తిరుప్పావై --- 15 పాశురం

ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో
శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్ నంగైమీర్! పోదరుగిన్ఱేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పండేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీంగళే నానే తాన్ ఆయిడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై
ఎల్లారుం పోందారో పోందార్ పోంద్-ఎణ్ణిక్కోళ్
వల్లానై కొన్ఱానై మాత్తారై మాత్తరిక్క
వల్లానై మాయనై ప్పాడ-ఏలోర్ ఎమ్బావాయ్ 

రాగం : భైరవి

ఏమే చిన్నారి చిలుకా! ఎన్నాళ్ళె నీ నిదుర?
జిల్లుమని పిలువకుడె ఓ తల్లులార! ఇదె వచ్చేను.
నీ నోటివాటము, నీ మాట పాటవము
తెలిసికొన్నాములే తెమలవే కలికి! //చిన్నారి //
మాటకారులు మీరే - పోనీ నేనవుతాను
ఏమిటే నీ గొప్ప ఒప్పులకుప్ప?
వచ్చిరా అందరు? ఆఁ! - లెక్కించుకో
మత్తగజముల, శాత్రవుల మదమునణచిన
మాయావి కృష్ణుని మనము కీర్తింపగ
జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము

ఈరోజు గోపిక అహంకారము తొలగి పరిపూర్ణ స్థితిలో ఉంది. ఆమె అప్పటికే నిద్రలేచి నిన్నటి పాశురం మధురంగా పాడుకుంటుంది. ఆమెను మేల్కొల్పడానికి వచ్చిన గోపికల బృందం అది విని ఇలా సంభాషించారు.

ఓ లేతచిలుకా! ఇంకా నిద్రలోనే ఉన్నావా?
అలా జిల్లుమని పిలవకండే.. ఇదిగో వస్తున్నానుగా..
అమ్మో నీవు మంచి నేర్పరివి, మాటకారివే. నీ నోటివాటం మాకు తెలీదా?
మీరే మాటకారులు! పోనీ నేనే అవుతాను
ఏమిటే నీ గొప్ప? తొందరగా తెములు.
అందరూ వచ్చారా?
ఆ! వచ్చారే! కావాలంటే నీవే లెక్కించు
సరే! నేను వచ్చి ఏం చేయాలి? చెప్పండి
మదించిన ఏనుగును మట్టుపెట్టినవాడు, శత్రువుల గర్వాన్ని అణచినవాడు, మాయావి ఐన ఆ శ్రీకృష్ణుడిని కీర్తిద్దాం రావమ్మా!

ఈ రోజు జరిగిన గోపికా సంవాదంలో మనకు కొన్ని ముఖ్యమైన విషయాలు అర్ధమవుతాయి. తాను అందరిలా నిద్రపోక , వేకువఝామునే మేలుకున్నా కూడా తోటివారు ఇంకా నిద్రపోతున్నావా? అని నిష్టూరమాడేసరికి భరించలేకపోయింది.తన మంచితనాన్ని నిరూపించుకోవడానికి వారి పరుష ప్రవర్తనను బయట పెట్టింది. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారికి ఇటువంటి ప్రవర్తన మంచిది కాదు. ఒకరితో ఒకరు వాదిస్తే హృదయంలోని భగవదనుభవం తరిగిపోతుంది. అందుకే లోపలున్న గోపికకు జ్ఞానోదయమై నేనే కఠినురాలిని అని ఒప్పుకుంది. మన తప్పు ఉన్నా లేకున్నా పెద్దలు ఉన్నది అంటే మనసులో కూడా బాధపడక సంతోషంతో స్వీకరించడమే క్షమాగుణంలోని పరాకాష్ట. మనలోని దోషాలను ఎత్తి చూపినవారిని శత్రువులుగా ద్వేషించక, శ్రేయోభిలాషులుగా భావించి నిందాస్తుతులను సమానంగా స్వీకరించాలి. స్తుతిని నిందగానూ, నిందను స్తుతిగానూ భావించి తనను తాను సరిదిద్దుకునేవాడే భాగవతోత్తముడు. అంతే కాదు ఒకరికంటే ఒకరు తక్కువ వారము అనుకోవడం ఉత్తమ శ్రీవైష్ణవ లక్షణం. అందుకే లోపలున్న గోపిక ముందు నిష్టూరాలాడినా తర్వాత నింద తనమీదే వేసుకుంది.

భగవంతుని దర్శనానికి వెళ్లేటపుడు పదిమంది భాగవతోత్తములైన ఆళ్వారులను సేవించి తోడ్కొని పోయినట్టు గోదాదేవి పదిమంది ఉత్తములైన గోపికలను మేల్కొలిపి శ్రీకృష్ణుడుండే భవనానికి చేరుకుంది... దీనితో శ్రీవ్రతం అనబడే తిరుప్పావై వ్రతం పూర్వభాగం పూర్తైంది. భగవంతుని భక్తులను మేల్కొల్పడం పూర్వభాగం. భగవానుని మేల్కొల్పడం ఉత్తరభాగం.

No comments: