తిరుప్పావై --- 14 పాశురం

ఉంగళ్ పురైక్కడై త్తోట్టత్తు వావియుళ్
శెంగరునీర్ వాయ్ నెగిర్ అంద్ ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్
శెంగల్పొడి క్కూరై వెణ్బల్ తవత్తవర్
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్
ఎంగళై మున్నం ఎరుప్పువాన్ వాయ్ పేశుమ్
నంగాయ్! ఎరుందిరాయ్ నాణాదాయ్! నావుడైయాయ్
శంగోడు చక్కరం ఏందుం తడక్కైయం
పంగయ క్కణ్ణానై ప్పాడ-ఏలోర్ ఎంబావాయ్

రాగం: దేశి

నీ పెరటి తోటలో, ఆ నడిమి బావిలో
కమలాలు పూసినవి - కలువలు కనుమూసినవి
కాషాయములు దాల్చి కదలిరదె జీయరులు
కుంచకోలల కోవెలలు తెరువంగ //నీ పెరటి//
మునుముందు మమ్ముల మేలుకొలిపెదనంచు, పూర్ణా!
బీరములు ఆడి నీవు మాట మరచితివే - లజ్జావిహీనా!
శంఖచక్రధరుని పంకజనేత్రుని
విశాల బాహుని నామము పాడగరావే! మధురభాషిణి!
జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము.

అందరికంటే ముందు లేచి అందరినీ మేల్కొలుపుతాను అని మాట ఇచ్చి మరచిపోయి ఇంకా నిద్రపోతున్న గోపికను ఈరోజు మేల్కొల్పుతున్నారు. ఈ గోపిక ఉన్నది ఒక విశాలభవనం. దాని వెనకాల తోటలో అందమైన కొలను. అందులో కలువలు తామరలు కదలాడుతూ అందంగా ఉన్నాయి. "అమ్మా! చూశావా? కలువపూలు ముడుచుకుంటున్నాయి. తామరపూవులు వికసిస్తున్నాయి. తెల్లవారిందమ్మా లే! ఎర్రని కాషాయవస్త్రాలు ధరించి, తెల్లని పలువరుస కలిగిన సన్యాసులు దేవాలయాలు తెరిచి ఆరాధన చేయడానికి వెళ్తున్నారు. అందరికంటే ముందుగా లేచి మమ్మల్నందరినీ లేపుతానని మాట ఇచ్చి తప్పావు. సిగ్గులేనిదానా! మంచి మాటకారివే! పరిపూర్ణురాలా! ఆజానుబాహువు, పుండరీకాక్షుడు, శంఖచక్రాలను ధరించిన ఆ శ్రీమన్నారాయణుని కీర్తిద్దాం . రా తొందరగా!

మన శరీరమనే భవనంలో వెనుక ఒక తోట ఉంది. అది భగవంతునితో కలిసి విహరించే స్థలం. అదే మన వెన్నుపూసలో ఉండే నాడీమండలం. మన నాభినుండి శిరఃస్థానం వరకు ఉన్న నాడీమండలంలో ప్రయాణం చేసి భగవంత్ తత్వాన్ని దర్శించాలి. ఆ తోటమధ్యలో కొలను అందులొ వికసించిన పద్మాలు. నాడీమండలంలో ఉండే చక్రాలనే పద్మములని అంటారు. మూలాధార, స్వాదిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారములు అనే ఏడు పద్మాలు వికసించాయి. దానికర్ధం జ్ఞానేంద్రియాలు వికసించాయన్నమాట. ఇక కలువలు ఇంద్రియాలు. నిద్రిస్తున్న గోపికను పరిపూర్ణులారా అన్నారు. ఆమె కృష్ణప్రేమలో పూర్తిగా మునిగిపోయి ఉన్నది.. కాషాయములు ధరించిన సన్యాసులు కుంచెకోలలను చేతబట్టుకుని ఆలయాలు తెరిచి ఆరాధన చేయడానికి వెళ్తున్నారట. కాషాయం వైరాగ్యానికి చిహ్నం..గురువుల ఉపదేశమే హృదయమనే ఆలయపు తలుపును తెరిచే కుంచెకోల.

No comments: