అమ్మంటే ఏంటి?
మొదటిది కడుపుబ్బ కన్నీళ్లు!
రెండవది తెల్లని రక్తం!
నాకు తెలిసిన అమ్మ ఈ రెండు భావాలు.
అమ్మ గురించి, అమ్మ గొప్పదనం గురించి
కవులు, సాహితీకారులు పలువిధాలుగా పోల్చారు,
కొనియాడారు కానీ
ఈ రెండు భావాలూ ఎప్పుడూ విన్నట్టు గుర్తులేదు.
లేదా, నా చిన్ని జీవితంలో నాకు ఈ రెండు భావాలు తారసపడలేదు

కడుపు నిండా కన్నీళ్లు అంటే..?
ప్రసవ వేదనను చూశాము, విన్నాము.
బిడ్డను కడుపులో మోసినంత సేపూ తల్లికి ఎన్ని కష్టాలు!
తిండి సహించకపోవడం, వాంతులు కావడం,
నడుము లాగేయడం...
అందమైన శరీరం మారడం, అనారోగ్యం...
ఏంటో! కడుపుతో ఉన్న తల్లిని చూస్తే నాకెప్పుడూ
పాపం అనే అనిపిస్తుంది.
తెల్లని రక్తం అంటే..?
రక్తం చూస్తే అందరికీ భయమే.
పసికందు భయపడకూడదని తన రక్తం రంగుని కూడా
మార్చగల ప్రేమ అమ్మది.
తన రక్తాన్నే మార్చి మరీ ప్రాణం పోసే తల్లి పాలు తెల్లని రక్తమే కదా.
ఆ రక్తం పంచుకున్న బిడ్డలుగా
మా అమ్మకు నేను,
మీ అమ్మకు మీరు రీచార్జ్ కావాలని
ప్రార్థిస్తూ...

ప్రియురాలి ప్రేమలో అంధుడైన ఓ కుమారుడు ప్రియురాలి కోరిక తీర్చడానికి తన తల్లి గుండెలు చీల్చి దోసిళ్లలో ఆమె గుండెను తీసుకొని పరిగెడుతూ పరిగెడుతూ దారిలో రాయి దెబ్బ తగిలి బోర్లా పడిపోతాడు. కొడుకు పడిపోవడం చూసి ఆ తల్లి గుండె తల్లడిల్లిపోతుంది. ‘‘జాగ్రత్త బాబూ... జాగ్రత్త’’ అని పరితపించిపోతుంది. తనను చంపినా సరే తన సంతానం మీద ప్రేమ కురిపిస్తుంది తల్లి. ఏ తూనికలకూ కొలతలకూ అందని అనురాగం అమ్మది.

**********
ప్రతి మనిషికీ ఐదుగురు అమ్మలుంటారట.
నిజమాత- నీకు జన్మనిస్తుంది. భూమాత- నీకు ఆశ్రయం ఇస్తుంది. నదీమాత- నీ దప్పిక తీరుస్తుంది. గోమాత- నీ పుష్టికి పాలు ఇస్తుంది. దేశమాత- నీకొక ఉనికి ఇస్తుంది. గమనించి చూడండి. ఈ అమ్మలెవ్వరూ తన బిడ్డల నుంచి ప్రతిఫలం ఆశించరు. ఈ అమ్మలెవ్వరూ తన బిడ్డల మీద అక్కసు పెట్టుకోరు. కాని ఆ అమ్మల కడుపున పుట్టిన బిడ్డలే అమ్మను మర్చిపోతారు. అమ్మకు ద్రోహం తలబెట్టబోతారు.

************
‘సిందూరం’లో ఒక దృశ్యం.
పోలీస్ కానిస్టేబుళ్లతో క్రిక్కిరిసిన వ్యాన్ ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళుతూ ఉంటుంది. అందులో శివాజీరాజా ఉంటాడు. అతడు జూనియర్ కానిస్టేబుల్. కొత్తగా కూతురు పుట్టిందని ఒక చిన్న సంచిలో కొత్త గౌను, బొమ్మ తీసుకొని వెళుతూ ఉంటాడు. సీనియర్ కానిస్టేబుళ్లు ఇది గమనిస్తారు.
‘‘ఏమిట్రా కూతురు పుట్టిందా’’ అని అడుగుతారు.
‘‘అవును సార్’’ అంటాడు శివాజీ రాజా. ‘‘ఏం పేరు పెడుతున్నావేంటి?’’.
‘‘శివాజీరాజా’’ తన చేతిలో ఉన్న గౌనే తన కూతురు అన్నట్టుగా హత్తుకుంటూ ఎంతో మురిపెంగా పెంటమ్మ అండీ అంటాడు. అందరికీ నవ్వు వస్తుంది. భళ్లున నవ్వుతారు. విన్నార్రా పెంటమ్మ అంట... పెంటమ్మ... ఏం పేరురా అది హేళనగా నవ్వుతూ శివాజీరాజాను ఆటపట్టిస్తారు. శివాజీరాజా కళ్లల్లో పలుచగా నీళ్లుబుకుతాయి. ఆ కళ్లతోటే అందరినీ చూస్తూ- ‘‘పెంటమ్మ మా అమ్మ పేరండీ. అమ్మ పేరు ఎలా ఉంటే ఏంటండీ... అది అమ్మ పేరుకదండీ’’ అంటాడు.
కానిస్టేబుళ్లు టక్కున నవ్వు ఆపేస్తారు. సిగ్గుతో తల వంచుకుంటారు. అమ్మను హేళన చేసే శక్తి ఎవరికి ఉంటుంది గనుక?
అమ్మ పేరుకు వంక పెట్టే అహంకారం ఎవరికి ఉంటుంది గనుక? అమ్మను ఎగతాళి చేసే మూర్ఖత్వం ఎవరు మూటగట్టుకుంటారు గనుక? అమ్మ- దేవత కదా. కాదు కాదు... దేవత అనే మాట అమ్మ కంటే చాలా చిన్నది కదా.



సినిమాల్లో చాలామంది అమ్మలు ఉన్నారు. కాని ముందుగా చెప్పుకోవలసింది మాత్రం ‘పాండురంగ మహత్మ్యం’లోని అమ్మనే. అందులో పుండరీకుడు చెడుతిరుగుళ్ళు తిరుగుతూ వేశ్య కోసం అర్ధరాత్రి తన ఇంట్లోనే దొంగతనానికి పూనుకుంటాడు. ఇంట్లోని నగలన్నీ కాజేసి ముసుగు కప్పుకొని ఉడాయించబోతాడు. కాని పక్కనే ఉన్న దీపం పుండరీకుడి కాలికి తగిలి పడి అందరూ లేస్తారు. దొంగ అనుకుని పుండరీకుడ్ని గట్టిగా పట్టుకున్నాడు తండ్రి. ఆయన్ను ఒక్క నెట్టు నెట్టి... పారిపోబోతున్న పుండరీకుడ్ని తల్లి అడ్డగిస్తుంది. ఆమెకు, పుండరీకుడికీ మధ్య పెనుగులాట జరుగుతుంది. అలజడి రేగుతుంది. దాంతో నగలను అక్కడే వదిలి తన గదిలోకి ఉడాయిస్తాడు పుండరీకుడు. ఇరుగుపొరుగు వచ్చి చూసే సరికి తల్లి నిశ్చష్టురాలై నిలబడి ఉంది. ఆమె కాళ్ల వద్ద నగలు పడున్నాయి. వచ్చినవారందరూ ఆమెనే దొంగగా భావిస్తారు.

‘‘చివరకు నీ ఇంట్లో నువ్వే దొంగతనం చేసే స్థితికి దిగజారావన్నమాట’’ అని మాటలంటారు. ఆమె నోరు మెదపదు. ఉబికి వస్తున్న కన్నీటిని బలవంతంగా ఆపుకుంటూ... మౌనంగా నిలుచుండిపోతుంది. సొంత కోడలు కూడా ‘‘ఛీ ఛీ.. ఇంతకంటే... సిగ్గుమాలిన పని మరొకటుందా...’’ అని అత్తను అనరాని మాటలంటుంది. అయినా ఆ మహాతల్లి మారు మాట్లాడదు. ఏమీ ఎరుగనివాడిలా అక్కడకొచ్చి జరుగుతున్నదంతా వేడుకలా చూస్తుంటాడు పుండరీకుడు. ‘‘ఇంత జరిగాక.. మేం ఇక్కడుండటం సమంజనం కాదమ్మా... మీరు సుఖంగా ఉండండి. మేం వెళ్లిపోతాం’’ అని కోడలికి చెప్పి ఆ వృద్ధ దంపతులిద్దరూ ఇల్లు దాటబోయారు. గుమ్మం వద్దకు రాగానే తల్లి ఒక్కసారి ఆగుతుంది. వెనక్కుతిరిగి పుండరీకుడ్ని కనులారా చూసుకుంటుంది. బరువెక్కిన హృదయంతో పుండరీకుడ్ని పిలిచి అతడి తల నిమిరి చేయి తీసుకొని పెనుగులాటలో ఆమె చేతికి చిక్కిన అతడి ఉంగరాన్ని తొడుగుతుంది. ఊహించని ఆ పరిణామానికి పుండరీకుడు హతాశుడవుతాడు. తాను దొంగనని తెలిసే... తన తల్లి ఈ అపవాదును మోసిందా అని కుమిలిపోతాడు. తల్లి దైవంతో ఎందుకు సమానమైందో అప్పుడు అర్థమయ్యింది పుండరీకుడికి. ఈ సన్నివేశంలో దారి తప్పిన కొడుకుగా ఎన్టీఆర్, త్యాగమూర్తి తల్లిగా ఋష్యేంద్రమణి తమ నటనతో కలకాలం గుర్తుండిపోతారు.



అమ్మ మాట సూది మందు. అది నొప్పి పుట్టించినా మన మంచికే. అమ్మ కోపం చేదు కాకర. అది నోటికి సయించకపోయినా మన బాగుకే. కాని ‘అమ్మ రాజీనామా’లోని ఆ కొడుకులు- ప్రసాద్‌బాబు, సాయికుమార్ ఆ సంగతి అర్థం చేసుకోరు. తమపై అమ్మకున్న ఆపేక్షను స్వీకరించరు. పైగా భార్యల ప్రభావానికి లోనై దేవతలాంటి అమ్మని అవమానిస్తారు. అమ్మకు కోపం వస్తుంది. తీవ్రమైన కోపం వస్తుంది. అందుకోసమని ప్రపంచంలో ఏ తల్లీ తీసుకోని కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది. అదే ‘రాజీనామా’. అమ్మ అనే పదవికి రాజీనామా. అమ్మ బాధ్యతలకు రాజీనామా. లక్ష్మీదేవిలా ఇల్లంతా కలియతిరిగే అమ్మ ఒక్కచోటుకే పరిమితమైపోయింది. మూగలా మారిపోతుంది. చివరకు భార్యగా తన భర్తకు చేయాల్సిన సేవను కూడా బిడ్డలకే వదిలేసింది.సరే. నువ్వు పట్టించుకోకపోతే... మేం బతకలేమా...’’ అంటూ ఇష్టం వచ్చినట్టు బ్రతకడం మొదలుపెడతారు కొడుకులు, కోడళ్లు. ఆ స్వతంత్రంలో సంసారాన్ని చక్కదిద్దుకోవడం చేతకాక, అత్యాశకు పోయి ఇంటిని నరకం చేసుకుంటారు. ఆఖరుకు పరిస్థితి ఎంత దిగజారుతుందంటే నానమ్మ భయంతో త్వరగా ఇంటికి చేరుకునే మనుమరాలు పెళ్లికాకముందే తల్లి కాబోతోంది. 

ఇలాంటి పరిస్థితుల్లో ఓ అదృశ్య శక్తి ఆ కుటుంబాన్ని ఆదుకుంది. సాయికుమార్, ప్రసాద్‌బాబు చేసిన అప్పులన్నీ తీర్చేసింది. ప్రసాద్‌బాబు కూతురికి ఇష్టపడ్డవాడితోనే పెళ్లి నిశ్చయం అయ్యేలా చేసింది. ఎవరా అదృశ్య శక్తి...? అమ్మే. బిడ్డలు చేసిన అప్పులు తీర్చడానికి ఆరోగ్యంగా ఉన్న కిడ్నీనీ అమ్మేసుకుంది అమ్మ. బిడ్డలకోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి అనంతలోకాలకు ఏగింది అమ్మ. అందుకే అమ్మ రాజీనామా చేయదు. ఒకవేళ చేస్తే ఈ ప్రపంచమే ప్రశ్నార్థకం అయిపోతుంది. 




ఇప్పుడు ఒక నిజపాత్రను చూద్దాం. మంగళంపల్లి సూర్యకాంతమ్మ తెలుసా మీకు? మంగళంపల్లి బాలమురళీకృష్ణకు కన్నతల్లి. తొలిగురువు. నేడు తెలుగువారి ఖ్యాతిని దశదశిలా వ్యాపింపచేసిన మంగళంపల్లికి ఆమె సంగీతాన్ని తన గర్భం నుంచే నేర్పారు. బాలమురళీకృష్ణ కడుపులో ఉండగా ఆమె రోజూ ఏడెనిమిది గంటలు వీణ వాయించేవారట. ‘‘ఎందుకంత కష్టం. రెస్ట్ తీసుకోవాలి’’ అని ఎవరో అంటే, ‘‘నా కడుపులో ఉన్న బిడ్డకు సంగీతం చెబుతున్నాను. మీరేమీ నాకు అడ్డు చెప్పకండి’’ అని చెప్పేవారట. పుట్టిన కొడుకుని చూసుకుని ‘‘వీడు మన దేశానికి పేరు తెస్తాడు. గొప్ప సంగీత విద్వాంసుడవుతాడు’’ అని భర్తతో చెప్పి మురిసిపోయారట. ‘‘వీణ్ణి కనడం కోసమే నేను పుట్టా’’ అని చెప్పి నిజంగా కొడుకు పుట్టిన కొన్ని రోజులకే కాలం చేశారామె. 

మరో అద్భుత ప్రజాగాయకుడు గద్దర్ కథ కూడా అంతే. ఆడినా పాడినా ఏడ్చినా నవ్వినా దానిని పాటగా మార్చడం వెనుక గద్దర్‌కు స్ఫూర్తి ఆమె తల్లే. గద్దర్ తండ్రి మేస్త్రి పని మీద ఊళ్లు తిరుగుతుంటే త ల్లే గద్దర్‌ని కంటికి రెప్పలా కాచుకుంది. ఏడ్చినప్పుడల్లా పాటను ఒక మిఠాయిగా బిడ్డ చేతిలో పెట్టింది. ఆమె పాడే జానపద పాటలే గద్దర్‌కు పాట గురించి ఓనమాలు నేర్పాయి. అన్యాయాలపై ఆమె ప్రతిఘటించే తీరే అతణ్ణి విప్లవం వైపు పయనించేలా చేశాయి. ఆ తల్లి జ్ఞాపకాలతోటే గద్దర్ అద్భుతమైన పాట కూడా రాశారు.



కొన్ని డైలాగులు ముఖం మీద చాచి కొట్టినట్టుగా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆతర్వాత ఊపిరాడకుండా చేసి శాశ్వతంగా గుర్తుండిపోతాయి. చంటిలో అటువంటి డైలాగ్ ఉంది. వెంకటేష్ అందులో అమాయకుడు. తల్లితోడు తప్ప పాట తోడు తప్ప మరొకటి తెలియనివాడు. మీనా అన్నదమ్ములు వెంకటేష్‌ని ఎప్పుడూ ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఒక సందర్భంలో వాళ్ల మనుషులను తుక్కురేగ బాదుతాడు వెంకటేష్. ముగ్గురు అన్నదమ్ములూ వెంకటేష్‌ని పిలిపించి పంచాయతీ పెడతారు. నువ్వు అంత పుడింగివా అని ముఖం మీద వేలు ఆడిస్తారు. తప్పు చేసిన వాళ్లను తన్నడం ఎలా తప్పో వెంకటేష్‌కు అర్థం కాదు. మొత్తం మీద వీళ్లు తనని తన్నబోతున్నారని మాత్రం అర్థమవుతుంది. అప్పుడు ఒక డైలాగ్ చెబుతాడు-
‘సరే. మీరు పెద్దలు. నే చేసింది తప్పయితే కొట్టండి. కానీ వీపు మీదే కొట్టండి. ముఖం మీద కొట్టకండి. ఆ దెబ్బలు చూస్తే అమ్మ తట్టుకోలేదు...’ 

హీరోయిన్ అన్నదమ్ములే కాదు సినిమా చూసే ప్రేక్షకులు కూడా ఈ మాటలకు అదిరిపోతారు. సినిమాలోని అమ్మ సెంటిమెంట్‌కు బ్రహ్మరథం పడతారు. 



రోజులు మారాయి. అమ్మనుంచి అనురాగం పొందే పిల్లలు ఆమెనో ఫ్రెండ్‌గా ట్రీట్ చేసే రోజులొచ్చాయి. తమ ఫీలింగ్స్‌ను ఆమెతో షేర్ చేసుకునే రోజులొచ్చాయి.


**********
తొలికాన్పు స్త్రీకి పునర్జన్మ అట. ఆ మాటకొస్తే ప్రతి కాన్పూ స్త్రీకి జీవన్మరణ సమస్యేనట. అయితే? ఆ మాట ఎప్పుడూ అమ్మ చెప్పుకోదు. బిడ్డను పిలిచి- ఒరే కన్నా నిన్ను కనడానికి నేను ప్రాణాలకు తెగించానురా అని అనదు. అమ్మకు బిడ్డను కనడం ఒక ఆనందం. పొత్తిళ్లల్లో ఉన్న బిడ్డ చిట్టి పిడికిళ్లు బిగించి కేర్‌మంటూ ఏడ్చే ఏడుపును చూడటం ఆనందం. అంతలోనే కాళ్లు ఆడించి బొజ్జమీద తంతూ ఉంటే ఆ స్పర్శను అనుభవించడం ఆనందం. తాను ఎదురుపడగానే తన గొంతు వినగానే చేతులు సాచగానే విచ్చుకునే పెదవులతో నవ్వే బిడ్డను చూడటం ఆనందం.

ఆ ఆనందం కోసం అమ్మ ఒక్కసారి ఏమిటి వేయిసార్లు మరణించడానికైనా సిద్ధపడుతుంది. ఒక్క జననం కోసం వేయి మరణాలను గెలుస్తుంది అమ్మ.

**********
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నది హైందవం. తల్లి పాదాల చెంతే స్వర్గం ఉంది అన్నది ఇస్లాం. మేరీ మాతకు సమున్నతమైన స్థానం ఇచ్చి కొలుస్తోంది క్రైస్తవం. ఉన్నతమైన స్థానం అమ్మదే. అమ్మలేనిదే జగతి లేదు. అమ్మ తలుచుకుంటే ఈ ప్రపంచపు శోకాన్ని తుడిచేయగలదు. కలవరపడే సంతానాన్ని అక్కున చేర్చుకుని వారికి ఊరట ప్రసాదించగలదు. మదర్స్ డే రోజు తలుచుకునే మ్యూజియం వస్తువు కాదు అమ్మ.

అనుక్షణం తలుచుకోవాల్సిన అమృతమూర్తి ఆమె.
అనునిత్యం పూజించాల్సిన చల్లని దైవం ఆమె.
అమ్మా నీకు వందనం. జననీ నీకు పాదాభివందనం.




No comments: