భారతీయ వివాహ సాంప్రదాయం ఎంతో విశిష్టమైనదని, మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా జరుగుతున్న మాంగల్యధారణ చూడముచ్చటగా ఉంటుందని మనం అనటమేకాక విదేశీయులు సైతం ఈ పద్ధతిలో వివాహం చేసుకోవటానికి ఆరాటపడతారు. వివాహ సమయంలో జరుపు ఉపనయం, కాశీయాత్రలను గూర్చి భగవాన్ రమణ మహర్షి ...


‘‘ఉపనయనం అంటే కేవలం మూడు పోగుల నూలు మెడలో వేయటం మాత్రమే కాదు. ఈ రెండు కళ్లే కాదోయ్, మూడవ కన్నున్నది. అది జ్ఞాననేత్రం. దాన్ని తెరచి స్వరూపాన్ని గుర్తించు అని బోధించటం.’’ అన్నారు. దానికి కావలసిన ప్రాణాయామం నేర్పి, బ్రహ్మోపదేశం చేసి, జోలె కట్టి, భిక్షమెత్తమంటారు. మాతృభిక్షే ప్రథమభిక్ష. తండ్రి బ్రహ్మోపదేశం చేస్తే, తల్లి మూడు పిడికెళ్ల బియ్యం భిక్ష పెడుతుంది. అంటే తండ్రి చేసిన ఉపదేశం మననం చేసే నిమిత్తం భిక్షాటన వల్ల కుక్షి నింపుకుని, గురుకులవాసం చేసి, జ్ఞాననేత్రం తెరచి ఆత్మానుభూతిని పొందాలనేది ఉపనయనం యొక్క తాత్పర్యం. ప్రస్తుతం ఆ విషయం మరచి ప్రాణాయామమంటే వేళ్లతో ముక్కుమూసి అభినయించుటగాను, బ్రహ్మోపదేశమంటే కొత్త ధోవతి ముసుగుకప్పి, చెవులో గుసగుసలాడటంగాను, భిక్షంటే రూకలతో జోలె నింపటంగాను పరిణమించింది. అసలు ఉపనయన తత్త్వం గురించి ఉపదేశం చేసే తండ్రికి, చేయించే పురోహితునికి తెలియనప్పుడు బిడ్డలకేం చెప్తారని కూడా రమణులు ప్రశ్నిస్తారు.

మానవ జీవితాన్ని మన పెద్దలు బ్రహ్మచర్యం, గార్హస్త్యం, వానప్రస్థం, సన్యాసంగా వివరించారు. ఐదేళ్లు నిండిన బాలుడిని ఊరికి దూరంగా ఉన్న గురుకులానికి జ్ఞానార్జన కోసం పంపేవారు. అక్కడ దాదాపు ఇరవై సంవత్సరాలు గడిపాక స్వగృహానికి వచ్చేవాడు. కొన్నాళ్ల తరవాత కాశీయాత్రకు బయలు దేరేవాడు. కొందరు వచ్చి మా కూతురునిచ్చి పాణిగ్రహణం చేస్తాం రమ్మని ఆహ్వానించేవారు. అతడు విరాగియైతే కాశీకి వెళ్లిపోయేవాడు, నచ్చితే వచ్చి కన్యాదానం గ్రహించి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి, పిల్లలను కని, పెంచి పోషిస్తూ, తల్లిదండ్రులకు సంఘానికి సేవ చేస్తూ దాదాపు యాభై సంవత్సరాల వయసు వచ్చేవరకు గృహస్థుగా గడిపి ఆ తరవాత తన భార్య తోడురాగా వానప్రస్థాశ్రమంలోకి ప్రవేశించి, చివరగా సన్యసించేవాడు. ఇప్పుడు అవన్నీ మరచిపోయారు. అర్థవంతమైన జీవితాన్ని మన భావితరాలవారికి అందించాలి. మన వ్యవస్థలు, ఆచారవ్యవహారాలు యావత్ప్రపంచానికి ఆదర్శం కావాలి.

No comments: