మానవసేవే మాధవసేవ, గ్రామసేవయే రామసేవ, పల్లెసేవయే పరమాత్ముని సేవ అని యావత్‌ప్రపంచానికి చాటిచెప్పిన దార్శనికుడాయన. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అనే నిదానంతో తన భక్తులందరినీ ఏకతాటిపై నడిపించిన భగవత్‌స్వరూపుడాయన. ఏ పనినైనా త్రికరణ శుద్ధిగా చేయాలనే ఆదర్శాన్ని తాను ఆచరించి, తన భక్తులతో ఆచరింప చేసిన పరమాత్ముడాయన. ఆయనే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. 


ప్రార్థన చేసే పెదవులకన్న సాయం చేసే చేతులు మిన్న’ అని సూక్తి. శ్రీ సత్యసాయి పెదవులు ప్రార్థన చేస్తూనే ఉన్నా ఆయన చేతులు ఆపన్నులను ఆదుకున్నాయి. కష్టాలలో ఉన్నవారికి సాయం చేశాయి. ఆయన వితరణ దాహార్తితో పరితపిస్తున్న కొన్ని లక్షల మంది ప్రజలకు గొంతు తడిపింది. చదువు‘కొనలేని’ ఎంతో మంది పేదలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను దేశవ్యాప్తంగా ఆయన స్థాపించిన విద్యాలయాలు ఉచితంగా బోధించాయి. చల్లని తన ప్రేమస్పర్శతో ఎంతోమందికి స్వస్థత చేకూర్చారు. అంతేకాదు, గాలిలో దీపం పెట్టి దానిని రక్షించు భగవంతుడా అని ప్రార్థించమని చెప్పలేదాయన.

మీ వంతు ప్రయత్నం చేస్తూనే భగవంతుని ప్రార్థించండి. అప్పుడాయన తప్పకుండా మీ ప్రార్థనను ఆలకిస్తాడు’, అంటూ నిరుపేద రోగుల కోసం అత్యాధునిక సదుపాయాలు గల ఆసుపత్రిని కట్టించారు. ఆయన ధర్మబోధ, సత్యవాక్పరిపాలన, సేవానిరతులు ప్రపంచదేశాలకు పాకాయి. కోటానుకోట్ల మందిని శిష్యులుగా చేర్చుకున్నాయి. ఆయన శిష్యులలో దరిద్రనారాయణుల దగ్గరనుంచి దేశాధినేతల వరకు ఉన్నారు. సమత- మమత-మానవత, ఆధ్యాత్మికత వంటి మేలు గుణాలు కలగలసిన మహానుభావుడు భగవాన్ శ్రీసత్యసాయిబాబా. ఆయన బోధనలు కొన్ని ఈ విశాల విశ్వంలో ఒకటే మతం ఉంది. అదే ప్రేమ మతం. భాష ఒకటే. అదే హృదయ భాష. ఒకే కులం... అదే మానవత. ఒకే న్యాయం- అదే కర్మ అనేది. ఒకే దేవుడు. ఆయన ఒక్కడే మహా శక్తిమంతుడు. మీ దినచర్యను ప్రేమతో ప్రారంభించండి. రోజంతా ప్రేమగానే గడపండి. చేసే ప్రతి పనినీ ప్రేమగా చెయ్యండి.

దినచర్యను ముగించడం కూడా ప్రేమగా ముగించండి. అదే మిమ్మల్ని భగవంతుడికి దగ్గర చేస్తుంది. మన ఆలోచనల్లో ప్రేమ ఉంటే అవి నిజమైన ఆలోచనలు. మనం చేసే పని పట్ల ప్రేమ ఉంటే దానిని మించిన ఉత్తమ ప్రవర్తన మరొకటి లేదు. ఎవరినైనా ప్రేమగా అర్థం చేసుకోవడానికి మించిన శాంతం లేదు. 



అందరిపట్లా ప్రేమ భావను కలిగి ఉండటాన్ని మించిన అహింస మరొకటి లేదు. అసలు ప్రతివారితోనూ ప్రేమగా మసిలేవాడికి హింసతో పని ఏముంది? ప్రేమతో చేసే పనికి మించిన సత్ప్రవర్తన లేదు. ప్రేమతో మాట్లాడు. దానికి మించిన సత్యం లేదు. ప్రేమగా ఆలోచించు. ఫలితం అనుకూలంగా ఉంటుంది.

మతాలన్నీ భగవంతుని చేరుకునే మార్గాన్ని దర్శింప చేసేవే కాబట్టి అన్ని మతాలనూ ఆదరించు. మన కంటికి కనిపించనంత మాత్రాన భగవంతుడు లేనట్లు కాదు. నువ్వు చూసే వెలుగు భగవంతునిదే. నువ్వు దేవుని గురించి విననంత మాత్రాన ఆయన లేనట్లుకాదు. ఎందుకంటే నువ్వు వినే ప్రతి శబ్దమూ దైవం చేసేదే...

దేవుడు ఎవరో నీకు తెలియకపోతే ఆయన లేడని కాదు, ఈ క్షణంలో నువ్వు ఆలోచిస్తున్నావంటే, వింటున్నావంటే, చూస్తున్నావంటే, జీవించి ఉన్నావంటే భగవంతుడు ఉన్నట్లే. ఆయన వల్లనే ఏ పనినైనా చేయగలుగుతున్నావు.

నువ్వు చేసే పనిని ఎవరూ చూడటం లేదనుకోవడానికి మించిన అవివేకం మరొకటి లేదు. ఎందుకంటే భగవంతుడు సర్వాంతర్యామి. ఆయన వెయ్యి కనులతో నిన్ను అనుక్షణం గమనిస్తూ ఉంటాడు. నిస్వార్థ బుద్ధితో నువ్వు చేసే ప్రతి పనినీ భగవంతుడు ఇష్టపడతాడు. ఎంతో ప్రేమతో స్వీకరిస్తాడు. నువ్వు వండే వంటను ప్రేమభావనతో చేస్తే ఆ వంట కచ్చితంగా రుచిగా ఉంటుంది. 



శత్రువులు పెట్టే బాధలన్నింటినీ సహనంతో భరించు, బదులుగా వారికి ఉపకారమే చేయి. ఎట్టి పరిస్థితులలోనూ అపకారం చేయనే వద్దు. నీపై వేసే ప్రతి నిందనూ ఓపికగా విను. వాటన్నింటినీ మౌనంగా స్వీకరించు. దేనికీ బదులు ఇవ్వవద్దు. భగవంతుని కృప బీమా రక్షణ వంటిది. ఆయనను ప్రతి క్షణం సేవిస్తూ ఉండు. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీకు అంతులేనంతటి రక్షణను, భద్రతను ఆయనే కల్పిస్తాడు.

నిన్ను వంచించిన ‘నిన్న’ వెళ్లిపోయింది. ‘రేపు’ వస్తుందో రాదో తెలియని అతిథి వంటిది. ‘నేడు’ నీ ముందున్న ప్రాణ స్నేహితుడు. కాబట్టి నేటిని జాగ్రత్తగా కాపాడుకో. నీ దగ్గర ఉన్నది నీ సంపద కాదు. ఇతరులకు పంచినప్పుడే అది నీదవుతుంది. నీ హృదయం సుందరంగా ఉంటే శీలం బాగుంటుంది. అప్పుడు నువ్వు చేసే ప్రతి పనీ అందంగా ఉంటుంది.

మౌన ం మీ జన్మహక్కు. దీనిలో నుంచి మహత్తర శక్తిని, ఆనందాన్ని అనుభవించడం మీ జీవితాశయంగా మారాలి. పసిపిల్లాడు ఏం మాటలు మాట్లాడుతున్నాడని ఆనందంతో కేరింతలు కొట్టగలుగుతున్నాడు? అప్పటి ఆ స్థితిని చూస్తే మనకెంత ఆనందం కలుగుతుందో కాస్త ప్రశాంతంగా ఆలోచించండి. పసిపిల్లల మౌనంలో, మంచి సాధకుల మౌనంలో ఆనందం వెల్లువలై పొంగుతుంది. అందుకనే ఇకనైనా మౌనంలోని ఆనందాన్ని అనుభవించండి, మీలోని దైవాన్ని కనుగొనండి.

ప్రేమతత్వం, శాంతిగీతం, సేవాపథం, సత్యశోధన బాబా బోధ. మానవ సేవే మాధవ సేవగా, సర్వ మతసారం సాయి అభిమతంగా, సత్యం, సేవానిరత, అహింసలను ప్రబోధించిన సత్యసాయిబాబా మనుషుల మధ్య మెలగిన దైవస్వరూపునిగా భక్తుల హృదయాలలో ఎప్పటికీ నిలచి ఉంటారు. ఆయన పిలుపులోని బంగారాన్ని అందుకుందాం. ఆయన బోధనల నుండి స్ఫూర్తిని పొందుదాం. ఆయన సేవలలోని పరమార్థాన్ని గ్రహిద్దాం. అదే మనం ఆయనకు సమర్పించే ఘననీరాజనం. 



కుటుంబ జీవన వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే సామాజిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది కాబట్టి భార్యాభర్తలు పరస్పర అవగాహనతో ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ కలసి మెలసి ఉండాలని, ప్రేమతో మెలగాలని బాబా బోధించారు. దేశప్రతిష్ఠ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే మహిళలు కీలక పాత్ర వహించాలని, సీతారాములను ఆదర్శంగా తీసుకుని త్యాగం, పరోపకారం, ఆత్మవిశ్వాసం, స్థైర్యం, ధైర్యం వంటి ఉత్తమ లక్షణాలను పెంపొందించుకుంటూ వ్యక్తిగతంగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన 85వ జయంత్యుత్సవాలలో బోధించారు. 

దయాకరో భగవాన్...
బాబా మానవులకే కాదు, జంతువులకు, పశుపక్ష్యాదులకు కూడా తన ప్రేమను పంచారు. ఒకే సమయంలో వివిధమందికి వివిధ ప్రదేశాలలో కనపడటం, ఆయన పటాల నుంచి విభూది, తేనె వంటివి రాలడం, అనేక మంది శారీరక, మానసిక రుగ్మతలను తానే స్వయంగా నయం చేయటం వంటివే కాదు. ఆయన మహిమలు ఇంకా అనేకమున్నాయి. వాటిలో మచ్చుకు కొన్ని. ఓ భక్తుడు... భగవద్దర్శనానికి ఆలస్యం చేశాడు. ద్వారాలు మూసేసే వేళ అయ్యింది. వాటిని మూయమని ఆజ్ఞ అయ్యింది. భక్తుడికి భగవద్దర్శనం కలగలేదు. చేసేదేమీ లేక ఎలుగెత్తి ‘‘దయాకరో భగవాన్, కృపాకరో భగవాన్’’... పాడటం మొదలు పెట్టాడు భక్తుడు.
స్వామి కరుణామూర్తి... రమ్మన్నాడు. కానీ ద్వారాలు తెరచి లేవు.
‘‘తలుపులు తీయకూడదని మీ ఆజ్ఞకదా స్వామీ. మేమెలా తెరవగలం. మీ ఆజ్ఞ మీరలేం’’ అన్నారు ద్వార పాలకులు. ‘‘మీ నిబంధనలు మీవి. మీరనీయను. నాదయ వీడనీయను’’ అన్నారు స్వామి. ‘‘దయా కరో అన్నావు కదా... అనుజ్ఞ ఇచ్చా. రా’’ ఆజ్ఞాపించారు స్వామి.
ద్వారాలు మూసేవున్నా భగవంతుడి పాదాలు చేరాడు భక్తుడు.



courtesy by sakshi

No comments: