బామ్మ మాట



 అమ్మా..!క్లాస్ కి టైం అవుతోంది. స్కూటీ కీస్ కనిపించడం లేదు.మళ్లీ బాబీ గాడు నా బండి తీసాడా..? వాడికి ఎన్ని సార్లు చెప్పాను..నా బండి టచ్ చేయొద్దని..?
,అసహనం తో చిందులు తొక్కుతున్న ధాత్రి ని ఓరకంట చూసింది బామ్మ..కళ్ళజోడు మధ్య భాగాన్ని చూపుడు వేలితో పైకి నెడుతూ...
అడక్కూడదు కానీ ...ఎక్కడికే తల్లీ...?
క్లాస్ మామ్మా..! 
అదే ..ఏ క్లాసనీ....

అడిగింది పెద్దావిడ కనుక కోపం అనుచుకుంటూ
చెప్పింది.." పర్సనాలిటీ డెవలప్మెంట్.."
అంటే ?
వ్యక్తిత్వ వికాసం.. నొక్కి చెప్పింది.

నీ ఇల్లు బంగారం కానూ.. అది ఎవడో నేర్పించడం ఏమిటే...
మీ ఇంట్లో ఎవరికీ వ్యక్తిత్వాలు లేవా...?

అప్పుడే కిచెన్ లో నుంచి బయటకి వస్తున్న సావిత్రి ఆ ప్రశ్నకి నవ్వావుకోలేక ముఖం పక్కకి తిప్పుకుంది.
ధాత్రి ఖంగు తిన్నది..

ఎలాగూ లేట్ అయింది కనుక ఈ పూటకి ఉండిపోవే...నేనెలాగూ సాయంత్రం వెళ్లిపోతాను..
అంది బామ్మ.
చేసేది లేక చున్నీ తీసి సోఫా మీదకి విసిరి బామ్మ పక్కన కూర్చుంది ధాత్రి.

ఈ లోగా మనవడు శ్రీకర్ కూడా వచ్చాడు.
వాళ్లిద్దరికీ బామ్మ అంటే ఇష్టం..ఇంట్రెస్టింగా మాట్లాడుతుంది అని. పైగా ఆవిడకి కరెంట్ ఇష్యూస్ మీద కావలసినంత జ్ఞానం ఉండడం వారికి ఆశ్చర్యం.!

నా పచ్చ శాలువా ఏదిరా..కనబడడం లేదు? 
బామ్మా! దాన్ని నీకు ఉదయం ఇస్తే నీ బాగ్ లో పెట్టుకున్నావు..నీకు మతిమరుపు బాగా వచ్చింది..
జాలిగా చూసాడు శ్రీకర్.

ఆవిడ సంభ్రమంగా చూసింది.
నిజమేనట్రా...నాకు మతిమరుపు వచ్చిందా...
శ్రీకర్ షాకయ్యాడు.

అంత హ్యాపీ గా ఫీల్ అవుతున్నవేమిటి బామ్మా..!
అయోమయంగా అడిగాడు.
ఒరేయ్..మతిమరుపు అంటే ఏమనుకున్నావు ?
ఏమిటి 
ప్రాపంచిక విషయాలు పట్టుకుని మనం వెళ్లాడుతూ ఉంటే ...వాటిని వదలడం మీ వల్ల కాదు గానీ..నేను సహాయం చేస్తానని దేముడు ముందుకు రావడం...
శ్రీకర్ తెల్లముఖం వేసాడు.
అవునురా అబ్బాయ్..! నువ్వు పట్టుకు వెళ్లాడుతున్నవేవీ పనికిరావు..నీతో రావు..కాస్త తెలివి ఉండగానే వాటిని వదిలేయి అని దేముడు చెప్తున్నాడన్నమాట.....

కాదు బామ్మా...అల్జీమర్స్ అంటే అదో జబ్బు..

"వాళ్ళ బొంద..వాళ్లెం చెప్తారూ.... ఒక వయస్సు వచ్చాక ...బాడీ పార్ట్స్ పని చేయడం మానేస్తాయి.. అది జబ్బు కాదు..మనిషిని ప్రపంచం నుంచి దృష్టి మరల్చి తన వైపుకి తిప్పుకొనే ప్రయత్నం..అని నాకు అనిపిస్తుంది. లేకపోతే నువ్వే చెప్పు..
అవన్నీ ఓల్డ్ ఏజ్ లోనే ఎందుకు వస్తాయి..? 

అప్పటికి జీవితం చూసేసారు కనుక. కనీసం అప్పుడైనా దైవధ్యాస లో పడతారని. .."

శ్రీకర్, ధాత్రి అయోమయంగా తల్లి వైపు చూసారు.
సావిత్రి ఒప్పుకుంటున్నాను అన్నట్లు మందహాసం చేసింది.

తాతగారు పోయినప్పుడు నువ్వు బాగా షాక్ అయ్యావా బామ్మా..

షాకెందుకురా... ఆయన స్టేషన్ వచింది..ఆయన దిగిపోయాడు.. ? 
ఏమిటీ..?
అంతే కదురా... ఈ రైలు ప్రయాణం లో కొన్నాళ్ళు నాకు కంపెనీ ఇవ్వడానికి వచ్చాడు.. మరి తన స్టేషన్ వస్తే దిగాలి కదా...ఒకవేళ నా స్టేషన్ ముందు వచిందనుకో ..నేనైనా దిగాలా..? 

నీకేం బాధ కలగలేదూ...
నీతో ప్రయాణం చేస్తున్నవాడు దిగిపోతే బాధపడి నువ్వు కూడా దిగిపోతావా..?

ఇది రిలేషన్ కదా బామ్మా...
తోటి ప్రయాణీకుడితో ఉండేది కూడా రిలేషనే...
జ్ఞాపకాలు బాధ పెట్టవా..?
అది నీ మీద ఆధార పడి ఉంది.నువ్వు బలహీనుడవు అయితే జ్ఞాపకాలు దుఃఖాన్ని కలిగిస్తాయి..బలవంతుడవు అయితే జ్ఞాపకాలు జీవింప చేస్తాయి..
సావిత్రి 'హాట్సాఫ్..' అనుకుంది మనసులో.
ధాత్రి చూసింది ఈ సారి.

లైఫ్ లో కష్టం , సమస్యలు ఏమిటి బామ్మా...వాటిని ఎలా తీసుకోవాలి? 
లాలనగా ఆమె ముంగురులు సవరించింది బామ్మ.

సమస్య తాలూకు బాధ రెండు విధాలుగా ఉంటుంది రా తల్లీ..! ఒకటి దాన్ని ఊహించుకోవడం వలన కలిగే బాధ రెండు. దానికి మన స్పందన ని బట్టి కలిగే బాధ.
అయ్యేది అవుతుంది..నేను ఎదురుకుంటాను అని అనుకున్నా..లేక
అయిన తర్వాత ప్రతి స్పందన లోని గాఢతని కాస్త తగ్గించుకున్నా...సమస్య అంత ఎక్కువగా బాధ పెట్టదు. 
పిల్లలిద్దరూ ఆవిడ మాటని ఇంకాస్త లోతుగా అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ కొద్దీ క్షణాలు మౌనంగా ఉన్నారు...
ఊహిస్తే కలిగే బాధ
స్పందన వలన కలిగే బాధ....మనసులోనే రిపీట్ చేసుకున్నారు.
జీవితానికి అత్యంత ఆవశ్యకం ఏమిటి బామ్మా...!
ఒక ఆశయం....జన్మ కి పరిపూర్ణతని ఇచ్చేది అదే..
 మరి, వదులుకోకూడనిది.....?
"సమయం.... ఏమాత్రం వదులుకోకూడనిది..
అదృశ్యహస్తం తో మన జీవితాలను శాసించేది సమయమే...ఒకరకంగా చెప్పాలి అంటే సమయానికి పర్యాయపదం జీవితం...
మనం సమయం గడిచిపోతున్నాది అనడానికి ఇష్టపడతాం..కానీ అక్కడ కరుగుతున్నది జీవితం...."
ఇద్దరికీ వెంటనే ...నిజమే కదా....అనిపించింది.

శ్రీకర్ గారంగా బామ్మ భుజాలు పట్టుకుని ఊపాడు.
"బామ్మా..! నువ్వు ఉండిపోవచ్చు కదా ఇక్కడే...
రోజూ ఏదో ఒకటి నీ దగ్గర నేర్చుకుంటాం.."
నవ్వుతూ అతడి బుగ్గ చిదిమింది ఆవిడ.

జీవితం ఒట్టి నేర్చుకోవడానికే కాదు...నేర్చుకున్నది ఆచరించడానికి కూడా....

నిజమేకదా అనుకున్నారు ఇద్దరూ!!
*రచన:*
*శ్రీమతి శివల పద్మ*

No comments: