నేను ఒక దేవాలయంలో పూజారిని. భక్తులకు తీర్థంగా ఏది ఇవ్వాలనేది నా సందేహం. కొబ్బరినీటినా? తులసితీర్థాన్నా? పటికబెల్లపు నీటినా?
- డి.ఎస్. శాస్త్రి, ఆత్మకూరు

దేవాలయమనేది వైద్య- ఆధ్యాత్మిక రంగాల కేంద్రం. ప్రతి భక్తుని ఆరోగ్యమూ సరిగా ఉండేందుకై తులసితీర్థాన్నివ్వడమే సరైన పద్ధతి. స్వామికి లేదా అమ్మవారికి అభిషేకించిన జల ంలోని ఒక ఉద్ధరిణె తీర్థాన్ని తులసితీర్థంలో కలిపి భక్తులకు ఇవ్వాలి. 



గ్రహణ సమయంలో దేవాలయాలను మూసివేస్తారెందుకని? ఆ తర్వాత శుద్ధి ఎందుకు?
- కె. రాజేశ్వరరావు, పరకాల

ఆదిత్యమండల మధ్యాంతర్వర్తీ నారాయణః- ఏ దైవమైనా సూర్యమండల మధ్యంలోనే ఉంటాడని దీని భావం. సూర్యుణ్ణి గ్రహణం (పట్టుకోవడం) చేయగానే ఆ మండలంలో ఉన్న అందరు దేవతలకీ కూడ గ్రహణ దోషం వస్తుంది కదా! ప్రవహిస్తున్న విద్యుత్తీగను పట్టుకుంటే పట్టుకున్నవారికే కాక వారిని తాకిన వారికి కూడా ప్రమాదమే కదా! గ్రహణమయ్యాక శుద్ధి కూడా ఇందుకే. విగ్రహం కిందనున్న శక్తిమంతమైన యంత్రబీజాక్షర శక్తిని ధ్వంసం చేసే శక్తి గ్రహణకాల కిరణాలకీ, అగ్నికీ ఉంది. అందుకే హనుమ రావణుని బీజ యంత్రశక్తిని ధ్వంసం చేయడానికే లంకాదహనాన్ని చేశాడు. 



పరమపద సోపాన పటంలోని ఆంతర్యమేమిటి?
- పి.పద్మజ, మచిలీపట్నం

వెనుకటి తరం ఆటల్లో ఆరోగ్యం, ఆధ్యాత్మిక రహస్యం అనేవి ఉండేవి. పరమపదమంటే స్వర్గం. దానికి సోపానపటం- మెట్లని తెలియజేసే చిత్రమని దీనర్థం. రాక్షసులూ నిచ్చెనలూ పాములూ దేవతలూ... ఉండే ఈ చిత్రంలో అలా అలా అలా పైకి వెళ్లిపోతూ వెళ్లిపోతూ అకస్మాత్తుగా పెద్దపాటు నోటపడి మళ్లీ మొదటికి వచ్చేయవచ్చు లేదా మోక్షానికి పోవచ్చు. ఇలా దృష్ట- అదృష్టాల నడుమ మన జీవితముంటుందనీ, ఏ క్షణమైనా పెరగవచ్చు అంతలోనే కుంగిపోవచ్చనే తీరు మానసిక ధైర్యాన్ని ముందుగానే ఇస్తూ వ్యక్తిని తీర్చిదిద్దే ఆట పరమపద సోపాన పటం.

నేనొక చిరువ్యాపారిని. ఏం చేసినా కలుసుబాటు రావడం లేదు. వ్యాపారంలో నష్టాలే వస్తున్నాయి. జనాకర్షణకు ఏ దైవాన్ని కొలవాలి?
- నరసింగ్‌రావు, హైదరాబాద్

వ్యాపార కారకుడు బుధుడు కాబట్టి బుధస్తోత్రాన్ని నిత్యం చేసుకోండి. దీంతోపాటు కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పిన మాటల్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. వ్యాపారాభివృద్ధికి నిజమైన పెట్టుబడి నమ్మకం. దాని తరుగుదలకు కారణం మోసం. వ్యాపారం పూర్తిగా మూతపడడానికి కారణం వ్యసనం. కాబట్టి వీటిని అవలోకనం చేసుకుని, వాక్చాతుర్యంతో ముందుకు వెళ్లండి.

No comments: