తిరుప్పావై --- 19 పాశురం
కుత్తు విళక్కెరియ కోట్టుక్కాల్ కట్టిల్మేల్
మెత్తెన్ఱ పంచ శయనత్తిన్ మేల్ ఏఱి
కొత్తలర్ పూంగురల్ నప్పిన్నై కొంగైమేల్
వైత్తు క్కిడంద మలర్ మార్బా! వాయ్ తిఱవాయ్
మైత్తడంకణ్ణినాయ్! నీ ఉన్-మణాళనై
ఎత్తనై పోదుం తుయిలెర ఒట్టాయ్ కాణ్
ఎత్తనై యేలుం పిరివాత్తగిల్లాయాల్
తత్తువమన్ఱు తగవ్-ఏలోర్ ఎంబావాయ్
రాగం: అమీర్ కళ్యాణి
గుత్తు దీపాలు వెలుగ పట్టెమంచము పైని
పంచ శయనమ్ముపై పూల గుత్తుల నీల
ఎదను ఎదనుంచిన దేవా! పలుకవా! //గుత్తు దీపాలు //
కాటుక కన్నుల కలికిరో నీవు
నీ పతిని క్షణమైన మేలుకోనీవా?
ఎడబాటు సుంతైన ఓపలేకున్నావ?
నీ స్వరూపానికి నీ స్వభావానికి
ఇది తగదు తగదమ్మ తలుపు తీయమ్మా!
జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము..
ఇది భగవంతుని తత్వ నిరూపణ చేసే శృంగార పాశురము. సృష్టికి ముందు తర్వాత కూడా పరమాత్మ లక్ష్మీ సహితుడై ఉంటాడు. శ్రీమన్నారాయణ తత్వము ఏక అనేకములైనది. శ్రీని గాని, నారాయణుని గాని వేరువేరుగా భావించకుండా వాళ్లిద్దరే ఈ జగత్తుకు మూలాధారాలు అని ఈ పాశురంలో ఇద్దరినీ మేల్కొల్పుతున్నారు.
"ఓ కృష్ణా! నీది విశాలమైన హృదయం కదా! నోరు తెరిచి మాతో మాట్లాడడం లేదెందుకని? నీవు మా నీలాదేవితో కలిసి దంతపుకోళ్ల మంచం మీద పంచశయనంపై హాయిగా నిద్రపోతున్నావు. చుట్టూ గుత్తి వెలిగించి ఉన్నాయి. నీలాదేవి జడలో పూలు సువాసలు వెదజల్లుతున్నాయి. ఆమెతోనైనా మాట్లాడదామనుకుంటే ఆమె ఎదమీద ఎదనుంచి నీవు పడుకున్నావు. అమ్మా నీలాదేవి! నీవైనా స్వామిని నిద్రలేపవమ్మా! కొంచమైనా అతని ఎడబాటును సహించలేవా? అది నీ స్వరూపానికి, స్వభావానికి తగిన పని కాదమ్మా!"
నీలాదేవి, శ్రీకృష్ణుడు నిద్రపోయే మంచాన్ని పంచశయనం అంటారు. ఈ పంచశయానికి మెత్తగా , విశాలంగా, ఎత్తుగా, పరిమళభరితంగా ఉండాలి. అలాగే కాలానికి తగ్గట్టుగా వెచ్చగా, చల్లగా ఉండాలి. భగవంతుడే పాన్పు కాగా ఆ పాన్పు చుట్టూ గుత్తి దీపాలు వెలిగించి ఉన్నాయి. దీపము జ్ఞానానికి ప్రతీక. అది ఐదు దీపాలుగా వచ్చేట్టుగా పెట్టి ఉన్నాయి. అదే గుత్తు దీపం అంటారు. ఆ ఐదు విశేషాలు ఏంటంటే.. శ్రుతి, స్మృతి, ఇతిహాసము, పురాణము, ఆగమాలు. నీలాదేవి దంతపు కోళ్ల మంచం మీద పడుకుని ఉంది. శ్రీకృష్ణుడు కువలయాపీడనమనే ఏనుగును చంపి దాని దంతాలను మంచం కోళ్లుగా అమర్చాడు. ఆ ఏనుగే అహంకారము. నేను అనుభవించేవాడిని, చేసేవాడిని, తెలుసుకునేవాడిని, భగవంతుడికి దాసుడను అనే నాలుగు అహంకారాలను మంచం కోళ్లుగా చేసుకుని దానిపై స్వామి కూర్చున్నా, శయనించినా చాలు ఆ అహంకారం అణిగిపోతుంది.
నీలాదేవి జడలో సువాసనలతో కూడిన పూలను ధరించి ఉంది. ఆ పూలే జీవాత్మలు. జీవకోటిని పరమాత్మతో చేర్చడమే ఆమె ముఖ్యమైన ఆశయం. ఆమె కళ్ళకు పెట్టుకున్న భక్తి సిద్ధాంజనమనే కాటుక మనలో ఉండే పరమాత్మను దర్శించుకునేలా చేస్తుంది. జీవులు బాధలను అనుభవించునప్పుడు ముందుగా అమ్మా అనే అంటారు. అందుకే ఆ స్వామి కొరకు ముందుగా అమ్మను ప్రార్ధిస్తున్నారు గోపికలు.
No comments:
Post a Comment