శ్రీ అనంతపద్మనాభ వ్రతము
|
భాద్రపద శుక్ల చతుర్దశినాడు జరుపుకొనే వ్రతం అనంత పద్మనాభ చతుర్దశి. ఇది కేవలం వ్రతమేకానీ ఉత్సవం మాత్రం కాదు. సంప్రదాయంలో ఉన్న కామ్య వ్రతాలలో ఇది ప్రధానమైందని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి...
అనంతుడు అనేది శ్రీమహావిష్ణువుకు ఉండే పేర్లలో ఒకటి. శ్రీమహావిష్ణువును అనంతుడిగా పూజిస్తూ చేసే వ్రతమునకే ’అనంత చతుర్దశి వ్రతం’ లేదా ’ అనంత పద్మనాభ వ్రతం’ అని పేర్లు.
ఈ వ్రతం గురించి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించినట్లు భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది. అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరిస్తే సకల సంపదలు చేకూరుతాయి. శ్రీకృష్ణ భగవానుడు అనంత పద్మనాభ వ్రతాన్ని ధర్మరాజుకు వినిపించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
భాద్రపద శుక్ల చతుర్ధశి నాడు (ఇంగ్లిష్ క్యాలడర్ ప్రకారము ఒక్కోసంవత్సర్ము ఒక్కో తేదీ ) శుచిగా స్నానమాచరించి, గృహాన్ని, పూజామందిరాన్ని శుభ్రపరుచుకోవాలి. పూజామందిరము నందు అష్టదశ పద్మాన్ని తీర్చిదిద్దాలి. ఆ పద్మం చుట్టూ రంగవల్లికలతో అలంకరించుకోవాలి. దానికి దక్షణ భాగంలో నీరు నింపిన కలశం ఉంచాలి. పద్మానికి నడుమ దర్భలతో తయారు చేసిన ఏడు పడగలతో ఉన్న అనంత పద్మనాభ స్వామి బొమ్మను పెట్టాలి. దర్భలతో చేసిన ఆ బొమ్మలోకి అనంత పద్మనాభ స్వామిని ఆవాహన చేయాలి. ఎర్రని రంగులో ఉండే 14 ముడులతో ఉన్న తోరాన్ని స్వామి దగ్గర ఉంచాలి. షోడశోపచార పూజ చేయాలని పురోహితులు చెబుతున్నారు. ఇలా పద్మనాభ వ్రతాన్ని ఆచరించే వారికి సకల సౌభాగ్యాలు చేకూరుతాయని విశ్వాసం. ఈ వ్రతమహిమతో కృతయుగంలో సుశీల-కౌండిన్య దంపతుల సకల సంపదలు, సుఖసంతోషాలతో జీవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇంకా అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరించిన భక్తులు ఆ రోజున తమకు వీలైనంత దానధర్మాలు చేయడం ద్వార మోక్షఫలములు, పుణ్యఫలములు, అష్టైశ్వర్యాలు పొందుతారని పురోహితులు సూచిస్తున్నారు.
ఆచమ్య ప్రాణాయామ దేశకాలమాన, గోత్రనామ ధేయాదీన్ సంస్కృత్య అని సంకల్పము చెప్పుకొని
ఈ క్రింది విధముగా పూజ ప్రారంభించాలి.
ఏవంగుణ విశేషణ విశిష్టాయం, శుభతిథౌ, అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయాభయ
అయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫలసిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త
శ్రీమదనంతపద్మనాభ దేవతాముద్దిశ్య శ్రీమదనంతపద్మనాభదేవతా ప్రీత్యర్థం పద్మపురాణోక్త ప్రకారేణ
యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాంకరిష్యే (నీళ్లు ముట్టుకొవాలి)
అథశ్రీమదనంతపద్మనాభ పూజాకల్పః
ధ్యానం
కృత్వాదర్భమయం దేవం పరిధాన సమన్వితః
ఫణైస్సప్తభిరా విష్ణుం పింగళాక్షంచ చతుర్భుజం దక్షిణాగ్రకరే పద్మం శంఖం తస్యాప్యథః కరే చక్రమూర్ధ్యకరే వామే గదాంతస్యాప్యధః కరే|| దధానం సర్వలోకేశం సర్వాభరణ భూషితం అవ్యయం సర్వలోకేశం పీతాంబరధరం హరిం దుగ్ధాబ్ధి శాయనం ధ్యాత్వా చైవమావాహయేత్సుధీః|| శ్రీ అనంతపద్మనాభాయనమః ధ్యానం సమర్పయామి
శ్రీ అనంత పద్మనాభ అష్టోత్తర శతనామావళిః
ఇతి శ్రీ అనంత పద్మనాభ అష్టోత్తర శతనామావళిః
అనంతపద్మనాభ వ్రతకల్ప కథ
శౌనకాది మహామునులతో సూత పౌరాణికుడు: లోకములలో దారిద్ర్య నివారణమునకు ఒక మహొత్తర వ్రతము కలదు. దానిని చెప్పెద వినుడు అని ఈ విధంగా చెప్పసాగిరి. కాలకర్మవశమున పాండవులు అరణ్యవాస సమయంలో కృష్ణభగవానునితో మహాత్మా! మేము అనేక కష్టాలతో జీవనము సాగిస్తున్నాము. ఈ జీవన మార్గాన్ని తప్పించే తరుణోపాయ మేదైనా ఉంటే చెప్పమని వేడుకున్నారు.
ఓ ధర్మరాజా! పురుషులకు, స్త్రీలకు సకల పాపములను పోగొట్టి సకల సౌభాగ్యములనిచ్చు ఓ వ్రతము కలదు. అదియే అనంతపద్మనాభవ్రతము. భాద్రపద శుక్ల పక్ష చతుర్థీ రోజున చేయవలెను. ఆ వ్రతము వల్ల పుత్ర, పౌత్రాభి వృద్ధియు యశస్సు, సుఖశాంతులు కలుగును అని శ్రీకృష్ణుడు చెప్పగా ధర్మరాజు "అనంతుడెవ్వరు? అతని స్వరూప మేమిట"ని అడుగగా, ఓ పాండుపుత్రా! అనంతుడు మరెవ్వరో కాదు నేనే. సృష్టి, స్థితి లయ కారకుడను నేనే! కాలగమనమునకు ఆద్యుడను నేనే! నా హృదయాంతరాలలో పదునాలుగు రుద్రులు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు సప్తర్షులు, భూర్భువ స్వర్గోకాదులు గల నా స్వరూపమును వీక్షించుము అన్నాడు. ఆ మాటలు విని, "ఓ లోకరక్షకా! జనార్దనా! అనంతవ్రతం చేస్తాము ఆ వ్రతము ఎలా చేయాలి ఏ దైవాన్ని పూజించాలి" అని ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుని అడుగగా ఈ విధంగా చెప్పసాగిరి. కృతయుగంలో సుమంతుడను వేదశాస్త్ర సంపన్నుడయిన బ్రాహ్మణుడు కలడు. వశిష్టగోత్రోద్భవుడయిన సుమంతునకు భృగుమహాఋషి పుత్రిక అయిన దీక్షాదేవితో వివాహమయినది. ఆ దంపతులకు సుగుణరాశియగు పుత్రిక జన్మించినది. ఆ బాలికకు శీల యను పేరు పెట్టారు. కొంతకాలం తరువాత దీక్షాదేవి తాపజ్వరముచే చనిపోయింది. సుమంతుడు కర్కశ అను మరొక కన్యను పెండ్లి చేసుకున్నాడు. ఆమె చాల గయ్యాళి, లోభి. శీల తన తండ్రికి అనుగుణంగా భక్తిశ్రద్ధలతో ఉండేది. కొంతకాలానికి సుమంతుడు తన పుత్రికకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. తపోనిష్టుడగు కౌండిన్యమహాముని సుమంతుని ఇంటికి వచ్చాడు. ఆయనను సుమంతుడు అర్ఘ్య పాద్యాదులతో సత్కరించి, తన కుమార్తె శీలనిచ్చి వివాహం చేశాడు. అల్లునితో కూతుర్ని పంపేటప్పుడు ఏదైనా బహుమతి ఇవ్వాలనుకొన్నాడు. తన భార్యయగు కర్కశను అడిగాడు. ఆమె చిరాకుపడి తలుపులు వేసుకుని "ఏమీలేదు ఇవ్వను పో" అంది. సుమంతుడు చింతించి, ఇంట వెతికాడు. పెండ్లికి చేయబడి మిగిలిన పేలపిండి ఇచ్చి కూతురుని పంపాడు. కౌండిన్యుడు సదాచార సంపన్నురాలు అయిన తన భార్యతో తన యాశ్రమముకు బయలుదేరాడు. మధ్యాహ్న సమయమున మార్గమధ్య మములో బండి ఆపి సంధ్యావందనాది క్రియలు చేయాలనుకొని చెరువు దగ్గరకు వెళ్ళారు. ఆరోజు భాద్రపద శుక్ల చతుర్దశి, స్త్రీలు అంతా ఎర్రని వస్త్రాలు ధరించి భక్తి శ్రద్ధలతో అనంతపద్మనాభ స్వామిని పూజిస్తున్నారు. పరమభక్తురాలైన శీల కూడా ఆ వ్రతమునందు ఆసక్తురాలై వారిని ఆ వ్రతం విషయం అడిగినది. ఈ వ్రతం అనంతపద్మనాభ వ్రతం. ఈ వ్రతం వలన అనంతఫలములు లభించును ఇట్టి మహత్తరశక్తిగల వ్రతం భాద్రపద శుక్ల చతుర్దశి రోజున, నదియందుగాని తటాకమునందు గాని స్నానమాచరించి, శుచియై శుభ్రవస్త్రములు ధరించి పూజ చేయు స్థలమును గోమయముచే అలికి, పరిశుభ్రముగా ఉంచి ఎనిమిది దళములు గల తామరపుష్పం వంటి కుండము నిర్మించాలి. ఆ మండపము చుట్టూ ముగ్గులతో అలంకరించి దక్షిణ పార్శ్వభాగములో కలశము ఉంచి అనంత పద్మనాభ స్వామిని దర్భతో నొనర్చి అందు ఆవాహనం చేసి
కృత్వా దర్భమయం దేవం శ్వేతద్వీపస్తితిం హరిమ్
సమన్వితం సప్తఫణైః పింగళాక్షం చతుర్భుజం||
అను శ్లోకములో ధ్యానం చేసి కల్పోక్త ప్రకారం షోడశో పచార పూజతో ప్రదక్షిణ నమస్కారములు గావించి, పదు నాలుగు నూళ్లు కలిగి కుంకుమతో తడిపిన కొత్త తోరంను ఆ పద్మనాభస్వామికి దగ్గరలో ఉంచి పూజించి గోధుమ పిండితో ఇరువది ఎనిమిది అతిరసములు చేసి నైవేద్యము పెట్టి ఆ తోరమును కట్టుకొని పదునాలుగు అతిరసములు బ్రాహ్మణులకు వాయనదానమునిచ్చి తక్కినవి తాను భుజించాలి. పూజాద్రవ్యములన్నియు పదునాలుగుగా వేసి ఉంచవలెను. బ్రాహ్మణ సమారాధన చేసి అనంత పద్మనాభస్వామిని ధ్యానించుకోవాలి. ఈ విధముగా వ్రతం పరిసమాప్తి గావించి ప్రతి సంవత్సరం ఉద్యాపనం చేసి, మరల వ్రతం ఆచరించాలి అని వారు తెలిపిరి. కౌండిన్యుడు తన భార్య శీలతో స్నానమాచరించినాడు. స్త్రీల సహాయమున శీల వ్రతం ఆచరించి, తోరము గట్టుకొని దారి ఖర్చులకు తండ్రి ఇచ్చిన పేలపు పిండిని వాయనదానమిచ్చి తానును భుజించి, సంతృప్తుడైన భర్తతో బండి ఎక్కి ఆశ్రమముకు వెళ్లారు.
వ్రత ప్రభావం వల్ల ఆశ్రమము స్వర్ణమయముతో ఐశ్వర్య సంపదగల భవంతిగా అయింది. దంపతులిద్దరు ఏ లోటు లేకుండా అతిధి సత్కారములతో సుఖముగా ఉన్నారు. కౌండిన్యుడు ఓ రోజున శీల సందిట నుండు తోరము చూసి ఓ శీల నీవు తోరము కట్టుకొన్నావు గద! అదెందులకు! నన్ను వశము చేసుకొనుటకా లేక మరియొకరి కోసం కట్టుకొన్నావా! అని అడిగాడు. స్వామీ అది అనంతపద్మనాభస్వామి తోరణము ధరించియున్నాను. ఆ దేవదేవుని అనుగ్రహం వల్ల ఇట్టి సిరి భాగ్యములు కలిగాయి. అన్న శీల మాటలకు కౌండిన్యుడు కోపధారుడై దేవుడిని ధూషిస్తూ తోరమును త్రెంచి భగభగ మండెడు మంటలలో వేసాడు. శీల ఏడుస్తూ పరుగెత్తి ఆ తోరంబును తీసి పాలతో తడిపింది. కొన్ని రోజులకు వారి సంపద అంతయు బుగ్గిపాలయ్యెను. ఎవ్వరునూ వారితో మాట్లాడలేదు. ధనముంటే గదా! ఆఖరికి బియ్యంగింజ లేక క్షుద్బాధ పీడితులయ్యారు కౌండిన్యుడికి గతమంతా గుర్తుకు వచ్చి, దైవదూషణంవల్ల జరిగింది అని తలచి, మనస్సులో అనంత నామము జపిస్తూ ఒక మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళి, "ఓ వృక్షరాజమా! అనంతుడను నామముగల దైవమును చూచినావా" అని అడిగాడు. "అనంతుడెవ్వరో నాకు తెలియదు" అని చెప్పినది. కౌండిన్యుడు మరికొంత దూరం వెళ్ళగా అక్కడ ఒక ఏనుగు, గాడిద నిలుచుని ఉన్నాయి వారిని అనంత పద్మనాభ స్వామి గురించి అడిగాడు అవి అనంతుడెవ్వరో తెలియదన్నాయి. కౌండిన్యుడికి విసుగు, బాధ కలిగి ఓపికలేక మూర్చ పోయి క్రిందపడ్డాడు. కౌండిన్యుని కోసం భగవంతుడు తేజోవంతుడైన వృద్ధరూపమున వచ్చి కౌండిన్యుని తన గృహమునకు తీసుకొనిపోయెను. ఆ గృహము మణులతోను దేవాంగనలతోగూడి యాశ్చర్యము చెందేలా ఉంది. సదాగరుడసేవితుడు, శంఖ చక్రగదాధరుడగు స్వస్వరూపాల్ని పద్మనాభస్వామి చూపించగా, కౌండిన్యుడు సంతుష్టుడై - నమో నమస్తే! గోవిందా నారాయణ జనార్ధనా అని అనేక విధముల స్తోత్రం చేశాడు. అంతట అనంతపద్మనాభస్వామి సంతుష్టుడై ఎన్నడు దారిద్ర్యం రాకుండా, అంత్య కాలమున విష్ణులోక ప్రాప్తికలుగునని వరము ఇచ్చాడు. దేవాది దేవా! నేను త్రోవలో చూసిన మామిడిచెట్టు, ఆవు, వృషభము, గాడిద, ఏనుగుల వింత ప్రవర్తనకు కారణ మేమిటని అడిగాడు. ఓ బ్రాహ్మణ శ్రేష్టుడా! పూర్వము ఒక బ్రాహ్మణుడు సకల విద్యలు నేర్చుకొని గర్వంతో విద్యను ఎవ్వరికి చెప్పక పోవడం వలన ఎవ్వరూ ఉపయోగించలేని మామిడి చెట్టుగా జన్మించాడు. తొల్లియొకడు మహాభాగ్యవంతుడై ఎన్నడూ ఎవ్వరికి ఆఖరికి బ్రాహ్మణులకు కూడా అన్నదానం చేయనందున పశువుగా పుట్టి, పచ్చిగడ్డిలో తిరుగుచున్నాడు. మానవులను ఎల్లప్పుడు దూషణములు చేసినవాడు గాన గాడిద అయినాడు. పెద్దలు చేసి ధర్మము అమ్మినందువలన ఏనుగు అయ్యాడు. ఇవి వారి వారి పూర్వస్థితిగతులు. నీవు పదునాలుగు సంవత్సరాలు అనంత వ్రతము నియమానుసారంగా ఆచరించినచో నీకు నక్షత్ర స్థానము లభిస్తుంది అని అనంతుడు అదృశ్యమయ్యాడు. కౌండిన్యుడు జరిగినది అంతయు భార్య శీలకు చెప్పి పదునాలుగు సంవత్సరాలు అనంతవ్రతం చేసి ఇహలోకములో పుత్రలతో, పాత్రులతో సంపదలు పొంది నక్షత్రస్థానం పొందాడు. ధర్మరాజా! కౌండిన్యుడు నక్షత్రమండలంలో ఆ నామమున విరాజిల్లుతూ ఉన్నాడు. అగస్త్య మహాముని ఆచరించి ప్రసిద్ధి పొందాడు. నగర, దిలీప, భరత, హరిశ్చంద్ర మొదలగు రాజులు వ్రతం చేసి, యశస్సుపొందారు. స్వర్గ ప్రాప్తి కలిగింది. ఈ వ్రతకథను విన్నవారు ఇహలోకమున అష్టైశ్వర్యములతో సుఖముగా ఉందురు. అంతిమకాలంతో పరమపదము పొందగలరు. |
No comments:
Post a Comment