తిరుప్పావై --- 12 పాశురం
కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి
నినైత్తు ములై వరియే నిన్ఱు పాల్ శోర
ననైత్త్-ఇల్లం శేఱాక్కుం నచ్చెల్వన్ తంగాయ్
పనిత్తలై వీర నిన్ వాశల్ కడై పత్తి
శినత్తినాల్ తెన్ ఇలంగై క్కోమానై చ్చెత్త
మనత్తుక్కినియానై ప్పాడవుం నీ వాయ్ తిఱవాయ్
ఇనిత్తాన్ ఎరుందిరాయ్ ఈదెన్న పేర్ ఉఱక్కమ్
అనైత్తిల్లత్తారుం అఱింద్-ఏలోర్ ఎంబావాయ్
రాగం : రేవతి
లేగలను తలచి జాలిగొని అరచి
ఎనుములు సిరములు పాలుధారగ కురియ
వీడెల్ల నాని చిత్తడి ఆయనే చెలియ!
మేటి సంపదలున్న మొనగాడి చెల్లెలా!
మంచు మాతలలపై పడగ నీ వాకిలి పట్టి
కోపమున రావణుని కూల్చిన శ్రీరాముని
కీర్తింపగ, పెదవి కదపవేమె కలికి!!
మాయ నిద్రను వీడి మేలుకోవమ్మ!
నీ సంగతులు తెలిసె లే! బంగారు బొమ్మ
జగతికే మంగళం కూర్చు మన శ్రీ వ్రతము
నిన్నటి పాశురంలో గోపాలురు ఎటువంటి ఫలాన్ని ఆశించకుండా స్వధర్మాన్ని ఆచరించేవారని చదువుకున్నాం కదా. ఈరోజు ఆ స్వధర్మం కూడా అవలంభించని ఓ గోపిక గురించి తెలుసుకుందాం. ఈ గోపికనే గోదాదేవి, ఇతర గోపకాంతలు మేల్కొల్పుతున్నారు. ఈమె స్ధితప్రజ్ఞత అవస్ధలలోని తొలిదశ యతమానావస్ధలో ఉంది. తాబేలు తన అవయవములను మొత్తం లోపలికి లాక్కుని ఉంటుంది అదేవిధంగా ఈ గోపిక వలెనే ఇంద్రియములను ఇంద్రియ విషయములనుండి పూర్తిగా ఉపసంహరించినవాడే స్ధితప్రజ్ఞుడు అవుతాడు. ఈ గోపిక శ్రీకృష్ణుడి ఆప్తమిత్రుడు శ్రీదాముని సోదరి. అతను కృష్ణు డి సేవలో పూర్తిగా మునిగిపోయి తన ఇంటిలోని గేదెల పాలు కూడా పిండడం లేదు. ఆ గేదెలు తమ పాలు పిండేవారు లేక తమ లేగదూడలు కూడా పాలు త్రాగకపోవడంతో పొదుగుల బాధతో అరుస్తూ వాటిని తలుచుకుంటూ పాలను నేలపై స్రవించాయి. ఆ పాలతో ఇల్లంతా చిత్తడిగా మారింది. ఈ వేకువజామున మంచు మా తలలపై కురుస్తున్నా నిన్ను విడిచి వెళ్ళలేక నీ ఇంటివాకిట నిలబడ్డాము. బురదలో కాలు జారకుండా మీ ఇంటి వాకిటి పై దండెను పట్టుకొని నిలబడ్డి తన భార్యను అపహరించిన ఆ లంకాధీశుని చంపిన శ్రీరామచంద్రుని కీర్తిస్తున్నాము. అది విని కూడా నీవు పెదవి విప్పడంలేదు. ఇదేమి గాఢనిద్ర?. లేచి రావమ్మా ఇప్పటికే ఇరుగుపొరుగు వాళ్లు కూడా వచ్చి నీ నిద్రను చూస్తున్నారు.
గేదెలు దూడలకై చేపు వచ్చి అరుస్తున్నాయి. తమను తాము పోషించుకోని వారు లేగదూడలవంటివారు. ఆవులు, గేదెలు ఉదారులైన గురువులు. ఈ గేదెలకు సమృద్ధిగా పాలు ఉండడమంటే వారికి భగవదనుగ్రహం సంపూర్ణంగా ఉండడం. కట్టి ఉంచిన దూడలు తమ తల్లి వద్దకు చేరుకోలేనట్టే జీవుడు తన కర్మపాశంతో, అవిద్యతో ఈ శరీరమనే దుంగకు కట్టబడ్డాడు. దానిని వదిలించుకుంటే గాని భగవంతుని చేరలేడు. అతనిని ఆ పరమాత్మ వద్దకు చేర్చేవాడే గురువు. క్రింద నేలంతా బురదగా మారి పైన మంచు కురుస్తుంది. భగవంతుని అనుభవప్రవహమే ఈ నేలపై ఉన్న తడి, మంచు ఆళ్వారుల దివ్య సూక్తులు. భగవంతుని అనుభవంలో చేరడానికి సాయం చేసే దివ్యమంత్రమే అష్టాక్షరి. ద్వారం మీద ఉన్న దండెను పట్టుకుని ఈ గోపికలు రావణాసురుని చంపిన రాముడి గుణగానం చేస్తున్నారు. రావణుడు పాలించిన లంకయే మన శరీరము కాగా ఆ రావణుడే మన మనస్సు. దశేంద్రియాలే ఆతని పది తలలు. మనస్సును నిగ్రహించుకుని సీత(ఆత్మ) ను తనలో చేర్చుకున్నాడు శ్రీరాముడు. అందుకే ఆతని కీర్తిస్తున్నారు.
No comments:
Post a Comment