తిరుప్పావై --- 18 పాశురం

ఉందు మదకళిత్తన్-ఓడాద తోళ్ వలియన్
నంద గోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్!
కందం కమరుం కురలి కడై తిఱవాయ్ వంద్
ఎంగుం కోరి అరైత్తన కాణ్ మాదవి
ప్పందల్ మేల్ పల్గాల్ కుయిల్ ఇనంగళ్ కూవిన కాణ్
పందార్ విరలి ఉన్ మ్మైత్తునన్ పేర్ పా డ
శెందామరై క్కైయాల్ శీరార్ వళై ఒలిప్ప
వందు తిఱవాయ్ మగిరింద్-ఏలోర్ ఎంబావాయ్

రాగం : తిలాంగ్

మత్తగజరాజముల నెదిరించెను - మంచి
భుజ బలము గల నందుని కోడలా!
నెత్తావి కురుల నెలతరో నప్పిన్న!
నీ స్వామి కీర్తింప గడె తీసి రావే! // మత్తగజ//
కోళ్లు కూయగ అంతటా, మాధవి పందిట
కోయిలల కుహుకుహూలు చెలరేగె
బంతి చేతను గల మేల్బంతి నీల!
కరకంకణములు గలు గల్లుమనగ
తలుపు తీయగరావే ముదమార ముదితరో!
జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము..

నిన్న నందగోపభవనంలో నందుని , యశోదను మేల్కొల్పిన గోపికలు శ్రీకృష్ణుడు కానరాక నందుని అడగారు. అతను శ్రీకృష్ణుడు తన ప్రియసఖి నీలాదేవి భవనంలో ఉన్నాడని తెలియచేస్తాడు. అప్పుడు ఆ గోపికలంతా నీలాదేవి భవనానికి వచ్చి ఆమెను నిద్ర లేపుతున్నారు. నీలాదేవి శ్రీకృష్ణుని ప్రియ సఖి. అత్యంత సన్నిహితురాలు. ఏడు ఎద్దులను కలిపి కట్టి ఈమెను పెళ్లి చేసుకున్నాడు కృష్ణుడు. ఈమె ద్రావిడబాషలో 'నప్పిన్న'గా, భాగవతంలో 'నాగ్నజిత్తి'గా కనిపిస్తుంది. ఆమె లేపితేనే కృష్ణుడు నిద్ర మేల్కొంటాడు. అందుకే గోపికలు నీలాదేవి భవనానికి వచ్చి ఆమెను మేల్కొల్పుతున్నారు.

"మదపుటేనుగు బలము కలవాడు, వెనుదీయని భుజబలము కలవాడు అయిన నందుని కోడలమ్మా! నప్పిన్నా! పరిమళము వెదజల్లే నల్లని కురులు కలిగిన నీలాదేవి! తలుపు తీయుము. బయట కోళ్లు మేల్కొని అరుస్తున్నాయి. మాధవీ పందిరిమీద కోయిలలు కూస్తున్నాయి. తెల్లవారిందని ఇంకా నీకు తెలియలేదా? చేతిలో బంతిని పట్టుకున్నదానా! నీ మేనబావను కీర్తించడానికి వచ్చాము. సంతోషంగా లేచి వచ్చి ఎర్రని తామరపువ్వులాంటి నీ చేతితో అందమైన నీ చేతిగాజులు గలగలాడగా వచ్చి తలుపు తెరువమ్మ..

నప్పిన్న! నందుని కోడలా! అనడంలో మామగారు నందుడు అందరికీ ఉదారంగా సాయం చేస్తారు అలాగే కోడలివైన నువ్వు మా కోరిక తీర్చాల్సిందే అన్న సూచన కనిపిస్తుంది. కృష్ణుడు పుష్పమైనప్పుడు ఆమె పరిమళమౌతుంది.. అందుకేనేమో ఆమె కేశాలు గుభాళిస్తున్నాయి. ఆ సుగంధం బయటకు కూడా ప్రసరిస్తుండడంతో స్వామి లోపల ఉన్నాడని అందరికీ తెలిసిపోతుంది. తెల్లవారుతుందనడానికి గుర్తుగా కోళ్ళు అంతటా అరుస్తున్నయంట. భగవంతుని భక్తులే ఈ కోళ్లు అనవచ్చు. కోళ్ళు తమకు ఆహారం ఐన ధాన్యపు గింజలను ఏరుకుంటూ ఎంతో విలువైన రత్నాలు దొరికినా వాటిని పక్కకు తోసేస్తాయి. అదే విధంగా భాగవతోత్తముడైనవాడు సంసారంలో ఉన్నా అనవసరమైనవి త్యజించి అవసరమైన భగవత్ తత్వాన్ని మాత్రమే ఆహారంగా తీసుకుంటాడు. మాదవీలత అల్లుకున్న పందిరిపై కోయిలలు మధురంగా కూస్తున్నాయి. అలా కోకిలలా తమ మధురగానంతో లోకాన్ని ఆనందమయం చేస్తారు ఆళ్వారులు.

మాధవి అంటే లక్ష్మి ఆమె లతతో పోల్చబడింది. ఆ లత ఆశ్రయించిన పందిరి ఆ నారాయణుడు. మాధవి పందిరి అంటే ఆ శ్రీమన్నారాయణ తత్వం. అదే ఆధారంగా జీవించే పుణ్యాత్ములు ఆళ్వారులు. ఈ పాశురంలో మరో విశేషం ఉంది. నీలాదేవి తన చేతిలో బంతి పట్టుకొని ఉందంట. ఆమె శ్రీకృష్ణునితో రాత్రి బంతి ఆడి ఆడి అలసి నిద్రపోయింది. విభూతి (సర్వ ప్రపంచం) ఐన బంతి ఒక చేతిలో, విభూతిమంతుడైన పరమాత్మ మరో చేతిలో ఉన్నారు. ఈ రెండూ కలిసిందే నారాయణ తత్వం లేదా శ్రీ తత్వం. భగవంతుని పొందాలనుకునేటప్పుడు మనకు సాయపడేది ఈ 'శ్రీ' ... అతనే మనకు ఉపాయము, సర్వస్వమూ అని తెలియచేసి, ఆ భగవంతునితో మనలను జతచేర్చే దయామయి ఈ లక్ష్మీదేవి. ఈ పాశురం గానం చేసినంతనే మనకు అమ్మవారి సాక్షాత్కారం లభిస్తుంది అని పెద్దల మాట..

No comments: