Showing posts with label సందేశం. Show all posts
Showing posts with label సందేశం. Show all posts
జాతకాన్ని గూర్చి, నాడీగ్రంథాలను గూర్చి ఒకమారు భక్తులు చర్చిస్తుంటే ఒకరి ప్రశ్నకు సమాధానంగా రమణ మహర్షి - ‘‘నేను స్కందాశ్రమంలో ఉండగా జటాస్వామి ఒక వ్యక్తిని చూశారు. అతను హస్తసాముద్రికంలో, జాతకం చూసి చెప్పడంలో నేర్పరి అట. ఆయన జటాస్వామి జాతకం చూశాడట. జటాస్వామికి చాలా నచ్చాడు. జటాస్వామి ఆ సాముద్రికుణ్ణి నా దగ్గరకు పిలుచుకుని వచ్చి ఈయన సాముద్రికంలో, జాతకం చూసి చెప్పడంలో గొప్పవాడు. మనం ఎంత ఖర్చుపెట్టినా ఇలాంటివాడు దొరకడు. ఆయన చెప్పినవన్నీ సరిగ్గా ఉంటాయి. ఆయనగా మన దగ్గరకు రావడం మన అదృష్టం. మీ చెయ్యి చూపండి, మీ భవిష్యత్తంతా ఆయన చెప్తాడు’’ అన్నాడు. నేను చూపలేదు. జటాస్వామి ఎంత నచ్చచెప్పటానికి ప్రయత్నించినా నా చెయ్యి చూపలేదు. పైగా నేను ‘‘మనకు వర్తమానమే తెలీదు. ఇక భవిష్యత్తును గురించి ఆరాటం ఎందుకు?’’ (పేజీ 179-180 అనుదినమును రమణులతో) అన్నాను.

గత జన్మను గూర్చి, పునర్జన్మను గూర్చి, మరణానంతర స్థితిని గూర్చి కొందరు మహర్షిని అడిగేవారు. అలాంటి ప్రశ్నే వేసిన గజేంద్ర మెహతాతో ‘‘ప్రస్తుతాన్ని తెలుసుకుంటే భవిష్యత్తును తెలుసుకుంటావు. ఎవరికీ ఏ అనుమానమూ లేని ప్రస్తుతాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడనివాళ్ళు, తెలీని గతాన్ని, భవిష్యత్తును తెలుసుకోవడానికి ఎంతో ఆరాటపడతారు’’ (పేజీ 320 - అనుదినమును రమణులతో) అని మహర్షి చెప్పారు.

మానవుడికి ఈశ్వరుడు ఎంతో జ్ఞానం ఇచ్చాడంటూ, ‘‘భవిష్యత్తు జ్ఞానమే తప్ప, రాబోయే నిమిషం సంగతి కూడా తెలియదు అతనికి’’ అంటారు రమణమహర్షి (పేజి 88 - భగవాన్ స్మృతులు). జ్యోతిష్యాన్ని గూర్చిన తలంపులుదయిస్తే దాన్ని మానసిక రుగ్మతగా భావించి వెంటనే వైద్యుని సంప్రదించి మంచి నిద్రాహారాలను తీసికొమ్మని సలహా ఇస్తాడు వివేకానందస్వామి. గ్రహ, నక్షత్ర రాశులను మింగివేయగల రూపమేనట మన స్వస్వరూపము! అంతర్ముఖులై ఆ స్థితిని చేరుకుందాం. గ్రహబలాన్ని మించిన ఆధ్యాత్మిక బలాన్ని పొందుదాం. రమణులు చేసిందీ, చెప్పిందీ అదే. చివరకు ఆయన సాధించిందీ అదే. దేన్ని తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసింది ఏది ఉండదో, దాన్ని ఆయన తెలుసుకున్నారు, మనలను తెలుసుకోమన్నారు.



courtesy by Sakshi
మానవసేవే మాధవసేవ, గ్రామసేవయే రామసేవ, పల్లెసేవయే పరమాత్ముని సేవ అని యావత్‌ప్రపంచానికి చాటిచెప్పిన దార్శనికుడాయన. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అనే నిదానంతో తన భక్తులందరినీ ఏకతాటిపై నడిపించిన భగవత్‌స్వరూపుడాయన. ఏ పనినైనా త్రికరణ శుద్ధిగా చేయాలనే ఆదర్శాన్ని తాను ఆచరించి, తన భక్తులతో ఆచరింప చేసిన పరమాత్ముడాయన. ఆయనే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. 


ప్రార్థన చేసే పెదవులకన్న సాయం చేసే చేతులు మిన్న’ అని సూక్తి. శ్రీ సత్యసాయి పెదవులు ప్రార్థన చేస్తూనే ఉన్నా ఆయన చేతులు ఆపన్నులను ఆదుకున్నాయి. కష్టాలలో ఉన్నవారికి సాయం చేశాయి. ఆయన వితరణ దాహార్తితో పరితపిస్తున్న కొన్ని లక్షల మంది ప్రజలకు గొంతు తడిపింది. చదువు‘కొనలేని’ ఎంతో మంది పేదలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను దేశవ్యాప్తంగా ఆయన స్థాపించిన విద్యాలయాలు ఉచితంగా బోధించాయి. చల్లని తన ప్రేమస్పర్శతో ఎంతోమందికి స్వస్థత చేకూర్చారు. అంతేకాదు, గాలిలో దీపం పెట్టి దానిని రక్షించు భగవంతుడా అని ప్రార్థించమని చెప్పలేదాయన.

‘మీ వంతు ప్రయత్నం చేస్తూనే భగవంతుని ప్రార్థించండి. అప్పుడాయన తప్పకుండా మీ ప్రార్థనను ఆలకిస్తాడు’, అంటూ నిరుపేద రోగుల కోసం అత్యాధునిక సదుపాయాలు గల ఆసుపత్రిని కట్టించారు. ఆయన ధర్మబోధ, సత్యవాక్పరిపాలన, సేవానిరతులు ప్రపంచదేశాలకు పాకాయి. కోటానుకోట్ల మందిని శిష్యులుగా చేర్చుకున్నాయి. ఆయన శిష్యులలో దరిద్రనారాయణుల దగ్గరనుంచి దేశాధినేతల వరకు ఉన్నారు. సమత- మమత-మానవత, ఆధ్యాత్మికత వంటి మేలు గుణాలు కలగలసిన మహానుభావుడు భగవాన్ శ్రీసత్యసాయిబాబా. ఆయన బోధనలు కొన్ని ఈ విశాల విశ్వంలో ఒకటే మతం ఉంది. అదే ప్రేమ మతం. భాష ఒకటే. అదే హృదయ భాష. ఒకే కులం... అదే మానవత. ఒకే న్యాయం- అదే కర్మ అనేది. ఒకే దేవుడు. ఆయన ఒక్కడే మహా శక్తిమంతుడు. మీ దినచర్యను ప్రేమతో ప్రారంభించండి. రోజంతా ప్రేమగానే గడపండి. చేసే ప్రతి పనినీ ప్రేమగా చెయ్యండి.

దినచర్యను ముగించడం కూడా ప్రేమగా ముగించండి. అదే మిమ్మల్ని భగవంతుడికి దగ్గర చేస్తుంది. మన ఆలోచనల్లో ప్రేమ ఉంటే అవి నిజమైన ఆలోచనలు. మనం చేసే పని పట్ల ప్రేమ ఉంటే దానిని మించిన ఉత్తమ ప్రవర్తన మరొకటి లేదు. ఎవరినైనా ప్రేమగా అర్థం చేసుకోవడానికి మించిన శాంతం లేదు. 



అందరిపట్లా ప్రేమ భావను కలిగి ఉండటాన్ని మించిన అహింస మరొకటి లేదు. అసలు ప్రతివారితోనూ ప్రేమగా మసిలేవాడికి హింసతో పని ఏముంది? ప్రేమతో చేసే పనికి మించిన సత్ప్రవర్తన లేదు. ప్రేమతో మాట్లాడు. దానికి మించిన సత్యం లేదు. ప్రేమగా ఆలోచించు. ఫలితం అనుకూలంగా ఉంటుంది.

మతాలన్నీ భగవంతుని చేరుకునే మార్గాన్ని దర్శింప చేసేవే కాబట్టి అన్ని మతాలనూ ఆదరించు. మన కంటికి కనిపించనంత మాత్రాన భగవంతుడు లేనట్లు కాదు. నువ్వు చూసే వెలుగు భగవంతునిదే. నువ్వు దేవుని గురించి విననంత మాత్రాన ఆయన లేనట్లుకాదు. ఎందుకంటే నువ్వు వినే ప్రతి శబ్దమూ దైవం చేసేదే...

దేవుడు ఎవరో నీకు తెలియకపోతే ఆయన లేడని కాదు, ఈ క్షణంలో నువ్వు ఆలోచిస్తున్నావంటే, వింటున్నావంటే, చూస్తున్నావంటే, జీవించి ఉన్నావంటే భగవంతుడు ఉన్నట్లే. ఆయన వల్లనే ఏ పనినైనా చేయగలుగుతున్నావు.

నువ్వు చేసే పనిని ఎవరూ చూడటం లేదనుకోవడానికి మించిన అవివేకం మరొకటి లేదు. ఎందుకంటే భగవంతుడు సర్వాంతర్యామి. ఆయన వెయ్యి కనులతో నిన్ను అనుక్షణం గమనిస్తూ ఉంటాడు. నిస్వార్థ బుద్ధితో నువ్వు చేసే ప్రతి పనినీ భగవంతుడు ఇష్టపడతాడు. ఎంతో ప్రేమతో స్వీకరిస్తాడు. నువ్వు వండే వంటను ప్రేమభావనతో చేస్తే ఆ వంట కచ్చితంగా రుచిగా ఉంటుంది. 



శత్రువులు పెట్టే బాధలన్నింటినీ సహనంతో భరించు, బదులుగా వారికి ఉపకారమే చేయి. ఎట్టి పరిస్థితులలోనూ అపకారం చేయనే వద్దు. నీపై వేసే ప్రతి నిందనూ ఓపికగా విను. వాటన్నింటినీ మౌనంగా స్వీకరించు. దేనికీ బదులు ఇవ్వవద్దు. భగవంతుని కృప బీమా రక్షణ వంటిది. ఆయనను ప్రతి క్షణం సేవిస్తూ ఉండు. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీకు అంతులేనంతటి రక్షణను, భద్రతను ఆయనే కల్పిస్తాడు.

నిన్ను వంచించిన ‘నిన్న’ వెళ్లిపోయింది. ‘రేపు’ వస్తుందో రాదో తెలియని అతిథి వంటిది. ‘నేడు’ నీ ముందున్న ప్రాణ స్నేహితుడు. కాబట్టి నేటిని జాగ్రత్తగా కాపాడుకో. నీ దగ్గర ఉన్నది నీ సంపద కాదు. ఇతరులకు పంచినప్పుడే అది నీదవుతుంది. నీ హృదయం సుందరంగా ఉంటే శీలం బాగుంటుంది. అప్పుడు నువ్వు చేసే ప్రతి పనీ అందంగా ఉంటుంది.

మౌన ం మీ జన్మహక్కు. దీనిలో నుంచి మహత్తర శక్తిని, ఆనందాన్ని అనుభవించడం మీ జీవితాశయంగా మారాలి. పసిపిల్లాడు ఏం మాటలు మాట్లాడుతున్నాడని ఆనందంతో కేరింతలు కొట్టగలుగుతున్నాడు? అప్పటి ఆ స్థితిని చూస్తే మనకెంత ఆనందం కలుగుతుందో కాస్త ప్రశాంతంగా ఆలోచించండి. పసిపిల్లల మౌనంలో, మంచి సాధకుల మౌనంలో ఆనందం వెల్లువలై పొంగుతుంది. అందుకనే ఇకనైనా మౌనంలోని ఆనందాన్ని అనుభవించండి, మీలోని దైవాన్ని కనుగొనండి.

ప్రేమతత్వం, శాంతిగీతం, సేవాపథం, సత్యశోధన బాబా బోధ. మానవ సేవే మాధవ సేవగా, సర్వ మతసారం సాయి అభిమతంగా, సత్యం, సేవానిరత, అహింసలను ప్రబోధించిన సత్యసాయిబాబా మనుషుల మధ్య మెలగిన దైవస్వరూపునిగా భక్తుల హృదయాలలో ఎప్పటికీ నిలచి ఉంటారు. ఆయన పిలుపులోని బంగారాన్ని అందుకుందాం. ఆయన బోధనల నుండి స్ఫూర్తిని పొందుదాం. ఆయన సేవలలోని పరమార్థాన్ని గ్రహిద్దాం. అదే మనం ఆయనకు సమర్పించే ఘననీరాజనం. 



కుటుంబ జీవన వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే సామాజిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది కాబట్టి భార్యాభర్తలు పరస్పర అవగాహనతో ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ కలసి మెలసి ఉండాలని, ప్రేమతో మెలగాలని బాబా బోధించారు. దేశప్రతిష్ఠ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే మహిళలు కీలక పాత్ర వహించాలని, సీతారాములను ఆదర్శంగా తీసుకుని త్యాగం, పరోపకారం, ఆత్మవిశ్వాసం, స్థైర్యం, ధైర్యం వంటి ఉత్తమ లక్షణాలను పెంపొందించుకుంటూ వ్యక్తిగతంగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన 85వ జయంత్యుత్సవాలలో బోధించారు. 

దయాకరో భగవాన్...
బాబా మానవులకే కాదు, జంతువులకు, పశుపక్ష్యాదులకు కూడా తన ప్రేమను పంచారు. ఒకే సమయంలో వివిధమందికి వివిధ ప్రదేశాలలో కనపడటం, ఆయన పటాల నుంచి విభూది, తేనె వంటివి రాలడం, అనేక మంది శారీరక, మానసిక రుగ్మతలను తానే స్వయంగా నయం చేయటం వంటివే కాదు. ఆయన మహిమలు ఇంకా అనేకమున్నాయి. వాటిలో మచ్చుకు కొన్ని. ఓ భక్తుడు... భగవద్దర్శనానికి ఆలస్యం చేశాడు. ద్వారాలు మూసేసే వేళ అయ్యింది. వాటిని మూయమని ఆజ్ఞ అయ్యింది. భక్తుడికి భగవద్దర్శనం కలగలేదు. చేసేదేమీ లేక ఎలుగెత్తి ‘‘దయాకరో భగవాన్, కృపాకరో భగవాన్’’... పాడటం మొదలు పెట్టాడు భక్తుడు.
స్వామి కరుణామూర్తి... రమ్మన్నాడు. కానీ ద్వారాలు తెరచి లేవు.
‘‘తలుపులు తీయకూడదని మీ ఆజ్ఞకదా స్వామీ. మేమెలా తెరవగలం. మీ ఆజ్ఞ మీరలేం’’ అన్నారు ద్వార పాలకులు. ‘‘మీ నిబంధనలు మీవి. మీరనీయను. నాదయ వీడనీయను’’ అన్నారు స్వామి. ‘‘దయా కరో అన్నావు కదా... అనుజ్ఞ ఇచ్చా. రా’’ ఆజ్ఞాపించారు స్వామి.
ద్వారాలు మూసేవున్నా భగవంతుడి పాదాలు చేరాడు భక్తుడు.



courtesy by sakshi

లోకమంతా ప్రేమమయమే

ప్రేమే దైవమని, ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ దైవంఉంటుందని ఎందరో చెప్పారు, ఎన్నో కథలు ఉన్నాయి. ఒక భక్తుడు రమణమహర్షితో, ‘‘స్వామీ! దైవాన్ని ప్రేమించడం మంచిదేగదా. ప్రేమ మార్గంలో ఎందుకు పోకూడదు?’’ అని ప్రశ్నించారు. (పేజీ 371 - శ్రీరమణాశ్రమలేఖలు). అపుడు రమణమహర్షి ‘‘కూడదని ఎవరన్నారు? పోవచ్చును,’’ అంటూ ‘‘మనిషికి ధనం అంటే ఇష్టం, ఆ ధనం కంటే పుత్రుడు, పుత్రుని కంటె తన శరీరం, శరీరం కంటే ఇంద్రియాలూ, ఇంద్రియాలలో కన్ను, దాని కంటే ప్రాణం, దాని కంటే ఆత్మ... ప్రియమైనవి. ప్రియరూపమైన ఆత్మగా తెలుసుకోవటమే దైవాన్ని ప్రేమించటం. తాను సుఖంగా ఉండాలనే కదా దైవాన్ని ప్రేమించదలచటం. తాను సుఖమాయె, సుఖమే దైవమాయె. ఇక ప్రేమించేదెవరిని? ప్రేమే దైవం’’ అని వివరించారు.

భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఎందుకంటే ఒకరిలో ఒకరు తమను చూసుకుంటారు. అలాగే భక్తుడు భగవంతునిలో తనను తాను చూసుకొని, తనలో భగవంతుడిని కూడా చూడాలి. అది ఎలా సాధ్యం అని సందేహం కలుగుతుంది. పరమపవిత్రుడైన భగవంతుని కల్మష హృదయంతో చూడటానికి ఎలా వీలవుతుంది? చెడును తీసివేసేందుకు మంచిని ప్రేమించాలి. కడకు అదీ అడ్డుగానే తోస్తుంది. కనుక ఆ మంచిని తీసివేయాలి. అయితే, ముందు మంచిని ప్రేమించి, ఆ తరవాత నిరసించాలన్నమాట. అట్లా అన్నిటినీ తీసివేస్తే, తోసివేస్తే, ఇక ఉండేది తానే. అదే నిజమైన ప్రేమ. ‘‘ఆ ప్రేమ రహస్యమెరిగినవారికి లోకమంతా ప్రేమమయంగానే తోస్తుంది,’’ అంటారు రమణమహర్షి.

ప్రేమ రహస్యం తెలిసినవాడు కాబట్టే యేసుక్రీస్తు తనను అత్యంత క్రూరంగా హింసించి, అవమానించి సిలువపై రక్తాన్ని చిందింపచేసిన వారి పట్ల కూడా నిరుపమాన ప్రేమను చూపి, ‘‘తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు’’ (లూకా సువార్త - 23 అధ్యాయం) అని దేవుని ప్రార్థించాడు ... :)