అసలైన ప్రేమ- భక్తి



శ్రీకృష్ణుని ప్రియమిత్రుడైన అర్జునుని హృదయంలో ఒకసారి అహంకారం జనించింది. శ్రీకృష్ణుని భక్తులలో తనకు సాటి ఎవ్వరూ లేరనుకున్నాడు. అంతా తెలిసిన శ్రీకృష్ణుడు అర్జునుడి మనసులోని విషయాన్ని కనిపెట్టాడు. ఒకరోజు అర్జునుడిని తనతో వ్యాహ్యాళికి తీసుకువెళ్లాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత వారికి ఒక బ్రాహ్మణుడు ఎండుగడ్డి తింటూ కనిపించాడు. నడుముకు ఒక కత్తి వేలాడుతోంది. అర్జునుడు అతడు గొప్ప కృష్ణభక్తుడని గ్రహించాడు. అటువంటి భక్తులు ఎవరికీ హాని తలపెట్టరు. కనుకనే పచ్చిగడ్డిలో జీవం ఉంటుందన్న భావంతో ఎండుగడ్డిని మాత్రమే తింటున్నాడు. మరి అతని దగ్గర హింసకు ప్రతీక అయిన కత్తి ఎందుకు ఉన్నట్టు?
ఈ విషయం అర్థంకాక అర్జునుడు శ్రీకృష్ణుడితో, ‘‘ఏమిటిది? ఇతణ్ణి చూస్తే గడ్డిపోచకు కూడా హాని తలపెట్టనివాడిలాగ ఉన్నాడు. అయినా అతని దగ్గర హింసను, చావును సూచించే కత్తి ఉంది దేనికి?’’ అని అడిగాడు. 
శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ‘‘నీవే వెళ్లి అతడిని అడిగితే బాగుంటుంది!’’అని చెప్పాడు. అర్జునుడు ఆ బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్లి, ‘‘అయ్యా! మీరు ఎవ్వరినీ హింసించరు. ఎండుగడ్డి తిని కాలం గడుపుతున్నారు. మరి ఈ పదునైన కత్తితో మీకేం పని?’’ అని ప్రశ్నించాడు. 

బ్రాహ్మణుడు: నలుగురు మనుషులు ఉన్నారు. ఎక్కడైనా ఎదురైతే వాళ్లకి బుద్ధి చెప్పాలని ఈ కత్తి తీసుకుని తిరుగుతున్నాను. 

అర్జునుడు: ఎవరు వాళ్లు?

బ్రాహ్మణుడు: ఆ నీచుడు, నారదుడు... వాళ్లలో మొదటివాడు!

అర్జునుడు: ఆయన ఏం చేశాడు?

బ్రాహ్మణుడు: ఎప్పుడూ పాటలతో, సంగీతంతో నా స్వామికి నిద్ర లేకుండా చేస్తుంటాడు. పగలు, రాత్రి అని తేడా లేకుండా తన ప్రార్థనలతో, స్తోత్రాలతో నా స్వామిని విశ్రాంతి లేకుండా విసిగిస్తుంటాడు.’’

అర్జునుడు: మరి రెండవ వ్యక్తి ఎవరు?

బ్రాహ్మణుడు: ఆ తెలివితక్కువ ద్రౌపది.

అర్జునుడు: ఆమె ఏం తప్పు చేసింది?

బ్రాహ్మణుడు: ఆమె చేసిన దిక్కుమాలిన పని చూడండి! నా స్వామి సరిగ్గా భోజనానికి కూర్చునే సమయానికే ఆమె ప్రార్థన చేసి పిలిచింది. నా స్వామి తన భోజనం మానుకుని కామ్యకవనానికి వెళ్లి దుర్వాసుడి శాపం నుండి ఆ పాండవులను రక్షించవలసి వచ్చింది. పైగా అందుకోసం నా స్వామికి తాను తిని వదిలేసిన ఎంగిలి మెతుకులను తినిపించింది. 

అర్జునుడు: మరి ఆ మూడవ వ్యక్తి ఎవరు?

బ్రాహ్మణుడు: ప్రహ్లాదుడు. వాడికి హృదయం లేదు. వాడు ఎంత క్రూరుడంటే నా స్వామిని మరుగుతున్న నూనెలో వేయించాడు. ఏనుగుల చేత తొక్కించాడు. దుర్భేద్యమైన రాతిస్తంభాన్ని పగులగొట్టుకుని బయటకు వచ్చేలా చేశాడు.

అర్జునుడు: నాలుగవ వ్యక్తి ఎవరు?

బ్రాహ్మణుడు: ఆ దౌర్భాగ్యుడు, అర్జునుడు!

అర్జునుడు: ఏం! అతడు ఏ తప్పు చేశాడు?

బ్రాహ్మణుడు: వాడు ఎంత దుర్మార్గుడో చూడండి. కురుక్షేత్రసంగ్రామంలో నా స్వామిని తన రథసారథిగా చేసుకున్నాడు. అంతకన్నా నీచమైన పని మరొకటి ఉందా?

అర్జునుడు ఆ బ్రాహ్మణుడి మాటలకు నిర్ఘాంతపోయాడు. ఆ బ్రాహ్మణుడి భక్తి, ప్రేమ ఎంత గాఢమైనవో చూసి విస్మయం చెందాడు. అతడి గర్వం అణగారిపోయింది. శ్రీకృష్ణుడి భక్తులలో తానే గొప్పవాణ్ణి అనుకునే అహంకారాన్ని వదిలిపెట్టాడు.

(శ్రీరామకృష్ణ పరమహంస చెప్పిన గూఢార్థ కథల నుంచి) 

శ్రీవారికిచ్చే హారతి కోసం ఆలయంలో రోజుకు ఆరుకిలోల హారతి కర్పూరం వినియోగిస్తారు.

=స్వామి వారికి వెన్న నివేదన తరువాత ఇచ్చే హారతిని నవనీత హారతి అని పిలుస్తారు.

=స్వామి వారి దీపారాధన కోసం ఆవునెయ్యి, నువ్వులనూనె 50 కిలోల వరకు ఉపయోగిస్తారు.

=తిరుమలకొండపై కొబ్బరికాయలు కొట్టే స్థలాన్ని అఖిలాండం అంటారు.

No comments: