తిరుప్పావై --- 22 పాశురం
అంగణ్ మా ఞాలత్తరశర్, అబిమాన
పంగమాయ్ వందు నిన్ పళ్ళికట్టిల్ కీరే
శంగమ్ ఇరుప్పార్ పోల్ వందు తలై ప్పెయ్-దోమ్
కింగిణివాయ్ చ్చేయ్ద తామరై ప్పూప్పోలే
శెంగణ్ శిఱుచ్చిఱిదే యెమ్మేల్ విరయావో
తింగళుమ్ ఆదిత్తియనుమ్ ఎరుందాఱ్పోల్
అంగణ్ ఇరండుం కొండు ఎంగళ్మేల్ నోక్కుదియేల్
ఎంగళ్మేల్ శాపం ఇరింద్-ఏలోర్ ఎమ్బావాయ్
రాగం: భైరవి
సుందర విశాల మహా పృధివి నేలు రాజులు
అభిమాన భంగమై నీ పర్యంకము చేరి శరణువేడు లీల
అందర్ము చేరితిమి ఆదరింపుము స్వామి // సుందర //
సిరిమువ్వ అరవాయి. చెందమ్మి విరుల వలె
కెంజాయకందోయి కరుణా కటాక్షముల
సూర్యచంద్రులు కలసి ఉదయించినటుల
రెండు నేత్రమ్ముల నిండుగా చూచిన
మాశాపకర్మలు మటుమాయమగును
జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము.
తమ కర్మవశాన భగవంతునికి దూరమైనవారు తిరిగి ఆతని దరి చేరే విధానాన్ని తెలిపేదే ఈ వ్రతము.ఇందులో ప్రధానంగా శ్రేష్టులైన భగవంతుని భక్తుల , ఆచార్యుల సాంగత్యము, పరమాత్మను చేరడం చాలా ముఖ్యమైనవి. అభిమానం అనేది రెండు విధాలుగా ఉంటుంది. అంతా నాదే అనేది మమత అనే అభిమానం. శరీరమే నేను. సర్వ స్వతంత్రుడను అనే భావన అహం అనే అభిమానం.. నిన్నటి పాశురంలో శత్రువులు తమ సర్వస్వమూ వదిలి పరమాత్మ వాకిట నిలిచారు. ఆతని వీడి ఎక్కడికి తిరిగి వెళ్లము అని అన్ని విషయాలందు ఉన్న మమతను వదిలిపెట్టారు. అంటే నాది అనే భావన పోయింది. ఈరోజు నేను అనే భావన వీడిపోతుంది.
సుందరమైన, విశాలమైన గొప్ప భూమిని ఏలిన రాజులందరూ తమకంటే గొప్పవారు లేరు అనే అహంకారాన్ని వదిలిపెట్టి తమను ఓడించి గెలిచిన పరమాత్మ సింహాసనం క్రింద గుంపులుగా చేరారు. ఆ విధంగానే మా అభిమానాన్ని వదిలిపెట్టి వచ్చి నీ మంచం క్రింద నిలిచి ఉన్నాము. చిరుమువ్వ ముఖం వంటి, వికసించిన తామరపూవు వంటి ప్రేమతో ఎర్రగా ఉన్న కళ్లను మెల్లిగా తెరిచి మాపై నీ దయను ప్రసరింపచేయుము.. సూర్యచంద్రులు ఇద్దరూ ఆకాశంలో ఒకేసారి ఉదయించినట్టుగా నీ రెండు కళ్లతో మమ్మల్ని చూస్తే మేము అనుభవిస్తున్న తీరని శాపంలాంటి కర్మ మమ్మల్ని వీడిపోతుంది.
పరమాత్మ మన కర్మానుసారం మనకు సుఖఃదుఃఖాలు ఏర్పరిచాడు. అది తెలియక అందరూ తాము చూసినంత మేరకు తమదే అని భావిస్తుంటారు. అహం అనే అభిమానం బ్రహ్మ నుండి చీమవరకు అందరికీ సమానంగానే ఉంటుంది. కాని అది ఎక్కువైతేనే దుఃఖం ఎక్కువవుతుంది. తమ అభిమానాన్ని వదిలి స్వామి మంచం క్రిందకు చేరామని గోపికలు చెప్పుకున్నారు. ఆ ప్రభువును వీడివెళ్లిపోతే తమను తిరిగి రాజ్యాభిషిక్తులను చేస్తారేమో అని ఆతని సన్నిధి విడవడానికి ఇష్టపడడం లేదు. చిరుమువ్వ ముఖం వలె , వికసించిన ఎర్రతామరవంటి కన్నులు తెరిచి తమను చూడాలని కోరుకుంటున్నారు. చిరుమువ్వలో చిన్న రాయి ఉంటుంది. దానికి సన్నని గీతలా ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీలోనుండి రాయి కనిపిస్తుంది కాని బయటకు జారిపడదు. లోపల ఉన్న తుమ్మెద కనపడుతూ పూర్తిగా వికసించని తామరపువ్వు ఇలాగే ఉంటుందంట. ఆ స్వామి కనులు మెల్లిగా తెరిచి మనను చూడాలి. అప్పుడే మనం అతనికి కనపడతాం. ఒకేసారి కళ్లు తెరిచి చూడకుండా మెల్లిగా చూస్తూ క్రమక్రమంగా తమకు భగవందనుభవం కలిగించు. సూర్యునివలె ప్రతాపం చూపించి మా శత్రువులను నిరోధించు. చంద్రునివలె చల్లదనాన్ని ఇచ్చి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ప్రసాదించమని గోపికలు కోరుకుంటున్నారు.
No comments:
Post a Comment