బాంధవ్యం... 11
అసలు ఎలా అర్థం చేసుకోవాలి ఈ మగవాళ్ళని, భార్యలు ఎలాఉండాలని కోరుకుంటారు .. పెళ్ళి కానంత సేపు ఎవరైనా ఫరవాలేదు పెళ్ళి అయ్యాక మటుకు తాము కోరుకున్న విధంగానే ఉండాలా? ఆడపిల్లలకు కోరికలుండకూడదు కలలు కనకూడదు. అన్నింటికీ సర్దుకుపోయి చేసుకున్నా ఇంకా మామీదే తప్పులు వేస్తే ఎలా? చదువుకోవడం కూడా తప్పేనా? చదువుకుని ఏం చేసాను వాళ్ళ మీద పెత్తనం చలాయిస్తున్నానా, నా బాధ్యతను నేను నిర్వర్తించాలను కుంటున్నాను అంతేగా .. అది కూడా తను చేయనంటేనే కదా ! అంత భయమైతే ఉద్యోగంలో చేరక ముందే చెప్పాలికదా, చేరాక అనుమానాలు లేని పోని సందేహాలు ఏంటో , ఈ మనిషిని మార్చ గలనా అనుకుంటూ నిద్రలోకి జారుకుంది... పొద్దున్నే యధావిధిగా పనులు .. సంగీతను టెన్షన్ పెట్టిన సతీష్ మటుకు చాలా ఉత్సాహంగా ఉన్నాడు..పొద్దున్న సంగీతతో బస్టాపుదాకా తోడు వెళ్ళి వచ్చాడు ... సాయంత్రం మళ్ళీ బస్టాపులో సంగీత కోసం ఎదురు చూసి సంగీత రాగానే . "పద ! హోటల్ కెళ్ళి కాఫీ తాగుదాం" అన్నాడు సంగీత ఏం మాట్లాడకుండా అతన్ని అనుసరించింది.. ఏదో తనతో ఈ కాస్తయినా మాట్లాడుతున్నాడు సంతోషం... మనిషి దగ్గరయితే మనసు తెలుసుకోవచ్చుకదూ అసలే నామీద అపనమ్మకంతో ఉన్నాడు అని మాట్లాడకుండా వచ్చింది. అత్తయ్య కు జవాబు చెప్పుకోవచ్చు కానీ రానంటే ఈయన కెన్ని సంజాయిషీలు చెప్పు కోవాలో.... అనుకుంటూ కుర్చీలో కూచుంది. "ఏమైనా తింటావా." "ఊహూ కాఫీ చాలు.. " "అమ్మ ఏమైనా అనుకుంటుందనా అమ్మకు నేను చెబుతాలే.. " "అలా అని కాదు కాఫీ చాలు "అన్నది . ఇద్దరు కలిసి ఇంటికి రావడాన్ని చూసిన సుచరిత కళ్ళు ఆనందంతో మెరిసాయి.. ఏం అడగకుండానే అర్థం చేసుకుంది .. రాత్రి భర్త కు ఆనందంగా చెప్పింది .... సతీష్ సంగీతతో చనువుగా ఉండటాన్ని.. వారం రోజులు సతీష్ సంగీతను ఆఫీస్ లో దింపడం, తీసుకురావడం మధ్యలో కాఫీతాగడం అలా గడిచింది.. ఒక ఆదివారం అందరం సినిమా కెళదాం అన్న సతీష్ తో మేమెందుకులే బాబు మీరు వెళ్ళండి అన్నారు పెద్ద వాళ్ళు. వీరిద్దరు సినిమా నుండి వచ్చేసరికి ఇంట్లో లలితా ఆమెభర్త మోహన్ ఉన్నారు .. అందరూ కలిసి భోంచేస్తున్నప్పుడు సుచరితగారు మెల్లగా చెప్పారు. "మేం కొన్నాళ్ళు మన ఊరి కెళతాం" అని .. సతీష్ సంగీత ఒక్కసారే "అదేంటి ఇంత సడన్ గా" అన్నారు " ఎప్పుడో అనుకున్నాం మీ సంసారం గాడిన పడింది , కొన్నాళ్ళు మేం కూడా ఒంటరిగా ఉండి విశ్రాంతి తీసుకోవాలని నేనూ , మీ నాన్న గారు అనుకుంటున్నాం" "మళ్ళీ తొందరగా వస్తాంలే ! అక్కా,అన్నయ్యా ఉన్నారు కదా! వాళ్ళు చూస్తుంటారు లే" అన్నది ఇంక ఆ మాటకు తిరుగు లేదు అని మిన్నకుండి పోయారు... అంతకు ముందు లలితరాగానే సుచరిత కూతురితో సంతోషంగా చెప్పుకుంది. "వాళ్ళిద్దరూ చాలా సంతోషం గా ఉంటున్నారు. మేం కొన్ని రోజులు దూరంగా ఉంటే ఇంకా దగ్గరవుతారేమో ,అందుకే నాన్నగారు , నేను ఊరు వెళ్ళాలనే నిర్ణయం తీసుకున్నాం. అని రెండు రోజుల తరవాత సుచరిత గారు వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు ... ఆరోజు వెలితిగా అనిపించినా చిత్రంగా సతీష్ ఒంటరిగా ఫీల్ అవ్వ లేదు,సంగీతకు మరింత దగ్గరయ్యాడు. .. వంటలో సాయం చేస్తూ, బయట పనులను కూడా చక్కబెడుతూ ఇంటి పట్టునే ఉంటున్నాడు.. రోజులు ఆనందంగా గడిచి పోతున్నాయి. సంగీత కూడా రెట్టించిన ఉత్సాహంతో ఇంట్లో ఆఫీస్ లో పనులు చక చకా చేసేస్తున్నది.. ఆదివారాలు కూడా సతీష్ తామిద్దరు కలిసి ఉండడానికే ఇష్టపడపతున్నాడు.. ఒక రోజు సంగీత ఆఫీస్ నుండి ఇంటికి చాలా డల్ గా వచ్చింది అన్నం తినకుండానే పడుకుంది మరునాడు కూడా లేవలేదు జ్వరమేమో అనుకున్నాడు .. డాక్టర్ దగ్గర కెళదాం అని అనేంతలో రెండు మూడు వాంతులు చేసుకుంది, భయపడి అక్కయ్యకు ఫోన్ చేసాడు. లలిత పరుగున వచ్చి తనకు చెల్లి వరుసయ్యే డాక్టరు దగ్గరకు తీసుకెళ్ళింది.. ఆమె అనుమానం నిజమయ్యింది. సతీష్ ఆనందపడ్డాడు .. లలిత ఇంటి కొచ్చాక అందరికీ ఫోన్ చేసి సంగీత తల్లి కాబోతున్న సంగతి చెప్పింది .. అందరూ ఎంతో సంతోషపడ్డారు. కానీ సంగీతమాత్రం ఆలోచనలో పడి పోయింది.. సశేషం..బాంధవ్యం.... 12 "పిల్లలు కావాలని ఎవరికుండదు, పిల్లలు పుడుతున్నారంటే సంతోషమే కదా.. కానీ తన బాధ్యతను ఇతరుల మీదకి తోసే ఈయన పిల్లల బాధ్యత తీసుకుంటారా? మరి నేను చంటిపిల్లను వదిలి ఉద్యోగానికి వెళ్ళగలనా.. బాబోయ్ ఇప్పుడివన్నీ ఆలోచించలేను " అంటూ పడుకునే ప్రయత్నం చేసింది... అలసట వల్లేమో సంగీత కాస్త ఆలశ్యం గా లేచింది, అప్పటికే సతీష్ టిఫిన్ చేసి వంట ప్రయత్నంలో ఉన్నాడు. సంగీతను చూసి " రా రా !హార్లిక్స్ తాగు, అక్క నువ్వు కాఫీ తాగొద్దని చెప్పింది". సంగీతకు పాలంటే ఇష్టమే అందుకే మారు మాట్లాడకుండా తాగింది.. బాధ్యతగా వంట అది చేస్తుంటే ఫరవాలేదు పిల్లలు పుట్టాక ఆటోమాటిక్ గా బాధ్యత తెలుస్తుందేమో అనుకుని కాస్త సంబర పడింది.. ఆఫీస్ కి రాగానే అమ్మకు ఫోన్ చేసింది. .. అనురాధగారు సంబరపడ్డారు . బామ్మగారు ఫోన్ తీసుకుని సంగీత తీసుకోవలసిన జాగర్తలు , ఎప్పుడెప్పుడు ఏం తినాలో లిస్ట్ చెబుతూ రాసుకోమంటున్నారు. "అమ్మాయ్ అసలివన్నీ ఎందుకు గానీ ఇక్కడి కొచ్చి నాలుగు రోజులుండి వెళ్ళు, లేత నెలలు, వేవిళ్ళు, నువ్వు వండుకుని తినలేవు అని చెబుతూనే "మీ నాన్నగారు సతీష్ కి ఫోన్ చేసి అడుగు తారు .". అని ఫోన్ పెట్టేశారు ... సాయంత్రం సతీష్ సంగీతను తీసుకు రావడానికి రాలేదు ఇంటి కొచ్చే సరికి డల్ గా కూచున్నాడు... ఏం జరిగిందో అని గాభరా పడింది.. "ఏంటండి ఏం జరిగింది " "మీ నాన్నగారు ఫోన్ చేసారు నిన్ను అక్కడికి పంపించమని వెళతావా" "వెళ్ళనా ?వద్దా ? మీరు వద్దంటే వెళ్ళను " "వద్దు నేనొక్కడినే ఉండలేను నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అంటున్న సతీష్ ని దగ్గరకు తీసుకుని, " వెళ్ళనండి" అన్నది . "నాన్న గారికి నేను చెబుతాను లెండి " అంటూ లోపలికెళ్ళింది.. ''నో , నేనిప్పుడు తనని విడిచి ఎక్కడికీ వెళ్ళకూడదు, ఇప్పుడిప్పుడే ఆయన నాతో ఉండడానికి ఇష్టపడుతున్నారు , నా సమక్షంలో సంతోషంగా ఉంటున్నారు. అంతే కాదు తనకు ఇప్పుడిప్పుడే నామీద నమ్మకం కలుగుతున్నది '' 'నేను సంపూర్ణంగా తనదాన్ననే అవగాహన ఇంకా రావాలి .. అప్పటి దాకా తనని ఒంటరిగా వదలకూడదని' నిశ్చయించుకుంది.. కానీ తానొకటి తలుస్తే దైవం ఒకటి తలిచాడు. కొద్ది కొద్దిగా మొదలైన బ్లీడింగ్ ని సంగీత కాస్త అశ్రద్ధ చేసింది . ఆగక పోయేటప్పటికి వాళ్ళ అమ్మకు చెప్పింది అనురాధ సంగీతను తీసుకుని లలితతో కలిసి డాక్టర్ దగ్గరకెళ్ళారు .. డాక్టర్ బెడ్ రెస్ట్ అవసరమని మందులు రాసిచ్చి పది రోజుల తరువాత రమ్మన్నారు.. సతీష్ ను ద్రుష్టిలో పెట్టుకుని లలిత తన దగ్గరకు తీసుకెళతానంది.. కానీ అనూరాధ మాఇంటికి తీసుకెళతానని పట్టుపట్టడంతో పంపించక తప్పలేదు .. సంగీత కోరిక మేర అనూరాధ సతీష్ ని కూడా రమ్మన్నా ' ఫరవాలేదు ' అని లలిత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది.. సతీష్ ఆ రాత్రి చాలా ఒంటరిగా ఫీల్ అయ్యాడు. పెళ్ళి కానప్పుడు ఎలా ఉన్నా పెళ్ళయ్యాక ఉండ లేనని అర్థం అయ్యింది.. రెండు రోజులు గడిచాయి.. ఆరోజే ఊరినుండి వచ్చిన హరీష్ లలిత ద్వారా విషయం తెలుసుకుని సతీష్ కి ఫోన్ చేసాడు .. రోజూ అక్క దగ్గర తినడం అక్కడే ఉండడం బాగుండదు. ఇక్కడికి వచ్చెయ్ ఇవాల్టి నుండి ఇక్కడే ఉండు అని ఆర్డర్ లా చెప్పి ఫోన్ పెట్టేసాడు.. సంగీతకు ఫోన్ చేసి విషయం చెప్పి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు సతీష్ వెళ్ళేటప్పటికి హరీష్ ఇంట్లోనే ఉన్నాడు .. సతీష్ రాగానే ఇద్దరికీ భోజనం వడ్డిస్తూ జ్యోతి " మీరు లేకపోతే వీరెవరూ మనింటికి రారండి అసలు నేనున్నాను అన్న విషయమే గుర్తుండదు.. పెళ్ళయ్యాక సతీష్ చాలా పెద్ద వాడయ్యాడు మనం గుర్తు రానంతగా మారి పోయాడు వదిన చేతి వంట తినాలని ఆరాట పడే సతీష్ కాదు ఇప్పడు... . " "అయినా సతీష్ నీకిష్టమని చామదుంప వేపుడు పాలకూర ముద్దకూర పచ్చి పులుసు చేసాను " "అయ్యో వదినా! అలాంటిదేం లేదు. అమ్మ నాన్న లేరు కదా సంగీత ఒక్కతే ఉంటుందని ఎక్కడికీ వెళ్ళటంలేదు అంతే.. అయినా ఎంత దూరంలో ఉన్నాను ఒక ఫోన్ కాల్ చేస్తే రానా.. " "ఓహో ఫోన్ చేస్తే కానీ రావన్న మాట అందుకే మీ అన్నయ్యతో చేయించాను ఏం ఇబ్బంది పడతున్నావో అని " " సరే వాణ్ణి భోజనం చేయనీ " సతీష్ భోంచేసాక నువ్వొకసారి GPO కెళ్ళి రావాలి అని లేచాడు హరీష్.. ............................................................... సతీష్ ఫోన్ చేసినప్పటినుండి సంగీతకు లోపల ఏదో తెలియని భయం మొదలయ్యింది.. ఇది అని చెప్పలేదు. ఏమిటో గాభరా... ఆపూట అన్నం కూడా సహించలేదు.. పైగా సన్నగా కడుపులో నొప్పి మొదలయ్యింది.. బాంధవ్యం.... 13 సాయంత్రం వరకూ ఓపిక పట్టింది .. ఇక సంగీత వల్ల కాలేదు మెల్లగా వాళ్ళ అమ్మకు చెప్పింది.... బామ్మ ఏవో చిట్కా వైద్యం చేసినా తగ్గక లాభం లేదని లలితకు ఫోన్ చేసి డాక్టర్ దగ్గరకెళ్ళారు.. లలిత , మోహన్ ఇద్దరూ వచ్చారు.. సంగీతను చెక్ చేసి బయటకొచ్చిన డాక్టర్ పద్మ మొహం కాస్త సీరియస్ గానే ఉంది.. "ఏమైంది పద్మ " అంతా OK నే కదా.. "లేదక్కాకొంచం ప్రాబ్లం గానే కనబడుతుంది.... చాలా టెన్షన్ పడతున్నట్టుంది, ఇలాగే ఉంటే అబార్షన్ అయ్యే ఛాన్సెెస్ ఎక్కువగా ఉన్నాయి. బెడ్ రెస్ట్ చాలా అవసరం ... at the same time No tensions.. మందులు అవే కంటిన్యూ చేయండి అని చెప్పింది.. లలిత చెప్పిందేమో సాయంత్రం సతీష్ వచ్చాడు.. " జాగ్రత్త సంగీతా! తొందరగా తగ్గించుకుని ఇంటికిరా నువ్వు లేకపోతే నాకేం బాగు లేదు.. " "అలాగే మీరెలా ఉన్నారు"... "బాగానే ఉన్నాను అన్నయ్య అక్కడే ఉండమన్నాడు నువ్వు వచ్చే దాకా అక్కడే .. మరి తొందరగా వచ్చెయ్యి" అన్నాడు.. "భోంచేసి వెళ్ళమన్నా వదిన ఎదురు చూస్తుందని వెళ్ళిపోయాడు... " మరునాడు సంగీత శ్రీధర్ కి ఫోన్ చేసి చెప్పింది కొన్ని రోజులు ఆఫీస్ కి వెళ్ళలేనని వాళ్ళకు inform చేయమని .. చూస్తుండగానే ఒక నెల గడిచింది సంగీత ఆరోగ్యం కాస్త కుదుట పడింది.. ఇంక ఇంటికి వెళతానని గొడవ చేస్తే మంచి రోజు చూసి హరిహర్రావుగారు వాళ్ళింట్లో దింపి వచ్చారు.. ఆ రోజు అనురాధ గారు పంపించిన వాటితో భోజనం కానిచ్చేసారు. తెల్లవారి సతీష్ బద్ధకంగానే లేచాడు వదిన చేసిపెడితే తిని హాయిగా ఉన్న ప్రాణాన్ని తీసుకొచ్చి కష్టాల్లో పడేసినట్టు ఫీల్ అవ్వసాగాడు.. సుచరిత గారికి ఫోన్ చేసాడు రమ్మని.. కానీ తండ్రికి ఒంట్లో బాగా లేదని ప్రయాణం చేసే స్థితిలో లేరని వీలు చూసుకుని వస్తామని చెప్పారు.. వారం రోజులు Office కి వెళ్ళిన సంధ్య ఇంక ఓపిక లేక వెళ్ళలేక పోయింది.. ఫరవాలేదమ్మా! ఆరోగ్యం జాగ్రత్త , నీ ఉద్యోగం ఎక్కడికీ పోదు వీలుచూసుకుని రా అంటూ ఆ నెల జీతం ఇచ్చి పంపించారు.. కావలసిన సరకులతో పాటు అందరికీ అన్నీ ఇచ్చి మిగతా వాటితో మందులు తెమ్మని చెప్పింది సంగీత.. ఆ మిగిలిన డబ్బులతో వారం రోజుల మందులు కూడా పూర్తిగా రాలేదు.. వారం తరువాత ఎలాగ? అదే అడిగింది సంగీత సతీష్ ని.. "ఏం చేద్దాం.. " అని "మొదటి డెలివరీ ఖర్చు మీ అమ్మా వాళ్ళదట కదా మరి వాళ్ళు మందులు కొనరా... " "అలా అని ఎవరు చెప్పారు " "వదిన చెప్పింది నువ్వు ఇంటికొస్తే ఎలాగ అని అడిగితే అంతా వాళ్ళమ్మా వాళ్ళు చూసుకుంటారు అని" నవ్వాలో, ఏడవాలో కూడా తెలీలేదు సంగీతకు కోపం , బాధ , ఉక్రోషం అన్నీ ఒక్కసారే వచ్చాయి.. ఆహా! ఏం మనిషి సుఖం, ఆనందం మాత్రమే తనవి అంత వరకే తన బాధ్యత ,మిగతా విషయాలు అమ్మా వాళ్ళవా? అస్సలడగను ఎలా అవుతే అలా అవుతుంది అని ఊరుకుంది .. మెల్ల మెల్లగా ఇంటిలో అన్నీ నిండు కుంటున్నాయి , ఉన్న దాంతోనే వండిపెడుతుంది.. మందుల మాటే లేదు అవెప్పుడో అయిపోయాయి. కట్టుకున్నవాడికే లేనప్పుడు ఇంక ఎవరికేం చెబుతుంది... అలా రోజులు గడుస్తున్నాయి .. మధ్య మధ్య అనురాధ గారు లలిత వనిత వచ్చి చూసి వెళుతున్నారు.. వచ్చినప్పుడు వారు తెచ్చే వాటితో రోజులు వెళ్ళ తీస్తున్నది... ఆ రోజు కాఫీ పొడి లేక కాఫీ కూడా చేయలేదని ఇష్టం వచ్చినట్టు అరిచి బయటకు వెళ్ళి పోయాడు.. సంగీత ఆలోచనలో పడింది ఏంటి ఈ మనిషి , ఇంటి బాధ్యతలు తెలీవా? లేక తీసుకోడా.. తండ్రి కావడం అంటే అదొక పదవి అనుకుంటున్నాడు , కానీ తండ్రి గా , భర్తగా తన బాధ్యత కూడా ఉందని అనుకోవడం లేదేం.. సాయంత్రం బయటకెళ్ళి కొన్ని సరుకులు పట్టు కొచ్చాడు, ఎవరిచ్చారు అని అడిగినా జవాబు శూన్యం.. తరువాత ఇంటికి వచ్చిన లలిత సంగీతకు చెప్పింది "నాన్నగారు ఇవ్వ మన్నారని ఇప్పుడు నేనిచ్చాను ..." "ఇక నుండి డబ్బులు నాన్నగారు పంపిస్తారు నువ్వేం దిగులు పడకు హాయిగా మందులు వేసుకుని రోజూ పాలు తాగుతూ ప్రశాంతంగా ఉండు . ఇంకా ఏమన్నా కావాలంటే నాకు ఫోన్ చెయ్యి అని చెప్పి వెళ్ళి పోయింది " "హూ !ఎక్కడి ప్రశాంతత... ఏకాస్తో మిగిలింది కూడా పోయింది, జీవితం అంతా ఇలాగేనా ఇలా సిగ్గు లజ్జ లేకుండా అందరినీ అడిగి తీసుకేవడమేనా?ఉద్యోగం చేసి సంపాదించాలన్న ఆలోచన రాదా? ఆధ్యాస లేదా? "" "నేను తప్పుచేసానా ?కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందా? భగవంతుడా ! అన్నీ ఉండి ఈ అడుక్కు తినే బతుకేంటి " అని సంగీత ఆ రోజంతా ఏడుస్తూనే ఉంది .... కాలింగ్ బెల్ మోగితే వెళ్ళి తలుపు తీసింది, సతీష్ సంగీత అడక్కుండానే "అన్నయ్య ఏదో పని చెప్పాడు అక్కడ లేటయ్యింది వదిన అక్కడే తినమన్నది తినేసి వచ్చాను" ఇంక దానికి జవాబేముంది.. కడుపుతో ఉన్న పెళ్ళాం తిన్నదా ?లేదా ?అని కూడా పట్టించుకోని మనిషి , ఇక ముందు ఏదో చేస్తాడను కోవడం పొరపాటే అనుకుంటూ సంగీత నిద్ర పోయే ప్రయత్నం చేసింది సశేషంబాంధవ్యం..... 14 సంగీత నెమ్మదిగా సతీష్ ప్రవర్తనకు అలవాటు పడ సాగింది. అతను దుర్మార్గుడు కాదు భయస్తుడు మాత్రమే. కొంతమంది మంది దగ్గర మాత్రమే అతను Open అవుతాడు . Secured గా feel అవుతాడు. వారెవరంటే ఆయన అక్క, బావగారు, వదిన. అన్నయ్యంటే ప్రేమే కానీ గౌరవంతో కూడిన భయం కూడా ఉంది, హరీష్ కుండే నిక్కచ్చితనం వల్ల అన్నయ్య ముందు ఎక్కువగా మాట్లాడడు .. వదిన మాటకారితనం, ప్రేమగా మాట్లాడడం చనువుగా ఉండడమే కాకుండా ప్రతీదీ అడిగి తెలుసుకునే మనస్తత్వం వల్ల ఆమె ఏమడిగినా అందరూ అన్నీ చెప్పేస్తారు.. ఇన్నాళ్ళ సావాసంలో అదే తెలుసుకోగలిగింది.. ఒక రోజు అనురాధ మంజుల కలిసి సంగీత దగ్గరకు వచ్చారు.. "సీమంతానికి ముహూర్తం పెట్టించామని అత్తయ్య వాళ్ళకు ఫోన్ చేసి చెప్పాలి, అలాగే ఉత్తరం కూడా రాయాలనీ,ఇక్కడ మీబావగారికి అక్కయ్యకు వదినలకు చెప్పాలి , సతీష్ ని కలిసి తనతో కూడా మాట్లాడాలని వచ్చాం." "ఆయన ఎప్పుడొస్తారో తెలీదమ్మా? నేను చెప్తాలే" " సరే అయితే మీ ఇద్దరూ బట్టలు కొనుక్కోండని" డబ్బులిచ్చి వెళ్ళారు . అనుకున్నరోజు రానే వచ్చింది.. సంగీత వాళ్ళ అత్తగారు , మావగారు అనారోగ్యం వల్ల రాలేక పోయారు , మిగతా బంధువులందరూ వచ్చారు.. సంగీత పుట్టింట్లో మొదటి ఆడపిల్ల , అందుకని అనురాధగారు బామ్మ గారి ప్రోత్సాహం తో ఆడంబరంగా చేసారు.. రెండు రోజులుంచుకుని తిరిగి సంగీతను వారింటికి పంపించారు. రోజులు భారంగా గడుస్తున్నాయి.. పెళ్ళంటే భార్యతో సినిమాలు, షికార్లు, హోటల్ కి వెళ్ళడాలు అనుకున్న సతీష్ కి ఈ కొత్త బాధ్యతలతో విసుగ్గా ఉంది... ఎక్కడికెళ్ళినా సంగీత కోసం ఇంటికి తొందరగా రావడం అనేది మింగుడు పడని విషయం.. అందుకే ఆ రోజు ఒక్కడే సినిమాకెళ్ళి రాత్రి పదింటికి వచ్చాడు, ఆ రాత్రి ఏం అడగకుండానే పడుకుంది సంగీత.. కానీ ఆమె గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలవు తున్నాయి.. "భార్యను ప్రేమగా పలకరిచడానకి డబ్బులు ఖర్చు కావుకదా ? అందులో ఇటువంటి పరిస్థితి లో ఎవరూ తోడు లేని ఇంట్లో ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళడం భావ్యమా ? ఏం నేనొక్కదాన్నే తల్లిని కాబోతున్నానా ఆయన మాత్రం తండ్రి కావడం లేదా? నాకే మైనా ఇది రెండో,మూడో కానుపా.. ముద్దు ముచ్చట కావాలని ఉండదా అనుకుంటూ ఏడుస్తూ పడుకుంది.పొద్దున లేవలేక పోయింది .... మంచి నిద్రలో ఉన్న సంగీతను సతీష్ కొంచెం మోటుగా చెయ్యి లాగుతూ లేపుతున్నాడు... నొప్పితో కలిగిన బాధతో ' అమ్మా' అని అరిచింది. "ఏం , ఏమయ్యింది ? తొందరగా లేస్తే నీకు కాఫీ టిఫిన్ ఇచ్చి బయటకెళ్ళాలి " అన్నాడు ఆ మాటతో అసలే రాత్రి నుండి పడుతున్న బాధ కోపంగా మారింది..... "ఏం ఎక్కడికెళ్ళాలి అంత అర్జంటుగా? మీ వదినా వాళ్ళ ఇంటికేగా " అన్నది . అంతే కళ్ళు మూసి తెరిచే లోగా ఒక్క క్షణంలో మంచం మీద నుండి కింద పడింది.. "మావదిననంటావా ? నీకు తెలుసా నేను ఎక్కడికెళుతున్నానో ? అంటూ చేయిపట్టి లాగేసరికి అదాటున కూచున్నదల్లా ఊహించని విధంగా కింద పడింది . కళ్ళముందు మెరుపులు మెరిసాయి సంగీతకు . గుండె గొంతుక లోకి వచ్చింది, పొట్ట భూమికి తగిలి శరీరం మొత్తం కదిలిపోయింది "అమ్మా " అంటూ గట్టిగా అరిచింది.. ఊహించని పరిమాణానికి విస్తుపోయిన సతీష్ ఒక్కసారిగా సంగీత దగ్గరకొచ్చి చేయి పట్టుకుని కూచో పెట్టబోయాడు, కానీ సంగీత లేచే పరిస్థితిలో లేదు, నొప్పితో విలవిల లాడుతున్నది. ఏంచేయాలో తోచక వాళ్ళ అక్కయ్యకు ఫోన్ చేసాడు ,లలిత డాక్టర్ పద్మకు ఫోన్ చేసింది.. " అక్కా ! ఏడోనెల నిండబోతుంది కదా చాలా వీక్ గా ఉంది లేబర్ Pains Start అయ్యాయేమో Hospital కి తీసుకురండి , నేను కూడా బయలుదేరుతున్నా అని ఫోన్ పెట్టేసింది.. లలిత , సంగీత వాళ్ళ అమ్మకు inform చేసి తను కూడా మోహన్ తో కలిసి సతీష్ వాళ్ళింటికి బయలు దేరింది.. అనురాధకు గాభరా వచ్చింది . బామ్మగారి సలహాతో ... పసుపు, కుంకుమ , పళ్ళు, రెండు జాకెట్టు ముక్కలు తీసుకుని భర్తతో కలిసి బయలుదేరింది . వీళ్ళు వెళ్ళేసరికే లలితా వాళ్ళు వచ్చి ఉన్నారు సంగీత కుర్చీలో మెలికలు తిరిగి పోతున్నది.. అనురాధ కళ్ళలో నీళ్ళు తిరిగాయి .. నెమ్మదిగా లేపి బొట్టు పెట్టి పసుపు కుంకుమతో సహా తెచ్చినవన్నీ సంగీత ఒళ్ళోపెట్టి లలిత చేతికిచ్చింది .. అర్థం కాని లలిత అనురాధవైపు ప్రశ్నార్ధకంగా చూసింది .. "అత్తయ్య చెప్పారు , ఒకవేళ డెలివరీ అయితే ఇంటికి తీసుకెళ్ళాలిగా అందుకని ఇవన్నీ ఇచ్చాక హాస్పిటల్ కి తీసుకు వెళ్ళమన్నారు, పెద్దావిడ కదా! ఆవిడ నమ్మకం, ఆవిడ పద్ధతి ఆవిడది అని చెప్పింది. అందరూ కలిసి నెమ్మదిగా సంగీతను కార్లో కూచో పెట్టి హాస్పిటల్ కి తీసుకెళ్ళారు... హాస్పిటల్ కి వెళ్ళేసరికి పద్మ రెడీగా ఉంది. వీళ్ళు వెళ్ళగానే ఆయాలు గబ గబా స్ట్రెచర్ తీసుకుని వచ్చి సంగీతను పడుకోబెట్టి లోపల లేబర్ రూమ్ లోకి తీసుకెళ్ళారు.. బయట కూచున్న అందరికీ టెన్షనే .. కాసేపటికి వనిత శ్రీధర్ జ్యోతి హరీష్ కూడా వచ్చారు.. సతీష్ చాలా గిల్టీగా feel అవుతున్నాడు. తనవల్లే ఇదంతా జరిగిందని సంగీత అందరికీ చెబితే తన పరిస్థితి ఏంటీ అని భయ పడుతున్నాడు .. అందరూ సతీష్ టెన్షన్ ని చూసి సంగీత కోసం అనుకుని, "ఫరవాలేదు అంతా బాగానే జరుగుతుంది అని సతీష్ కి ధైర్యం చెబుతున్నారు.. కొంత సేపయ్యాక పద్మ లేబర్ రూమ్ నుండి బయటకొచ్చి తన రూమ్ లోకి వెళుతూ అందరినీ రమ్మని పిలిచింది.. ఏం వినాల్సి వస్తుందో అని అందరూ కాస్త భయ పడుతూనే వెళ్ళారు, పద్మ లలితను చూస్తూ చెప్పడం మొదలు పెట్టింది.. "అక్కా! రావడం సంగీతకు లేబర్ Pains యే వచ్చాయి .. కానీ లోపల బిడ్డ అస్సలు పెరగలేదు పైగా సడన్ గా కాళ్ళు కొద్ది గా కిందకు జారినట్టు అనిపించాయి, బిడ్డ పుడితే బతకడం కష్టం" అని చెప్పగానే అందరూ మ్రాన్పడి పోయారు.. శ్రీధరే ముందు తేరుకుని దీనికి ట్రీట్మెంటు ఏంటి అని అడిగారు .. "Pains ఆగిపోవడానికి మందిచ్చాను కానీ లోపల బిడ్డ పెరగాలి, అలాగే జారకుండా ఉండాలి... అందుకోసం గర్భసంచీకి కుట్లు వేసి పూర్తి బెడ్ రెస్ట్ లో ఉంచాలి..." "OK మరి కుట్లు వేసారా?" అన్న అనురాధతో "లేదండి ముందు నొప్పులు తగ్గితే తరువాత వేస్తాను ,చిన్న సర్జరీ అవసరం అవుతుంది.. ఎవరో ఒకరుండి అందరూ ఇంటికి వెళ్ళి లంచ్ చేసి రండి అని చెప్పింది. వనిత అందరినీ తమ ఇంటికి రమ్మని తీసుకెళ్ళింది ... ససేమిరా రానన్న అనూరాధతో "అలాగే అత్తయ్యా! మీరు ఉండండి , మేం వస్తూ మీకు కారియర్ తీసుకు వస్తాం" అంటూ అందరూ వెళ్ళి పోయారు సశేషం... బాంధవ్యం... 15 అలాగే waiting room లో కూర్చున్న అనురాధ కు ఆయా కాఫీ తెచ్చి ఇచ్చింది, మాట్లాడకుండా తాగి అమ్మాయిని చూడొచ్చా అనడిగింది .. డాక్టర్ నడిగి వచ్చిన ఆయమ్మ అనూరాధను లోపలికి తీసికెళ్ళి వదిలింది . సంగీత దగ్గరకెళ్ళి తలమీద చేయి వేసి నిమిరింది.. పిచ్చి తల్లికి చేయడానికి ఇంత మంది ఉన్నా ఒక్కతే ఉండి ప్రాణం మీదకు తెచ్చుకుంది.... చేతి స్పర్శకు మేలుకున్న సంగీత "అమ్మా నువ్వెప్పుడొచ్చావని ?" అడిగింది.. "అయ్యో తల్లీ ! నీకేం గుర్తు లేదా? అంది .. "ఊహూ" .. "నీకు నొప్పులొచ్చాయమ్మా అందుకని తీసుకొచ్చాం " సంగీతకు లీలగా తాను కింద పడిన సంగతి గుర్తొచ్చింది కానీ తల్లికి ఏం చెప్ప లేదు.. ఎప్పుడూ లేంది తాను అంత కఠినంగా మాట్లాడి అతన్ని హర్ట్ చేసింది ,అలా మాట్లాడకుండా ఉండాల్సింది అనుకుని "ఇంకెవరూ లేరా ? "అన్నమాటకు "అందరూ ఇంటి కెళ్ళారు, వస్తారు అని చెప్పి ఆకలేస్తుందా ? ఏమైనా తింటావా? అంటే కాఫీ తాగుతానంది. " కానీ పద్మ ఏమీ ఇవ్వకూడదని చెప్పి వెళ్ళింది. గంటలో అందరూ వచ్చేసారు. జ్యోతి బలవంతంగా అనూరాధకు అన్నం తినిపించింది.. 3 గంటలకు చిన్న సర్జరీ చేసి కుట్లు వేసి రూమ్ లోకి పంపించారు.. తరువాత పద్మ అందరినీ కూచోపెట్టి చెప్పింది... "సంగీతనుమంచం మీద పడుకో పెట్టి, కాళ్ళ దగ్గర ఎత్తుగా పెట్టి తల కిందకు వచ్చే లాగా ఉంచండి, అటాచ్ డ్ బాత్రూం ఉంటే లేచి వెళ్ళొచ్చు లేదంటే నడవకూడదు.. " "బిడ్డ పెరగడానికి వారానికి ఒక ఇంజక్షన్ చొప్పున ఈ పది వారాలూ ఇస్తాను.." "ఇంకో విషయం తనకు Pains రావు 10 weeks అయ్యాక సెక్షన్ I mean ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలి, చాలా కేర్ ఫుల్ గా చూడాలి తను అస్సలు టెన్షన్ పడకూడదు.." ఇక ఇప్పుడు రెండు గంటలు observationలో ఉంచుతున్నాను తరువాత ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పింది. హరిహర్రావు గారు వెంటనే ఇంటికి ఫోన్ చేసి సంగీత కోసం రూమ్ బెడ్ రెడీ చేయమని చెప్పారు . దాంతో ఇంక ఎవరూ మాట్లాడలేదు .. సతీష్ ఏం మాట్లాడకుండా కూచున్నాడు తన భయం తనది.. మాట్లాడుతుండగానే రెండు గంటల ఇట్టే గడిచి పోయాయి సంగీతను తీసుకుని అందరూ హరి హర్రావు గారింటికి వచ్చారు.. ఏర్పాట్లు అన్నీ perfect గా చేసుంచారు. కాసేపుండి అందరూ బయలు దేరారు.. సతీష్ ని ఆ పూట ఉండమన్నా " లేదండి! సంగీతను రెస్ట్ తీసుకోనివ్వండి , మళ్ళీ వస్తాడు అంటూ హరీష్ వారించాడు.. శ్రీధర్ మాత్రం " ఒకసారి లోపలికెళ్ళి చెప్పిరా" అని పంపించాడు... లోపలికొచ్చిన సతీష్ " వెళ్ళొస్తాను" అని చెప్పి వెళ్ళబోతుంటే దగ్గరికి పిలిచి సతీష్ చెయ్యి పట్టుకుని "సారీ అండి ,నేను అంత రూడ్ గా మాట్లాడాల్సింది కాదు, ఏంటో ఒక్కదానికి భయమేసి అలా బాధలో అనేసాను really I am sorry " హమ్మయ్య! అంటే ఎవరికీ చెప్పలేదన్న మాట. Thank God.... " ఫరవాలేదు, నేను కూడా అలా చేయాల్సింది కాదు. Sorry". "వెళతాను, రేపొస్తాను " అంటూ బయలు దేరాడు.... పిచ్చిపిల్ల ! తను చేయని తప్పును తనమీద ఎలా వేసుకుందో, నిజం దాచి మంచి పనే చేసిందో , తన జీవితాన్ని పణంగా పెట్టిందో కాలమే నిర్ణయించాలి... సంగీతను అందరూ పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు, వారం వారం ఇంజెక్షన్లు పద్మే ఇంటి కొచ్చి ఇస్తున్నది సతీష్ రోజూ వచ్చి చూసిపోతున్నాడు.... సుచరిత చంద్రశేఖర్ గారు delivery అయ్యాక వస్తామని చెప్పారు.... ఆరోజు ఆఖరు ఇంజక్షను ఇచ్చాక కాసేపు కూచున్నది పద్మ.. "లోపల బేబీ బాగుంది, రేపొకసారి హాస్పిటల్ కి వస్తే చెకప్ చేస్తాను.. " తెల్లవారి సతీష్ వచ్చాక హస్పిటల్ కి వెళ్ళి Scaning చేయించారు . "అంతా OK ".అని చెబుతూ పద్మ అన్నది.. "అత్తయ్యా! మంచి రోజు, మంచి ముహుర్తం చూసుకోండి ఆపరేషన్ చేస్తానని " చెప్పింది "అలాగే " అంటూ సంతోషంగా ఇంటికొచ్చారు.. బామ్మగారు వెంటనే చెప్పారు ఎల్లుండి శుక్రవారం పొద్దున బాగుంది ఆడపిల్ల పుట్టినా శుక్రవారం మహాలక్ష్మి పుడుతుంది అని fix చేసారు.. హరి హర్రావు గారు అందరికీ phone చేసి చెప్పారు. అనూరాధ , మంజుల ,సతీష్ , సంగీతను తీసుకుని గురువారం హాస్పిటల్ కెళ్ళారు.. Formalities పూర్తయ్యాక అనూరాధ తప్ప మిగతా వాళ్ళు వెళ్ళి పోయారు .. శుక్రవారం పొద్దున సతీష్ కుటుంబం ,హరిహర్రావు గారి కుటుంబం అంతా హాస్పిటల్ లోనే ఉన్నారు ఇన్ని రోజుల తరువాత , ఇంత టెన్షన్స్ తరువాత కాస్త ఆదుర్దాగా అందరూ ఆపరేషన్ థీయేటర్ ముందు కూచున్నారు పద్మ చెప్పే శుభవార్త కోసం ఎదురు చూసబాంధవ్యం.... 16 నవ్వు ముఖంతో బయటకు వచ్చిన పద్మ " ఆడపిల్ల చక్కగుంది , చిలక ముక్కు , చేతికిపెద్ద వేళ్ళు, పెద్ద పెద్ద కళ్ళు, గులాబీ రంగులో ఉంది అని చెప్పింది.. "చూడొచ్చా ?" అని అందరూ ఒక్కసారే అడిగారు.. "పాపను చూడొచ్చు సంగీతను ఇంకో పావుగంట తరువాత రూమ్ లోకి షిఫ్ట్ చేశాక చూడండి.".. అన్నది. "ఎలా ఉంది సంగీత" అన్న అనురాధతో "కొంచెం కష్టమైంది పాప మెడలో పేగులన్నీ వేసుకుని ఒక మూలకు వెళ్ళి పడుకుంది.. గర్భసంచీకూడా చాల పలచగా ఉంది.. అందుకనే జాగ్రతగా తీయాల్సి వచ్చింది.. తనను కూడా జాగర్త గా చూసుకోవాలి " అని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళింది.. అందరూ అపురూపంగా చూస్తున్నారు, "సిజేరియన్ బేబీస్ సెన్సిటివ్ గా ఉంటారు ఎత్తుకోవద్దని" చెప్పారు... అందరూ దూరం నుండి చూసే సంబరపడి పోతున్నారు ,మంచి నక్షత్రమే తండ్రి చూడొచ్చు అనగానే గబగబ సతీష్ లోపలకెళ్ళి పాపను చూసాడు.. ఒకలాంటి ఉద్వేగంతో అతని హ్రుదయం ఉప్పొంగింది.. మెల్లిగా చేతిని చూపుడు వేలును పట్టు కుని కాసేపు నించొని బయటకొచ్చాడు... రూమ్ లోకి సంగీతను తీసుకు రాగానే ముందు లలిత సంగీత నుదుటి మీద ముద్దు పెట్టుకుని "Congratulations చక్కని పాపను మాకిచ్చావు" అంటూ తన సంతోషం వెలి బుచ్చింది. అందరూ కాసేపుండి వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళారు.. పురిటి రోజుకు చంద్రశేఖర్ గారు సుచరిత వచ్చారు చంద్రశేఖర్ గారు చాలా నీరసంగా కనుపించారు మనవరాలిని చూసి ఒకటే సంబరం.. ఆరోజు అందరికీ భోజనాలక్కడే.. భోజనాలయ్యాక అందరూ కూచున్న తరువాత బారసాల గురించిన ప్రస్తావన వచ్చింది.. బామ్మగారు కల్పించుకుని " అమ్మాయి చాలా బలహీనంగా ఉంది పీటల మీద కూచునే శక్తి కావాలి కదా అందుకని మూడో నెల చేద్దాం" అన్నారు.. పెద్దావిడ ఆమాట చెప్పాక ఇంక ఎవరేమనగలరు.. మూడునెలలదాకా చంటిదానికి పేరుండదా అని నవ్వారందరూ .. ...... .................. ................ ................... ...... కాస్త అట్టహాసంగానే బారసాల చేసారు.. ఏం పేరు అనేది సంగీత ఇష్టానికే వదిలేసారు... అనూహ్యం గా పుట్టిన పాపకు అనూహ్య అని పెట్టాలనుకుంది ,కానీ ఆ పేరు అందరికీ నచ్చలేదు చివరికి ప్రవల్లిక అని పేరు సెలెక్ట్ చేసింది .. బారసాల అయ్యాక రెండు రోజులు మాదగ్గర ఉంచుకుని పంపిస్తామని అడిగారు సుచరిత సరే అని మంచి రోజు చూసి హరిహర్రావుగారు అనూరాధ కలిసి దింపి వచ్చారు . హాయిగా చంటి పిల్లతో అందరికీ కాలక్షేపం అవుతున్నది.లలిత, వనిత , జ్యోతి వాళ్ళంతా కూడా వచ్చి పాపతో ఆడుకుంటున్నారు. రేపు సంగీత వెళ్ళిపోతుందనగా అందరూ మాట్లాడుతున్నప్పుడు సడన్ గా జ్యోతి సంగీతనడిగింది . "ఉద్యోగానికి ఎప్పటి నుండి వెళ్ళాలను కుంటున్నావు అని" ... ఒక్క సారిగా మ్రాన్పడి పోయింది సంగీత .. "అవునమ్మా ! నేను అదే అడుగుదామనకున్నా ఏం నిర్ణయించుకున్నావు పాపనెక్కడ ఉంచాలనుకుంటున్నావు" అని చంద్రశేఖర్ గారు కూడా అడిగే సరికి నోటమాట రాలేదు.. సుచరిత గారే "అదేంటి రెండు రోజుల కోసం వచ్చిన పచ్చి బాలింతను అలా అడుగుతున్నారు?" "ఎప్పుడైనా అడిగేదేగా అత్తయ్యా! తన అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకోవాలిగా ?"అన్న జ్యోతితో "నేనింకా అంత ఆలోచించలేదండి ఆలోచించుకుని చెబుతా " అన్నది. అందరూ వెళ్ళి పోయారు, వెళుతూ లలిత మాత్రం "బాధ పడకు సంగీతా! వదినకు కొంచం తొందరెక్కువ.. Take Your Own Time" అని భుజం తట్టి వెళ్ళి పోయింది.. ఆ రాత్రి సంగీత అన్యమనస్కంగానే గడిపింది.. ఎలాంటి భావాలు లేకుండా నిరాసక్తంగా నిస్సత్తువుగా కూచుంది.. అమ్మ చెప్పింది 'పాలిచ్చేతల్లి కంటతడి పెట్టకూడదని , బాలింత ఏడిస్తే జీవితాంతం తలనొప్పి వస్తుందని. అలా అనుకుంటే వచ్చే కన్నీరాగుతుందా ?కానీ చిత్రంగా తనకు కన్నీరు రావడం లేదు, తనభవిష్యత్తు తన కళ్ళ ముందు కనపడుతున్నది.....' ఏ మాటైతో నాన్నతో అన్నదో ఆ మాట నిజం కాబోతుందేమో, తెల్లవారి భోజనాలయ్యాక సతీషే వచ్చాడు దింపడానికి .. పాప నవ్వులు చూస్తూ ఎప్పుడు ఇంటి కొచ్చారో తెలీలేదు.. సతీష్ వెళుతుంటే మటుకు సంగీత చెప్పింది "వీలుచూసుకుని మీరొక సారొస్తే మనం పర్సనల్ గా మాట్లాడుకుందాం " "ఎందుకూ ? నాకేం ఫిట్టింగులు పెట్టకు "అన్న సతీష్ తో 'అదేంలేదు రండి ఒకసారి మాట్లాడుకుందాం' అని చెప్పి లోపలికెళ్ళింది.. ఎవరికీ ఏం చెప్పలేదు అలా అని ఎక్కువ ఆలోచించే శక్తి కూడా లేదు, పాప పనులు చూస్తూ అన్నీ మరిచి పోతున్నది.. రెండు రోజులకు రమ్మంటే అంటే వారంరోజులకొచ్చిన సతీష్ కాసేపు పాపతో ఆడుకున్నాడు, కాఫీ తాగాక మెల్లిగా చెప్పింది.. "పాపకు 5వ నెల వచ్చాకే నన్ను అక్కడికి పంపిస్తారట , ఆతరువాత కూడా పాలుతాగే పిల్లనొదిలి నేను ఉద్యోగం చేయలేను, అందుకని కొన్ని రోజులు మీరు చిన్నదో , పెద్దదో ఏదో ఒక ఉద్యోగం చేయక తప్పదు.. ఆ తరువాత నేను ఆలోచిస్తాను. " "ముందు మీరు ఉద్యోగం చూసుకుని పిలవండి నేనొస్తాను" అని నెమ్మది గా అయినా ఖచ్చితంగా చెప్పింది.. "సరేలే అలాగే "అని వెళ్ళి పోయాడు ... ఇంట్లో ఎవరికీ ఏం చెప్పలేదు... ఎందుకు? self confidence ఆ ?లేక over confidence ఆ. ? అవేం కాదేమో! పిల్ల బాధ్యత అయినా తీసుతుంటాడేమో అని తీసుకుంటాడా? లేదా ? దాన్ని బట్టి అతని మనస్తత్వాన్ని అంచనా వేసుకుని భవిష్యత్తు నిర్ణయించు కోవాలనుకుంది.. చూద్దాం ఏమవుతుందో... సశేషం... బాంధవ్యం.......17 సంగీత దగ్గర నుండి నేరుగా లలిత వాళ్ళ ఇంటికొచ్చాడు.. కామ్ గా కూచున్న సతీష్ ని "ఏంటి ! అంత కామ్ గా ఉన్నావు.. ఏమైనా ప్రాబ్లమా ?" "బావగారితో మాట్లాడాలి.. నాకర్జంట్ జాబ్ కావాలి సంగీత వచ్చే లోగా నేను జాబ్ లో చేరాలి పాప పెద్దయ్యే వరకూ సంగీత జాబ్ చేయలేదు కదా.. " "అలా అని నీతో చెప్పిందా " "లేదు , లేదు నేనే అంటున్నాను.. " "అలాగే ఏంచేద్దామని " "ఏదో ఒకటి " "సరే బావగారికి చెబుతాను .." "రేపు వస్తావా ? లేదంటే వెయిట్ చేస్తావా?" వెయిట్ చేస్తానని కూచున్నాడు.. మోహన్ రాగానే లలిత విషయం చెప్పింది. "చూడు సతీష్ ! చేర్పించిన ప్రతీసారి ఏ కారణం లేకుండానే మానేస్తావు, ఏ మొహం పెట్టుకుని మళ్ళీ అందరినీ అడగను,ఇలా మానేస్తుంటే నా పరువు పోదా?. " "లేదు బావగారు ఇప్పుడు నాకు చాలా అవసరం .తప్పకుండా చేస్తా" అని చెప్పాడు .. "సరే రేపు పొద్దునరా మాట్లాడదాం... " ఇంటి కెళ్ళిన సతీష్ కి నిద్ర పట్టలేదు... అలాగే ఏం చెబుతారు, చేస్తారా? లేదా? అని అక్కడ సంగీత, ఇద్దరూ రెస్ట్ లెస్ గానే పడుకున్నారు.. పొద్దున్నే మోహన్, సతీష్ ఇద్దరూ కలిసి బయలుదేరారు.. మోహన్ నిన్ననే వాళ్ళ friend కి Phone చేసి చెప్పాడు.. "మార్కెటింగ్ సైడ్ ఇచ్చారుగా ఈసారి బయట తిరిగే జాబే కదా బాధ్యతగా ఉంటూ హాయిగా చేసుకో అని మోహన్ చెప్పాడు. " "అలాగే బావగారు మీరు చూస్తారుగా " పాప పుట్టింది కదా కొంచం బాధ్యత తెలిసిందేమో అని అనుకున్నారందరూ.. నెల రోజుల నుండీ అత్త వారింటికి వెళ్ళకుండా సంగీతను పాపను చూడకుండా అలాగే ఆఫీస్ కి వెళుతున్నాడు సతీష్.. లలిత సంగీత కు ఫోన్ చేసి అడిగింది "నువ్వేమైనా అన్నావా కండీషన్స్ పెట్టావా " అని. "లేదే ఎందుకు" అంటే సతీష్ విషయం చెప్పింది . సంగీత " ఓహో అలాగా ! బాధ్యతగా ఉంటే మంచిదేగా వదినా, ఇదెన్ని రోజులో చూద్దాం" అంది . కానీ నిజంగానే సతీష్ ఇక్కడికి రాకపోవడాన్ని పాజిటివ్ గా తీసుకోవాలో లేక కోపం వచ్చి మానేసాడో అర్థం కాలేదు సంగీతకు. సంగీత కూడా ఏం మాట్లాడకుండా తనన్న మాటమీదే ఉంది.. ఆరోజు సాయంత్రం పాపకు పాలు తాగించి పడుకో పెట్టే ప్రయత్నం చేస్తున్నది సంగీత ..లోపలి నుండి అనురాధ భోజనానికి పిలుస్తున్నది .. ఇంతలో తలుపు చప్పుడయ్యింది.. ఎవరా అని చూస్తే సతీష్ లోపలికొస్తూ కనిపించాడు. ఎదురెళ్ళి లోపలకు తీసుకొచ్చింది సంగీత. నెలరోజులుగా రాని మనిషి రాత్రి వచ్చాడేమిటా అని ఆలోచిస్తూ అతని మొహం లోకి చూసింది.. ఉయ్యాల దగ్గరకొచ్చి పాపను చూసి చేతితో తడిమి సంగీత చేతిలో ఒక కవర్ పెట్టాడు . ఏంటన్నట్టు చూసింది "చూడు" అన్నాడు కవర్ సీల్ విప్పి చూసింది వంద రూపాయల నోట్లున్నాయి.. సంగీత ఏదో అడగ బోయేంతలో సతీషే చెప్పాడు. "ఇవాళ సాలరీ ఇచ్చారు , తీసుకుని ఇక్కడికే వచ్చాను . నీఇష్టం, ఏంచేస్తావో ,పాపకు నీ అవసరాలకు వాడుకుంటావని ఇచ్చాను " అని అంటుంటే సంగీత కళ్ళళ్ళో నీళ్ళు తిరిగాయి.. కానీ కంట్రోల్ చేసుకుంది... ఇది లాంగ్ రన్ లో కూడా ఉండాలి కదా అనుకొని..... "ఇప్పుడు ఇక్కడ నాకేం అవసరమండి?" అన్నది.. అయినా వినకుండా అక్కడే పెట్టి తీసుకోకుండా వెళుతుంటే హరిహర్రావుగారు" రండి సమయానికి వచ్చారు భోంచేసి వెళ్ళండి " అని బలవంతం చేసారు.. భోంచేసి వారి బలవంతం మీద అక్కడే పడుకున్నాడు...ఆ రాత్రి సంగీత కూడా నిశ్చింతగా నిద్రపోయింది.. సశేషం...బాంధవ్యం..... 18 రెండో నెల, మూడో నెల కూడా జీతం తీసుకుని సంగీతకే ఇచ్చాడు. పాపకు 5 వ నెల నిండబోతున్నది సంగీతకు ఏంచేయాలో తోచడం లేదు. బామ్మ తొందర పడుతున్నది,. హరిహర్రావుగారిని పంపించి మంచి రోజు చూపించుకు రమ్మంది,అలాగే చంద్రశేఖర్ రావుగారికి ఫోన్ చేసి చెప్పమంది. ఎటూ నిర్ణయించుకోలేని సంగీత పెద్దల నిర్ణయానికి కట్టుబడి 5 వ నెలలో చంటిపిల్లతో అత్తవారింటికి అదే తమ ఇంటికి బయలు దేరింది. చంద్ర శేఖర్ రావుగారి ఆరోగ్యం బాగా లేదు మాటి మాటికీ ప్రయాణాలు చేయలేక పోతున్నారు డాక్టర్ గారు కూడా రెగ్యలర్ చెకప్ లో ఉండాలని చెప్పడంతో వారు రాలేదు.. జ్యోతి ,హరీష్ వచ్చారు.. అనూరాధ తను తెచ్చిన బొమ్మ సారె, చలిమిడి, బట్టలు అన్నీ పెద్ద కోడలు జ్యోతికి బొట్టు పెట్టి ఇచ్చారు,కాసేపుండి హరీష్ వాళ్ళు వెళ్ళారు సతీష్ ఆ పూట హరిహర్రావుగారు వాళ్ళను అక్కడే భోంచేసి వెళ్ళమన్నాడు ,సతీష్ మాటను కాదనలేకపోయారు.. బామ్మ, పనమ్మాయిని, మాట్లాడి పంపడంతో సంగీత నిశ్చింతగా ఇంట్లో పనులు చేసుకుంటున్నది .. సతీష్ రాముడు మంచి బాలుడు లాగా మారిపోయాడు ... ఆరోజు సతీష్ జీతం తీసుకుని ఇంటి కొస్తున్నాడు ముచ్చటగా నాలుగో నెల జీతం కూడా ఇచ్చి సంగీతను అలా బయటకు తీసుకెళ్ళాలనుకున్నాడు. పాపం సంగీత కాస్త రిలాక్స్డ్గా ఫీలవుతుంది, సంతోష పడుతుందని ఆలోచిస్తూ బైక్ ను డివైడర్ కు కొట్టి కింద పడిపోయాడు, మెల్లిగా లేచాడు కానీ నడవలేక పోయాడు.. ఇద్దరెవరో కలిసి ఆటోలో కూచో పెట్టారు.. ట్రాఫిక్ పోలీస్ వచ్చి బైక్ ని తీసుకెళ్ళాడు, సతీష్ ఆటోలో కూచుని హరీష్ కి ఫోన్ చేసాడు . "నివేదిత నర్సింగ్ హోమ్ కు వెళ్ళు, నేనక్కడికే వస్తున్నానని " చెప్పిన హరీష్ తో "అలాగేనని " చెప్పి బయలు దేరాడు డాక్టర్ చూసి ఎక్స్ రే తీసి , "కాలు ఫ్రాక్చర్ అయ్యింది అంతే మూడు నెలలు రెస్ట్ తీసుకుంటే చాలు" అని చెప్పి కట్టుకట్టి పంపించారు. గాభరా పడిన సంగీతకు హరీష్ " ఫరవాలేదు, మూడు నెలలు రెస్ట్ తీసుకుంటే చాలట" అని చెప్పి మందులవి ఇచ్చి ఎలా వేయాలో చెప్పి వెళ్ళి పోయాడు .. సంగీతకు ఇంక అదనపు బాధ్యత, అదనపు పనులు మొదలయ్యాయి.. సతీష్ కి సేవలతో పాటు ,సతీష్ ని చూడడానికి వచ్చే పోయే వారికి పాపకు చేయడంతో సరిపోయింది సంగీతకు... లలిత రోజూ వచ్చి సంగీతకు సాయంగా ఉండేది.. మూడు నెలలయ్యాక సతీష్ కి కట్టు విప్పారు కానీ నడవలేక పోతున్నాడు ..ఫిజియోథెరపీ అన్నారు రోజూ ఎవరో ఒకరు వచ్చి తీసుకెళుతున్నారు. కాస్త నడవడం వచ్చాక తనే వెళుతున్నాడు.. దాచుకున్న మూడునెలల జీతం అయిపోయింది తెల్లవారి ఫిజియో థెరపీకి డబ్బులు లేవు . లలితకు ఫోన్ చేసింది . "100/ రూపాయలుంటే ఫారెక్స్ తెప్పించాను. మావయ్య గారికి చెబుతారా? ఆయనకు రేపు ఫిజియో థెరపీ కోసం కావాలి" అని ఇప్పుడు ఆశ్చర్యపోవడం లలిత వంతయ్యింది "ఫిజియో థెరపీ చేయించు కోవడం ఎప్పుడో. అయిపోయిందిగా?" అంది "అదేంటి మరి రోజూ ఎక్కడి కెళుతున్నట్టు ఈయన .." "నే కనుక్కంటానులే" అని లలిత ఫోన్ పెట్టేసింది ఇంటి కొచ్చిన సతీష్ ని ఏం అడగలేదు సంగీత తెల్లవారి పొద్దున అడిగింది. "మళ్ళీ ఉద్యోగం లో ఎప్పుడు జాయిన్ అవుతున్నారు "అని.. "అప్పుడే ఎలా! కాలు పూర్తిగా నయమవలేదు కదా.. " "ఫరవా లేదు బండిమీదే కదా జాగ్రత్తగా వెళ్ళొచ్చు లెండి " " లేదు నేను వెళ్ళను " "జీతం డబ్బులు అయిపోయాయి.. రేపటినుండి ఎలామరి? ఏం చేద్దాం " "చూద్దాం "అన్నాడు అంతే .. రెండు రోజుల తరువాత మావగారి ఫోన్ " అమ్మా!వాడు బండీ మీద వెళ్ళడానికి భయడపతున్నాడు పాప కాస్త పెద్దదయ్యిందిగా నువ్వే నీ పాత ఉద్యోగానికి వెళ్ళ కూడదా?" అని. నోట మాటరాక అలగే ఉండి పోయింది.. ఆవేశం వచ్చింది .. శ్రీధర్ కి ఫోన్ చేసి తను మళ్ళీ ఉద్యోగం లో జాయిన్ అవుతాను అని చెప్పింది "OK.. అడిగి చెపుతాను అని అరగంట తరవాత Phone చేసి చెప్పాడు "ఎల్లుండి 1St నుండి జాయిన్ అవమన్నారు.. " అని.. 'సరే' అంది మరి పాప ఎలా? ఎక్కడ వదలాలి? పనమ్మాయి మీద వదిలేయనా.. లేక అమ్మా వాళ్ళ దగ్గరా.. అమ్మా వాళ్ళకు చెప్పాలా? అనురాధకు ఫోన్ చేసింది సంగీత. మావగారి పేరు చెప్పకుండా తనే ఇల్లు గడవడం కోసం, పాపకోసం ఉద్యోగం చేయాలనుకుంటున్నట్టు చెప్పి పాప గురించి ఆందోళన పడింది.. "రోజూ అక్కడ వదలడం ఎలా అమ్మా ? అంది ." "ఫరవాలేదు నేనే అక్కడికి వస్తాలే" అంది అనూరాధ. 'హమ్మయ్య ! ఒక సమస్య పరిష్కారం అయ్యింది ' అనుకుంది పిచ్చి పిల్ల.. కానీ ఇవన్నీ రేపు తనకు సంకెళ్ళవుతాయని తెలియదు. తనే కాదు ప్రతి ఆడపిల్లా అంతే... అత్తవారింట్లో మంచి అనిపించుకోవడానికి , అమ్మా నాన్నకు చెడ్డ పేరు రాకుండా ఉండడానికి ఎన్నో సహిస్తుంది.. కానీ పిచ్చి పిల్లలు తమకేదైనా అయితే కన్నీళ్ళు కార్చేది అమ్మ నాన్నలే అనీ, గుండె కోత వారికే అని ఎప్పుడు తెలుసు కుంటారో.... 😩 సశేషం. బాంధవ్యం... 19 తెల్లవారి గబ గబ పనులు చేసుకుని, పాపకు అన్నీ చేసి, కడుపు నిండా పాలిచ్చి పడుకోపెట్టింది .. గబ గబా అన్నంతిని "అమ్మ వస్తుంది అంతవరకు మీరుండండి "అని సతీష్ కి చెప్పి పనమ్మాయికి జాగ్రత్తలు చెప్పి ఆఫీస్ కి వెళ్ళింది. ఆఫీస్ లో అందరూ సంతోషంగా ఆహ్వానించారు. బాస్ గదిలోకి వెళ్ళింది ఆయన నవ్వుతూ పలకరిస్తూ "ఏమ్మా బాగున్నావా ? పాప బాగుందా " అని అడుగుతూనే పనులు ఏమేం పెండింగ్ లో ఉన్నాయో అందులో సంగీత చేయాల్సినవేంటో చెబుతూనే, "నాకీరోజు డిపార్టుమెంటులో కేసుంది వెళ్ళాలి లేటవ్వచ్చు నీకు ఓపికున్నంత వరకూ ఉండి వెళ్ళమ్మా" ఇంకో విషయం నేను నీకు అన్నలాంటి వాడిని శ్రీధరెంతో నేనంత.హాయిగా ఫ్రీగా ఉండొచ్చు " అని చెప్పి కావలసిన ఫైల్స్ తీసుకుని వెళ్ళారు.. పనిచేస్తున్నదే కానీ పాపెలా ఉందో అమ్మ వచ్చిందా అనే ధ్యాస లోనే ఉంది. లంచ్ టైమ్ లో ఇంటికి ఫోన్ చేసింది అనూరాధ మాట్లాడింది " ఫారెక్స్ తినిపించానమ్మా తిని కాసేపు ఆడకుని మళ్ళీ పడుకుంది " అనగానే కాస్త నిశ్చంతతో పని చేసుకుని సాయంత్రం ఇంటికి బయలుదేరింది.. "అమ్మలూ ఇప్పటికే లేట్ అయ్యింది పాపకు అన్నప్రాసన చేయాలి " అని అనూరాధ సంగీత ఇంటికి రాగానే చెప్పింది.. చూద్దాం! రేపు చెబుతాలే తెల్లవారి ఆఫీస్ కి యధాప్రకారం వెళ్ళింది. లంచ్ చేసాక సింక్ దగ్గర కెళ్ళి చేయి కడుక్కంటూ చూసుకుని ఆశ్చర్య పోయింది. గుండెల దగ్గర చీరంతా తడిసి పోయింది , ఏమిటో అర్థం కాలేదు, ఇందాక గుండెల దగ్గర సన్నగా నొప్పి వస్తుంటే ఏమిటో అనుకుంది . ఇప్పుడు చూస్తే తెలిసింది పాలన్నీ కారిపోతున్నాయి.. అయ్యయ్యో పాపకు లేకుండా వేస్ట్ అయిపోతున్నాయే అని గాభరా పడింది ఆఫీస్ లో వాళ్ళకు వెళుతున్నానని చెప్పి పరుగున ఇంటికి బయలుదేరింది.. వస్తూనే పాపకు పాలిచ్చాక అప్పుడు రిలీఫ్ గా ఫీలయ్యింది, ఇదంతా చూస్తున్న అనూరాధకు బాధనిపించింది. " నువ్విప్పుడు పాలు తాగుతున్న చంటిపిల్లను వదిలి ఉద్యోగం చేయడం అంత అవసరమా " అని అడిగింది. సంగీత ఏం మాట్లాడలేదు. "కనీసం ఒక రెండు నెలలైనా అల్లుడు చేస్తే బాగుండేది కదమ్మా "అంది "అమ్మా ! చేయాలనుకున్న వారు ఎలాగైనా చేస్తారు వంకలు వెతకరు, అతనికి చేయాలని లేనప్పుడు ఊరికే ఏం వెంట పడతాను .." " మంచి ఉద్యోగమే దొరికింది నాకు , ఇంట్లో దానిలాగా చూసుకునే వారు దొరికారు, టైమ్ కి రావాలని,పోవాలనే నిబంధనలు పెట్టలేదు. కానీ ! చూద్దాం ఇలా ఎన్ని రోజులో.. " "సరే నీ ఇష్టం మరి నేను వెళ్ళనా? రాత్రి కోసం కూర చేసి పెట్టాను మధ్యాహ్నం తినడానికి జంతికలు తీసుకొచ్చాను " "జాగ్రత్త! అన్నప్రాసన నానమ్మ, తాతయ్య చేయాలి మరి వాళ్ళెవరూ ఏం మాట్లాడటం లేదు, అందుకని నాన్న ఫోన్ చేసి వాళ్ళకు రమ్మని చెబుతారు, మనింట్లోనే చేద్దాం, మీరు వద్దురు గానీ" అని చెప్పి వెళ్ళి పోయింది. సాయంత్రం పద్మకు ఫోన్ చేసింది సంగీత "పాలు తగ్గడానికి మందులేమన్నా ఇస్తారా " అని " వద్దమ్మా అలా చేస్తే బ్రెస్ట్ కాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది ,అందుకని మందులు వేసుకోకూడదు.. " "పాప రోజూ ఆ సమయానికి పాలు తాగుతుంది కదా అందుకే వచ్చాయి సమయం మారినప్పుడు రావడం ఆగి పోతాయి. అందుకని దాని కోసం పెద్దగా టెన్షన్ పడకమ్మా " అని చెప్పింది .. "రెండురోజులయ్యాక అన్న ప్రాసనకు ముహూర్తం బాగుందట ..నాన్న అందరికీ ఫోన్ చేస్తానన్నారు." అంటూ అనూరాధ సంగీతకు ఫోన్ చేసి చెబుతుంటే, "వద్దమ్మా !ఎవరకీ చెప్పొద్దు. మేనమామ తినిపించాలి కదా ? అందుకని ఈనను ఒక్కరినీ పిలిస్తే చాలు, అనవసరమైన ఖర్చులు మనం కూడా తగ్గించుకోవాలి " అని చెప్పింది. ఏరోజయితే మావగారు తనను ఉద్యోగం చేయమని చెప్పారో ఆరోజే ఆయన మీద గౌరవం పోయింది. ఎవరైనా తమ కొడుకులకు పెళ్ళి చేస్తున్నప్పుడు జాగ్రత గా ఆలోచించాలి . తమ కొడుకు ఎలాంటి వాడో వాళ్ళకు తెలిసే ఉంటుంది కదా, మరి పెళ్ళయ్యాక బాధ్యతలు తెలుస్తాయని అనుకుని పెళ్ళి చేస్తే ఎలా ? పెద్దవారు చెబుతున్నప్పుడు ఎదుటివారు నమ్ముతారు కదూ! అక్కడికీ నాన్న అంటూనే ఉన్నారు " ఇన్ని రోజుల నుండీ చేయనివాడు ఇప్పుడేం చేస్తాడమ్మా "అని తనే అన్నీ పెడ చెవిని పెట్టింది. వాళ్ళంత గట్టిగా ఉన్నప్పుడు,పాప గురించి ఆలోచించనప్పుడు,అమ్మావాళ్ళు మాత్రం ఎందుకు పిలవాలి ? తమ కొడుకు గురించిన ఆలోచన తప్ప, నేనెలా ఉన్నానో కూడా అడగలేదు, మరి తను ఎందుకు వారి గురించి ఆలోచించాలి అని గట్టిగా నిర్ణయించుకుంది... అన్నప్రాసనరోజు రమ్మనమని సతీష్ కి ఫోన్ చేసి చెప్పారు సతీష్ సంగీత ఇద్దరూ పాపను తీసుకుని వెళ్ళారు.. అనూరాధ పాయసం వండింది చిన్న వెండి కంచం స్పూన్ కొన్నారు దేవుడికి నైవేద్యం పెట్టి తినిపిస్తుంటే ,హర్ష అన్నాడు "బామ్మా ! ఏవో వస్తువులన్నీ ముందర పెట్టి ఏది అందుకుంటుందో చూస్తారు కదా "అని పోని కొడుకు సరదా సంబరం ఎందుకు కాదనాలని అనూరాధ గబగబా అన్నీ సర్దింది అందరూ ఆత్రంగా చూస్తున్నారు పాప ఏంతీసుకుంటుందా అని ప్రవల్లిక మెల్లిగా వెళ్ళి పెన్ను పట్టుకుంది . సంగీత హమ్మయ్య! బంగారు తల్లికి చదువొస్తే చాలు అనుకుంది... పాపను అక్కడే వదిలి, ఆఫీస్ కి వెళ్ళి,వస్తూ వస్తూ పాపను తెచ్చుకుంది. పనమ్మాయి రేణుక పొద్దున వస్తానని వెళ్ళి పోయింది .. ఇంటికి వచ్చిన కాసేపటికి లలిత ఫోన్ చేసింది "ఎలాఉన్నావు ఉద్యోగం ఎలా ఉంది నిజానికి వాడింట్లో ఉండి నువ్వు ఉద్యోగం చేస్తుంటే మాకు గిల్టీగా ఉంది ,అందుకే నేను పలకరించలేక పోతున్నా? " అంది. " అయ్యో దానికి దీనికీ ఏం సంబంధం వదిన . దేనికదే నేనేం ఫీల్ అవ్వడం లేదు , డబ్బులేక పోయినా తండ్రిగా పాప పట్ల బాధ్యతగా ఉండొచ్చు, ప్రేమగా పలకరించొచ్చు, అది కూడా చేయలేని వారికి పెళ్ళి , పిల్లలు అక్కరలేదు కదా వదినా " అన్న తరవాత ఏంటి ఇలా మాట్లాడాను అనుకుని "సారీ వదినా! ఏదో బాధ కొద్దీ అనేసా, అమ్మ రాగానే పాపను అమ్మ మీద వదిలి వెళ్ళిపోతారు అందుకనే ఏదో బాధనిపించింది " అని అంటున్న సంగీతను వారించి "నేనేం అనుకేలేదు , అనుకోను కూడా ,ఇంతకూ ఎందుకు ఫోన్ చేసానంటే రేపు నువ్వు ఆఫీస్ కి వెళ్ళే లోపు వస్తాను " "అలాగే వదినా! తప్పకుండా రండి , సాయంత్రం వస్తే నేను కూడా ఉండే దాన్ని గా " "కాదులే పాపతో ఆడుకోవడానికి వస్తున్నాం " అన్న లలిత తో " ఓహో నాకోసం కాదా "అని నవ్వుతూ సరే అయితే రేపు కలుద్దాం వదినా" అంటూ ఫోన్ పెట్టేసింది. సశేషం...బాంధవ్యం.... 20 తెల్ల వారి పొద్దున్నే లేచి పనులన్నీ గబ గబ పూర్తి చేసుకుని పాపను కూడా రెడీ చేసింది .. వారొస్తే తినడానికని పూరీ కూర చేసి కూచుంది.. 9 గంటలకు వచ్చారు వాళ్ళు లలిత మోహన్ వస్తారను కున్న తన ఆలోచనను వమ్ము చేస్తూ లలిత, వనిత వచ్చారు రెండు చేతులతో బాగులు మోసుకొస్తూ ... సతీష్ వెళ్ళి అందుకున్నాడు .. ఇద్దరూ గబ గబా పాప దగ్గర కొచ్చారు .. పది నిముషాల్లో లేస్తుందని చెప్పి... "మీరీ లోపల టిఫిన్ తినండి "అంటూ లోపలికెళ్ళ బోతుంటే ఆపారు, "మేం తినే వచ్చాం కానీ కాసేపు కూచో "అంటూ "పాప అన్న ప్రాసన చేసారు కదా! మేం ఏం ఇవ్వలేదు" అంటు లలిత పాపకు ఒక కవరిచ్చింది, వనిత ఒక పెద్ద వెండిగిన్నె రెండు ఫ్రాక్స్ ఇచ్చింది. అంతేనా ? సంగీతకు ఇద్దరూ చెరొక చీరా తెచ్చారు . వనితయితే బాగులోనుండి డబ్బాలన్నీ తీసి కింద పెట్టింది ఏంటవన్నీ ? అని అడిగేలోగానే ఫ్రిజ్ లో పెట్టమని రేణుకకు పురమాయించింది.. "ఏంటొదినా" అని అడిగితే "ఏం లేదు చంటి పిల్లతో రోజూ ఏంచేసుకుంటావు ఇడ్లీ పిండి ,దోశ పిండి , పచ్చళ్ళు, పొళ్ళు తెచ్చాను, పాపాయికి ఉగ్గు కూడా ఉంది.పొడి చేసి తెచ్చాను , ఉడక పెట్టి పెట్టడమే " అని వనిత అంటుంటే సంగీత కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. "ఇవన్నీ ఇప్పుడు ఎందుకు వదినా? అమ్మ ఉంది కదా!" అన్న సంగీతను వారిస్తూ , " మేం నీకన్నా ఎక్కువేం కష్ట పడటంలేదులే, ఏదో మాకు తోచిన సాయం ఒక్క దానివి చేసుకోలేవు కదా .." "అమ్మ కూడా బాధ పడింది అందరికీ అన్నీ చేసాను సంగీతకు ఏంచేయలేక పోతున్నాను " అని. "నువ్వెప్పుడూ ఒంటరి దానివి కాదు , అలాఫీల్ అవ్వొద్దు, మీ అక్కయ్య ఉంటే ఎలా చెబుతావో. అలాగే మాదగ్గరఅన్నీ చెప్పుకోవచ్చు." అంటూ వనితే ప్లేట్ లో టిఫిన్ పెట్టి తెచ్చింది. వారు చూపేది నిజమైన అభిమానమా? లేక తమ్ముడు చేస్తున్న దానికి కాంపెన్సేషన్ గానా అని ఒక్క నిముషం అనుకుని , ఛీ నాబుద్ధి కూడా పెడదారి పడుతున్నది అని గబగబా తినేసి బయలు దేరుతూ " అమ్మ వస్తుంది వదినా సాయంత్రం దాకా ఉంటుంది మీ ఇష్టం మీరు ఎంత సేపన్నా ఉండి వెళ్ళండి " అని చెప్పింది. ఆఫీస్ లో ఆలోచించే టైమ్ లేనంత బిజీ అయ్యింది. లంచ్ కూడా గబా గబా తినేసి పనిలో పడింది.. ఇంటికి రాగానే అనూరాధ చెప్పిన వార్త విని ఆశ్చర్యపోయింది సంగీత. రోజూ వనిత , లలిత ఎవరో ఒకరు వచ్చి ఉండే లాగా అనుకున్నారట. "మీరు మరోలా అనుకోవద్దు అత్తయ్యా ,రోజూ ఈవయసులో మీరు రావడం కష్టం కదా మీకు పాపను చూడాలనిపించినప్పుడు తప్పకుండారండి మాకూ పాపను చూసే అవకాశం ఇవ్వండి అన్నారు"అని చెబుతూ ' నీ కోసమే ఆగాను చెప్పి వెళదామని ' అని బయలుదేరింది. సరే అమ్మా ! చూద్దాం వారిష్టప్రకారమే కానీ అన్నది.. రోజులు గడుస్తున్నాయి.. పాప ముద్దు ముద్దు మాటలు బుడి బుడి అడుగులు అందరినీ చిన్న పిల్లలను చేసాయి. పాపతో సమానంగా అందరూ ఆటలే.. చూస్తూ చూస్తూ పాప మొదటి పుట్టిన రోజు రానే వచ్చింది. హరీష్ ఫంక్షన్ వాళ్ళింట్లో చేస్తానన్నాడు , వాళ్ళు పెద్దవాళ్ళు ఎదురు చెప్పడానికి లేదు. అయినా ఈ పరిస్థితిలో తామేం చేయగలరు? అందుకనే బావగారు అడిగితే సరేనంది సుచరిత చంద్రశేఖర్రావు గారు కూడా వచ్చారు.. కాకపోతే హరీష్ వాళ్ళింట్లో ఉన్నారు .... పుట్టినరోజు అందరినీ పిలిచి అట్టహాసంగా చేసారు, అందరు ఆనందంగా పాల్గొన్నారు . జ్యోతి సంగతి చెప్పనే అక్కర లేదు, తన ఇంట్లో తను చేస్తున్న ఫంక్షన్ అనీ, అది తన బాధ్యతగా , సతీష్ సంగీతల మీద తనకు చాలా ప్రేమ అన్నట్టుగా, పాప మీద తనకూ అధికారం ఉందన్నట్టుగా హడావిడిగా తిరిగింది .. ఫంక్షన్ కాగానే అందరూ సంతోషంగా ఎవరింటికిి వారు వెళ్ళారు .. అమ్మా ,నాన్నా ఉన్నారని పాపను రోజూ అక్కడికి తీసుకెళుతున్నాడు సతీష్ . సతీష్ అలా వెళుతుంటే ఏమో !వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు కదా అందుకనేమో అనుకుంది సంగీత. ఒక రోజు పాపను లలిత వాళ్ళ ఇంట్లో వదిలి హరీష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. తరువాత శ్రీధర్ ద్వారా ఆఫీస్ లో తెలిసింది. చంద్రశేఖర్ గారి ఆరోగ్యం బాగాలేదు, అందుకనే ప్రాపర్టీస్ కొన్ని అమ్మేసి అందరికీ కాష్ ఇచ్చారనీ, కొన్ని కొడుకుల పేరు మీద రాసాడని , ఒక ప్రాపర్టీ ద్వారా వచ్చే రెంట్ లో సగం సుచరితకు , ఆమె తరువాత హరీష్ కి మిగతా సగం సతీష్ కి వచ్చేలా డిసైడ్ చేసారని. చెప్పాడు .. 'ఆహా ' అని విని ఊరుకుంది. ఇంటి కొచ్చాక ఎదురు చూసింది, సతీష్ తనకేమన్నా చెబుతాడేమోనని కానీ రెండు రోజులైనా చెప్పలేదు, ఇంక వదిలేసింది.. ఒకరోజు సాయంత్రం సంగీత ఆఫీస్ నుండి ఇంటికొచ్చేసరికి సతీష్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు "పాప ఏదీ "అడిగింది "అమ్మవాళ్ళదగ్గరుంది మనం వెళ్ళి తెచ్చుకుందాం " అన్నాడు సరేనని ఫ్రెష్ అవ్వడానికి వెళుతుంటే రూమ్ లోకొచ్చి చేతిలో పాకెట్ పెట్టాడు "ఏంటి " " చూడు " విప్పి చూసింది అరిటాకు రంగులో ఉన్న చీర " ఎక్కడిది " " కొన్నాను, చాలా రోజులయ్యింది మనం బయట కెళ్ళి ఈ చీర కట్టుకో , సినిమా కెళ్ళి బయట భోంచేసి అటునుండే అన్నయ్య వాళ్ళింటికి వెళదాం" అన్నాడు . "చీర ఎక్కడిది " "కొన్నాను " "అదే డబ్బులు " "నాన్న గారు ఇచ్చారు " "అంటే మీడబ్బులు కావన్న మాట " "అంటే నావే "అంటూ నసిగాడు. "మీవి కాని డబ్బులతో తెచ్చినవి నా కొద్దు. " "అంటే రేపు నాకు నాన్నగారు డబ్బులిచ్చినా తీసుకోవా " "తీసుకోను, నాకు మీ కష్టార్జితంతో తెచ్చినవే ఇష్టం , మీవి కాని డబ్బులతో నన్ను ఎక్కడికో తీసుకెళ్ళాలని, నన్ను సంతోష పెట్టాలనీ చూడకండి.." "సరే అయితే పాపను తీసుకొద్దాం రా " "ఫరవా లేదు మీరు తీసుకురండి " "రావా ?" "లేదు నాకు అలసటగా ఉంది " అని గదిలోకెళ్ళింది... "సరే నేను వెళుతున్నాను " అని వెళ్ళాడు కానీ డబ్బు సంగతి, ప్రాపర్టీ సంగతీ చెప్పలేదు. ఎంత గట్టి మనసు ఏం చెప్పాలను కున్నాడో అదే చెబుతాడు. కానీ చూద్దాం, ఈ పెద్ద వాళ్ళయినా చెబుతారా అంటూ సతీష్ కోసం పాప కోసం ఎదురు చూస్తూ కూచుంది .. సశేషం
No comments:
Post a Comment