ఆరోగ్యాభివృద్ధికి నక్షత్ర వృక్షాలు
జ్యోతిషశాస్త్రంలోని 27 నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు, అధిదేవతలు ఉన్నట్లుగానే ఆయా నక్షత్రాలకు చెందిన వృక్షాలు కూడా ఉన్నాయి. అయితే వీటి ప్రాధాన్యత ఏమిటనేది మనలో చాలామందికి తెలియదు. కారణం నక్షత్రాలకు వృక్షాలుండటం ఏమిటనే అపోహ వల్లనే. నక్షత్రాలకు చెప్పబడిన దేవతలను, అధిదేవతలను, ప్రత్యధిదేవతలను పూజించలేని వారు తమ తమ జన్మనక్షత్రాలకు సంబంధించిన వృక్షాలను లేదా చెట్లను పూజించినట్లయితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. అంతేకాదు ఆయా నక్షత్రాలకు చెందిన మొక్కలను వారి ఇండ్ల ఆవరణలో పెంచడం వల్ల ఆ గృహ యజమాని ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి వంటి వాటిని తెలుసుకునేందుకు వీలుకలుగుతుంది. దీనికి కారణం ఆయా వృక్షాలలో దాగిన గొప్పశక్తులే. 


1)అశ్వని: వీరు విషముష్టిని లేదా జీడిమామిడిని పెంచాలి. అశ్వని నక్షత్రం శరీరంలోని జననేంద్రియాలను, చర్మాన్ని సూచిస్తుంది కాబట్టి అశ్వనిలో పుట్టినవారు ఈ మొక్కను ఇంటి ఆవరణలో నాటి దానిని సంరక్షిస్తుండటం వల్ల సంతానవృద్ధి కలుగుతుంది. చర్మసంబంధవ్యాధులు రాకుండా ఉంటాయి. పుంసత్వం పెరుగుతుంది.


2)భరణి: వీరు ఉసిరిచెట్టును పెంచాలి. ఈ నక్షత్రం శరీరంలోని ఆసన, గుదములను సూచిస్తుంది. అదేవిధంగా జీర్ణమండలాన్ని కూడా సూచిస్తుంది కాబట్టి ఉసిరిక చెట్టును పెంచడం వల్ల మూలశంక, మొలలు, పైల్స్, క్యాన్సర్, కడుపులో వాయు సంబంధిత వ్యాధులు, కడుపులో పుండ్లు, పైత్యరోగాలు వంటివి దరిచేరవు. 


3)కృత్తిక: ఈ నక్షత్రంలో పుట్టినవారు అత్తి(మేడి)చెట్టును పెంచాలి. ఈ నక్షత్రానికి అధిదేవత హుతాశనుడు, ప్రత్యధిదేవత స్వాహాదేవి (అగ్నిదేవుడి భార్య). దేహంలోని ఆయుఃస్థానాలైన షట్చక్రాలకు ప్రతీక కృత్తికానక్షత్రం. ఈ చెట్టును పెంచడం వల్ల వాత, గుండెవ్యాధులు దరిచేరవు. వీరుపెంచే అత్తిచెట్టు బలంగా, దృఢంగా పెరిగిన కొద్దీ గుండెకవాటాలు బలంగా ఉంటాయి. సంపూర్ణమైన ఆరోగ్యం చేకూరుతుంది. 


4)రోహిణి: ఈ నక్షత్రానికి అధిదేవత బ్రహ్మదేవుడు. ప్రత్యధిదేవత దక్షప్రజాపతి. వీరు నేరేడు చెట్టును పెంచడం మంచిది. ఈ చెట్టు శరీంలోని క్లోమగ్రంథిని, ఎడమకన్నును సూచిస్తుంది. ఈ వృక్షాన్ని పెంచడం వల్ల చక్కెరవ్యాధి, నేత్రరోగాలు దరిచేరవు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. 

మృగశిర: వీరు మారేడు వృక్షాన్ని పెంచాలి. ఈ నక్షత్రం గొంతు, స్వరపేటిక, థైరాయిడ్ గ్రంథులపై ప్రభావం చూపుతుంది. మారేడు లేదా చండ్ర వృక్షాన్ని పెంచడం వల్ల మృగశిర వారికి అజీర్ణసమస్యలు ఉండవు. జీర్ణక్రియ బాగుంటుంది.

ఆరుద్ర: సాక్షాత్తూ శివుని జన్మనక్షత్రం ఆరుద్ర. ఈ నక్షత్రంలో జన్మించినవారు చింతచెట్టును పెంచడం మంచిది. ఈ నక్షత్రం కూడా మృగశిర లాగానే గొంతును, స్వరపేటికను సూచిస్తుంది. వీరు చింతచెట్టును పెంచడంవల్ల పిశాచ భయం, తేళ్లు, పాముల వంటి విషజంతువుల భయం ఉండదు.

పునర్వసు: ఇది శ్రీరాముడి జన్మనక్షత్రం. ఈనక్షత్రంలో పుట్టినవారు వెదురు లేదా గన్నేరు చెట్టును పెంచాలి. పునర్వసు ఊపిరితిత్తులు, రొమ్ముభాగంపై ప్రభావం చూపుతుంది. ఈ నక్షత్రానికి అధిదేవత అదితీదేవి, ప్రత్యధిదేవత కశ్యపుడు. ఈ చెట్టును పెంచడం వల్ల క్షయ, ఉబ్బసం, శ్వాసకోశవ్యాధులు, రొమ్ముక్యాన్సర్ వంటి వాటి నుంచి రక్షణ లభిస్తుంది. బాలింతలు ఈ చెట్టును పెంచితే పాలకు లోటుండదు.

పుష్యమి: వీరు రావి లేదా పిప్పలిచెట్టును పెంచాలి. ఈ నక్షత్రం నాడీమండలానికి, నరాలకు సంకేతం. ఈ చెట్టును పెంచితే నరాల వ్యాధులు దరిచేరవు. శత్రు, రుణ, రోగభయాలు ఉండవు. పురుషులలో లైంగికవ్యాధులు ఉండవు. స్త్రీలు సంతానవతులవుతారు. దేవగురువు బృహస్పతి ఈ నక్షత్రాధిదేవత.

ఆశ్లేష: ఇది ఆదిశేషుని జన్మనక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించినవారు సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచడం వల్ల బొల్లి, శ్వేతకుష్ఠు, తామర, నాసిక సంబంధవ్యాధులు, అసాస్మ్యత (అలర్జీ) వంటి వ్యాధులు దరిచేరవు. ఈ న క్షత్రం కపాలంలోని పొరలను, చర్మాన్ని సూచిస్తుంది.

మఖ: వీరు మర్రిచెట్టును పెంచాలి. ఈ నక్షత్రం జాతకుడి చదువు సంధ్యలు, స్థిరచరాస్తులను సూచిస్తుంది. భుజాలకు సంబంధించిన ఎముకలను సూచిస్తుంది. ఈ వృక్షాన్ని పెంచడం వల్ల భార్యాభర్తలకు దాంపత్య సౌఖ్యం లభిస్తుంది. తల్లిదండ్రులకు, సంతానానికి మేలు కలుగుతుంది. అకాలవ్యాధులు, అకాల మరణాలు వీరి దరిచేరవు.

పుబ్బ: వీరు మోదుగవృక్షాన్ని పెంచుకోవాలి. ఇది స్త్రీ శరీరంలోని అండాశయాన్ని, పురుషుల శరీరంలోని వృషణాలను సూచిస్తుంది. దీనిని పెంచడం వల్ల అండాశయవ్యాధులు, పుంసత్వానికి సంబంధించిన వ్యాధులు దరిచేరవు. అంతేకాదు సౌందర్యం వృద్ధి అవుతుంది.

ఉత్తర: వీరు ఇంటిలో జువ్విచెట్టును పెంచాలి. ఇది గుండె లేదా హృదయాన్ని సూచిస్తుంది. దీనిని పెంచడం వల్ల గుండె వ్యాధులు దరిచేరవు. హృదయకవాటాలు బలంగా ఉంటాయి. హస్త: వీరు సన్నజాజి తీగెలను లేదా కుంకుడు చెట్టును పెంచాలి. ఇది ఉదరాన్ని లేదా పొట్టను సూచిస్తుంది. దీనిని పెంచడం వల్ల ఉదరకోశవ్యాధులు దరిచేరవు. ముఖ్యంగా ఉదరకోశానికి సంబంధించిన క్యాన్సర్, కడుపులో పుండ్ల నుంచి రక్షణ లభిస్తుంది.

చిత్త: మారేడు చెట్టు లేదా తాళవృక్షాన్ని (తాటిచెట్టు) పెంచుకోవాలి. ఇది పేగులను సూచిస్తుంది. యోనిసంబంధ వ్యాధులు దరిచేరవు. పేగు సంబంధమైన పూత, అల్సర్లు దరిచేరవు.

స్వాతి: ఈ నక్షత్రజాతకులు పెరటిలో మద్దిచెట్టును పెంచాలి. ఇది నాభిని సూచిస్తుంది. దీనిని పెంచడం వల్ల నాభి సంబంధ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. గర్భవ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.

విశాఖ: ఈ నక్షత్రంలో పుట్టినవారు వెలగ లేదా మొగలిచెట్టును పెంచాలి. ఇది జీర్ణగ్రంథులను సూచిస్తుంది. దీనిని పెంచడం వల్ల జీర్ణకోశంలో ఆహారం పులిసిపోకుండా చేస్తుంది. తిన్న ఆహారాన్ని సులువుగా జీర్ణమయేలా చేస్తుంది.

అనూరాధ: ఈ జాతకులు ఇంటిలో పొగడచెట్టును పెంచాలి. ఇది పిత్తాశయానికి ప్రతీక. దీనిని పెంచడం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. కాలేయవ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.

No comments: