవసరం లేదు. పండితులతో చర్చించనవసరంలేదు. బాబాలకు, స్వాములకు మొక్కాల్సిన పనిలేదు. ఏవీ అక్కరలేదు. పైగా మనం కనుగొన్న జవాబును ఇతరులకు చెప్పవలసిన పని కూడా లేదు - ఆ ఒక్క ప్రశ్నకు జవాబును కనుగొన్నామా - ఇక హృదయం ఆనందంతో పొంగిపోతుంది, ముఖం దివ్యకాంతితో కళకళలాడుతుంది, పరిసర ప్రాంతాలు శక్తిమంతమవుతాయి, ఆ చోటు పుణ్యక్షేత్రమవుతుంది, ప్రతి పలుకు అమృతగుళిక అవుతుంది, ప్రతి కదలిక చూపరులకు నయనానందం కలిగించే నాట్యమవుతుంది. మన దృక్కు, ఉనికి... ప్రతిజీవికి ప్రశాంతతను, ప్రేమను పంచగలిగే తరగని నిధి అవుతుంది.

ఆ ఒక్క ప్రశ్న ‘నేనెవరు?’
దాని జవాబు నీలోనే ఉంది. నీవు చేయవలసిందల్లా ‘ఉల్లిపొరలను కత్తితో తీసివేసినట్టే’... నిన్ను కప్పిన పొరలను... ఆత్మవిచారమనే సాధనంతో తీసివేయాలని రమణమహర్షి చెప్పారు. ఆయన ఆదర్శమైన జీవితమే మనకు ఒక చక్కని ఋజువు.

No comments: