DEADLY లైఫ్


జన్మించే ప్రతి మనిషీ తన జీవితంలో ఎవరిని కలిసినా ఎవరిని కలవకపోయినా ఒకరిని మాత్రం తప్పనిసరిగా కలుస్తానని హామీ ఇచ్చి ఈ లోకంలోకి వస్తాడు.
ఇచ్చిన హామీ ప్రకారం ఎప్పుడో ఒకప్పుడు ఆ ఒక్కరిని కలుస్తాడు. కలిసి తీరుతాడు.
ఆ ఒక్కరు ఎవరో తెలుసా?
మృత్యువు.

*******************************************
మృత్యువు ఎవరు? మృత్యుదేవత అని మనం పిలుచుకుంటున్న ఆ ఆడకూతురు ఎవరు? ఆమెకు తల్లీదండ్రీ లేరా? ఆమెకు బొడ్డుకోసి ఆ పేరు పెట్టినవారు లేరా? అగ్నిపురాణం చూద్దాం. అనగనగా ఒక అధర్ముడు. అతడి భార్య హింస. వాళ్లకొక కూతురు. పేరు నికృతి. ఆమెకు ఇంకొక కూతురు. పేరు మాయ. ఆ మాయకు పుట్టిన పుత్రికే మృత్యువు.
భారతాన్ని తెరుద్దాం. భూమ్మీద భారం పెరిగిపోయింది... ఆ భారాన్ని భరించలేను అని భూమి బ్రహ్మను ప్రార్థిస్తుంది. భారం తగ్గించే ఉపాయం బ్రహ్మకు దొరకదు. అతడికి సృష్టించడం చేతనవును. నాశనం తెలియదు. మరోవైపు భూమి సొద పెడుతూ ఉంది. ఆ సొదకు బ్రహ్మదేవుడికి కోపం వస్తుంది. ఆ కోపంలోంచి ఒక స్ర్తీ పుడుతుంది. ఆమె పేరే మృత్యువు. మొత్తం మీద మృత్యువులో ఆహ్లాదం లేదు. మృత్యువు మూలాలలో ఆహ్లాదం లేదు. అందుకే మృత్యువు సంభవించడంలో కూడా ఆహ్లాదం ఉండదు.
మృత్యువుకు అతీతం ఎవరూ కాదు. దాని అంతిమ చుంబనాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు.



******************************


మృత్యువు మనుషులను నక్షత్రాలుగా మార్చడం మీకు తెలుసా? మృత్యువు మనుషులను అంతరిక్షంలో శాశ్వతంగా కూచోబెట్టడం తెలుసా.
కల్పన చావ్లా. అంతరిక్షానికి వెళ్లారు. తిరిగి రాలేదు. కల్పన జననం క్రీ.శ. 1961. కల్పన పునర్జననం క్రీ.శ. 2003.
శబ్ద వేగానికి పద్దెనిమిది రెట్ల వేగంతో నాసా వ్యోమనౌక ‘కొలంబియా’ నుంచి కిందికి జారిపోతున్నప్పుడు... రాక్షస అయస్కాంతంలా భూమ్యాకర్షణ శక్తి ప్రచండ బలంతో తన ప్రాణాలను గుంజుతున్నప్పుడు... కల్పన తన మనసులో ఏమనుకుని ఉంటారో, అనుకోడానికైనా అసలు వ్యవధి ఉందో లేదో తెలియదు. కొలంబియా స్పేస్ షటిల్ లోని ఇరవై ఐదు లక్షల విడిభాగాలతో పాటు ఆమె శరీరం లిప్త పాటులో శూన్యంలోని ఒక మిణుగురు కణమై చప్పున వెలిగి, తారల చెంత చేరి ఉంటుంది.
ఫ్లోరిడా నుంచి అంతరిక్షంలోకి బయల్దేరేముందు కల్పన తన చివరి ఇంటర్వ్యూ ఇచ్చారు. అంతరిక్షంలోకి తన అంతిమ ప్రయాణానికి కొన్ని నిమిషాల ముందు ఆమె అన్న మాటలివి: ‘‘భౌతిక సుఖాలే జీవిత పరమార్థం కాదు. ఒక ఉన్నత లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలి. దాన్ని సాధించడానికి జీవితాన్ని పణంగా పెట్టుకోవాలి’’.

ఆమె మాటలు దేశాన్ని రీచార్జ్ చేశాయి. ఆమె మరణం... దేశానికి ఆమెపై ఉన్న వాత్సల్యాన్ని రీచార్జ్ చేసింది. ఫిబ్రవరి 1వ తేదీన కొలంబియా తునకలైనప్పుడు అమెరికాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్‌లో సమయం ఉదయం 8.53. ఇండియాలో అది సాయంత్రం 7 గంటలు. దుర్ఘటన వార్తతో కేబుళ్లు జామ్ అయ్యాయి. కల్పనకు నివాళి అర్పిస్తూ ఉత్తరాది హిందీ న్యూస్ చానెల్ ‘ఆజ్‌తక్’కు లక్ష సందేశాలు అందాయి! ఆమెకు శ్రద్ధాంజలి ఘటించడానికి ప్రజలతో సమానంగా ప్రభుత్వం పోటీ పడింది.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’ ప్రయోగించిన వాతావరణ ఉపగ్రహానికి కల్పన-1 అని ప్రధాని నామకరణం చేశారు. విద్యార్థినుల కోసం కల్పనా చావ్లా స్కాలర్‌షిప్‌ను ప్రారంభించినట్లు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. కల్పన స్మృతికి ఒక వైద్య కళాశాలను అంకితం చేస్తామని కేంద్ర హోమ్ శాఖ మంత్రి ప్రకటించారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ‘నాసా’... ‘అపురూపమైన యువతి’ అని కల్పనకు శ్రద్ధాంజలి ఘటించింది.
కల్పన ప్రస్తావన వచ్చినప్పుడు అమెరికా అధ్యక్షుని గొంతు గద్గదమయింది. 




No comments: