లోకమంతా ప్రేమమయమే

ప్రేమే దైవమని, ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ దైవంఉంటుందని ఎందరో చెప్పారు, ఎన్నో కథలు ఉన్నాయి. ఒక భక్తుడు రమణమహర్షితో, ‘‘స్వామీ! దైవాన్ని ప్రేమించడం మంచిదేగదా. ప్రేమ మార్గంలో ఎందుకు పోకూడదు?’’ అని ప్రశ్నించారు. (పేజీ 371 - శ్రీరమణాశ్రమలేఖలు). అపుడు రమణమహర్షి ‘‘కూడదని ఎవరన్నారు? పోవచ్చును,’’ అంటూ ‘‘మనిషికి ధనం అంటే ఇష్టం, ఆ ధనం కంటే పుత్రుడు, పుత్రుని కంటె తన శరీరం, శరీరం కంటే ఇంద్రియాలూ, ఇంద్రియాలలో కన్ను, దాని కంటే ప్రాణం, దాని కంటే ఆత్మ... ప్రియమైనవి. ప్రియరూపమైన ఆత్మగా తెలుసుకోవటమే దైవాన్ని ప్రేమించటం. తాను సుఖంగా ఉండాలనే కదా దైవాన్ని ప్రేమించదలచటం. తాను సుఖమాయె, సుఖమే దైవమాయె. ఇక ప్రేమించేదెవరిని? ప్రేమే దైవం’’ అని వివరించారు.

భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఎందుకంటే ఒకరిలో ఒకరు తమను చూసుకుంటారు. అలాగే భక్తుడు భగవంతునిలో తనను తాను చూసుకొని, తనలో భగవంతుడిని కూడా చూడాలి. అది ఎలా సాధ్యం అని సందేహం కలుగుతుంది. పరమపవిత్రుడైన భగవంతుని కల్మష హృదయంతో చూడటానికి ఎలా వీలవుతుంది? చెడును తీసివేసేందుకు మంచిని ప్రేమించాలి. కడకు అదీ అడ్డుగానే తోస్తుంది. కనుక ఆ మంచిని తీసివేయాలి. అయితే, ముందు మంచిని ప్రేమించి, ఆ తరవాత నిరసించాలన్నమాట. అట్లా అన్నిటినీ తీసివేస్తే, తోసివేస్తే, ఇక ఉండేది తానే. అదే నిజమైన ప్రేమ. ‘‘ఆ ప్రేమ రహస్యమెరిగినవారికి లోకమంతా ప్రేమమయంగానే తోస్తుంది,’’ అంటారు రమణమహర్షి.

ప్రేమ రహస్యం తెలిసినవాడు కాబట్టే యేసుక్రీస్తు తనను అత్యంత క్రూరంగా హింసించి, అవమానించి సిలువపై రక్తాన్ని చిందింపచేసిన వారి పట్ల కూడా నిరుపమాన ప్రేమను చూపి, ‘‘తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు’’ (లూకా సువార్త - 23 అధ్యాయం) అని దేవుని ప్రార్థించాడు ... :)

No comments: