బాంధవ్యం
బాంధవ్యం... 1 ఆరోజు ఆదివారం అందరికీ ఆటవిడుపే .. అందుకే చంద్రశేఖర్రావు గారిల్లు కూడా సందడిగా ఉంది . కూతుళ్ళు అల్లుళ్ళును భోజనానికి పిలిచారు. అందరి పిల్లలు అమెరికా లోనే పెద్దలు మాత్రమే ఇక్కడ.. ఆఇంటి చిన్నకోడలు సంగీత ఒక్కతే అత్తగారి సాయంతో అందరికీ వంట చేసింది.. అల్లుళ్ళు బావగారు వంటను తెగ మెచ్చుకుని తింటున్నారు. కూర చాలా బాగుంది అన్న మావగారు చంద్రశేఖర్రావుగారి మాటలకు అడ్డు వస్తూ పెద్ద కోడలు జ్యోతి " అదేమిటి ! మావగారు దొడకాయ తినరుగా? తెలిసే చేసావా? ఆ గోంగూర పచ్చడి లో కూడా నూనె ఎక్కువ పడలేదు ..ఉల్లి కారం కూడా ఇంకా బాగా వేగాలి " అంటుంటే చిన్న కొడుకు సతీష్ .. "అవును వదినా నువ్వు చేసినట్టు పచ్చళ్ళు ఎవరూ నీలాగ చేయరు.. కూరలు కూడా ఎంత రుచిగా ఉంటాయో.. "అన్నాడు.. " ఓఇది దొండ కాయ కూరా? నేనింకా గుత్తి వంకాయ అనుకున్నా చాలా బాగుంది " అని అంటున్న మావగారి మాటలకు సంగీతకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి... కంటి నీరు ఎవరికీ కనబడకుండా గబ గబా వంటింట్లోకి నడిచింది సంగీత.. కాస్త సద్దుకుని మెల్లిగా కన్నీరు తుడుచుకుని వంటిల్లు సర్దడం మొదలు పెట్టింది.. కాసేపటికి సంగీత వాళ్ళ ఆడబడుచు లలిత లోపలికి వచ్చి సంగీత భుజం మీద చేయి వేస్తూ వాళ్ళ ఇద్దరి సంగతి తెలుసుగా నీకు కొత్తేముంది . అంది అక్కయ్యను వదిలేయండి ఈన కూడా నలుగురిలో ఎందుకు అనడం.. పోనీలే సంగీతా వదిలెయ్ మనసు కష్టపెట్టుకోకు పద అందరూ ఏదేదో ఊహించుకుంటారు అంటూ సంగీతను డైనింగ్ హాల్లోకి తీసుకొచ్చింది. అందరూ ముభావంగానే ఉన్నారు.. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సంగీత వాళ్ళ అత్తగారన్నారు నువ్వుకూడా వడ్డించు కోమ్మా అని... ఏం మాట్లాడకుండా అన్నంతిని మళ్ళీ ఎవరికీ అవకాశం ఇవ్వకుండా వంటిల్లు సద్ది మధ్యాహ్నం Snacks తయరీలో మునిగి పోయింది ... తను తీసుకున్న నిర్ణయం తప్పా ఒప్పా అని ఇప్పుడు ఆలోచించి లాభం లేక పోయినా ఆలోచించ వలసిన అవసరం పదే పదే సంగీతకు వస్తూనే ఉన్నది... సంగీత ఒక మంచి సాంప్రదాయ కుటుంబం లో పుట్టిన అమ్మాయి ఉమ్మడి కుటుంబంలో పెద్దలందరి మధ్య పెరిగింది చదువుతోపాటే ఆట పాట నేర్చుకుంది పని పాటలు అలవోకగా చేసేస్తుంది.. బామ్మ అమ్మ పిన్నులను చూస్తూ కుటుంబ బాధ్యతలు ఎలా నిర్వహించాలో కూడా తెలుసుకుంది చదువయ్యాక అందరిలా ఉద్యోగం చేద్దామనుకునే లోగా వీల్లేదు పెళ్ళి చేయాలన్న పెద్దల ఆలోచనలకు తలవొగ్గింది ... కానీ జాతకాల సమస్య.. ఒకటి కుదిరితే ఇంకొకటి కుదరదు చూసిన అన్ని సంబంధాలు జాతకాల దగ్గరే ఆగిపోయాయి.. ఒక సంబంధం మటుకు జాతకం కుదిరిందన్నారు.. మంచి కుటుంబం సమాజం లో ఉన్నతస్థాయిలో ఉన్న వారు ఆర్థికంగా కూడా అంతా పైస్థాయిలో ఉన్నావారే.. హమ్మయ్య అనుకునేంతలో సంగీత వాళ్ళ నాన్నగారు హరిహరరావుగారు వద్దు ఇంటర్ వరకే చదువు కున్నాడు మనమ్మాయి డిగ్రీ చదివింది నాకిష్టం లేదన్నారు.. కానీ అప్పటికే విసిగిపోయిన సంగీత మీకు జాతకాలు కలవడం కావాలిగా కలిసాయి అంతే నాకు OKనే.. అంతంగా అవసరమైతే నేను ఉద్యోగం చేస్తాను అని తాతయ్యతో సంబంధం ఖాయం చేయమని చెప్పింది.. అదేంటి అబ్బాయిని చూడకుండానే.. అక్కరలేదులే .. బాగుంది వాళ్ళు చూడాలను కుంటే.... ఓహో ఇదొకటా సరే మీఇష్టం అని లోపలికెళ్ళింది.. ఒకమంచి ముహుర్తంలో పెళ్ళి చూపులు చూడడం ముహుర్తాలు పెట్టుకోవడం కూడా జరిగింది.. హరిహరరావుగారికి వారబ్బాయి హర్షకి అస్సలిష్టం లేదు.. చక్కని చుక్క .. చదువుల తల్లి నా కూతురికి ఆ అబ్బాయికి పోలికేంటి అని గొణుగుతూనే ఉన్నారు ఆయన భార్య అనూరాధ మటుకు ఇద్దరికీ రాసిపెట్టి ఉంటే మనచేతుల్లో ఏంలేదని భగవంతుడి మీద భారం వేసి నిశ్చింత గా ఉంది... సంగీత మటుకు ఎలాంటి ఆలోచన లేకుండా తన పనులు తాను చేసుకు పోతుంది.. పెళ్ళి పనులు జరిగి పోతున్నాయి ఒకరోజు పెళ్ళి వాళ్ళ దగ్గరనుండి పిలుపు.... అమ్మాయికి పెళ్ళి బట్టలు కొనాలి మా ఇంటికి వస్తే ఇక్కడినుండే అందరం కలిసి వెళదామని.. అలాగే అని పెళ్ళి వారింటికి బయలుదేరారు... ఇంటికి వెళ్ళగానే మగ పెళ్ళి వాళ్ళకు చేసి నట్టు మర్యాదలు చేసారు.. పెళ్ళి కొడుకు సతీష్ వాళ్ళ అన్నయ్య హరీష్ వదిన జ్యోతి , సతీష్ వాళ్ళ అక్క లలిత చెల్లి వనిత అమ్మగారు సుచరిత గారు అందరూ రెడీగా ఉన్నారు వీళ్ళు మటుకు తల్లి అనురాధ, సంగీత ,సంగీత పిన్ని మంజుల మాత్రమే వచ్చారు మగవాళ్ళు రామన్నారు. సతీష్ వాళ్ళ నాన్నగారు చంద్రశేఖర్ రావుగారు సంగీతతో మాట్లాడాలని Living రూమ్ లోకి పిలిపించుకున్నారు... కొంచెం భయంగా కొంచం ఆశ్చర్యం గా తల్లి వైపు చూసింది .... ఫరవాలేదు వెళ్ళు అని తల్లి అనగానే లోపలికెళ్ళింది. చంద్ర శేఖర్ రావుగారు సంగీతను తన పక్కన కూచోపెట్టుకున్నారు హరీష్ కూడా ఆపక్కనే కూచుని ఉన్నారు.. ఇద్దరికీ నమస్కారం చేసి కూచుంది స్వతహాగా ధైర్యవంతురాలైనా ఏమిటో కొత్తగా ఉంది అనుకుంటున్న సంగీత ఆలోచనలను తుంచి వేస్తూ ఏమ్మా మా ఇల్లు నచ్చిందా? మేమంతా నచ్చామా? ఎవరి ప్రోద్బలం లేకుండా నీకు ఇష్ట మయ్యే చేసుకుంటున్నావుగా? అంటున్న ఆయనకు తలూపుతూనే జవాబిచ్చింది... నీ హాబీలేంటి ? అని అడుగుతున్న కాబోయే మావగారికి ఉత్తరాలు రాయడం, పుస్తకాలు చదవడం అని చెప్పింది.. వెరీ గుడ్ అన్నారు.. ఆ తరువాత తమ కుటుంబం గురించి చెప్పారు అది పెద్ద కొడుకు ఇల్లని పెళ్ళి అయ్యాక మనం మన ఇంటికి వెళతాం అని చెప్పారు .. సంగీత సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బు అయ్యింది ఎంత చక్కగా friendlyగా మాట్లడుతూ అన్ని సంగతులూ చెప్పేస్తున్నారు అనుకుంది ఆ తరువాత బట్టల షాప్స్లో కూడా అంతే మొహమాట పడకుండా నీకు నచ్చిన కలర్స్ డిజైన్స్ తీసుకోమని పూర్తిగా సంగీత మీదే వదిలేసారు. మొత్తానికి అందరి సలహా సంప్రదింపులతో shopping పూర్తయ్యింది.. ఏకాస్తో అనుమానం ఉన్నా సంగీతకు ఇప్పుడది పూర్తిగా తీరిపోయింది.. చాలా మంచి వారు అని అందరూ సంతోషించారు .. అనుకున్న రోజు రానే వచ్చింది పెళ్ళిలో కూడా సరదాగా సంబరంగా హుషారుగా కలిసిపోయి సందడి చేసారు.. ఆడపెళ్ళి వారి ఆనందానికి హద్దులు లేవు మంచి సంబంధం దొరికిందని మురిసిపోయారు.. దిగులతో కాకుండా సంతోషంగానే అప్పగింతలు పెట్టి అమ్మాయిని అత్తవారింటికి పంపించారు.... సశేషం... రేపు మగ పెళ్ళి వారింట్లో కలుద్దాం
బాంధవ్యం ... 2 కొత్త పెళ్ళి కూతురిని అందరూ ఆప్యాయంగా స్వాగతించారు.. తెల్లవారి సత్యనారాయణ స్వామి వ్రతం రోజున పూజయ్యాక తోటి కోడలు జ్యోతి తమ బంధువులందరికీ సంగీతను పరిచయం చేసింది అందరూ ప్రేమగా మాట్లాడారు సంగీతను కొత్త అనే భావన నుండి దూరంచేసారు... తెల్లవారి పుట్టింట్లో వ్రతం అయ్యాక శోభనానికి ముహూర్తం పెట్టారు.. లేదు మాయింట్లో చేయడం ఆనవాయితీ అని అత్తగారు సుచరితగారు వాళ్ళింటికి తీసుకెళ్ళారు.. అంతే కానీ ఆడపెళ్ళి వాళ్ళను ఆహ్వానించలేదు.. ఇక చేసేదేం లేక దంపత్తాంబూలాలకు ఇవ్వవలసిన సరంజామా అబ్బాయి బట్టలు అన్నీ సుచరిత గారికి అప్పగించారు.. సాయంకాలం వారు వెళ్ళి పోగానే ఎందుకో సంగీత వాళ్ళ అమ్మ అనురాధకు దిగులేసింది .. బాధ పడుతున్న అనురాధను చూసి ఇప్పుడివన్నీ అందరూ పాటించడం లేదక్కయ్యా వారసలే చాలా ఆధునికంగా కనబడుతున్నారు.. అంతా బాగానే ఉంటుంది అని సంగీత పిన్ని మంజుల ఓదార్చింది... ............................................... చంద్ర శేఖర్ రావు గారింట్లో ఆ రాత్రి అందరి భోజనాలు అయ్యాయి.. లోపల ఎవరి గదిలో వారున్నారు వెళ్ళాలో వద్దో తెలీని పరిస్థితిలో సంగీత హాల్లో డైనింగ్ టేబుల్ దగ్గరే కూచుండి పోయింది అక్కడే ఉన్న TV చూస్తూ... కాసేపటికి కాస్త స్వరం పెంచి ఖచ్చితంగా చెబుతున్న జ్యోతి మాటలు వినబడ్డాయి.. మీరెంత చెప్పినా నేను ఒప్పుకోనత్తయ్యా.. ఇవన్నీ ముందే ఆలోచించాల్సింది అన్నది తరవాత ఇంకేం వినబడలేదు సంగీతకు... ఒక పది నిముషాల తరువాత జ్యోతి బయటకు వచ్చి ఒక తెల్లని నైలెక్స్ చీర ఇచ్చి వంటింట్లోకి వెళ్ళి మార్చుకో అంది.. తరువాత పైన మూడో అంతస్తులో ఉన్న గది దగ్గర వదిలి లోపల సతీష్ ఉన్నాడు వెళ్ళు అంది. దగ్గరగా వేసి ఉన్న తలుపును మెల్లిగా తోసింది లోపల చిమ్మ చీకటి ఏం కనబడటం లేదు.. అగ్గిపుల్ల వెలుతురు చూపిస్తూ సతీష్ వచ్చి సంగీత చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళాడు కాండిల్ వెలిగించినా గాలికి ఆరిపోతున్నది . లోపల మంచం లేదు ,పాత దూది పరుపు ఉండలు చుట్టుకుని ఉంది . దిళ్ళు నూనె కంపు కొడుతున్నాయి . గబుక్కున కొంగుతో ముక్కు మూసుకుంది. సతీష్ ఫీలింగ్స్ చూడాలనుకుంది కానీ చీకట్లో ఏం కనిపించలేదు.. కడుపులోంచి దుఖం తన్నుకొచ్చింది.. "పెళ్ళయిన కొత్త జంటలకు జీవితాంతం గుర్తుఉంచుకోవలసి ఈ రాత్రి సినిమాలో లాగా కాక పోయినా ఇంత ఛండాలంగా మాత్రం ఎవరికీ రాదు." అనుకుంది సంగీత.. గదిలోకి వచ్చే దోమలను చంపుతూ ఎలాగో కాలక్షేపం చేసి ,తెల్ల వారకముందే లేచి ఇంట్లోకి వచ్చి హల్లో చాపమీద సంగీత, సోఫాలో సతీష్ పడుకున్నారు.. తెల్లవారి లేచాక సుచరిత గారు మాటి మాటికీ కళ్ళు తుడుచుకోవడం సంగీత ద్రుష్టి ని దాటి పోలేదు.. ఆ రోజు సంగీత ఆడబడుచు లలిత అందరినీ భోజనానికి పిలిచింది కబుర్లతో జోకులతో భోజనాలయ్యాయి. లలిత భర్త మోహన్ కూడా మంచి జోవియల్. సాయంత్రం కాఫీలయ్యాక అందరూ బయలు దేరారు సతీష్ మటుకు లేవడం లేదు సంగీత లేవబోతుంటే మీరు కాసేపుండండి అని లలిత ఆపింది.. అలా సినిమా కెళ్ళిరండి రాత్రి భోంచేసి వెళుదురుగానీ అంది లలిత.. రాత్రి భోజనాలయ్యాయి.. మోహన్ సతీష్ కిళ్లీ తెస్తామని బయటకెళ్ళారు. ఈలోపు లలిత సంగీతను లోపలికి తీసుకెళ్ళి బొట్టు పెట్టి తాంబూలంతో పాటు కొత్త చీర కూడా ఇచ్చి ఇప్పుడే కట్టుకోమంది. ఈ పూట ఇక్కడే పడుకుని రేపు వెళుదురు గానీ అన్నది.. కొత్త చీరతో ఎలా పడుకోవడం అసలే వెంకటగిరి తెల్లచీర. అని ఆలోచిస్తున్న సంగీతతో, " వెళ్ళు వెళ్ళి ఆగదిలో మార్చుకుని అక్కడే పడుకో సతీష్ వచ్చాక వస్తాడు" అన్నది. మెల్లిగా గదిలో అడుగు పెట్టింది మల్లెల సువాసనతో గది గుబాళిస్తున్నది.. మంచం మీద కొత్త దుప్పటి పక్కన టేబుల్ మీద అగరొత్తుల స్టాండు గ్లాసులో బాదం పాలు.. ఇవన్నీ చూసి సంగీత సిగ్గుతో ముడుచుకు పోయింది. ఒక విధమైన ఉద్వేగం సంతోషం నిన్నటి రోజును తలచుకుని ఉక్రోషం అన్నీ కలగలిపిన భావాలతో కంట నీరు ఉప్పొంగింది.. సతీష్ రాగానే గట్టిగా పట్టుకుని ఏడ్చింది. సంగీతను ఓదారుస్తున్న సతీష్ కంట్లో కూడా నీరు తిరిగింది... సంగీతను పొదివి పట్టుకుని " అక్కయ్యకు అమ్మ చెప్పిందేమో "అన్నాడు.. పొద్దున లేస్తూనే సంగీత లలిత కాళ్ళకు దండం పెట్టింది. లలిత సంగీతను దగ్గరకు తీసుకుని "తప్పు నువ్వు సంతోషంగా ఉండడమే మాకు కావాలి " అంది . ఆ పూట కూడా భోజనాలయ్యాక ఇద్దరు ఇంటికి బయలు దేరారు.. ఎందుకో సంగీత అయిష్టంగానే బయలుదేరింది.. మరుసటి రోజు వనితా వాళ్ళింట్లో భోజనాలు ఆరాత్రి కొత్త జంట అక్కడే ఉండి పోయారు ... వనిత వాళ్ళ ఇంటినుండి వస్తూ అనుకుంది సంగీత .. "కొన్ని వరుసలెంత చెడ్డవి ఆ బంధం చెప్పగానే అమ్మో అనుకుంటాం .. వరుసలు బాంధవ్యం కాదు ముఖ్యం , బంధం ముఖ్యం .. పేరుకు ఆడబడుచులైనా అక్కల్లాగా ఆదరించారు.. అక్క వరుస మనిషి మాత్రం అక్కసుతో ప్రవర్తిస్తుంది అనుకుంది...బాంధవ్యం... 3 ఇంటికి రాగానే తోడితోడలు కోసం కళ్ళతో వెతుక్కుంది.... కనబడలేదు మాట కూడా వినబడలేదు . హమ్మయ్య అనుకుంది.. ఎందుకో మనసుకు కాస్త ఊరట కలిగింది.. సంతోషం నింపుకుని వచ్చిన మనసుకు కష్టం కలగకూడదనేమో . మెల్లిగా అత్తగారి పక్కన కూచుంది.. "ఏమ్మా ఎక్కడికైనా ఏగుడికో వెళ్ళి రాక పోయారా" అన్న అత్తగారితో మీతో కబుర్లు చెప్పొచ్చు కదా అని వచ్చాం ..అంది సంగీత.. అత్తగారు సుచరిత మాట్లాడలేదు కానీ మావగారు బోలెడు కబుర్లు చెప్పారు . వారి ఊరు గురించి ఉద్యోగం గురించి తన భార్య గురించి.. " మీ అత్తగారు చాలా గారబంగా పెరిగారు ఏపనీ వచ్చేది కాదు దగ్గరుండి అన్నీ మా అమ్మ నేర్పింది అయినా అమ్మే ఎక్కువ చేసేది. " "గబుక్కున ఏ నిర్ణయం తీసుకోలేదు భయం.. ఎవరేమనకుంటారోనని మొహమాటం ఎక్కువ. మా మీద బాగా ఆధార పడి ఉంటుంది.. " "జ్యోతి వచ్చాక ఇంట్లో కాస్త సందడి... పిల్లలు కూడా మీ అత్తయ్యకు దగ్గరయ్యారు .. "జ్యోతి అమ్మ దగ్గర పనులు నేర్చుకుని ఇంటి బాధ్యతలు తీసుకుంది.. " "హరీష్ ఉద్యోగ రీత్యా కొన్నాళ్ళు వాళ్ళువేరే ఊళ్ళో కాపురం పెట్టారు మళ్ళీ వచ్చాక బయట వేరే ఉంటున్నారు. " "మంచిదేగా అనుకున్నాం.. " "ఇక సతీష్ కి ఎందుకో చదువబ్బ లేదు ఎక్కడైనా ఉద్యోగం చేయమంటే వినడు.. చాలా రకాలుగా చెప్పి చూసాం. " "కనీసం పెళ్ళి చేస్తే బాధ్యత తెలిసి మసులుకుంటాడని చేసాం , నువ్వు వాడి జీవితంలోకి రావడం వాడి అద్రుష్టం.. " " మేం పెద్ద వాళ్ళం అయ్యాం ,ఎంత కాలముంటామో తెలీదు, ఇంక వాడి బాధ్యత నీదే మీ బాగోగులు నువ్వే చూసుకోవాలి " అన్నారు సంగీత దిగ్భ్రమకు లోనయ్యింది.. " ఇదేంటి ఇంటి బాధ్యతలు సంసార బాధ్యతలు ఇలా నాఒక్క దాని మీద పెడుతున్నారు ..అంటే ఏమిటి అర్థం తనను ఉద్యోగం చేసి పోషించ మనా... " అంతలో చంద్రశేఖర్రావుగారే "నీమీద ఇంటి బాధ్యతలు పెట్టడంలేదు ఇంటిని చక్కదిద్దుకునే బాధ్యత మాత్రమే " అన్నారు హమ్మయ్య అనకుంది సంగీత .. ఇంతలో తలుపు చప్పుడయ్యింది.. జ్యోతి లోపలికి వస్తూ " ఓ వచ్చేసారా నేనే Phone చేద్దామనుకున్నాను తిని వస్తున్నారా లేక ఇక్కడే అన్నం వండాలా అని" అంది. ఏమనాలో తెలీక ఓ పిచ్చి నవ్వు నవ్వి ఊరుకుంది సంగీత. కుక్కర్ పెట్టడానికి వంటింట్లోకి వెళుతున్న జ్యోతిని అనుసరించింది సంగీత .. " ఫరవాలేదు నేను చేస్తాను నాకు వేరే వాళ్ళెవ్వరూ వంటింట్లోకి రావడం ఇష్టం ఉండదు. అయినా వంటిల్లు కూడా చిన్నది" అని మాటలతోనే ఒక గీత గీసి హద్దు పెట్టింది.. ఫ్రిడ్జ్ లోంచి కూరలు తీసి ఇచ్చి ఇవి కొంచం తరగమంది. తిరిగి వెళుతున్నపుడు జ్యోతి జడలో పెట్టుకున్న మల్లెపూల వాసన గుప్పున గుభాళించాయి ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళున్నారు అందులో ఒకరు కొత్త పెళ్ళి కూతురు చిన్న ముక్క వారికివ్వాలన్న కనీస మర్యాద తెలీని ఆమె సంస్కారాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది కూరలు తరగుతూ జ్యోతి... అందరి భోజనాలయ్యాయి.. అందరి తరఫున జ్యోతి మాత్రమే మాట్లాడడం ప్రతి నిముషం ఎవరేం చేయలో ఆదేశాలివ్వడం కూడా గమనించింది సంగీత.... రాత్రి పైన గదిలోకి వెళుతున్నప్పుడు ఏమాత్రం బాధ పడలేదు సంగీత...... పైగా ఒక విధమైన నిశ్చింతతో ధైర్యంతో వెళ్ళింది... తామిద్దరూ మాట్లాడుకోవడానికి దొరికే ఏకాంత క్షణాలవి. మనసులో మాట చెప్పుకోవచ్చు తనని అడగొచ్చు అనుకుంటూ లోపలికి అడుగు పెట్టింది.. వెళ్ళగానే సతీష్ అడిగిన మాట " ఇలాంటి గదిలో పడుకోవడం బాధగా ఉందా ?" .. "లేదు లేదు కానీ మనం ఇక్కడ ఇంకెన్ని రోజులుండాలి." "16 రోజుల పండుగయ్యాక అంటున్నారు.. " ఓ.. అంది మనసులో మాత్రం బాబోయ్ ఇంకా పదిరోజులా అనుకుంది.. పెళ్ళి నాటి సంతోషం ఏనాడో పోయింది.... .................................................................... మరునాడు పొద్దున్న భోజనాలయ్యాక హరిహరరావుగారు అనూరాధ గారు వచ్చారు. "ఒక నాలుగు రోజులు అమ్మాయిని అల్లుడిని మాఇంటికి తీసుకెళతామని అడగడానికి వచ్చాం..."అన్నారు హరిహరరావుగారు.. ఇక్కడ పరిస్థితి అంత అనుకూలంగా లేనప్పుడు పిల్లలు అక్కడుండటమే మంచిది అనుకుని సరే అన్నారు.. చంద్రశేఖర్ రావుగారు అమ్మ వాళ్ళింటికి భర్తతో కలిసి మొదటి సారి రాగానే ఒక విధమైన ఆనందం కలిగింది.. సంగీతకు సతీష్ కి మటుకు అందరితో కలిసి భోజనాలు, కబుర్లు, సినిమాలు షికార్లు, బావమరది తో పరాచికాలు, అత్తవారింట్లో మర్యాదలు .. కొత్తగా గమ్మత్తుగా అనిపించాయి . నాలుగు రోజులు ఎలా గడిచాయో తెలీలేదు ఇదా సంగతి.... "అందుకే అల్లుళ్ళు అత్తవారింటిని వదలడానికి ఇష్టపడరేమో..." అనుకున్నాడు ఆమాటే సంగీత తో అంటే .. " లేదండి మనం కోరుకున్నది కావాలనుకున్నది మనింట్లో లభించనప్పుడు అది దొరికేచోటు స్వర్గం కన్నా ఎక్కువగా అనిపిస్తుంది.." "కానీ మనింటిని స్వర్గం చేసుకోవడం లోనే మనకానందం ఉందని గ్రహించాలి... " అని అంటున్న సంగీతను అభిమానంగా చూసాడు... "ఇంటికెళ్ళగానే అమ్మా వాళ్లకు చెప్పాలి మనింటికి వీలైనంత తొందరగా వెళ్ళి పోదామని. " అలా అనుకున్న తరువాత సతీష్ నిశ్చింతగా పడుకున్నాడు... సశేషంబాంధవ్యం ... 4 తెల్లవారి భోజనాలవ్వగానే ప్రయాణం అనుకున్నారు.. కానీ సడన్ గా అనురాధగారు భోంచేస్తున్నప్పుడు సతీష్ తో అన్నారు "ఎలాగూ వచ్చారు పదహారు రోజుల పండగయ్యాక వెళ్ళండి " అని "లేదండి నేను వెళ్ళాలి.. కావాలంటే సంగీత ఉటుంది " అన్నాడు. "ఓ నిన్న నేనన్న మాటకు కాదు కదా...." "నవ్వి కాదులే నువ్వు వచ్చేలోగా మనిల్లు కొంచం సర్దాలి.. నువ్వు అక్కడికే వద్దువు కానీ.. " "ఓ...... అదా విషయం. " "సరే అయితే వెళ్ళి వస్తానండి" అన్న సతీష్ తో . "మీ నాన్నగారికి ఫోన్ చేసి చెప్తాను " అన్నారు హరి హర్రావుగారు "ఫరవా లేదండి నేను చెప్తానుగా " అని వెళ్ళిపోయాడు.. కానీ బామ్మ చెప్పింది. " తప్పురా నువ్వు ఫోన్ చేసి వాళ్ళ నాన్నగారికి చెప్పు. పిల్లలు అలాగే అంటారు. చెప్పక పోతే మన మాట పోతుంది దాని ప్రభావం మన పిల్ల మీద పడుతుంది.." అని "అలాగే అమ్మా " అని వెంటనే ఫోన్ చేసి చెప్పి వారి అంగీకారం తీసుకున్నారు .... పదహారు రోజుల పండక్కి వియ్యాల వారినందరినీ భోజనానికి పిలిచారు.. అందరూ సరదాగా గడిపారు జ్యోతి కూడా ఎంతో ప్రేమగా అందరినీ పలకరించింది .. "పిన్నిగారూ ,బాబాయ్ గారు ,బామ్మ గారూ " అంటూ సంగీత పుట్టింటి వారిని అందరినీ వరసలు కలిపి పలకరిస్తూ అందరి తల్లో నాలుకయి పోయింది.. సాయంత్రం తన బట్టలు పుస్తకాలు ఇతరత్రా సామాన్లు అన్నీ సర్దుకుని అత్తింటికి కాపురానికి బయలు దేరింది సంగీత... సంతోషంగా పెళ్ళి చేసి పంపించే ఏ తల్లిదండ్రులకు తెలీదు తమ కూతురు వెళ్ళేది స్వర్గం లోకా? నరకం లోకా ? అని.. ' ఏ కూతురు కూడా తల్లిదండ్రులకు అన్నీ చెప్పదు... తనకు తానే సమర్ధించు కోవాలనుకుంటుంది.. అదే మన వివాహ వ్యవస్థ గొప్పతనం ' అని లలిత మనసులో అనుకుంది. అందరూ కలిసి చంద్ర శేఖర్ రావు గారింటికే వెళ్ళారు . 'అసలైన అత్తవారింటికి వచ్చానన్నమాట' అనుకుంది సంగీత.. ఇంటికి వస్తూనే జ్యోతి "మీ ఆవిడ కోసం ఇల్లు బాగానే సర్దావు సతీష్, అయినా మావయ్యా ! మీ బెడ్ రూమ్ ఎందుకు వాళ్ళకిచ్చారు.. పెద్ద వాళ్ళు ఇందులోనే ఉండాలేమో చూసుకోండి.. " అని మావగారినీ "నాకా పెయింటింగ్స్ నచ్చలేదు" అని, "వంటింట్లో అలా అన్నీ పెడితే ఇరుకయిపోలేదా? " అని అలా ఆగకుండా జ్యోతి ప్రశ్నలు వేస్తూ మాట్లాడుతున్నా ఎవరూ జవాబివ్వక పోవడం అడ్డుతగలక పోవడం గమనించింది సంగీత.. అందరినీ రాత్రి భోజనాలక్కడే చేయమన్నారు సుచరిత.. గబగబ వంట ప్రయత్నం లో పడింది సంగీత.. ఆడపడుచులు సాయానికొచ్చారే కానీ జ్యోతి మాత్రం అత్త మామ భర్త మరిదితో సమానంగా సోఫాలో కబుర్లు చెబుతూ కూచుంది. భోజనాలప్పుడు కూడా అందరూ అన్నీ బాగున్నాయని మెచ్చుకుంటూ తింటుంటే ఈవిడ అన్నీ వంకలే. "అన్నింటిలో ఉప్పు పులుపు తక్కువే ఆవడలుకూడా మరీ అంత చప్పగానా.." "మావగారు కాకరకాయ తినరని తెలిసీ కూడా చేసావా సంగీతా? " అని ఆగకుండా అంటున్న మాటలకు అడ్డు వచ్చిన చంద్ర శేఖర్ గారు "నాకన్నీ బాగున్నాయమ్మా సంగీతా .. మేం ఈ వయసులో ఇలాగే తినాలి.. ఇక ఇది కాకరకాయ కూరా నాకు తెలీలేదు చేదు లేకుండా బాగుంది . . నాకు నచ్చింది.. " "చారు కూడా చాలా బాగుంది కాస్త గిన్నెలో పోసివ్వమ్మ తాగుతాను " అన్నారు హరీష్ కూడా "నువ్వు మరీ పుల్లగా తింటావుగా అందుకే అలా అనిపిస్తున్నాయి మాకు బాగున్నాయి.." అంతేనా.. "ఇందాక నువ్వు చూసిన ఆ పెయింటింగ్స్ కూడా సతీష్ కి పెళ్ళిలో వచ్చిన Gifts..." అన్నాడు అంతే గబ గబ పెరుగు పోసుకుని తిని లేచింది ఒక పదినిమిషాలు మర్యాద కోసం కూచుని హరీష్ ని ఇంటికి బయలుదేరదీసింది.... కాసేపు కూచుని మిగతా అందరూ వెళ్ళి పోయారు... "నువ్వు అవేం పట్టించుకోకమ్మా, జ్యోతి స్వభావమే అంత " అంటున్న మావగారిని అడ్డుకుంటూ.. "అలా అంటే ఎలా? జ్యోతి లాగే సంగీత కూడా ఈ ఇంటి కోడలే వాళ్ళింట్లో ఉన్నప్పుడు అంది సరే ఇక్కడ కూడా మనందరి ముందర అలా అనడం నాకు నచ్చలేదు .." "మనింటికి కొత్తగా వచ్చిన అమ్మాయి చేసినప్పుడు బాగా లేకున్నా బాగున్నాయని అనాలి , అలాంటిది బాగున్నా కూడా కావాలని ఇలా అనడం మంచిది కాదు. మరీ నోరు పారేసుకుంటున్నది" అంటున్న అత్తయ్యను వారిస్తూ "ఫరవాలేదత్తయ్య నేను ఏమీ ఫీల్ అవ్వలేదు.. అయినా అన్నింటిలో అందరినీ మెప్పించలేం కదా?" అన్న సంగీతను మెచ్చుకోలుగా చూసారు చంద్రశేఖర్రావు గారు.. రాత్రి అడగకుండానే సంగీతకు జ్యోతి గురించి చెప్పాడు సతీష్... "ముగ్గురన్నలకు ముద్దుల చెల్లి.. చాలా గారాబంగా పెరిగింది. అమ్మ తరఫు బంధువుల అమ్మాయి అని చేసుకున్నారు. బామ్మే వంట మిగతా పనులు అవి నేర్పించింది.. వాళ్ళింట్లో అందరికన్నా అందగాడు చదువుకున్నవాడూ అన్నయ్య మొగుడుగా వచ్చాడని అతిశయం. మనసు మంచిదే." అని చివర్లో కితాబిచ్చాడు... 'ఫరవాలేదు కారెక్టర్ కొంచం అర్థమయ్యింది' అనుకుంటూ పడుకుంది... సశేషం...బాంధవ్యం... 5 ఉదయం లేస్తూనే పనిలోకి దిగింది సంగీత.. పుట్టింట్లో అందరూ పొద్దున లేవడం అలవాటే. కానీ సంగీత లేచే సరికే సుచరితగారు కాఫీ ఫిల్టర్ వేసేసారు చంద్ర శేఖర్ గారికి టీ చేసి ఇచ్చారు.. "రామ్మా! వచ్చావా , నీకోసమే చూస్తున్నా.. అంటూ కాఫీ కలిపారు . ఇత్తడి ఫిల్టర్ లో వేసిన డికాషన్ తో ఆవిడో పెద్ద ఇత్తడి గ్లాస్ తో తీసుకుని సంగీతకో పెద్ద స్టీల్ గ్లాస్ తో కలిపిచ్చారు.. "అయ్యో !అంత నేను తాగలేను" అంటున్నా వినకుండా బలవంతం చేసారు.. "మీ మావగారికి పొద్దున టిఫిన్ అలవాటు లేదు మధ్యాహ్నం ఫలహారం చేస్తారు అందుకని పొద్దున్నే వంటయిపోవాలి.." అన్నారు పొద్దున 11 గంటల లోపు వంట భోజనాలు.. భోజనాలు కాగానే పడుకోవడం ,లేచాక సాయంత్రం ఫలహారాలు రాత్రి చపాతీలు ఇది రోజువారి వారి దినచర్య .. అప్పుడప్పుడూ ఆ ఇంటి ఆడపిల్లలు అమ్మానాన్నలను చూడడానికి వారింటికి రావడం.. సాయంత్రం కాసేపు సంగీత, సతీష్ వాళ్ళు వాళ్ళ ఇళ్ళకు వెళ్ళడం చేసేవారు.. హరీష్ వాళ్ళు మటుకు ఎప్పుడూ వచ్చేవారు కాదు . జ్యోతి వారినే తమ ఇంటికి పిలిచేది .. జ్యోతి వాళ్ళు వాళ్ళ ఇంటికి పిలిచినప్పుడల్లా సతీష్ సంగీతతో సినిమాకి వెళ్ళే వాడు.. తప్పించు కోవడానికా అని అప్పుడప్పుడూ సంగీతకు అనుమానం వచ్చేది. కానీ మాట్లాడేది కాదు.. పండక్కి భోజనాలకు పిలిచినా వీళ్ళకు అవకాశం ఉండేది కాదు ... కొత్త పెళ్ళి కూతురు కదా పుట్టింటి వారు భోజనానికి పిలిచే వారు.. అక్కడికి వెళ్ళిపోయేవారు .. అందుకని సంగీతకు జ్యోతిని కలిసే అవకాశం చాలా వరకు తగ్గింది .. అత్తవారింట్లో పనులు చక్క పెట్టుకోవడం , అత్త మామలను , ఆడపడుచులను ప్రేమగా ఆదరించడం , ఏదో ఒక వంకతో ఆ పూజ ,ఈ పూజ ఆనోమూ, ఈ వ్రతం , అని చేస్తూ ఆడపడుచులకు వాయినాలివ్వడం.. భోజనాలకు పిలవడం అభిమానంగా చూసుకోవడం .. ఎక్కడికి వెళ్ళినా అత్తగారిని , మావగారిని కనిపెట్టుకుని ఉండడంతో వారందరికీ సంగీత ప్రేమపాత్రురాలయ్యింది .. బంధువుల పెళ్ళిళ్ళకు వెళ్ళినప్పుడు జ్యోతి వస్తే మాత్రం మనసు కష్టపెట్టుకుని రాక తప్పేది కాదు. అక్కడ జ్యోతి తన అభిజాత్యం చూపించుకోవడానికి తెగ తాపత్రయ పడేది.. తన చీర నగలు అందరూ మెచ్చుకోవాలనుకునేది. కానీ చాలా సార్లు అందరి ద్రుష్టి వనిత సంగీతల మీద పడేది.. వనిత వాళ్ళ అత్తగారు వాళ్ళు బాగా ధనవంతులు ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చిన నగలు చీరలు కొనుక్కుని చాలా ఫాషనబుల్ గా ఉండేది.. సంగీత... సహజ సౌందర్యవతి, దానికి తోడు చదువుతో వచ్చిన సంస్కారం ,హుందాతనం , పుట్టింట నేర్చిన మర్యాదతో కూడిన నడవడిక అందరిలో ప్రత్యేకంగా నిబెట్టేవి.. అందులో కొత్త పెళ్ళి కూతరు... కలుపుగోలు తనంతో ఉండడంతో తనను అందరూ పలకరించే వారు.. వారి ద్రుష్టి మరల్చి తనవైపు తిప్పు కోవడానికి జ్యోతి చేసే ప్రయత్నాలు వెకిలిగా ఉండేవి.. ఇవన్నీ పాపం సంగీతకే కాదు, లలితకు వనితకు కూడా తెలీక వారు తనకు దగ్గరగా వస్తున్నా కావాలని దూరంగా వెళ్ళి పోయేది జ్యోతి.... ఒకరోజు జ్యోతి పొద్దున్నే చంద్రశేఖర్ గారికి ఫోన్ చేసింది.. "మావయ్య గారు! మీ అబ్బాయి కాంప్ కి వెళ్ళారు. బోర్ పాడయ్యింది ,పిల్లవాడి ఆటో అబ్బాయి రాలేదు , వాడిని స్కూల్ లో దింపి ఎలక్ట్రీషియన్ ని తీసుకు రావాలి సతీష్ ని పంపిస్తారా " అని అడిగింది.. "అలాగేనమ్మా పంపిస్తాను "అన్నారు. పొద్దున 7.30 గంటలకు వెళ్ళిన సతీష్ 12.30 అయినా రాలేదు అత్తగారు తినమన్నా తినకుండా సతీష్ కోసం ఎదురు చూస్తూ కూచుంది సంగీత .. తీరా సతీష్ వచ్చి అక్కడే తిన్నాను అనండంతో చేసేదేం లేక ఒక్కతే తిన్నది.. అలా ఆరోజుతో అయిపోలేదు. హరీష్ లేని వారం రోజులు ఏదో ఒక వంకతో సతీష్ ని పిలిపించుకునేది . ప్రతి రోజూ అక్కడే భోజనం చేసి వచ్చే వాడు.. ఒకరోజు సుచరిత , చంద్ర శేఖర్ గారు ఇద్దరూ అడిగారు "అమ్మాయేమో ఇక్కడ ఎదురు చూస్తుంటే నువ్వు రోజూ అక్కడ భోజనం చేయడ మేంటి"అని .. "ఎందుకు ఎదురు చూడడం? .. అక్కడ వదిన ఒక్కతే కదా అందుకనే కంపెనీ ఇస్తున్నాను. " "ఇక్కడ మీరంతా ఉన్నప్పుడు మీతో కలిసి భోంచేయొచ్చు కదా? "అని విసుక్కున్నాడు.. ఆ చిన్న మాటలో కనబడిన విసుగు అందరూ గమనించారు... సంగీతకు మాత్రం అది విసుగు కన్నా ,తను చేసిన పనికి అందరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చిందన్న కోపం కనబడింది.. అది మొదలు జ్యోతి అవసరమైనప్పుడల్లా అవకాశం ఉన్నప్పుడల్లా ఏదో ఒక వంకతో సతీష్ ని పిలిపించుకోవడం చేసేది.. అది అందరూ మామూలు విషయంగానే తీసుకున్నారు. ఒకరోజు మధ్యాహ్నం టీ తాగుతున్నప్పుడు సతీష్ విసుగ్గా టీ గ్లాస్ కింద పెట్టి " ఏంటి ఆ Tea చేయడం రాక పోతే వదిన దగ్గర నేర్చుకో. వదిన చేసే టీ ఎంత బాగుంటుందో ." అన్నాడు చంద్ర శేఖర్ తో సహా ఆడవాళ్ళిద్దరుకూడా మ్రాన్పడి పోయారు.. ఎప్పుడూ లేనిది కొత్త డైలాగ్.. అంతటితో ఆగితే బాగుండును. తనకు నచ్చిన వంటలు అడిగి చేయించుకుని ప్రతి దానికీ వదిన చేసిన వంటతో పోల్చి వంక పెట్టే వాడు.... అమ్మ చేసిన వంటకు కూడా వంకలు మొదలయ్యాయి.... చంద్ర శేఖర్ వారించినా ఆగేవి కాదు.. ఈ పరిణామం ఎక్కడికి దారి తీస్తుందా అని చంద్రశేఖర్ గారు...... సంగీత ఏమనుకుంటుందో అన్న బాధతో 'వీడిలా అనడం ఏంటి, నచ్చింది సరే ,అక్కడే వదినకు చెప్పకుండా ఇక్కడ చెప్పడం ఏంటి.. ' అని సుచరిత గారనుకున్నారు... కానీ సంగీతకు ... ఏదో తెలియని గుబులు, గుండెల్లో భయం, తన నుండి సతీష్ ని వేరు చేసే ప్రయత్నమా? లేక కుట్రా ? ఏదో జరగుతోంది, ఏంచేయాలి, ఎలా ఆపడం? అని ఆలోచిస్తూ ఉండిపోయింది.బాంధవ్యం ... 6 ఆరోజు ఉదయం లలిత ఫోన్ చేసింది.. " చాలా రోజులయ్యింది సతీష్ వాళ్ళు రావడం లేదు . మిమ్మల్ని చూసి కూడా చాలా రోజులయ్యింది ఈరోజు ఇక్కడికే భోజనానికి రండి అమ్మా " అని.. "ఏమో సతీష్ ని అడిగి చెబుతాం తల్లీ. " "అందేంటమ్మా కొత్తగా ." "అదంతేలే.."అని Phone పెట్టేసారు.. వెంటనే జ్యోతి దగ్గరనుండి సతీష్ కి Phone. "మీ అన్నయ్యకు ఏదో బాంక్ పనట రమ్మంటున్నారని" ఇవేమీ తెలియని సంగీత గుడికి వెళ్ళడానికి రెడీ అయ్యింది ... రెడీ అయిన సతీష్ తో "ఇవాళ ఏకాదశి గుడికి వెళ్ళొద్దామండి " అనడిగింది... "లేదు! నేను అన్నయ్యా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి , అన్నయ్య రమ్మన్నాడు, బాంకు పనట " "బాంకు పదిన్నరకు కదా తెెరిచేది అప్పటికల్లా వచ్చేస్తాం రండి" అని అనగానే.. "నేను రాను కావాలంటే నువ్వు వెళ్ళు" అన్నాడు ఇంక అడిగి లాభం లేదని అత్తగారికి మావగారికి చెప్పి బయలుదేరింది.. ఆలోచనలను మరల్చాలని చూసినా పదే పదే అటే తిరుగుతున్నాయి.. సడన్ గా ఎందుకింత మార్పు .. వాళ్ళ వదిన దగ్గరకు వెళ్ళి రాగానే చాలా చిరాగ్గా ప్రవర్తిస్తారు. 'ఏంటి, ఎందుకు అనే ప్రశ్నల కంటే , ఆయింటికి వెళ్ళకుండా ఎలా ఆపాలా ' అనే ఆలోచించింది.. పూజయ్యాక ప్రసాదం తీసుకుని , ప్రదక్షిణం చేసి ఇంటికి వచ్చి వంట మొదలు పెడదామని వంటింట్లోకి వెళ్ళింది "వాడెలాగూ అక్కడే తింటాడు కానీ మాక్కూడా సాబుదానా కిచిడీనే చేయమ్మా "అన్నారు సుచరిత అందరూ తినబోతుంటే లలిత వచ్చింది "నేనూ ఇక్కడే తింటాను "అని.. అయ్యో వదినా ! ఈ రోజు సాబుదానా కిచిడీనే చేేసా. ఒక్క పదినిముషాలుంటే కుక్కర్ పెడతానంటున్న సంగీతను కాదని , "ఫరవాలేదు నేనూ అదే తింటాను " అని అదే తిన్నారు.. అందరూ కూచున్న తరువాత లలిత సంగీత పక్కన కూచుని సంగీత భుజం మీద చెయ్యి వేసింది ఓదార్పుగా .. కళ్ళనుండి ఉబుకుతున్న నీటిని బయటకు రానివ్వలేదు కానీ లలితకు తెలుసు సంగీత బాధ.. ఉన్నట్టుండి సంగీత "నేను ఉద్యోగం చేస్తాను వదినా !ఎక్కడయినా చూడండి " "నువ్వు కాదమ్మ వాడితోనే చేయించాలి "అన్నారు చంద్ర శేఖర్ గారు.. "చూద్దాం పెద్దబాబుతోనే చెప్పిస్తాను" అని ఆయనే అన్నారు.. నా విషయం వీరందరినీ కూడా బాధ పెడుతుందన్న మాట.....అనుకుని కొంత స్థిమిత పడింది.. "సరే అమ్మా ! సతీష్ వస్తే ఇద్దరినీ పంపించు " అని లలిత వెళ్ళిపోయింది... లలిత వెళ్ళగానే సతీష్ కూడా వచ్చాడు వస్తూనే పడుకున్నాడు .. ఏ కళనున్నాడో అక్క పిలించింది. అనగానే సరే అన్నాడు.. ఇద్దరూ కలిసి బయలుదేరారు.దార్లో అంతా వదిన గురించే కబుర్లు.. "ఏంటి సంగీత! నీకు వదినంటే ఇష్టం లేదా .. ఒక్కసారి కూడా తనతో మాట్లాడవు వాళ్ళింటికి రావు తనెంత ఒంటరిగాగా ఫీల్ అవుతుందో తెలుసా ?" "నాకు వదినంటే చాలా ఇష్టం నాకు అమ్మకంటే ఎక్కువ . అందుకని అప్పుడప్పుడూ అక్కడికి కూడా వెళ్ళాలి తెలిసిందా? " అన్నాడు.. "అదేంటి అలా మాట్లాడుతారు నేను రానన్నానా.. మీరేగా ఒక్కరే వెళతారు.. పైగా వదినా వాళ్ళు మనల్ని రమ్మని పిలుస్తారు అప్పుడేగా వెళతాం.. " అన్నది .. "సరే పద ! " అని ఇల్లు రాగానే లోపలికి దారితీసారు.. వెళ్ళగానే మోహన్ కనబడ్డారు. "రండి రండి " మీ అక్కలోపల మీ కోసం ఏదో చేస్తుంది" అని అన్నారు వెంటనే అక్కడే కూచోబోతున్నదల్లా లేచి లోపలికి వెళ్ళింది సంగీత.. "వాడికిష్టమని ఆలూబోండా చేస్తున్నా "అని గబగబ నాలుగు ప్లేట్లలో సర్దింది . " ఆ గ్లాసులో నీళ్ళు పోసి తీసుకురా" అంటూ హాల్లోకి నడిచింది.. టిఫిన్ తిని కాఫీ తాగుతున్నప్పుడు మెల్లిగా మొదలు పెట్టారు మోహన్.. "నాకు తెలిసిన వాళ్ళదగ్గర సూపర్ వైసర్ పోస్ట్ ఒకటి ఖాళీ గా ఉంది తెలిసిన వాళ్ళుంటే చెప్పమన్నారు నువ్వేమన్నా ట్రై చేస్తావా... " "అలాగే బావగారు వెళతాను నాక్కూడా బోర్ కొడుతుంది." "సరే అయితే రేపు పొద్దున వెళదాం " అన్నాడు మోహన్... కాసేపు కూచుని బయలుదేరారు, ఇంటికి వెళుతున్నాం అనుకుంది కానీ వాళ్ళ అన్నయ్య వాళ్ళింటికి తీసుకొచ్చాడు.... ఇంట్లోకి వెళుతూనే హరీష్ "ఏరా ఇదేనా రావడం అమ్మా వాళ్ళు రాలేదా " అనడిగాడు .. "లేదన్నయ్యా! మేం అక్కయ్య వాళ్ళింటికి వెళ్ళి వస్తున్నాం" "అలాగా కూచో " అనగానే అక్కడే కూచున్నాడు సంగీత లోపలికెళ్ళింది... టీ వీ చూస్తున్న జ్యోతి మొహమంతా విప్పార్చుకుని నవ్వింది.. "ఏంటిలా వచ్చారు? .." "లలితొదినా వాళ్ళింటికి వెళ్ళి వస్తున్నాం .." "ఓహ్ ఏంటి సంగతులు.. బాగానే మాట్లాడిందా.. ఏం తిని వస్తున్నారు.. " అలా అన్ని ప్రశ్నలకు వరుసగా ఓపిగ్గా జవాబులిచ్చింది. "పిల్లలేరక్కయ్యా " "వాళ్ళు ట్యూషన్ కి వెళ్ళారు..మంచి నీళ్ళు కావాలా " "ఆహా వద్దక్కయ్య.." "అవునూ ఏంటి నీరసంగా ఉన్నావు ఏమైనా విశేషమా? " "అవునూ! ఎలా ఉంటాడు బాబు నీతో నువ్వు హాపీ నేనా.. అర్థమయ్యీ కానట్టున్న ఆవిడ భాషను చూసి ఏంటో ఛా అనుకుని ..అటూ ఇటూ కాకుండా తలూపి ఇంక కూచో బుద్ధికాక " లేటయ్యింది వెళ్ళొస్తాం అక్కయ్యా" అని లేచింది .. బయటకొచ్చి బావగారితో చెప్పి బయలు దేరింది వెనకాలే సతీష్ కూడా బయలుదేరాడు....బాంధవ్యం ... 7 మరునాడు ఉదయమే బావగారు ఇచ్చిన ఫోన్ నంబరుకు ఫోన్ చేసి రమ్మన్న టైముకు వెళ్ళాడు సతీష్.. రికమండేషన్ పైగా ఫ్రండ్ బావమరిది కాబట్టి రేపటి నుండీ రమ్మన్నాడు ప్రకాష్ .. సరేనని అదే మాట అమ్మా నాన్నకు అక్కకు బావకు అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పాడు.. ఇప్పుడు ఇంటికెళ్ళి చేసేదేముంది వదినక్కూడా చెబుదామని వెళ్ళాడు .. "రా రా సతీష్ మీ అన్నయ్య ఏదైనా పని చెప్పారా" లేదొదినా నేనే వచ్చా.. ఏంటి విషయం .. బావగారు ఉద్యోగం చూపించారు.. రేపటినుండి వెళ్ళాలి అందుకే ఒకసారి పిల్లల్ని మిమ్మల్ని చూసి వెళదామని వచ్చా.. "అలాగా 4 గంటలకు వస్తారు కదా ఉంటావా మరి? .." "అలాగే " వదినా "భోంచేసావా?" "లేదు"? "పద అయితే వడ్డిస్తాను.. " అన్నం వడ్డిస్తూ అడిగింది.. నేచర్ ఆఫ్ జాబ్ ఏంటి ?" స్టోర్ సూపర్వైజర్ వదినా స్టాక్ మెయిన్ టెైన్ చేయడం.... " " నీకు నచ్చిందా? చేయగలవా ?" "ఏమో చూద్దాం! నచ్చితే చేయడం ,లేదంటే వదిలేయడం.. " సాయంత్రం పిల్లలు వచ్చే దాకా ఉండి ఆ తరువాత ఇంటికెళ్ళాడు.. సంగీత పాపం ఇవాళ్టినుండే డ్యూటీ లో జాయిన్ అయ్యాడనుకుని పొద్దుటినుండి తినలెెెేదనుకుని గబ గబా వంటచేసింది.. భోజనం చేస్తున్నప్పుడు సంగీత మెల్లగా అడిగింది.. "ఎలా ఉంది ఉద్యోగం.. " "తెలీదు, రేపటినుండీ వెళ్ళాలి" "మరి ఇంతసేపు ఎక్కడున్నారు " అని అడగాలనుకుంది.. కానీ తనకు తెలిసిన విషయమే కదా అని ఊరుకుంది.. మరే కళనున్నాడో సతీషే చెప్పాడు ... "అన్నయ్యా వాళ్ళింటికి వెళ్ళానని... " తెల్లవారినుండి ఉద్యోగానికి వెళ్ళడం మొదలుపెట్టాడు.. అలా అంతా బాగుందని అనకుంటున్న సమయంలో బాంబు పేలింది... లలిత ఫోన్ చేసి "సతీష్ ని పంపించండి అమ్మా తన కిష్టమైన బయట తిరిగే ఉద్యోగం ఉందట ఆయన చెప్పారు".. అలాగే అన్నారు వీళ్ళు.. కానీ సంగీత తరవాత మెల్లిగా లలితకు ఫోన్ చేసింది.. "ఏంటొదినా ఆయన ఈ ఉద్యోగం చేయనన్నారా?" "అయ్యో ! చేయననక పోవడం ఏమిటీ ఎప్పుడో మానేసాడు కదా!" "అవునా! "అని ఆశ్చర్యపోవడం సంగీత వంతయ్యింది .. అత్తయ్యకు మావయ్యగారికి కూడా తెలిసినట్టులేదు. అదే విషయం లలితతో చెప్పి, "వారికి తెలియనివ్వకండి, పాపం సంతోష పడుతున్న వాళ్ళ మనసును కష్ట పెట్టడం ఎందుకు?" అని చెప్పింది " సరే అలాగే నీ ఇష్టం "అని లలిత ఫోన్ పెట్టేసింది... ఆ నిముషం పెద్ద వాళ్ళను కష్ట పెట్ట కూడదని అనుకుందే కానీ ... అది పామై తన జీవితాన్ని కాటేస్తుందని ఊహించలేక పోయింది.. ఇంటి కొచ్చిన సతీష్ రోజులాగే ఉద్యోగం నుండి వచ్చినట్టు వచ్చి ఫ్రెష్ అయి భోంచేసాడు.. రాత్రి ఏమీ తెలియనట్టు పడుకున్న సతీష్ ని చూస్తే కోపంతో, బాధతో కూడిన దుఃఖం వచ్చింది.. అడగాలనుకున్నా అడగలేక పోయింది. మరి మధ్యాహ్నం అంతా ఎక్కడుండే వారు? ఒక్కనిముషం ఎక్కడో తెలిసినట్టు అనిపించినా కాదులే అని ఆగిపోయింది ... తనమీద చేయి వేసిన అతని చేతిని మెల్లిగా తీసి దూరం జరిగింది... ఆడదంటే అందులోనూ భార్య అంటే ఏమనుకుంటారు వీళ్ళు .. ఒక నాలుగు గ్రాముల బంగారాన్ని ఒక మూర పసుపుదారంతో కట్టి తమ బానిసను చేసుకుంటారా ? మంచి చెడ్డా, కష్టం సుఖం ,మాట్లడుకునే, చెప్పుకునే , అసలు చెప్పే అవకాశం వీళ్ళకివ్వరా? లేక వీరికేంటి చెప్పేది అనుకుంటారా... మొదటి సారి వివాహ వ్యవస్థ మీద ఏహ్య భావం కలిగింది.. కానీ అంతలోనే అమ్మ నాన్నా , అత్తయ్య మావయ్య గారు, మిగతా అందరూ గుర్తొచ్చారు. చూద్దాం ఇంకో అవకాశం ఇచ్చారుగా అనుకుంది.. తెల్లవారి వెళ్ళి జాయిన్ అయ్యాడు.. కానీ ఎంతో కాలం చేయలేదు పైగా ఇంట్లో తిడతారని సాయంత్రం దాకా తిరిగి వచ్చేవాడు .. ఎక్కడి కెళ్ళేవాడో చెప్పలేదు .. కానీ ఆ విషయం ఎన్నాళ్ళో దాగలేదు.. ఒకరోజు హరీష్ వచ్చాడు.. ఆ కబురూ ఈ కబురూ చెప్పి సంగీత వంటింట్లో ఉంటే మంచి నీళ్ళు తాగే నెపంతో వంటింట్లోకెళ్ళాడు... "మీరిద్దరూ ఏమైనా పోట్లాడుకున్నారా ? " అని అడిగాడు. ' లేదంది ' " ok " అని బయటకెళుతుంటే "బావగారూ "అని పిలిచింది.. ఏమన్నా ప్రాబ్లమా? అనడిగింది.. "లేదు ? సతీష్ రోజూ సాయంత్రం అక్కడుంటే అడిగా, ఏమైనా ఉంటే చెప్పమ్మా .. ఫీల్ ఫ్రీ " అన్నారు.. "అలాగే " అంది .. ఇంట్లో ఎవరికీ చెప్పలేదు సతీష్ ని అడగలేదు ఏంటి ఈ మనిషి.. అని తనే మధన పడింది . కానీ అలా ఎవ్వరికీ చెప్పక పోవడమే తను చేస్తున్న మరో తప్పని తరువాత తెలిసింది అంత దాకా అమాయకంగా అతన్ని నమ్మింది.. ఇక లాభంలేదని ఒకరోజు భోజనాలయ్యాక తనే లలిత వాళ్ళ ఇంటికి వెళ్ళింది.. బావగారు చెప్పిన విషయం చెప్పి .. "వదినా! ఎందుకు అనవసరంగా ఆయన్ని ఉద్యోగం అంటూ బాధ పెట్టి , మన కోసం చేస్తున్నట్టు నటించి , ఊరి మీద పడి తిరిగి తిరిగి రావడం . అంత అవసరమా ? "అంటూ కంటతడి పెట్టుకుంది.. "అయ్యో పిచ్చి పిల్లా! బాధపడకు ,చూద్దాం ఏదో ఒకటి "అన్న లలితతో " ఆ ఏదో ఒకటి ఆయనకు కాదొదినా నాకే చూడండి .. నేను ఉద్యోగం చేస్తాను " అన్న సంగీతతో " సరే మీ అన్నయ్య కు చెబుతాలే " అంది.. కానీ , సంగీతకు ఈ సారి మోహన్ కాకుండా వనిత వాళ్ళ భర్త శ్రీధర్ చెప్పాడు.. "మా ఆడిటర్ కి అసిస్టెంట్ కావాలట చేస్తావా ?" అని.. "తప్పకుండా చేస్తానని సంతోషంగా " ఒప్పుకుంది... తెల్లవారినుండి ఉద్యోగానికి వెళ్ళడం మొదలు పెట్టింది.. మొదటి రోజు గబ గబా వంట చేసి బాక్స్ లో పెట్టుకుని అత్తగారికి మావగారికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుని బయలుదేరింది . "అత్తయ్య !సాయంత్రం ఎలాగ?" "మేం ఏదో ఒకటి చేసుకుంటాంలే తల్లి నువ్వు నిశ్చింతగా వెళ్ళి రా ! " అంది... "అలాగే అత్తయ్యా ! " అంటూ బయలుదేరిన సంగీతకు ఆ నిముషం తెలీదు తను వేసిన ఏడడుగులలో ఒక అడుగు వెనక్కి జరిగిందని.... సశేషం...బాంధవ్యం..... 8 చెప్పిన టైముకే ఆఫీస్ కి చేరిన సంగీత మెల్లిగా లోపలికి అడుగు పెట్టింది.. సిట్టింగ్ రూమ్ దాటి విజిటర్స్ రూమ్ ని దాటి హాల్లోకి అడుగు పెట్టింది. అక్కడ నాలుగు కాబిన్స్ ఒక రూమ్ ఉన్నాయి .కాబిన్స్ లో నలుగురున్నారు.. రూమ్ లో ఆడిటర్ లక్ష్మి నారాయణగారున్నారు.. సంగీత రావడం చూసి లోపలికి పిలిపించుకున్నారు. "ఏమ్మా ! ఏంచదివావు? " చెప్పింది . ఓకే! అకౌంట్స్ నాలెడ్జ్ ఉంది మరి." "ఇంటర్ లో అకౌంట్స్ అండి " అన్నది.. "Ok ముందు రెండు ఫైల్స్ ఇస్తాను ఇదిగో ఈ ప్రొఫార్మా చూస్తూ కాలమ్స్ ఫిలప్ చేయి .. డౌట్సుంటే దాన్ని వదలి వెేరే చేస్తూ వెళ్ళు అలా అన్నీ చేసి వస్తే ఒకే సారి అన్ని డౌట్స్ క్లియర్ చేసుకుందాం " అన్నారు.. అలాగే అని అదే రూమ్ లో ఓ పక్కగా ఉన్న టేబుల్ దగ్గర కూచుంది... బాలన్స్ షీట్ , ట్రయల్ బాలెన్స్ షీట్ ఇచ్చి IT ఆన్యుల్ ఐ టీ రిటర్న్ తయారు చేయమన్నారు.. చాలా ఇంట్రస్టింగా ఉంది...ఎక్కడా ఆగకుండా అన్నీ ఫిలప్ చేసింది. సమయం కూడా చూడలేదు . ఒకళ్ళ తరువాత ఒకళ్ళు లంచ్ కి వెళుతుంటే "వెళ్ళమ్మా! వెళ్ళి లంచ్ చేసిరా" అన్నారు.. గబ గబ తినేసి మళ్ళీ పనిలో పడింది అన్నీ కంప్లీట్ చేసి సర్ కు చూపించింది .. "వెరీ గుడ్ ఒకటి రెండు తప్ప అన్నీ కరెక్ట్ గా చేసావు అన్ని " అంటూ మెచ్చుకోలుగా చూసారు.. "సరే రేపు మరి కొన్ని చేద్దువుగాని ఇవాల్టికి చాలు" వెళ్ళిరమ్మన్నారు.. ఆటోలో ఇంటికి వచ్చింది. రాగానే ఫ్రెష్ అయి చంద్రశేఖర్రావు గారికి ఆఫీస్ విషయాలన్నీ చెప్పింది,సతీష్ కనబడలేదు .. ఎక్కడి కెళ్ళారని సంగీత అడగలేదు.. సుచరితే చెప్పింది "ఇప్పుడే అలా వెళ్ళొస్తాను అని వెళ్ళాడు"... గబ గబ వంట చేసింది.. 9 గంటలయినా రాకపోయేసరికి పెద్ద వాళ్ళకు పెట్టి తను ఎదురు చూస్తూ కూచుంది రాత్రి 9.30 కు వచ్చిన సతీష్ ని "రండి భోజనానికి " "అక్కయ్య దగ్గర తినొచ్చాను" మరింకేం మాట్లాడకుండా తినేసి గదిలో కెళ్ళింది.. అప్పటికే నిద్ర పోతున్న అతనితో ఆఫీస్ విషయాలు ఏం పంచుకుంటుంది.. సంగీత కూడా పడుకుంది. అలా వారం రోజులు గడిచి ఆదివారం వచ్చింది . వనిత, లలిత ఇద్దరూ పిలిచారు సరాదాగ అందరం కలుద్దామని . సంగీత పొద్దున వీలుకాదు పెండింగ్ పనులున్నాయని తప్పించుకుంది కానీ శ్రీధర్ సాయంత్రం కారు తీసుకొచ్చి అందరినీ హోటల్ కి తీసుకెళ్ళారు.. లలిత , హరీష్ వాళ్ళు కూడా వచ్చారు.. అందరు జంటలు పక్క పక్కన కూచున్నారు ఆర్డరిచ్చిన ఐటమ్స్ వచ్చే వరకు అందరూ కబుర్లలో పడ్డారు.. శ్రీధర్ , సంగీత ఆఫీస్ విషయాలూ, లక్ష్మి నారాయణ గారు సంగీత మీద వెలి బుచ్చిన అభి ప్రాయం చెబుతున్నాడు .. ఆరోజుఫోకస్ అంతా సంగీత మీదే ..అందరూ సంతోషంగా పాలు పంచుకుంటుంటే.. నచ్చని జ్యోతి మాత్రం సతీష్ తో వారిని డామినేట్ చేస్తూ ఏదో మాట్లాడేస్తుంది... ఇంటి కెళ్ళాక కూడా సతీష్ సంగీతను ఆఫీస్ ఎలాఉంది ? బాగుందా ?ఏంచేస్తున్నావు ?అని ఒక్క మాట కూడా అడగ లేదు.. రేపటి నుండి ఎలా వెళ్ళాలి చేతిలో ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. మానవుడు మాట్లాడడేం ? అని ఆలోచిస్తూ పడుకుంది. ఈయన గారు దినచర్య మార్చుకోడు, పొద్దున గుడి కని బయలుదేరడం, తను వెళ్ళాక రావడం భోంచేసి సాయంత్రం వెళ్ళి,రాత్రి పడుకునే సమయానికి వచ్చితినడం, పడుకోవడం అది దినచర్యగా పెట్టుకున్నాడు. కానీ ఆరోజు పొద్దున వెళితే మటుకు సంగీతకు కోపం వచ్చింది .. చేతిలో డబ్బులు లేవు ఎలా వెళ్ళడం పోనీ మానేయనా ... కానీ ఎలా ? ఆఫీస్ లో చాలా పనులున్నాయి అని అనుకుంటూ ఉంది... ఇంతలో చంద్రశేఖర్ రావుగారు సంగీతను పిలిచి ఒక కవరు చేతిలో పెట్టారు .. "నిన్న శ్రీధర్ ఇచ్చారమ్మ, మీ సర్ నీకివ్వమన్నారట" అంటూ . మావగారి ముందే విప్పి చూసింది,డబ్బులున్నాయి.. "మావయ్యా! డబ్బులున్నాయి ,నెల కాకుండానే జీతం ఇచ్చారా?" "కాదమ్మా! నీకు Conveyance కి కావాలి కదా ? 'ఉంచ మనండి 'అని లక్ష్మి నారాయణ గారు శ్రీధర్ కి ఇచ్చారట.. ఉంచుకో " అన్నారు.. సాయంత్రం ఇంటికి వస్తూ sపట్టుకొచ్చింది. దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టింది.. అత్తయ్యకు బాగు మావయ్యకు పర్స్ సతీష్ కి T shirt కొనుక్కొచ్చింది.. "జీతం కాదు కదా ఎందుకమ్మా ? అంటే ,"ఏదైతేనేం మావయ్యా! మొదటిసారి కష్టార్జితం చేతిలోకొచ్చింది కదా " అన్నది వనితకు , శ్రీధర్ కి ఫోన్ చేసి Thanks చెప్పింది లలితకు కూడా చెప్పింది.. హరీష్ కి ఫోన్ చేసింది అక్కయ్యకు కూడా చెప్పమంది.. అత్తగారు,మావయ్య గారు భోంచేసి వెళ్ళాక కంచాలు పెట్టి సతీష్ కోసం ఎదురు చూస్తూ కూచుంది.. ఎంత ఎదురు చూసినా రాలేదు.. ఎప్పుడు పడుకుందో తెలీదు పొద్దున అత్తగారు వచ్చి లేపుతుంటే లేచింది .. ఏమ్మా ! ఇక్కడ పడుకున్నావు సతీష్ రాలేదా .. అప్పుడు గుర్తొచ్చింది ఆయన రాలేదన్న సంగతి.. లేదని తలవూపింది...కానీ కూచున్న చోటునుండి లేవలేదు.. సుచరిత గబగబా చంద్రశేఖర్ రావుగారిని లేపి విషయం చెప్పింది .. ఆయన పిల్లలు ముగ్గురికీ ఫోన్లు చేసి అడిగారు.. వారు కూడా మా దగ్గరకు రాలేదన్నారు . "భగవంతుడా ఏం కాలేదు కదా! గుండెల్లోంచి తన్ను కొస్తున్న దుఃఖాన్ని ఆపలేక పోయింది.. సుచరిత దగ్గరకు తీసుకుంది.. భగవంతుడా! విషయం సీరయస్ కాకుండా చూడు తండ్రీ అని దండం పెట్టుకుంది.. ఆదుర్దాగా అందరూ వచ్చారు . హరీష్ మటుకు ఒకడుగు ముందుకు వేసి police complaint ఇవ్వ బోయాడు .. ఇంతలో Phone మోగింది... బాంధవ్యం....... 9 గబగబా వెళ్ళి హరీష్ ఫోన్ తీసాడు. అవతల నుండి హరీష్ వాళ్ళ పిన్ని గొంతు.. "ఎవరూ హరీషేనా " అని అడిగిందావిడ. "అవును పిన్ని.. " "అక్కయ్యను పిలవరా" అన్నారావిడ.. "ఏదైనా అర్జెంటా ఈ వేళప్పుడు ఫోన్ చేసావు.". కొంచం తొందరగా పిలువు లేదంటే బావగారికివ్వు.. సుచరితకు రిసీవర్ ఇచ్చాడు హరీష్ . 'హలో 'అని సుచరిత అనగానే.. అక్కయ్యా! సతీష్ ఉన్నాడా ఇంట్లో? ... "లేడు సువర్చలా? ఇంకా ఇంటికి రాలేదు వాడి కోసమే చూస్తున్నాం,ఏమైంది?ఎందుకలా అడిగావు? "ఏంలేదు, వీడిక్కడికి వచ్చాడు, మూడీగా ఉన్నాడు అన్నం కూడా తినలేదు, ఇప్పుడే బతిమాలి పెట్టాను ఏదో మనసులో బాధ పడుతున్నాడు. " "మీకు చెప్పి వచ్చాడో, లేదో తెలీదు, అన్నిటికీ ముక్తసరిగా సమాధానాలు ఇస్తున్నాడు, అందుకే చెబుదామని ఫోన్ చేసా ". అందరికీ సంగతి చూచాయగా అర్థమైంది .. హరీష్ , చంద్ర శేఖర్ గారు మాట్లాడాలనుకున్నారు కానీ" సువర్చల "నేను పెట్టేసాక మీరు చేయండి " అన్నది సువర్చల ఫోన్ పెట్టేసాక సుచరిత చేసారు.. సువర్చల ఫోన్ తీసి "నీకేరా సతీష్ " అంటూ ఇచ్చింది. అటువైపు నుండి సతీష్ మాట్లాడ లేదు... "హలో చిన్నా! లైన్లో ఉన్నావు కదా? వింటున్నావు కదా ? మాకు చాలా భయమేసింది , అందరూ వచ్చారు, సంగీత పిచ్చి దానిలా ఏడుస్తుంది ." "అలా ఎవరికీ చెప్పకుండా వెళతావా? తప్పు కదూ ! ఏదైనా ఉంటే ఇంట్లో మాట్లాడుకోవాలి అలా పారిపోతారా? నేనెక్కువ మాట్లాడను అందరూ ఉన్నారు, పొద్దున్నే రా" అని ఫోన్ పెట్టి సంగీత దగ్గరకొచ్చింది. "అక్కడున్నాడని తెలిసింది గా పడుకోమ్మా.. " అందరూ ఊపిరి పీల్చుకుని ఎవరిళ్ళకు వారు వెళ్ళి పోయారు.. సంగీత పడుకుందే కానీ నిద్ర పోలేదు, కన్నీళ్ళతో దిండు తడిసి పోతుంది.. కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్య అప్పుడే ఇంత అంతరమా? కోరి వచ్చాననా ? .. చెప్పకుండా వెళ్ళడమేంటి ... దూరం చేసుకోవాలనుకుంటున్నారా ?నేను దగ్గర చేసుకోలేక పోతున్నానా? అసలు ఇంటినుండి చెప్పకుండా వెళ్ళటమేంటి.. అలా రకరకాల జవాబు దొరకని ప్రశ్నలతో ఎప్పుడో తెల్లవారుఝామున నిద్ర పోయింది... ఉదయం లేవగానే మామూలుగా తన పని తను చేసుకుని ఆఫీస్ కి వెళ్ళి పోయింది.. సాయంత్రం 5 గంటలకు ఆఫీస్ కి ఫోన్ వచ్చింది లలిత, సంగీతను వాళ్ళ ఇంటికి రమ్మని పిలుపు. అత్తయ్య, అంటూ ఏదో అనబోతుంటే అమ్మా వాళ్ళు ఇక్కడే ఉన్నారు రమ్మంటున్నారు.. సరే అని అక్కడికే వెళ్ళింది.... అక్కడ సుచరిత,లలిత, చంద్ర శేఖర్ , మోహన్ తో పాటు సతీష్ కూడా ఉన్నాడు.. సంగీతను ఏ ఆంగిల్ లో కూడా సతీష్ చూడలేదు పలకరించలేదు కూడా.. అది గమనించారు అందరూ. సంగీత ఏదోఅడగబోతుంటే తల తిప్పుకున్నాడు. చాలా అవమానంగా feel అయ్యింది సంగీత.. ఇది గమనించి మోహన్ సతీష్ ని బయటకు తీసుకెళ్ళాడు.. వాళ్ళు వెళ్ళగానే కాఫీ టిఫిన్ అయ్యాక సంగీత దగ్గర కూచుని భుజం మీద చెయ్యి వేసింది లలిత.. Tiered గా ఉన్నావు.." పనెక్కువగా ఉందా ?" అని అడుగుతూనే.... "నువ్వు ఉద్యోగం చేయడం వాడికి ఇష్టం లేదా ." "వాడికి చెప్పావా నువ్వు ఉద్యోగం చేయాలను కున్న సంగతి, లేక వాడువద్దన్నా వెళుతున్నావా ?." "ఏం బాధపడకు , కానీ విషయం చెప్పు, ఈ మూడూ ,వాడు నీమీద చేసిన complaints.." "ఇష్టం ఉందో లేదో నాకు చెప్పలేదు చెబితే ఆలోచించే దాన్ని , నన్ను వద్దని అనలేదు.. అసలు మేం మాట్లాడు కున్నదే లేదు.. " "నేనున్నంత సేపు బయటే, ఇంటికి రాగానే నిద్ర.. " "అంతకు మించి మామధ్య ఏంలేదు వదినా... " "ఇక నేను ఉద్యోగం చేసే సంగతి ఏం చెప్పాలి, అందరి ముందే జరిగింది ... " "తనకు నచ్చక పోతే అక్కడే చెప్పొచ్చు ,ఇక్కడ ఇంత రభస చేయాల్సిన అవసరం లేదు. మెల్లిగా అడిగితే ఏం చెప్పేదాన్నో, కానీ ఇప్పుడు మటుకు ఉద్యోగం చేయడం పక్కా , అతని మీద ఆధారపడి ఉంటే నన్ను నేను చంపుకున్నట్టే .. " " తను ఏం చేయరని తెలుసుకున్న తరవాతే నేను చేయడం మొదలు పెట్టాను కదా.. " "అయినా నాలుగు గోడల మధ్య అడిగే విషయాన్ని నలుగురి ముందుకు తెచ్చారు.. " "ఇంట్లోనే చెప్పొచ్చు కదా! నేనంత చెడ్డదాన్నా? వద్దంటే ఊరుకోనా , అయినా తను ఉద్యోగం చేస్తే నేనెందుకు వెళతాను? " "వాడు చేసే ఉద్యోగాలు నీకు నచ్చడం లేదట కదా ! నాకిష్టం లేదు మానేయమన్నావట కదా" "వాడు నాన్నగారు బాధపడతారని చేయలేక మానేయలేక కుమిలి పోయానంటున్నాడు.. " లలిత మాటలకు ఆశ్చర్య పోవడం సంగీత వంతయ్యింది, దుఃఖం పెల్లుబుకుతుంది, ఆ ప్రశ్నలకు ఏమని జవాబిస్తుంది.. ఇన్ని అబద్ధాలా?. "పోనీండి వదినా ! . జరిగింది జరుగుతున్నది తనకు తెలుసు .. నేనెవరికీ సమాధానం ఇచ్చుకోను.. తనడిగితే చెపుతాను.. " ఈలోపు బయటకెళ్ళిన వాళ్ళు వచ్చారు.. బయలుదేరబోతుంటే.. "నువ్వు సతీష్ రేపెళ్ళండి "అన్నది లలిత.. "ప్రదేశాలు మారినంత మాత్రాన ప్రేమలు పెరుగు తాయా వదినా ? మీరేమనుకోవద్దు . సారీ నాకు మీ అందరి మీదా గౌరవమే ఈ సారికి వదిలేయండి. " "నేనింటికి వెళతాను .." అంటూ మెల్లగ చెప్పినా గట్టిగానే చెప్పింది.. చేసేదేం లేక నలుగురూ ఇంటికొచ్చారు.. గదిలో సతీష్ సంగీత కోసం ఎదురు చూస్తున్నాడు. బావగారు సంగీత గురించి చెప్పింది గుర్తు చేసుకుంటున్నాడు.. "చాలా మంచి పిల్ల నీ అద్రుష్టం కొద్దీ దొరికింది దూరం చేసుకోకు "అని .. సంగీత లోపలికి రాగానే దగ్గరకు తీసుకుని సారీ చెప్పాలి అనుకుంటున్నాడు సతీష్.. కానీ....... సంగీత లోపలికి రాగానే అటు తిరిగి పడుకుంది... సతీష్ కూడా బిగుసుకు పోయాడు మాటలు బయటకు రాలేదు తను ఏం అన్నకున్నాడో అది చెప్ప లేక పోయాడు.. సశేషంబాంధవ్యం .. 10 పొద్దున గబ గబా లేచి పనులు చేసుకుంటోంది సంగీత. సుచరిత అడగాలా ,వద్దా అని ఆలోచిస్తున్నది, ఇంతలో చంద్రశేఖర్ గారు వచ్చారు " ఏమ్మా చిన్నబాబు లేచాడా " "లేదు మావయ్య " అని Tea కలిపి తెచ్చి ఇచ్చింది. ఇంతలో సతీష్ కూడా లేచి వచ్చాడు కాఫీ కలిపి టేబుల్ మీద పెట్టింది. సతీష్ గుడికెళ్ళి వచ్చే లోపల వంట కూడా అయ్యింది. ఏమనుకున్నారో అందరూ కలిసి తిన్నారు.. సంగీత ఆఫీస్ కి వెళ్ళి పోయింది.. మళ్ళీ సాయంత్రం వచ్చేసరికిఇల్లంతా ప్రశాంతంగా ఉంది.సతీష్ కూడా ఇంట్లో నే ఉన్నాడు. "వంట పని నేను చూసుకుంటాను కానీ మీ ఇద్దరూ అలా బయటకు వెళ్ళి రండి" అంది సుచరిత . "ఫరవా లేదత్తయ్య నాకు ఓపిక లేదు . ఎక్కడికి వెళ్ళాలని లేదు " " అలా కాదులే వెళ్ళిరండి , అది మీ మావయ్య కోరిక కూడా .." ఇంక మాట్లాడకుండా రెడీ అయి వచ్చింది.. ఇద్దరూ కలిసి గుడికెళ్ళారు.. పక్క పక్కన నడుస్తూనే ప్రదక్షిణాలు చేసారు. ప్రసాదం తీసుకుని అక్కడ పక్కనే ఉన్న అరుగు మీద కూచున్నారు .. సంగీత మాట్లాడాలనీ, అడిగితే చెబుదామని సతీష్ , అలా ఎందుకువెళ్ళాడో , ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో తనే చెబుతాడని సంగీత, ఇద్దరూ మనసులోనే అనుకుంటున్నారు. కానీ ,మాట్లాడకుండా కూచుని సీరియస్ గా ప్రసాదం తింటున్నారు... ఇంతలో వారి ముందు ఒక మధ్య వయసు జంట వచ్చి కూచున్నారు.. "సారీ విజయా ! నేను First టైం నీ దగ్గర విషయం దాచాను నేనే ముందు చెప్పాల్సింది చాలా గిల్టీగా ఉంది.." అన్న భర్తతో "ఫరవాలేదండి నేనేం ఫీలవటం లేదు , అప్పుడప్పుడూ అలా అవుతుంది.. మన మధ్య నమ్మకం ముఖ్యం , మీమీద నాకా నమ్మకం ఉంది " అని భార్య అనడం ..సతీష్ , సంగీత ఇద్దరూ విన్నారు.. వెంటనే లేచి "కాఫీ తాగుదామా?" అన్న సతీష్ తో "ఊ "అంటూ బయటకు దారి తీస్తున్న సతీష్ అడుగులో అడుగు వేస్తూ నడిచింది సంగీత. కాఫీ తాగుతూ సతీష్ అన్న మాటలకు ఒక్క సారిగా ఉలికి పడింది సంగీత... "ఏంటి, ఏం మాట్లాడుతున్నారు , ఇది చెప్పడానికా మీరు ఇక్కడికి తీసుకొచ్చారు? " "నేనీ మానసిక సంఘర్షణ భరించ లేకపోతున్నాను సంగీతా, నా వల్ల కావడం లేదు. నేను మంచి వాణ్ణి అవునో, కాదో నాకు తెలీదు కానీ నువ్వు నాతో సుఖపడలేవు, ప్లీజ్ విడాకులు తీసుకుని వేరే పెళ్ళి చేసుకో " అంటున్న సతీష్ చంటిపిల్లాడిలా కనిపించాడు సంగీతకు . "నెమ్మదిగా అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని విడాకులు తీసుకోవడానికా మనం పెళ్ళి చేసుకున్నది , మీకెందుకా ఆలోచన వచ్చింది.. " "భయం " అన్నాడు "భయమా ? ఎందుకు? " "తెలీదు నిన్ను చూస్తే గాభరాగా ఉంటుంది. ఉక్కిరిబిక్కిరి అవుతాను "అంటున్న సతీష్ ని ఆశ్చర్యంగా చూసింది. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని స్థితిలో మౌనంగా ఉండి పోయింది.. కాసేపయ్యాక తనే "ఇంటికెళదమా? ఇంట్లో మాట్లాడుకుందాం ఇక్కడ బాగుండదేమో " అంటూ లేచింది.. ఇంటి కొస్తున్నంత సేపు ఇద్దరూ ఆటోలో ఒక్క మాట కూడా మాట్లాడకోలేదు . విషయం తెలిస్తే కానీ తను అతనికి ధైర్యం చెప్పలేదు , నమ్మకం కలిగించ లేదు. అందుకు తగిన చోటూ, సమయం కూడా ఇది కాదు.. అనుకుంది ఇంటికి రాగానే తన ముఖంలోకి పరీక్షగా చూస్తున్న అత్తయ్యతో నవ్వుతూ అంతా OK అన్నట్టుగా తలూపి భోజన ఏర్పాట్లు చేసింది. భోజనాలయ్యాక సుచరిత గారు వారికి ఏకాంతం కల్పించాలని గబ గబా వారి గదిలోకి వెళ్ళి పోయారు. సతీష్ తన మనసులో మాట చెప్పడానికి భయపడ్డా చెప్పాక మనసు తేలిక పడి అతను కూడా తన గదిలోకి వెళ్ళాడు.. ఇక మిగిలింది సంగీత... వంట ఇల్లు సర్దుతున్నా మనసులో అగ్ని గుండం బద్దలవుతున్నది .. ఎందుకు నన్ను చూస్తే అతనికి గాభరా. విషయం తెలీకుండా నేనెలా అది పోగొట్ట గలను అంటూ గదిలోకి వెళ్ళింది.. పక్కన పడుకున్న అతన్ని అడగాలని శత విధాలా ప్రయత్నిస్తున్నది కానీ ఎలా మొదలు పెట్టాలో తెలియడంలేదు. అలా అని ఇప్పుడు అడగకపోతే ఇంకెప్పుడూ అడగలేదు , అడిగినా వ్రుధా. తనే ధైర్యం చేసింది.. "పడుకున్నారా? అని అడిగింది. "లేదు " "మనం ఇప్పుడు ఇక్కడ కాసేపు మనసు విప్పి మాట్లాడుకుందామా? " అని అంటూనే "చెప్పండి! నేనంటే ఎందుకంత గాభరా? నేను ఏమన్నా తప్పుగా ప్రవర్తిస్తున్నానా " అంటూ లేచి కూచుని అడిగింది. "లేదు లేదు " అంటూ చెప్పడానికి తటపటాయిస్తున్న అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది.. "ఫరవాలేదు చెప్పండి ! నేనేం అనుకోను , మీ సందేహాలు అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత నాది .చెప్పండి ! అనడిగింది. సతీష్ మెల్లగా చెప్పడం మొదలు పెట్టాడు.. "నువ్వు నాకంటే ఎక్కువ చదువు కున్నావు , తెలివి గలదానివి మరి నన్ను ఎందుకు పెళ్ళి చేసుకున్నావు? చేసుకున్నావు సరే, మరి ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు.?" "నా మీద పెత్తనం చెలాయించడానికీ, నన్ను అవమానించడానికే కదా.. రేపెప్పుడైనా ఆఫీస్ లో నీ కెవరైనా నచ్చితే వాళ్ళతో వెళిపోతావు కదా.. మరి అదేదో ఇప్పుడే వెళ్ళిపోవచ్చుకదా" అంటున్న సతీష్ లో జనంలో తప్పిపోతానేమో అని భయపడుతూ ఇంట్లో కూచునే పిల్లాడు కనిపించాడు. "ఇవన్నీ మీకెవరు చెప్పారు .. పెళ్ళి అనేది ఒక్కసారి ఒకరితో మాత్రమే జరుగుతుంది, చేసుకునే ముందే ఆలోచించి చేసుకోవాలి తరువాత అది విడదీయరాని బంధంగా మారుతుంది అంతే కాని మన ఇష్టం వచ్చినప్పుడు వదిలేసేది కాదు". "నాకు మీరు నచ్చారు, జాతకాలు కలిసాయి, పెద్ద వాళ్ళు అంగీకరించారు. ఇక ఉద్యోగం అంటారా? మన ఇల్లు గడవాలంటే ఎవరో ఒకరు సంపాదించాలి కదా.. అందుకని చేయక తప్పదు.. ఇక ఆడదాని మనసు అంత బలహీనం కాదు. చీర మార్చుకున్నంత ఈజీగా భర్తలను మార్చదు". "నేను సాంప్రదాయాలకు విలువనిస్తాను, భగవంతుడిని నమ్ముతాను, అమ్మ నేర్పిన నైతిక విలువలను పాటిస్తాను ,అందుకని మీభయాలన్నీ వదిలేయండి. మీరు నా భర్త నాజీవితంలో ఇంకొకరు రారు , వేరే వారితో మాట్లాడినంత మాత్రాన వారితో వెళ్ళిపోను, నా పాతివ్రత్యానికేం భంగం వాటిల్లదు" అంటూ భర్త వైపు చూసింది. అతను తన మాటలు వింటూ ఎప్పుడు తన ఒడిలో పడుకున్నాడో తెలీలేదు.. అతని తల నిమురుతూ భయం కాదు మన మధ్య ఉండాల్సింది ప్రేమ, నమ్మకం అని అతని లోని భయం పోగొట్టాలి , మరీ ఇంత పసివాడి మనస్తత్వమా? ఇవి ఇతని ఆలోచనాలా లేక వేరే ఎవరివోనా అని అతని చేయి పట్టుకుని అలాగే ఆలోచిస్తూ ఉండి పోయింది .
No comments:
Post a Comment