60 సంవత్సరాలు నిండినా నేను, నా భార్య ప్రతి విషయంలోనూ తూర్పుపడమరలుగానే ఉన్నాం. లలితానామాలతో సయోధ్య కుదురుతుందా?
- శ్రీనివాస్, విజయనగరం 
ఆలుమగలకు బాధ్యతలు తీరాక పరస్పర నిర్లక్ష్య భావం వస్తుంది. ఎదుటివారు తమను అగౌరవ పరుస్తున్నారనే అభిప్రాయం పెరుగుతుంది. గతాన్ని తవ్వుకుంటూ తప్పుల్ని ఎత్తి చూపించుకోవడాన్ని మానితే, సయోధ్య పెరుగుతుంది. లలితాంబ ఇందులో ఏమీ చేయలేదు. 


సగోత్రీకులు భార్యాభర్తలవుతున్నారు. కొందరు సగోత్ర విధానాన్ని అంగీకరించరు. ఏది సరి?
- రాజమౌళి, శ్రీకాకుళం

గో- వంశాన్ని, త్ర- రక్షించే మహర్షులు అని అర్థం. ప్రతి వంశాన్నీ ఒక్కో మహర్షి రక్షిస్తూ ఉంటాడు. ఇలా ఒకే మహర్షి రక్షణలో ఉన్న ఒక స్త్రీ, పురుషుడు వివాహానికి సగోత్రీకులు అవుతారు. ఇది ఏ కులంలోనైనా సరికానిదే. 


తాచుపాము మా మనుమరాలికి దగ్గరగా వచ్చి పడగ విప్పి వెళ్లింది. 5 సంవత్సరాల ఈ పాపకు ఏదైనా గండం ఉందా? 
- కె. అంజి, రాజమండ్రి

అనుకోకుండా తాచుపాము చిన్నపిల్లల సమీపానికి వస్తే ఆ ఇంట్లో మరో స్త్రీ సంతానం కలుగబోతోందని సూచన. 

చెప్పులు వేసుకుని స్తోత్రాలు చదివాను. దోషమా? 
- పార్వతి, హైదరాబాద్

ఇంట్లో దైవమందిరం ముందు ఆచారం తప్పనిసరి. పత్తనే పాదమాచారమ్ (బయటకు వెళ్లాక ఆచారం నాలుగవ వంతే ఆచరించ సాధ్యమౌతుంది)అన్నారు. ఇల్లు దాటాక కూడా చదువుకునేందుకే పుట్టినవి స్తోత్రాలు. ఇంట్లో, గుడిలో తప్ప మరోచోట నియమాలు లేవు. 



తెలుగు సంవత్సరాల పేర్లు... వివరాలు ఏమిటి? 
- కె.వి.కృష్ణారెడ్డి, గుంటూరు

మన సంవత్సరాల పేర్లు ఆ సంవత్సర ఫలితమెలా ఉండబోతోందో వివరిస్తాయి. ‘రౌద్రి’- తీవ్రమైన రౌద్రం ప్రజల్లో ఉంటుంది. అలాగే గడిచిన వికృతి- అనేకమైన మార్పులు సంభవిస్తాయి. ఇప్పటి ఖర-చాల తీక్షణంగా ఉంటుంది. ఆదిలోనే మహాపురుష నిర్యాణాన్ని చూశాం కదా! భారతీయ సంప్రదాయజ్ఞులు, అనేక శాస్త్రాలను చదివింన పండితులు ఇలా సంవత్సరపు పేరును బట్టి ఫలితాన్ని ఊహించేలా పెట్టారు. 
 

No comments: