తిరుప్పావై --- 20 పాశురం

ముప్పత్తుమూవర్ అమరర్క్కు మున్ శెన్ఱు

కప్పం తవిర్క్కుం కలియే! తుయిల్ ఏరాయ్

శెప్పం ఉడైయాయ్! తిఱలుడైయాయ్ శేత్తార్క్కు

వెప్పం కొడుక్కుం విమలా! తుయిల్ ఎరాయ్

శెప్పన్న మెల్-ములై చ్చెవ్వాయ్ చ్చిఱు మరుంగుల్

నప్పినై నంగాయ్! తిరువే! తుయిలెరాయ్

ఉక్కముం తట్టొళియుం తందు ఉన్-మణాళనై

ఇప్పోదే ఎమ్మై నీరాట్టు-ఏలోర్ ఎంబావాయ్

రాగం: పూరీ కళ్యాణి

ముప్పది మూడు సురకోటుల ముప్పుగాచి

భయమును మానుపు బలశాలీ! మేలుకో!

అర్జవముతో ఆశ్రితులను బ్రోచు

అరిభయంకరా! హరీ! మేలుకో! //ముప్పది//

పూర్ణా! నప్పిన్నా! సిరీ! మేలుకో! మమ్మేలుకో!

ఆలవట్టము, అద్దమొసగీ అందరినీ

నీ స్వామితో నీరాట్ట మాడింపవే అమ్మా!

జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము.

ఈ తిరుప్పావై పాశురాలలోని విషయాలను మనం మూడు చోట్ల అన్వయించుకోవాలి. ఒకటి రేపల్లెలో కృష్ణుడు, గోపికలతో, రెండు శ్రీవిల్లిపుత్తూరులోని గోదాదేవి, శ్రీరంగనాధుడు. మూడోది మనలో. ఈ పాశురాలలోని అసలు అంతరార్ధం అన్ని యుగాలలో అందరికీ ఉపయుక్తమైనవే.. నిన్న గోఫికలు వచ్చి ఎన్ని నిష్టూరాలు చేసినా నీలాదేవి, శ్రీకృష్ణుడు నిద్ర లేవలేదు. ఈ రోజు గోపికలు ఇద్దరినీ ఒకేసారి స్తుతిస్తున్నారు.

"ముప్పై మూడు కోట్ల దేవతలకు ఎటువంటి కష్టం కలగకముందే వెళ్లి యుద్ధభూమిలో వారికి ముందుగా నిలిచి పోరాడి శత్రుభయాన్ని తొలగించే బలశాలి.. రక్షించేవాడా! నిన్ను ఆశ్రయించినవారి శత్రువులను నీ శత్రువులుగా భావించి వారికి భాయాన్ని పుట్టించేవాడా! నిర్మల స్వభావుడా! మేలుకో.. బంగారు కలశాల్లాంటి స్తనాలు కలిగి, దొండపండులాంటి ఎర్రని పెదవులు, సన్నని నడుము గల ఓ నీలాదేవి! పరిపూర్ణురాలా! లక్ష్మీ సమానురాలవైనదానా! మేలుకో. ఆ విసనకర్రను, కంచుటద్దాన్ని మాకు ఇచ్చి నీ సఖుడు శ్రీకృష్ణుడిని మాతో స్నానమాడించు" అని అర్ధించారు.

మనకు ముప్పై మూడు కోట్లమంది దేవతలు ఉన్నారని నానుడి కాని వేదాల ప్రకారం వర్గరీత్యా ఉన్నది ముప్పై ముగ్గురే. ఎనిమిదిమంది వసువులు, పదకొండుమంది రుద్రులు, పన్నెండుమంది ఆదిత్యులు, ఇద్దరు అశ్విని దేవతలు, మొత్తం ముప్పైమూడు వర్గాల దేవతలు. వారందరూ దేవతలైనా కూడా తమ కష్టాలను పోగొట్టుకోవడానికి పరమాత్మనే ఆశ్రయిస్తారు..”స్వామి నీవు మనసు, మాట, చేత కలిగినవాడవు. మనసులో అనుకున్నది మాటల్లో చెప్పడం, మాటల్లో చెప్పింది చేతల్లో చేయడం నీకు అలవాటు. మరి ఇవాళ ఉషోదయ వేళలో మమ్మల్ని కలుస్తానని నువ్వు ఇచ్చిన మాటను నిలబెట్టుకో. నీలాదేవి స్థనములు స్వామిని ఆకర్షిస్తాయి అంటే వక్షస్థానంలో జన్మించే పరమ భక్తులే ఆ స్వామిని ఆకర్షిస్తారు. ఆమె నాజూకైన నడుము అనగ వైరాగ్యం కూడా ఆతనికి ఆకర్షణీయం. అధరాలు పర, పరమ భక్తికి నిదర్శనాలు. జ్ఞానము, భక్తి, వైరాగ్యము స్వామిని చేరడానికి గల దారులు. అమ్మా! నీలాదేవి నీవు ఉన్నతమైన స్త్రీవి. సాక్షాత్తు ఆ స్రీమహాలక్ష్మివే. ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న నీవే ఇలా నిద్రించడం తగదమ్మా!" అని వేడుకుంటున్నారు గోపికలు.

శ్రీ అంటే జీవులచే ఆశ్రయింపబడి ఎల్లప్పుడు స్వామిని ఆశ్రయించి ఉండేది. వాత్సల్యము, కారుణ్యము, క్షమ, మార్దవము మొదలైన సుగుణాలు ఉన్న పరిపూర్ణురాలు. అమ్మా! విసనకర్రను, అద్దాన్ని మాకిచ్చి నీ విభునితో మేము స్నానమాడునట్లు చేయి. ఇదే మా కోరిక. విసనకర్ర, అద్దం వీరి వ్రతానికి కావలసిన వస్తువులు. కాని ఒక భార్యను ఆమె భర్తతో తమను స్నానం చేయించడానికి పంపమనడం ఎబ్బెట్టుగా అనిపించినా జీవులను పరమాత్రంతో చేర్చడం అనేది అసలు అర్ధం.పరమాత్మ అనే కొలనులో స్నానం లేదా అనుగ్రహం పొందడానికి సాయం చేసేదే శ్రీ లేదా అమ్మ. మన ఆత్మలకు బాధను కలిగించే అహంకార మమకారాలు అనే చెమటను తొలగించడానికి ఉపయోగపడేది నమః అనే వీవెన. అప్పుడు నీవు, నేను అనే భావన లేక సర్వమూ ఆ భగవంతుడే అనిపిస్తుంది. మన ఆత్మ స్వరూపాన్ని చూసుకోవడానికి ఉపయోగించే ప్రణవ (ఓం) మంత్రమే ఈ కంచుటద్దం. పరమాత్మకు నిత్యం సేవ చేసుకునే భాగ్యాన్ని పొందాలని ఆ గోపికలు అమ్మవారిని ప్రార్ధిస్తున్నారు

No comments: