బాంధవ్యం ... 21
అలా వెళ్ళి ఇలా పాపను తీసుకుని వచ్చాడు సతీష్ .... ఏం అడగకుండానే పాపను తీసుకుని పడుకోపెట్టింది . "తింటారా "అనడిగింది జవాబు కోసం ఎదురు చూడకుండా కంచంలో కిచిడీ వడ్డించింది ... తింటున్నంత సేపూ మౌనమే రాజ్యమేలింది.. మామూలుగా అయితే సంగీతే ఏదో ఒకటి మాట్లడేది .. కానీ ఎందుకో మాట్లాడాలనిపించడం లేదు పైగా ఒంటరిగా ఉండాలనిపిస్తుంది.. అందుకు వ్యతిరేకంగా సతీష్ సంగీతతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. పడుకున్నప్పుడు కూడా దగ్గరగా రావాలనుకున్నాడు కానీ సంగీత అతనికి ఆ అవకాశమే ఇవ్వలేదు.. రెండు మూడు రోజులు అలా మౌనంగానే గడిపారు, నాలుగవ రోజు సుచరిత ఫోన్ చేసింది "రేపు మేం వెళ్ళి పోతున్నాం ఒకసారి సాయంత్రం రామ్మా !" అని... అసలయితే సెలవు తీసుకొని వెళ్ళొచ్చు కానీ జ్యోతి ముందు అత్తగారి తో మాట్లాడడం ఇష్టం లేక సాయంత్రం వెళ్ళింది.... జ్యోతి కాఫీ ఇచ్చి "ఎలా ఉన్నావు ఆఫీస్ లో పనెక్కువగా ఉందట కదా సతీష్ చెప్పాడు ". "అవునక్కయ్యా! కొంచం ఎక్కువగానే ఉంది అందుకే రాలేక పోతున్నా " "అదే అత్తయ్య వాళ్ళు వెళుతున్నారు కదా నువ్వు సతీష్ ఏదో అనుకున్నారట నీతో మాట్లాడాలని రమ్మన్నారు. " ఆశ్చర్యపోవడం సంగీత వంతైంది. అదేంటి వాళ్ళను చూడటానికి కాదా రమ్మన్నది ? ఏంటి వీళ్ళు నాతో మాట్లాడేది ?.. కోపాన్ని ఆపుకున్నది.. సుచరితగారే చంద్రశేఖర్ గారితో అన్నారు "అమ్మాయికి చెప్పండి విషయాలన్ని తనకు కూడా తెలియాలి కదా " "కానీ అమ్మాయి కూచోనీ " వరస చూస్తుంటే మావయ్య గారికి చెప్పాలని లేదులా ఉంది అనుకుని "ఫరవాలేదత్తయ్యా నాకు చెప్పేదేముంది " "అమ్మాయి వద్దంటుంది కదా! " అన్నారాయన "భలేవారే !చిన్న పిల్ల ఏదో అంటే మాత్రం మనం ఊరుకుంటామా?" సంగీతకు ఏం అర్థం కావడం లేదు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇంతలో చంద్రశేఖర్ గారు జ్యోతిని పిలిచారు. జ్యోతి వచ్చాక చెప్పడం మొదలు పెట్టారు. "అమ్మా సంగీతా! మన ఊర్లో ఉన్న ఇంట్లో వచ్చే అద్దెలో సగం 4 వేలు సతీష్ కి ఇస్తున్నాం అది బాబు తన ఖర్చులకుంచుకుంటాడు. ఏదైనా అవసరమైతే ఇంట్లో ఇస్తాడు .. అలాగే కొంత ప్రాపర్టీ అమ్మాము ,ఆ డబ్బులు బాబు పేరు మీద 5 సంవత్సరాలకు ఫిక్సెడ్ చేసాము కొంత డబ్బుతో ఏదో బాండ్ కొన్నాము అది 10 సంవత్సరాల తరువాత మెచ్యూర్ అవుతుంది అదీ సంగతి.. " ఓహో ! అనుకుంది "అలాగే మావయ్యా! మీ డబ్బు మీ ఇష్టం నాకెందుకు చెప్పడం ? పెద్ద వారు మీకేది మంచిది అనుకుంటే అది చేయండి.. " "అంటే నీకూ సతీష్ కి మధ్య గొడవలు రాకూడదనీ, డబ్బుకోసం బాబును సతాయించకూడదని చెబుతున్నా, ఎందుకంటే బాబు చేతిలో క్యాష్ లేదని , ఉండదనీ నీకు తెలియడానికి మాత్రమే " అన్నారు . సంగీతేం అంటుంది , ఒంటరిగా చాలా ఇన్ సెక్యూర్డ్ గా ఫీల్ అయ్యింది.. ఇంక అక్కడ ఒక్క నిముషం కూడా ఉండాలనిపించ లేదు సంగీతకు, అలాగే పది నిముషాలు మౌనంగా కూచుంది. జ్యోతి వంటింట్లోకి వెళ్ళింది . అదే అదనుగా అత్తయ్యా ! మావయ్యా! వెళ్తాం ఇంక. అని పాపను తీసుకొని ముందు బయలు దేరింది సతీష్ కోసం కూడా ఎదురు చూడకుండా.. ఆటోలో కూచున్నదే కానీ , సంగీత కళ్ళలోంచి నీళ్ళు కారిపోతున్నాయి , పెద్దగా ఏడవాలని ఉంది , కానీ పాపను ఒళ్ళో పడుకో పెట్టుకుని ఏడవకూడదని ఆపుకుంది.. ఇంట్లోకి రాగానే పాపను పడుకోపెట్టి పక్కన తనూ పడుకుంది... ఏం అనుకుని ఈ పెళ్ళి చేసుకుంది ఏమవుతుంది... మనుషుల్లో ఇంత స్వార్థమా? . నిన్న మొన్న దాకా ఆహా ! ఓహో! అన్న వాళ్ళకు నేనింత పరాయిదాన్నయ్యానా ? నాతో మనసు విప్పి మాట్లాడుతూ చెబుతున్నారనుకున్నా , కానీ వాళ్ళబ్బాయిని సతాయించకూడదట, అందుకని ముందరి కాళ్ళకు బంధాలా మరి వారి బాబు కన్న కూతురు సంగతి వద్దా? 'ఆయన్ని డబ్బలడిగానా ఎప్పుడైనా? అలా అనే ఆయన అక్కడికెళ్ళి చెప్పి ఉంటారు లేకపోతే ఎందుకు నన్ను పిలిచి అన్ని విషయాలు చెబుతూ మాటలంటారు.. ' అన్నీ చెబుతూనే మావయ్యగారు ఒక లాగా "బాబు పేరు మీద "అని ఎలా అన్నారో ? వాళ్ళ బాబంటే ఎంతప్రేమో ? ఏం నేను బాబు కంటే చిన్నదాన్ని కాదా ..? విషయమేదో 'ఇలా చేసాము' అని చెబితే బాగుండేది కదా? కానీ నేను తనను డబ్బు కోసం సతాయిస్తున్నట్టు అంటారా ? అసలు డబ్బు కావాలని నాన్ననే అడగలేదే ? అలాంటిది ఈనను అడుగుతానా ?అదీ సంపాదిస్తున్న మనిషని సతాయిస్తానా? ఆ ఇంటికి వెళ్ళగానే పెద్ద వాళ్ళు కూడా మారారన్న మాట, నన్ను ఒంటరి దాన్ని చేసారన్న మాట . అలా అనుకుంటంటే దుఖం పొంగు కొచ్చింది . సంగీతకు ఏడుపు ఆపుకుంటుంటే గొంతులో నొప్పి వస్తుంది . ఎప్పుడొచ్చాడో సతీష్ మెల్లిగా వచ్చి పక్కన పడుకుని పైన చేయి వేసాడు, అంతే గబుక్కున విదిల్చేసింది . "నేనే ! ఎందు కంత భయం "అన్నాడు భయంకాదు అసహ్యం అనుకుంది.. మళ్ళీ వేయబోతే లేచి కూచుంది కోపము, బాధ, అసహ్యం అన్నీ కంట్రోల్ చేసుకుంది.. "నేను డబ్బు మనిషిని" అంది "అయ్యో నేననలేదు ఆ మాట. " "నేనంటున్నాను కదా ! నేను డబ్బు మనిషిని నా దగ్గరకి రావాలంటే డబ్బులిచ్చి రావాలి " " పెళ్ళానికి కూడా డబ్బులివ్వాలా " "భర్తగా మీ బాధ్యతలు కొన్ని ఉంటాయి అవి లేనప్పుడు మన రిలేషన్ అదే, నాకు డబ్బు కావాలి మీకు నేను కావాలి ఇంకో మాట లేదు." "నేనివ్వను ? అంటే... ఇలా ఇవ్వను ఇంక దేనికైనా ఇస్తాను , అయినా పెళ్ళాం మీద మొగుడికి అధికారం ఉంటుంది తెలుసా.. " "ఏంటి ఉండేది ? పసుపు దారం కట్టి సొంతం చేసుకుని కోరిక తీర్చుకోవడం కాదు, పెళ్ళాన్ని పోషించడం కూడా తెలియాలి " ఆ పోషిస్తాంలే! దానికి ఉద్యోగమే చేయక్కరలేదు, నాన్న ఇచ్చిన డబ్బులతో కూడా ఉండొచ్చు. అంటూ దగ్గర కొస్తున్న అతన్ని "పెళ్ళానికి ఇష్టం లేకపోతే బలత్కారం కేసు పెట్టొచ్చు ఆ సంగతి తెలుసా?" "ఓ అయితే నా మీద కేసు పెడతావా? " "ఆహా " "సరే " అని పక్కకు తిరిగి పడుకున్నాడు. కాని ఆమాట భవిష్యత్తులో తన మెడకు చుట్టు కుంటుందని పాపం సంగీతకు తెలీదు.. సంగీత తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేక పోయింది, తనను ఓదార్పుగా దగ్గరకు తీసుకుంటేే కాస్త ఉపశమనం పొందేదేమో.... కానీ భరించ లేని బాధ ఉక్రోషం గా మారింది. ఏమీ జరగనట్టు సతీష్ దగ్గరకొస్తుంటే కోపాన్ని ఆపుకోలేక పోయింది.. అరవాలనుకుంది. కానీ పడుకున్న పాపను చూసి అరవలేక మళ్ళీఇంకోసారి.. మేకవన్నె పులి దగ్గర మేకలా బలయ్యింది సశేషం
బాంధవ్యం.... 22 పొద్దున లేవగానే రొటీన్ లో పడిపోయింది సంగీత. అనూరాధకు ఫోన్ చేసి" ఇవాళ అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోతున్నారు వదినలు అక్కడే ఉంటారేమో. అందుకని నువ్వు రామ్మా "అంది పాపను రెడీ చేసింది, వంట చేసింది రేణుక రాగానే పాపను అప్పగించింది.. "ఈరోజు అమ్మ వస్తుంది తొందరగానే వస్తాను నేను " అంటూ వెళ్ళింది.. ఇంత పని చేసుకుంటున్నా ఎక్కడా సతీష్ ఎదురు పడలేదు కోపం వచ్చిందేమో రానీ దేనికైనా ఒక హద్దుంటుంది. తప్పు చేస్తే తిట్టడం వేరు,నెమ్మదిగా చెప్పి సరిదిద్దడం వేరు.... కానీ ఇదేంటి? తాను మంచి అవడం కోసం నన్ను చెడ్డదాన్ని చేయడం ఈఅభాండాలు వేయడం .... మైండ్ పనిచేయడం లేదు.. అనుకుంటూ సంగీత ఆఫీస్ కి వచ్చింది.. సాయంత్రం దాకా ఎలాగో గడిపి రోజు కంటె ముందుగానే ఇంటికి బయలుదేరింది.... ఎందుకో సంగీతకు అమ్మ ఒళ్ళో తలపెట్టుకుని పడుకోవాలని పిస్తున్నది అందుకే తొందరగా ఇంటికొచ్చింది... వెళతానన్న అమ్మను ఇంకాసేపుంచుకుంది ... రాత్రి వంటయ్యాక ఇంక వెళతానంటున్న అనురాధను తీసుకెళ్ళడానికి హరిహర్రావుగారు వచ్చారు. "ఏమ్మా సతీష్ ఇంకా రాలేదుగా, కాసేపు ఉండమా ? అంటున్న హరిహర్రావుగారిని "వద్దులే నాన్న మీరు వెళ్ళండి ఆయన వస్తారులే " అంటూ పంపించింది.. నిన్నటి సంఘటన చిన్నదేం కాదుగా కోపం వచ్చుంటుంది, ఇగో హర్ట్ అయ్యుంటుంది , మెల్లిగా బలాదూర్ తిరిగి పడుకునే టైమ్ కి వస్తారేమో అనుకుని తను తినేసి పాప పక్కన పడుకుంది. మెలుకువ వచ్చి చూస్తే 11.30 అయ్యింది సతీష్ లేడు పక్క బెడ్రూమ్ కి వెళ్ళి చూసింది లేడు ఇంకా రాలేదు.. చాలా పెద్ద కోపమే వచ్చిందన్న మాట అనుకుంది. సెకండ్ షో కి వెెళ్ళాడేమో నని ఎదురు చూసింది రాలేదు ... కాస్త భయమేసింది ఎవరికైనా ఫోన్ చేస్తే ఇంత రాత్రి భయపడతారేమో . పోనీ ఎక్కడైనా ఎవరింట్లోనైనా ఉండి పోయారేమో అని ఆగింది.. పొద్దున లేవగానే వనితకు ఫోన్ చేసింది. లలితకు నిన్న జరిగిన విషయం చెప్పారేమో అందుకని చిన్న వదినకు ఫోన్ చేస్తే బెటర్ అనుకుంది.. "అయ్యో నీకు చెప్పలేదా సంగీతా ? అమ్మ నాన్నతో ఊరెళ్ళాడు వాళ్ళను దింపడానికి, సాయంత్రం రాలేదా ఇవాళ వస్తాడేమో చూడు, నేను రానా మరి పాపను చూడడానికి. " "వద్దులే వదినా అమ్మ వస్తానంది.." అని పనులు చేసుకోవడం మొదలు పెట్టింది.. ఆఫీస్ కి వెళ్ళాలని లేదు, కాని మనసును ఆలోచనలను అదుపులో పెట్టుకోవాలంటే పనిలో పడాలి. ఇద్దరి మధ్య తమకు తెలియకుండానే దూరం పెరిగిపోతున్నట్టనిపిస్తుంది సంగీతకు. కానీ తనేం చేయగలదు తన వైపునుండి అన్నీ జాగ్రత్తగా చూసుకున్నా సతీష్ కే ఏదో అపనమ్మకం .. అది అతని మీదా లేక తన మీదా.. "భగవంతుడా ఇంత తగ్గి పోయినా కూడా తప్పేనా ? ఇలా అయితే భవిష్యత్తులో ఇంకే ఆడపిల్లా ఇలా తనకన్నా తక్కువ చదువు, ఉద్యోగం ఉన్న వాడిని పెళ్ళి చేసుకోదేమో ".. అనుకుంది. "అంతే కాదు మగ పెళ్ళి వాళ్ళు చెప్పే వివరాలు నమ్మడానికి కూడా ఆలోచిస్తుందేమో? అసలు నిజ నిర్ధారణ చేసుకుని కానీ నమ్మదేమో?. ఛ! ఇలాంటి వారివల్లే మనుషుల మీద నమ్మకం పోతుంది" అనకుంటూ ఇంటి కొచ్చింది.. నిన్నటి లాగే అమ్మను కాసేపుంచుకుంది . ఎనిమిది గంటలయినా ఇంకా సతీష్ రాకపోయేటప్పటికి ఇక రాడని నిర్థారణ చేసుకుని "అమ్మా ఆయన వాళ్ళ అమ్మా వాళ్ళ దగ్గరే ఉన్నట్టున్నారు, నేను కూడా నీతో పాటు మనింటికొస్తాను , ఆయన వచ్చేదాకా అక్కడే ఉంటాను " అంటూ అన్నీ సద్దుకుని తను కూడా అనురాధతో బయలు దేరింది .. అమ్మా వాళ్ళింటికి వచ్చాక సంగీతకు ఎందుకో ధైర్యంగా ఉంది .. ఒంటరితనం లోంచి బయట పడ్డట్టు అనిపించింది. బామ్మ కొసరి కొసరి తినిపిస్తుంటే ఎన్నో రోజులుగా ఆకలిగా ఉన్నట్టు కడుపు నిండా తిన్నది .... అమ్మ పక్కన పడుకుని హాయిగా కంటి నిండా నిద్ర పోయింది.. అలా మరో రెండు రోజులు గడిచాయి .... రోజూ ఆఫీస్ కి వెళ్ళినా సతీష్ ఫోన్ కోసం ఎదురు చూస్తూనే ఉంది . వచ్చాక ఫోన్ చేస్తాడని కనీసం వదినలయినా చేస్తారుగా అని ఎదురు చూసింది.. కానీ ఎవరూ చేయటంలేదు .. అసలు ఊరునుండి వచ్చారా? వచ్చి వీళ్ళతో ఏదైనా చెప్పారా? అందరికీ కోపం వచ్చిందా ? పోనీ ఈరోజు ఇంటికెళ్ళి చూడనా.. అంతే అదే చేయాలి అని డిసైడ్ చేసుకున్నాక నిశ్చింతగా పనిలో పడింది. కానీ అన్నీ మనం అనుకున్నవే ఎలా జరుగు తాయి.. ఐదు గంటలకు శ్రీధర్ ఆడిటర్ ని కలవడానికి ఆఫీస్ కి వచ్చాడు ... పనిచూసుకుని ఇంటి కెళుతూ" ఏమ్మా సంగీతా పాపను సతీషే చూసుకుంటున్నాడా వనిత ఇంట్లోనే ఉంటుంది " అని అడిగాడు.. అయితే వీళ్ళకు తెలీదా సతీష్ అక్కడున్న సంగతి అనుకుంది ... "సరే పదమ్మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం " అని సంగీతను ఇంటికి తీసుకెళ్ళాడు.. ఇంటికి వెళ్ళాక వనిత అతిధి మర్యాదలు చేస్తున్నది.. " రెండు సార్లు ఫోన్ చేసాను. తీయకపోతే పాప పడుకునుంటుంది అని ఊరుకున్నా.. పాపను చూడటానికి అత్తయ్య వస్తున్నారేమో అని నేనేం అడగ లేదు... మీ అన్నయ్యతో పాపను చూడాలనుంది అన్నాను. అలాగే సాయంత్రం వెళదాం అన్నారు .." "కానీ నిన్ను తీసుకొచ్చారు,పది నిముషాల్లో వస్తా వెళదాం" అంటున్న వనితను ఆపింది సంగీత.. ఎవరో ఒకరికి చెప్పాలి కాబట్టి తప్పని సరిగా శ్రీధర్ కు వనితకు అన్నీ చెప్పింది ఒక్క తమ బెడ్ రూమ్ లో జరిగిన విషయం తప్ప.. " అదేంటి పంపకాలు కూడా చేసుకున్నారా ఒక్కమాట మాతో చెప్పలేదు " అని వనిత "అయినా సతీష్ కి నాలుగు వేలు పాకెట్ మనీనా? చిన్న పిల్లాడా అలా తీసుకోవడానికి, అయినా మీ నాన్నగారేెంటి వనితా ఇలా చేసారు? సంగీత చిన్న పిల్ల కాదు పైగా ఇంటి బాధ్యతలు చూస్తున్నది తనకు చెప్పాలికదా! పాపకు సెక్యూరిటీ ఎలా.. అయినా ఇన్ని రోజులు పెళ్ళాం పిల్లల్ని వదిలి అక్కడుంటమేంటి.. " "అత్తయ్య, మావయ్య వాళ్ళు ఏమనటం లేదా ? నాకిలా సతీష్ బాధ్యత లేకుండా అక్కడ ఉండటం నచ్చలేదు , ఏం సంగతో కనుక్కోండి వనితా!లేదంటే నేనే హరీష్ బావగారితో మాట్లాడతా.." అన్నాడు శ్రీధర్. సంగీత మనసులో సంతోషపడింది 'నాకు అన్నయ్య ఉంటే ఇలాగే మాట్లాడే వాడేమో' అనుకుంది.. వనిత , శ్రీధర్ ఇద్దరూ కలిసి సంగీతను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలి పాపను చూసి లలితా వాళ్ళింటికి వెళ్ళారు.. సశేషం. బాంధవ్యం... 23 సంగీత దగ్గర నుండి సరాసరి లలిత వాళ్ళ ఇంటికి వెళ్ళారు వనిత శ్రీధర్.. సమయం కాని సమయంలో చెప్ప కుండా వచ్చిన వాళ్ళను చూసి ఆశ్చర్య పోయింది లలిత. లోపలికి రమ్మని మోహన్ ని కూడా పిలిచింది . అందరూ మాట్లాడుకుంటుండగానే లలిత కుక్కర్ పెట్టి వచ్చింది .... శ్రీధర్ ఎటువంటి ఉపోద్ఘాతం లేకుండా అసలు విషయంలోకి వచ్చాడు.. "సతీష్ నాలుగు రోజుల నుండి ఊళ్ళో అత్తయ్య మావయ్య వాళ్ళ దగ్గర ఉన్నాడట కదా! మీకు తెలుసా? "అని లలితనడిగాడు "అవునా! నాన్నను ఒకసారి చెకప్ కి తీసుకు వెళ్ళి వస్తున్నానన్నాడు.ఇంకా రాలేదటనా " "లేదండి సంగీత వాళ్ళ అమ్మా వాళ్ళ ఇంట్లో ఉంటున్నది . పెద్ద వాళ్ళకు ఇంకా చెప్పి నట్టులేదు. ఏమైనా పోట్లాడుకున్నారా లేక సతీష్ పనులు తప్పించుకోవడానికి వెళ్ళాడా? ప్రాపర్టీలు కూడా పంచేసారట కదా మీకు తెలుసా.. " "ఆడిటర్ ఫోన్ చేసి సంగీత రెండు రోజుల నుండి చాలా డల్ గా ఉంటున్నది . మాటి మాటికి కళ్ళు తుడుచుకుంటున్నది ఏమైనా ప్రాబ్లమా అని అడిగితే వెళ్ళాను.. " "చాలా మంచిపిల్ల తెలివి గలది పైకొస్తుంది, ఆ అమ్మాయి ప్రశాంతంగా ఉంటే చక్కగా కెరీర్ లో పైకెదుగుతుంది.. దాని వల్ల సతీష్ కి లాభమే కదా ఎందుకు ఆలోచించడు.. " అని శ్రీధర్ అనగానే మోహన్ కూడా అందుకున్నాడు .. "అవును లలితా ! సతీష్ ఇక్కడ వీళ్ళనొదిలి అక్కడెందుకుండడం? ఈ విషయం హరీష్ కి తెలుసా? " "తెలుసు " అంది లలిత "తెలుసా ! మరయితే అందరు పెద్దలు కలిసే ఆ అమ్మాయిని ఏడిపిస్తున్నారా?" అని కోపంగా అడిగాడు మోహన్.. ఇంక లాభం లేదని ఇంత వరకూ జరిగిన విషయాలన్నీ చెప్పడం మొదలు పెట్టింది లలిత... "బాధ్యతలన్నీ మీద పడేటప్పటికి ఒక్కసారి భయపడిపోయాడు .తప్పించు కోవడానికి , ఓదార్పు కోసం అందరి దగ్గరకొచ్చాడు.. కానీ బాబుకి ఎవ్వరి దగ్గర సపోర్టు లభించ లేదు ఒక్క వదిన దగ్గర తప్ప ,అందుకే ఉద్యోగం పేరు చెప్పి అక్కడికెళ్ళే వాడు.. " "తరువాత అన్నయ్య , వదిన మీద అరిచాడు. వాడు నీ మాట వింటున్నప్పుడు వాడికి మంచీ చెడ్డా చెప్పాల్సిన బాధ్యత నీది , వదినంటే అమ్మతో సమానం , అమ్మ లాగా మంచి చెడ్డా చెప్పాలి కాని వాడిని ఇక్కడ ఉండనిస్తావా అని .." "రెండు మూడు సార్లు సతీష్ ని వాళ్ళయింట్లో చూసిన అన్నయ్య నాకు ఫోన్ చేసి 'నేను సతీష్ కి నచ్చచెప్ప బోతే మీ అందరూ ఒకటే నేనే వేరు అని పిన్ని దగ్గరకెళ్ళాడు. అప్పటి నుండి నేనేం మాట్లాడడం లేదు నువ్వే చెప్పు అని నాతో అన్నాడు." మెల్లగా అందరం నచ్చ చెప్పిన కొన్ని రోజలకు ఆ ఆక్సిడెంట్ జరిగింది . అప్పుడే బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయ్యింది ఎక్కువ స్ట్రెస్ వల్ల ఆరోజు ఫిట్స్ వచ్చాయి .అవి అలా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు" "అందుకనే నాన్నగారు అన్నీ వాడిష్టానికి వదిలేయమన్నారు ,అది అన్నయ్యకు కూడా తెలుసు అందుకే నాన్న .. అన్నయ్య వాళ్ళను, నన్ను బాబును చూసకోమని చెప్పారు" "నేనేం చేయగలను అందుకే సంగీతను ఓదార్చెే ప్రయత్నం చేసాను.." " అంతా బాగవుతున్న సమయంలో డెలివరీ పేరుతో వాళ్ళ మధ్య దూరం పెరిగింది నాన్న ఆరోగ్యం వల్ల అమ్మా వాళ్ళు కూడా దూరంగా ఉన్నారు.ఇక వదిన బోధలు ఏంటో మనకు తెలీదు? అవి వాడిని ఎలా మార్చాయో అంత కన్నా తెలీదు.? " "తరువాత పాప మీద ప్రేమో? సంగీత మీద ప్రేమో తెలీదు కానీ ఉద్యోగంలో నిలదొక్కుకున్నాడనుకుంటే కాలు ఫ్రాక్చర్ అయ్యింది " .. "ఇది ఎవరి అద్రుష్టమో , దురద్రుష్టమో తెలీదు. అయినా సంగీత బాధ్యతలు తీసుకుంది.. సంగీత వాళ్ళ అమ్మ గారు రాగానే మళ్ళీ బయట కెళ్ళడం అలవాటయ్యింది" "వాడు ఎక్కడికీ వెళ్ళడు వదిన దగ్గరకే వెళ్ళేది, ఆమె తన పనులన్నీ వాడితో చేయించుకునే ఉంటుంది. వాడికి కూడా అదే నచ్చింది." "అన్నయ్య నాతో అంటూనే ఉన్నాడు వాణ్ణి అటువైపు రానీయకు అని కానీ ఎంత వరకు కాపలా ఉంటాం" .. "అన్నయ్య లేకుండా నాన్న ఏ పనీ చేయడు . అలాంటిది అన్నయ్య లేకుండా చూసి నాన్న గారికి కూడా హితబోధలు చేసిందట వదిన , ఈ విషయం కూడా అమ్మే చెప్పింది .. "సంగీత తెలివిగలది ఆ అమ్మాయి పేరు మీద ఏం పెట్టినా అదును చూసి అన్నీ తీసుకుని వెళ్ళి పోతుంది అప్పుడు సతీష్ రోడ్డు మీద ఉంటాడని నాన్నతో చెప్పిందట" " సంగీత ఉద్యోగం చేస్తే నిన్నొదిలి వేరే వాళ్ళతో వెళ్ళి పోతుంది లేదా వాళ్ళ అమ్మా వాళ్ళ దగ్గరుంటుంది అని కూడా సతీష్ కి చెప్పిందట ఇది కూడా అమ్మే చెప్పింది.. "సతీష్ కి బాగా బ్రైన్ వాష్ చేసింది అందుకని బాబు కూడా అదే అభిప్రాయంతో ఉన్నాడు , అందుకే దగ్గర కూచుని అన్నీ తన పేరు మీద రాయించుకున్నాడట ... "మనల్ని ఆ సమయంలో పిలిస్తే అన్నయ్యను ఒంటరి వాడిని చేసి తనకు తెలియకుండా చేసామనుకుంటామని మనకు కూడా తెలీనివ్వకూడదని అందంట.".. "రేపు ఏదైనా మాట వచ్చినా అన్నయ్యతో మీ నాన్నగారే అన్నీ చేసారని ఆయనే చూసుకున్నారని చెప్పినా చెప్పగలదు, నా భయమల్లా అన్నయ్య వచ్చాక ఏం జరగుతుందో అని.. " "ఇవన్నీ అన్నయ్యకు నచ్చవు , అందుకే సతీష్ కూడా ఎక్కడ గొడవలవుతాయో అని వాటి నుండి దూరంగా పారిపోయాడనుకుంటా? కానీ సంగీతను బాధ పెట్టాలని కాదేమో?" అని జరిగినవన్నీ లలిత పూసగుచ్చినట్టు అందరికీ చెప్పింది.. "మరయితే బావగారు వచ్చేటప్పటికయినా సతీష్ ని పిలిపించండి, బావగారికి తెలిస్తే ఊరుకోరు.. సతీష్ కి చెప్పండి వాళ్ళ అన్నయ్య మాట వినమని.. " అని కోపంగా అన్నాడు శ్రీధర్.. "ఇవన్నీ నాకెందుకు చెప్పలేదు " అని మోహన్ కూడా అసహనంగా అన్నాడు.. మళ్ళీ శ్రీధరే.... 'ఈ విషయంలో వారి మధ్య గొడవలేం రాలేదుగా. రాక పోతే మంచిదే సంగీతను నెమ్మదిగా అడిగి చూడండి.. " "తను ఈ ఫామిలీ లో ఒక మెంబర్. తనకన్నీ చెప్పడం మనధర్మం , అన్ని విషయాలు తెలిస్తే తన భర్తను తాను బాగుచేసుకుంటుంది , తన దారిలో పెట్టుకుంటుంది " "మీకు చెప్పేంత వాడిని కాదు కానీ వదినా ఆ అమ్మాయి ఇంకా ఎక్కడా బయట పడలేదు అంటే తన భర్త మీద ప్రేమ , తమ బంధం మీద గౌరవం ఉందన్న మాటే కదా.. " " ఈ విషయం నలుగురికీ ముఖ్యంగా వాళ్ళ అమ్మా నాన్నకు తెలీక ముందే చక్కదిద్దండి" అని చెప్పాడు శ్రీధర్.. మోహన్ కూడా "అవును లలితా పాపం ఆ అమ్మాయితో మనసు విప్పి మాట్లాడండి తనేం ఫీల్ అవుతుందో.... ధైర్యం చెప్పండి " "అలాగే మీ నాన్నగారికి కూడా ఫోన్ చేసి సతీష్ ని పంపించమనండి వచ్చాక మాట్లాడుదాం" అని అన్నాడు సరే అని అందరూ ఒక నిర్ణయానికొచ్చారు. లలిత కూడా "ఈ దాగుడు మూతలతో విసిగి పోయాను అన్నీ సంగీతకు చెప్పాలి.." భోజనాలయ్యాక నిశ్చింతగా శ్రీధర్ వాళ్ళు వెళ్ళి పోయారు .. లలిత ఎప్పుడు తెలవారుతుందా నాన్నగారికి ఫోన్ చేద్దామా అని ఎదురు చూస్తూ పడుకుంది..సశేషం..బాంధవ్యం ... 24
తెల్ల వారి కాఫీ తాగగానే వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసింది లలిత. "సతీష్ ఇంకా అక్కడ ఏంచేస్తున్నాడు నాన్న?" అనడిగింది. "ఏంలేదు, వెళ్ళమన్నాం , వెళతా వెళతా అంటున్నాడే కానీ వెళ్ళటం లేదు. తీరా నిన్న మీ అమ్మ అడిగేసరికి, 'ఆ వెళ్ళి మటుకు ఏంచేయాలి నెమ్మదిగా వెళతాలే' అన్నాడు... " "మరి సంగీత , పాప సంగతేంటి అనడిగితే వాళ్ళ అమ్మా వాళ్ళ దగ్గరుంటుందిలే అని చెప్పాడు". వస్తున్న కోపాన్ని ఆపుకుని సతీష్ తో మాట్లాడించ మంది లలిత. కానీ సతీష్ మాట్లాడలేదు డబ్బుల సంగతి అక్కయ్యకు చెప్పలేదు కదా అని గిల్టీగా ఫీలయ్యాడు. కానీ లలిత వేరేగా అర్థం చేసుకుంది.. "సరేలే నాతో మాట్లాడక పోయినా ఫరవాలేదు, ఈరోజు ఇక్కడికి రమ్మని చెప్పండి, ఎందుకంటే అన్నయ్య ఇవాళో,రేపో వస్తాడు. అక్కడుంటే బాగుండదు పంపించండి, నేనింతకంటే ఎక్కువ చెప్పలేను అమ్మకు ఫోనివ్వండి" అన్నది . "అమ్మా! అన్నయ్యకు తెలీకుండా చాలా జరిగాయి, వాడక్కడే ఉంటే బాగుండదు. వదిన జరిగిందంతా మొత్తం సతీష్ మీద వేస్తుంది, తరవాత మీఇష్టం " అని చెప్పి ఫోన్ పెట్టేసింది వెంటనే సంగీతకు కూడా ఫోన్ చేసింది .. "సంగీత ప్లీజ్ ఈ రోజొక్క రోజు నా కోసం సెలవు పెట్టి ఇక్కడికి రాగలవా ? నీతో మాట్లాడాలి" అంది.. "ఏం వదినా ఏమైనా ప్రాబ్లమా? " "లేదులే కానీ కొంచం పర్సనల్ , భోజనానికి రావాలి పాపను కూడా తీసుకొచ్చెయ్యి.." "అలాగే". వనితకు కూడా ఫోన్ చేసి రమ్మని , వంట చేసి ఎదురు చూస్తూ కూచుంది. శ్రీధర్ వనితను దింపి వెళ్లాడు .. శ్రీధర్ ఎంత మంచి వాడంటే వనిత ఎక్కడికి వెళ్ళాలన్నా తోడుంటాడు ,లేదంటే ఇలా డ్రాప్ చేసైనా వెళతాడు.. వనిత మాటకు గౌరవం ఇస్తాడు, రెండు కుటుంబాలకు సమానమైన బాధ్యత తీసుకుంటాడు , అది ఇంట్లో అందరికీ నచ్చుతుంది. మోహన్ కూడా వనితను సతీష్ ని చిన్నపిల్లలుగానే ట్రీట్ చేస్తాడు శ్రీధర్ ని కూడా తమ్ముడులాగే చూసుకుంటాడు.. కాకపోతే మోహన్ కు బాధ్యతలెక్కువ,లలితకు కూడా బాధ్యతలెక్కువ అందుకే లలిత వెళ్ళిన ప్రతిసారీ వెళ్ళలేడు... ఏదో ఆలోచిస్తున్నదల్లా వనిత రాగానే లోపలకు పిలిచింది. "నువ్వుంటే కాస్త ధైర్యంగా ఉంటుంది , ఏదైనా మాట అటూ ఇటూ తూలినా ఒకరికొకరం అని రమ్మన్నా.. " "ఫరవాలేదక్కా! సంగీత మనసు నొప్పించకుండా, సతీష్ మీద కోపం రాకుండా మానేజ్ చేయాలి " అలా అనుకుంటూనే ఉన్నారు సంగీత రానే వచ్చింది. పాపతో కాసేపు ఆడుకుని పాప పడుకోగానే "ముందు అన్నం తిన్న తరువాత మాట్లాడుకుందాం " అని భోంచేసి హాల్లో కూచున్నారు.. వనిత సంగీత పక్కన కూచుని సంగీత చేతిని తన చేతిలోకి తీసుకుంది... "మేం చెప్పేది నెమ్మదిగా విని ఆలోచించు, తరువాత నీ నిర్ణయం చెప్పు .." అంటూ సతీష్ కి వచ్చిన జబ్బు చెబుతూ " స్ట్రెస్ ఉండకూడదన్నారని మేమంతా తనను ఏం అనటం లేదు , అది అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాడని అన్నయ్య అంటున్నాడు. " "అందుకనే బాబుతో మాట్లాడే పని మాకే అప్పచెప్పాడు.. " "మా వదిన గురించి చెడుగా మేం చెప్పకూడదు కానీ అంటూ జరిగినవన్నీ చెప్పారు. " సంగీత వారనుకున్నట్టు ఆశ్చర్య పోలేదు "నాకు తెలుసు " అంది సింపుల్ గా "తెలుసా ఎలా? " "మా మొదటి రాత్రే కనిపెట్టాను, మేం సంతోషంగా ఉండకూడదనే మమ్మల్ని అలా పైకి పంపించారు , నేనెక్కడా బయట పడలేదని, బాధ పడటం లేదని నన్ను బాధపెట్టే పనులన్నీ చేస్తున్నారు, వీలైనంత వరకు నన్ను హర్ట్ చేయాలను కుంటున్నారు " "కానీ !విషయం తెలియని ఈన తనకు తానే తన భవిష్యత్తును పాడు చేసుకేవడమే కాకుండా తన పచ్చని సంసారానికి దూరమవుతున్నారు. అతనికి దగ్గరవ్వాలని నేనెంత ప్రయత్నించినా రెండు రోజులు మాత్రమే బాగుంటారు ఆతరువాత మామూలే లేదంటే ఇలా ఇల్లు వదిలి తిరుగుతారు. ఇంట్లో ఉంటే కోపంతోనో, చనువుతోనో, ఎలాగో నేను మార్చుకుంటాను, కానీ ఇలా వెళ్ళిపోతే నేనేం చేయగలను చెప్పండి" అంది.. ఇంత విమర్శగా మాట్లాడుతున్న అమ్మాయికి మనమేం చెప్పగలం అనుకున్నారు.. "ఒక్కటి మటుకు చెప్పగలం సతీష్ కు నీ మీద నమ్మకం కలిగేలా చేసుకో , ఇది మేం ఈజీగా చెప్పగలం, కానీ నీకు ఎంత కష్టమో మాకు తెలుసు , ఇలా చెప్పడం నీ వ్యక్తిత్వాన్ని కించపరచడమే అవుతుంది. " " నువ్వు , నీ కాపురం బాగుండాలని కోరుకుంటున్నావని మాకు తెలుసు అందుకే ఈమాత్రం చెప్పగలిగాం.. కొన్ని రోజులు వాడితో ప్రేమగా ఉండి, నీ ప్రేమతో వాడిని నీ వాడిగా చేసుకో " అన్నారు.. "సరే వదినా! ఆయన ఇక్కడుండాలే కానీ ఏమైనా చేయగలను". అని సాయంత్రం దాకా ఉండి బయలు దేర బోతుంటే సతీష్ వచ్చాడు. ఒకరికొకరు ఏం మాట్లాడు కోలేదు కానీ రాత్రి భోజనాలప్పుడు అందరి ముందూ మాట కలిపింది .. సంగీత త బయలదేరుతుంటే వనిత అడిగింది " అమ్మా వాళ్ళింటికి వెళతావా? మనింటికి వెళతావా ? "అని సతీష్ ఆత్రంగా సంగీత జవాబు కోసం చూస్తున్నాడు. "ఆయన ఊళ్ళో లేరని అక్కడికెళ్ళాకదా వదినా! ఇప్పుడు ఇంటికే వెళతానని" చెప్పింది.. సంగీత హరి హర్రావుగారికి ఫోన్ చేసి ఇంటికి వెళుతున్నట్టు చెప్పింది. ఇద్దరినీ సతీష్ వాళ్ళ ఇంట్లో దింపి వనిత , శ్రీధర్ వెళ్ళి పోయారు .. పాపను మధ్యలో పడుకోపెట్టి తాను ఒకవైపు పడుకుంది సతీష్ వచ్చి అటువైపు పడుకున్నాడు ఇద్దరూ ఏం మాట్లాడు కోవడంలేదు .. సతీష్ పాప మీద చేయి వేసి పడుకున్నాడు.... నిద్ర లో సంగీత చేయి కూడా సతీష్ చేయి మీద పడింది.. ఆస్పర్శతో ఇద్దరకీ చటుక్కున మెలుకువ వచ్చింది ఈ నాలుగు రోజుల వియోగం ఇద్దరినీ దగ్గరకు చేర్చింది. సశేషం బాంధవ్యం ... 25
అంతా సవ్యంగా గడుస్తున్నది. హరీష్ తన సంపాదనతో సంతోషంగా త్రుప్తిగా ఉన్నాడు కాబట్టి ఆస్తి విషయాలు పట్టించుకోలేదు .. పైగా వాళ్ళ నాన్నగారు డబ్బు ఇవ్వకుండా FD చేసి నెల నెలా వడ్డీ వచ్చేలా చేసినందుకు ఆనంద పడ్డాడు... సతీష్ ఇంట్లోకి కొత్త TV కొత్త Refrigerator కొన్నాడు. పాప పెద్దదయ్యింది ఇంక వేరే ఎవరి సాయం లేకుండా పాపను తనే చూసుకోవడం మొదలు పెట్టాడు. రెండో పుట్టిన రోజు కూడా అయ్యాక పక్కనే ఉన్న Play School లో చేర్పించారు. టీచర్ ప్రవల్లికను చూసి చాలా ఆశ్చర్యపోతున్నది . చక చక రైమ్స్ నేర్చుకోవడం కాదు ABCD లు రాయడం కూడా నేర్చుకుంది... ఆ అమ్మాయి తెలివి తేటలకు అందరూ ముచ్చట పడి పోతున్నారు బాసరలో అక్షరాభ్యాసం చేయించాలనుకుంది కానీ కుదరలేదు ఇంటి దగ్గర వినాయకుడి గుళ్ళో చేయించి Play School లో చేర్పించింది.. చేత్తో పెన్ను పెట్టుకుంది. దాని ఫలితమే ఇదనుకుంది.. మంచి స్కూల్ లో చేర్పించి తను ఏం చదువు కుంటానంటే అది చదించాలని నిర్ణయించుకుంది.. చిన్నప్పటి నుండే పుస్తకాలంటే ఇష్ట పడుతున్న పాపను చూసి సంబర పడిపోయింది వెతికి వెతికి చిన్న పిల్లల పుస్తకాలు కొని తెస్తున్నది.. ప్రవల్లిక అందరి పిల్లల్లా ఆటలాడుకోదు. ఒంటరిగా కూచుని చదువు కోవడం , దీర్ఘంగా ఆలోచించడం చేస్తుంది అంతే .. మాటలు చాలా తక్కువ ... తనకు తానే engage చేసుకుంటుంది... అందుకని సతీష్ కి కూడా పాపను చూసుకోవడం పెద్ద ఇబ్బంది కావడం లేదు.. సాయంత్రాలు అత్తల ఇళ్ళకు, పెదనాన్న ఇంటికి వాళ్ళ నాన్న తో కలిసి వెళ్ళి,తనకు ఇచ్చిన బొమ్మలతో ఆటలాడుకోవడం కన్నా పేపర్ మీద రాయడమే ఎక్కువ చేస్తుంది. ఆదివారాలు అమ్మతో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళుతుంది ... చూస్తుండగానే మూడో ఏడు నిండింది స్కూల్ లో జాయిన్ చేసే సమయం దగ్గర పడింది ... రెండు మూడు స్కూళ్ళ నుండి అప్లికేషన్స్ తెచ్చింది తనకు నచ్చిన అన్నిటి కంటే తక్కువ fees ఉన్న స్కూల్ ని select చేసుకుంది .. ఆరోజు సతీష్ కి చెప్పింది.. "Admission fees 25 + 1St term fees పుస్తకాలు Uniform కి 5 మొత్తం 30 వేలు మీరు కడితే నెలా నెలా fees నేను కట్టుకుంటాను తరువాత మిగతా నోటు పుస్తకాలు అవి కూడా నేను చూసుకుంటాను.. "అని "Just admmission fees Arrange చేయండి " అన్నది .. "నాన్ననడగాలి కదా ఊరెళ్ళి వస్తాను "అన్నాడు.. రెండు రోజుల తరువాత మొహం వేళ్ళాడుసు కొచ్చిన సతీష్ ని చూడగానే విషయం అర్థం అయ్యింది కానీ తనే చెబుతాడని చూసింది.. రెండురోజులు ఊరుకుంది మూడో రోజు అడగగానే చెప్పిన విషయం విని మ్రాన్పడిపోయింది .. "చాప ఉన్నంత వరకే కాళ్ళు చాపుకోవాలి. ఏదో ఒక Govt School లో చేర్పించ మన్నారు " "మరి మీరేం అనలేదా.. " "ముందు ముందు పెళ్ళి పేరంటాలకు అవసర మవుతాయి అప్పుడేం చేస్తారు, అందుకని స్కూల్ చదువే కదా ఎక్కడైనా చదవొచ్చు అంతా ఒకటే" అని నాన్నగారన్నారు" అని చెప్పాడు.. సంగీత ఏం మాట్లాడలేదు ఆఫీస్ కి వెళ్ళి పోయింది "అక్కడి నుండే శ్రీధర్ కి ఫోన్ చేసింది " సార్ దగ్గర నాకు 30 వేలు అడ్వాన్స్ ఇప్పిస్తారా అన్నయ్యా? నెల నెలా కొంత కడుతుంటాను పాపను స్కూల్లో జాయిన్ చేయాలి " అన్నది అదేంటి సతీష్ ఏం అంటాడు ...జరిగినవన్నీ చెప్పింది.. "ఇంక ఈ అడుక్కోవడాలు, వాళ్ళ మీటింగులు నా వల్ల కాదు , దాన్ని నేను కన్నాను, నేను కావాలనుకుంటేనే అది ఈ భూమ్మీదకొచ్చింది దాన్ని చూసే భారం, బాధ్యత నాదే .. " " నేనేం అడగ కుండా కామ్ గా ఇల్లు గడుపుతున్నన్ని రోజులు మంచి దాన్నే అన్నయ్యా! అడిగిన రోజు ఇలాంటి జవాబులు... నాక్కూడా విసుగ్గా ఉంది ఇవన్నీ నేను భరించలేను . నాకు పనిచేయడం, బాధ్యత తీసుకోవడం ఇష్టమే నేనేం బాధపడడం లేదు కూడా " అని చెప్పి ప్లీజ్ "ఈ ఒక్క సాయం చేయండి "అని ఫోన్ పెట్టేసింది రెండు మూడు రోజులు గడిచినా ఏం జవాబు లేదు .ఏం చేయాలో అర్థం కాలేదు.. నాలుగో రోజు ఆఫీస్ నుండి రాగానే సంగీత చేతిలో 30 వేలు పెట్టాడు సతీష్ .. "ఎక్కడివని " అడిగింది "ఇప్పుడు అన్నయ్య ఇచ్చాడు ..నేను తరువాత నాన్న దగ్గరకెళ్ళి డబ్బు తెచ్చి అన్నయ్యకివ్వాలి" అన్నాడు ఏం మాట్లాడకుండా తెల్లవారి వెళ్ళి స్కూల్ లో ఫీజ్ కట్టి వచ్చారు. స్కూల్ తెరవడానికి నాలుగు రోజుల ముందు వచ్చి Uni Form, Books తీసుకెళ్లమన్నారు.. మరునాడు శ్రీధర్ phone చేసి "డబ్బులందాయా?" అని అడిగాడు "ఆ అందాయి అన్నయ్యా! మీరిచ్చారా?" "లేదు బావగారికి చెప్పాను , పెళ్ళికన్నా ముందు చదువు ముఖ్యం కదా ముందు ఆ పని చూడండి. నేను ఆఫీస్ లో అడిగి ఇప్పించగలను కానీ మన పరువు,మర్యాద ఏమవుతాయి? అని చెప్పా 'సరే' అన్నారు బావగారు.. " "Thanks అన్నయ్యా"అని చెప్పి Phone పెట్టేసింది సంగీత . పోనీ అన్నయ్య మాట సీరియస్ గా తీసుకుని ఆలోచించారు బావగారు అనుకుంది.. పాప స్కూల్ కి వెళ్ళే రోజు రానే వచ్చింది.. పాపకు Uni form వేసి రెడీచేసి దేవుడికి దండం పెట్టించింది ..సతీష్ సంగీత ఇద్దరు కలిసి పాపను స్కూల్ లో దింపారు.. చిన్న పిల్లలందరూ ఏడుస్తూ లోపలికి వెళుతుంటే ప్రవల్లిక మటుకు నవ్వుతూ టాటా చెప్పి లోపలికెళ్ళింది... తల్లీ ! నీ జీవితం ఆనందంగా ఉండాలి , నువ్వు బాగా చదువుకొని పైకెదగాలి , హాయిగా నవ్వుతూ ఉండాలి అని మనసులో అనుకుని ఆఫీస్ కి వెళ్ళింది.. సతీష్ ఇంటికొచ్చాడు సశేషంబాంధవ్యం ... 26మొదటి రోజు కదా పదకొండున్నర కల్లా ఇంటికి పంపించేసారు. అక్కడే ఉండి పాపను ఇంటికి తీసుకొచ్చారు .. పాపకు అన్నం పెట్టి ఆఫీస్ కి వెళ్ళాలని లేకున్నా వెళ్ళింది .. ప్రవల్లిక నువ్వుతూనే " వెళ్ళమ్మ చదువు కుంటాను " అంది.. P1 అంతా సాఫీగా గడిచింది మధ్యాహ్నం పన్నెండున్నర వరకే స్కూల్,స్కూల్ నుండి రాగానే అన్నంపెట్టి నిద్రపుచ్చడం సతీష్ కి డ్యూటి అయిపోయింది. సంగీత సాయంత్రం వచ్చేలోపల దగ్గరున్న గుడికి లేదా పార్క్ కి తీసుకెళ్ళి వచ్చేవాడు .. ప్రవల్లిక P2 లోకి వచ్చింది.వయసుకు మించిన తెలివి,.విమర్శగా పనులు చేయడం నేర్చుకుంది. ఉద్యోగం చేసే అమ్మలున్న పిల్లలు అలాగే నేర్చుకుంటారేమో అని అందరూ అనడమే.. పాఠశాల వార్షిక దినోత్సవంలో , ప్రవల్లిక డాన్స్ లో పాల్గొన్నది. కానీ చూడడానికి ఎవరూ లేరు సంగీత సతీష్ తప్ప.. డాన్స్ ప్రోగ్రామ్అయ్యాక బహుమతులను ప్రకటించారు .. P2 అన్ని sections లోఉన్న స్టూడెంట్స్ అందరిలోకి ప్రవల్లిక 1St వచ్చింది.. తన 1st Profesioncy Prize స్టేజ్ మీద తీసుకుంది.. సంగీత చాలా సంతోషంగా ఫీల్ అయ్యింది సతీష్ కూడా ఇంటి కొచ్చి అందరికీ ఫోన్ చేసి చెప్పాడు... ఈ ఆనందాన్ని అందరూ సెలబ్రేట్ చేసుకుందామనుకున్నారు.. మరుసటి రోజు అందరూ డిన్నర్ కి బయట కెళ్ళారు. సతీష్ బిల్లు ఇవ్వబోతుంటే వద్దని హరీషే కట్టేసాడు .. తొమ్మిదేళ్ళ తరువాత ఇంట్లో చంటిపిల్ల అందులో అందంతో పాటు చదువు కూడా పోటీ పడుతుంటే అందరికీ ముద్దుగా ఉంది.. మరో సంవత్సరం గడిచింది ఈ సారి శలవలకు పై చదువులకు వెళ్ళిన పిల్లలంతా వచ్చారు . అందరికీ ప్రవల్లిక ప్రాణం అయిపోయింది .. సినిమాలు, షికార్లు , తీర్థయాత్రలు పిక్నిక్లకూ హాలిడే టూర్స్, అన్నీ తిరిగారు. కొన్ని చోట్లకు సంగీత వెళ్ళలేకపోయినా, ప్రవల్లిక పిల్లలందరికి మాలిమయిపోయింది అందరితో సరదాగా గడిపింది .. సెలవలయిపోగానే ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళి పోయారు.. పాప చిన్న బుచ్చుకుంది, రెండు రోజులు దాకా తేరుకోలేదు.అయ్యో! ప్రవల్లిక పెద్దదయ్యింది దానికి తోడుకావాలి అన్న జ్యోతి మాటలకు ఉలిక్కిపడింది .. అవును తనకెందుకు ఈ అనుమానం రాలేదు అనుకుంది. సాయంత్రం ఆఫీస్ నుండి డాక్టర్ పద్మ దగ్గరకు వెళ్ళింది.. తన అనుమానం నిజం చేస్తూ మూడో నెల అంది. ఒక్కసారి కంపించి పోయింది దేవుడా! ఇప్పుడెలా "వదినా! ఇప్పుడు ఇది నాకొద్దు వదినా! మందులివ్వలేరా" అంది "లేదు సంగీతా! మూడోనెల tablets పని చేయవు. D& C చేయాల్సిందే .అయినా ఎందుకు సంగీతా వద్దను కుంటున్నావు .." "వద్దొదినా నాకెందుకో భయంగా ఉంది దయచేసి ఎవరికీ తెలీక ముందే అబార్షన్ చేసేయండి.." "OK రేపు Scanning , Blood Test చేయించుకునిరా "అని పంపించింది .. ఇంటికొచ్చినా మనసు మనసులో లేదు సంగీతకు.. తెల్లవారి ఆఫీస్ కెళ్ళే ముందు వెళ్ళి blood ఇచ్చి Scanning చేయించుకుంది .. ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు రిపోర్ట్స్ తీసుకుని పద్మ దగ్గరకెళ్ళింది. "అంతా బాగుంది ,లోపల బేబీకూడ బాగుంది. కానీ! నువ్వు, నేను అనుకుంటున్నట్టు మూడు కాదు నాలుగవ నెల వచ్చింది. కష్టం సంగీతా " అన్నది.. ఏం మాట్లాడకుండా ఇంటి కొచ్చింది.ఎవరికీ ఏం చెప్పలేదు..." వద్దు, నా కొద్దు , పాపైనా , బాబైనా నేను పెంచలేను, మంచి చదువు చెప్పించి మంచిగా చూడలేను "అనుకుంది తెల్లవారి ఆఫీస్ కి సెలవు పెట్టి ఇంటికి కాస్త దూరంలో ఉన్న నర్సింగ్ హోమ్ కి వెళ్ళింది రిపోర్ట్స్ చూపించింది .. ఆవిడ అన్నీ చూసి "రిస్క్ కానీ కష్టమేమీ కాదు రేపు రండి ఎవరినో ఒకరిని వెంట బెట్టుకుని " అంది .. నేను ఒక్కదాన్ని వస్తే సరిపోదా అన్నది " లేదమ్మా ఎవరో ఒకరు తోడుండాలి"అంది.. " తెల్లవారి డాక్టర్ రమ్మన్న సమయానికి వెళ్ళారు సతీష్ , సంగీత .. అంతకు ముందు రాత్రి చాలా మాట్లాడు కున్నారు "మగపిల్లాడు పుడతాడేమో ఉండనీ " అన్నాడు సతీష్ .. " మగపిల్లాడయితే అస్సలు వద్దు.ఆడపిల్లయితే అన్నా పెళ్ళి చేసి పంపించవచ్చు. కానీ మగపిల్లాడు పుడితే అలాకాదు ఒక మంచి ఇల్లు ,ఉద్యోగం,మంచి కుటుంబ నేపధ్యం ఉంటేనే, మంచి కుటుంబం నుండి సంబంధాలు వస్తాయి వచ్చిన అమ్మాయి సంతోషంగా ఉంటుంది.." "దెప్పుతున్నావా నన్ను" అన్నాడు "లేదు, మా తరంవేరు , వచ్చే తరం వేరు,తరానికి తరానికి అంతరం ఉంటుంది. " "సరే లే నీఇష్టం నేనేమన్నా నీకు నచ్చదు.. " అని సతీష్ ఒప్పుకున్న తరువాత ఇద్దరూ కలిసి హాస్పిటల్ కి వచ్చారు.. దేవుడికి దండం పెట్టుకుంది. పొట్ట తడిమి చూసుకంటూ ఏడ్చింది.. " నిన్ను ఈ ప్రపంచం లోనికి తీసుకురాలేక పోతున్నందుకు నన్ను క్షమించమ్మా! ఇద్దరు పిల్లలను పెంచలేను.." "అంత జాగ్రత్తగా ఉన్నా నాతో ఈ పాపం చేయించడానికే నువ్వు వచ్చావా తల్లీ. నీ రాకను నేను సంతోషంగా ఆస్వాదించలేను నిన్ను ఆహ్వానించ లేను.. " అనుకుంటూ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని O T లోని బల్ల మీద పడుకుంది. "అంతా OK కదా! మీ నిర్ణయం మార్చుకోలేదు కదా ? అలాఅడగడం మా ధర్మం అంటూ ఇంజెక్షన్ ఇచ్చింది.. "చాలా హెల్దీ బేబి, నాకే మనసు రావడం లేదు ఇలా ఎందుకు చేసుకుటుందో , పాపం ఈ అమ్మాయి , ప్రాబ్లమ్స్ ఏంటో " అని డాక్టర్ మనసులో అనుకుంది.. సాయంత్రం దాకా అబ్జర్వేషన్ లో ఉంచుకుని కొన్ని మందులు రాసి పంపించింది డాక్టరు ఇంటికొచ్చి పడకుంది,మూడు రోజులు రెస్ట్ తీసుకుని ఆఫీస్ కి బయలుదేరింది. ఇంట్లో అంతా సతీషే చూసుకున్నాడు. ఎవరికి ఏం చెప్పలేదు కానీ సంగీత పాపం రెండు రోజులు బాగా ఏడ్చింది .. ఈ బాధ తనను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది అనుకుంది .. తన నిర్ణయం సరైనదేనని తరువాత జరిగిన సంఘటనలు సంగీతకు ఓదార్పునిచ్చాయి... సశేషం బాంధవ్యం ... 27స్త్రీ మనసును అందునా తల్లి మనసును ఎవరూ అర్థం చేసుకోరు,చేసుకోలేరు.... మరొక స్త్రీ కూడానేమో ఎందుకంటే ఎవరి ఆలోచనలు వారివి ఎవరి మనసు వారిది.. నారు పోసినవాడు నీరుపోయడా అంటారు . కానీ ఒక ఆశయంతో , ఒక ఆలోచనతో, పద్ధతిగా పిల్లలను పెంచాలనుకున్నప్పుడు కొన్ని పరిస్థితులు ప్రతిబంధకంగా అనిపిస్తాయి... ఒక నాలుగు నెలలగుడ్డు కోసం బాధ పడితే, పుట్టిన వారిని చక్కగా పెంచలేక పడాలి,ఆ బాధ కన్నా ఇదేం ఎక్కువ కాదు ఇలా అనుకుంటూ సంగీత తనకు తానే సమాధానపడింది... పెద్దవాళ్ళు ఇచ్చేది ఇచ్చారు, ఇంక వాళ్ళనేం అడుగుతాం . ఇచ్చింది జాగ్రతగా దాచుకుని సంపాదించిన దాంతో ఇల్లు గడుపుకుంటే చాలనుకుంది సంగీత.ఇంటి ఖర్చులకు ఏనాడూ సతీష్ ఇవ్వలేదూ సంగీత అడగలేదు.. కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే అనే మాట మీద చాలా నమ్మకమేమో సతీష్ కి ఒక్కరోజు కూడా అందులోనుండి ఖర్చుపెట్టలేదు. ఒక్క గాస్ సిలిండర్ కి తప్ప ,అది కూడా సంగీత ఆ టైమ్ కి ఉండదు కాబట్టి.. అలా గడిచి పోతున్నాయి రోజులు.. సంగీత ఈ జీవితానికి అలవాటు పడిపోయింది. సగటు భార్య లాగా, సగటు స్త్రీ లాగా జీవించడం నేర్చుకుంది . సంగీతకు ఆశలు ఆశయాలంటూ ఏమీ లేకపోయినా, కోరికలు తీరాలని, కానుకలు కావాలని అడగక పోయినా , అర్థం చేసుకుని ఆరాధించే భర్త , అతని ప్రేమతో కూడిన పలకరింపు చాలనుకుంది .. కానీ ! అందులో ఏదీ జరగనప్పుడు, జరగుతున్న దానికి ఆనందించడమే సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల చేసేది .... పుట్టింటి వారికి మాట రాకుండా , అత్తింటి వారి పరువుపోకుండా తనను తాను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటుంది .ఆ సంగతి ఎంత మందికి తెలుస్తుంది... ప్రతి రోజూ మనస్సాక్షికి విరుద్ధంగా మనసు చంపుకుని బ్రతకడమే ఆడవారి బ్రతుకు .. ఒక రోజు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక ప్రవల్లిక "అమ్మా టీచర్ డైరీ లో లెటర్ పెట్టింది నీకివ్వమని చూడు ఒకసారి"అంది లెటర్ తీసి చదివింది. Preparatory School అయిపోయింది 1St Class లో మీరు Rs 10000/ Admission fee pay చేయాలి అని దాని సారాంశం.. ఆమాటే సతీష్ కి చెప్పింది. "చచ్చినా ఇచ్చేది లేదు నాదగ్గరలేవు . కావాలంటే స్కూల్ మార్చుకో fees లేని స్కూల్ లో చేర్పించు" అంటూ వెళ్ళాడు . ఏం అంటుంది . ఇంక ఇక్కడ మాట్లాడి లాభం లేదు. భార్యా ,కూతురు , వారి బాధ్యత తనది అన్న స్ప్రుహే లేదు సతీష్ కి.. సంగీత ఎవరితో చెప్పలేదు చెప్పినా నమ్మరు. ఎందుకంటే అమాయకంగా నటించే అతి తెలివైన వాడు.. సంగీత పుట్టినరోజునాడు లలిత సతీష్ ని అడిగింది "సంగీతకేమిస్తున్నావు చీరా, బంగారమా" అని . "నాదగ్గరేమున్నాయి ఇవ్వడానికి " అన్నాడు "లేదులే ఊరికే అయినా చెప్పొచ్చుగా" అంటే నేనలా కమిట్ అవ్వను.మళ్ళీ దానికోసం గొడవ పడితే " అన్నాడు . సంగీత నవ్వుకుంది. అంతే ! అతన్నుండి ఏమీ ఆశించకూడదని ఆరోజే నిర్ణయించుకుంది .. అందుకే ఇన్నేళ్ళు పనిచేయడం వల్ల పెరిగిన చనువుతో వాళ్ళ బాస్ లక్ష్మీనారాయణగారిని అడ్వాన్స్ అడిగింది.. పాపం ఆయన లేదనకుండా ఇచ్చారు.. తెల్లవారి ఆఫీస్ కి వెళుతూ స్కూల్ లో ఫీజ్ కట్టేసింది..నా కూతురి కోసమే కదా అడిగింది అనుకుంది. కానీ ఎవరికి చెప్పకుండా తప్పు చేస్తున్నానా అని ఒక్క నిముషం కూడా ఆలోచించలేదు.. ఏ ఆడపిల్లయినా, స్త్రీ అయినా తన వారికోసం , తన భర్త, పిల్లల కోసం చేసేవాటికి పబ్లిసిటీ కావాలనీ, ప్రూఫ్ ఉంచుకోవాలనీ అనుకోదు.. అందుకే సతీష్ కి కూడా ఏం చెప్పలేదు. సతీష్ కి ఆ అవసరం కూడా లేదు.. తను ఆఫీస్ నుండి రావడం లేట్ అవుతున్నదని పెద్ద క్లాస్ కి వచ్చిన పిల్లకు ఏమీ చెప్ప లేక పోతున్నాని ప్రవల్లికను పక్కనే ఉన్న ఒక టీచర్ దగ్గర ట్యూషన్లో చేర్పించింది. ప్రవల్లికకు ఎక్కువ చెప్పే అవసరమే రాలేదు. చక్కగా తన హోంవర్క్ తాను చేసుకుని టీచర్ చెప్పినది రాసేది .. అందుకే టీచర్ కి కూడా పాపంటే ప్రాణమే... అన్ని రోజులూ మనవే అయితే చెప్పేందుకేం ఉంది . పొద్దున గుడికి వెళదామని కిందికి దిగిన మనిషి లిఫ్ట్ లోనుంచి బయటకు వస్తూ కింద పడిపోయాడు సతీష్ ... వాచ్ మెన్ గబగబా వచ్చి చెప్పాడు మవిషిని లేపడానికే రావడం లేదు ఎలాగోలా వాచ్ మెన్ సాయంతో పైకి లేపి పక్క వాళ్ళింట్లో ఉన్న వీల్ ఛైర్ లో కూచో పెట్టి ఇంట్లోకి తీసుకొచ్చింది. ఇడ్లీ పెడదామని లోపలికెళ్ళి తెచ్చే లోపల స్ప్రుహలో లేడు.. మెల్లిగా కాసేపు తరువాత తనే లేచాడు కానీ నడుము నొప్పని కూచోలేక ఎలాగో ఇడ్లీ తిన్నానని పించాడు.. ఇక లాభం లేదని సంగీత , వాళ్ళ ఆడబడుచుకు బావగారు వాళ్ళకు Phone చేసింది. ఇంకా ఎవరూ రాలేదు కానీ మళ్ళీ ఇంకో సారి అలాగే అయితే భయపడి చెప్పింది . ఏం కాదులే మేం రావడం కాస్త ఆలశ్యం అవుతుంది ,ఈ లోపు వాడిని ఫలానా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళమన్నారు . అంబులెన్స్ మాట్లాడింది మనిషి ని స్ట్రెచర్ మీద పడుకో పెట్టడానికి కష్టమవుతున్నది .... ముట్టుకుంటే నొప్పితో అల్లాడి పోతున్నాడు ఏంచేయాలో అర్థం కాలేదు మొత్తానికి వాళ్ళు చెప్పిన డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళింది అప్పటికే అక్కడ లలిత మోహన్ హరీష్ ఉన్నారు.. ముందే చెప్పారేమో వెంటనే లోపలికి తీసుకెళ్లి అన్ని పరీక్షలు చేసి MRI అన్నారు.. తిండి తిప్పలు లేకుండా ఉన్న సంగీతకు సోష వస్తున్నది.ఎవరో కాఫీ తెచ్చారు తాగి కూచున్న కాసేపటికి రిపోర్ట్ వచ్చింది.. దాన్ని తీసుకుని లోపలి కెళ్ళారందరూ. అన్నీ చూసిన డాక్టర్ గారు "వెన్నముక విరిగింది ఆర్థో పోడిక్ సర్జన్ advice తీసుకున్న తరువాత సర్జరీ అవసరమా లేదా అని చెపుతాను" అని చాలా కూల్ గా చెప్పారు .... సశేషం బాంధవ్యం ... 28డాక్టర్ విజయ్ కుమార్ గారు వచ్చారు, సర్జరీ చేయాలని, 1Lac దాకా ఖర్చవుతుందని చెప్పారు. సంగీత ఏం మాట్లాడకుండా కూచుంది తనకు సంబంధించిన విషయం కాదన్నట్టుగా... పెద్ద వాళ్ళు మాట్లాడుకుంటున్నారు .. హరీష్ చంద్ర శేఖర్ గారితో మాట్లాడుతూ విషయం చెబుతున్నారు.. ఆయన పద్మ తో మాట్లాడి ఆమెకు పరిచయం ఉన్న డాక్టర్ ని పంపించమన్నారు.. ఇంతలో అనురాధా, హరిహర్రావుగారు కూడా వచ్చారు.. వస్తూ అందరికీ ఇంటి నుండి కాఫీ తెచ్చారు అనూరాధ సంగీతను పక్కకు తీసుకెళ్ళి తాను తెచ్చిన ఇడ్లీలు తినిపించారు .. పాపం సంగీతకు పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టు అనిపించింది.... ఎంతయినా తల్లి ప్రాణం కదా.. అరంగంటయ్యాక పద్మతో పాటు డాక్టర్ శశిధర్ గారు వచ్చారు అన్నీ చూసి ఒకసారి నాకోసం CT scan తీయించమని చెప్పారు.. సరే అన్నింటితో పాటు ఇదొకటి అనుకొని తీయించారు... రిపోర్ట్ చూసి "సర్జరీ అవసరం లేదు మందులు వేసుకుంటూ 6weeks కదలకుండా పడుకుంటే చాలని సరి పోతుందని " చల్లని వార్త మెల్లగా చెప్పాడు.. సంగీత హమ్మయ్య అనుకుంది.. "ఇంట్లో ఉంటే ఎన్ని పనులైనా చేసుకోవచ్చును హాస్పిటల్ అంటే చాలా కష్టం" ..అని అనుకుంటున్న సంగీత దగ్గరకు హరీష్ వచ్చాడు.. "నాలుగు రోజులుంచుకుని పంపిస్తామన్నారు . నేనుంటాను ,వాళ్ళు ఇంటికెళ్ళి భోంచేసి వస్తారు తరువాత నువ్వెళ్ళు" అని చెప్పాడు ... "ఫరవాలేదు! అమ్మ , నాన్న ఉన్నారు కదా మీరు వెళ్ళండి " అని చెప్పింది "ఫరవాలేదు కదా " అని చెప్పి వెళ్ళాడు.. అందరూ వెళ్ళిపోయాక హరిహర్రావుగారు సతీష్ దగ్గర కూచున్నారు ..అనురాధ సంగీత బయట కూచున్నారు.. సంగీత తల్లి ఒడిలో తలపెట్టుకుని పడుకుంది ఎందుకో అదిమి పెట్టిన దుఖం ఒక్కసారిగా బయటకు వచ్చింది.. "ఏంఫరవాలేదమ్మ! తగ్గిపోతుంది బాగవుతుందని చెప్పారుగా డాక్టర్ గారు.. "అన్నది అనురాధ ఆవిడకు తెలీదు కదా! కూతురి మనసులో ఉన్న నిరాశా , నిస్ప్రుహ బడబాగ్ని . ఏం మాట్లాడకుండా కాసేపుండి ఇద్దరూ లోపలకెళ్ళారు.. సంగీత మనసు కాస్త తేలిక పడింది.. "పాపెక్కడుందమ్మా "అనడిగింది..".బామ్మ దగ్గరుంది ఫరవా లేదులే పుస్తకాలతో ఏదో కుస్తీ పడుతుంది " అని చెప్పింది.. హరీష్ వాళ్ళంతా వచ్చాక బలవంతాన సంగీతను వాళ్ళ అమ్మావాళ్ళను ఎంత వద్దన్నా వినకుండా ఇంటికి పంపించారు లంచ్ కోసం.. గబ గబా తినేసి అమ్మవాళ్ళని వద్దని తను ఒక్కతే బయలు దేరి వచ్చింది.. హాస్పిటల్ కి వెళ్ళగానే అందరూ కామ్ గా ఉన్నారు అప్పటి దాకా ఏదో సీరియస్ డిస్కషన్ జరిగినట్టుగా ఉన్నారు.. బహుశా! డబ్బులో లేక ఆయన గురించో తెలీదు.. సతీష్ చుట్టూ అందరూ కూచున్నారు.. అందుకే తను బయట కారిడార్ లో కూచుంది.. ముందులాగా ఎవ్వరూ సంగీత ఒక్కతే ఉన్నదని ఆమె దగ్గరకు రాలేదు , సతీష్ పడివున్న మంచం దగ్గర నుండి కదలడం లేదు.. బహుశా వాళ్ళ తమ్ముడికి అలా జరిగిందనేమో .. సాయంత్రం ఎవరో Tea తెచ్చిచ్చారు సంగీతకు, తాగింది లోపలికెళ్ళడానికి embarrassing గా ఉంది . మొట్టమొదటి సారిగా సంగీతకు ఒంటరి దాన్నయిన feeling కలిగింది . అలాగే కూచుంది.. 7 గంటలకు డాక్టర్ వచ్చారు. అతను చూసి వెళ్ళి పోతుంటేే యధాలాపంగా చూసింది డాక్టర్ మిశ్రా న్యూరో సర్జన్ అని కోట్ మీద రాసి ఉంది. ఒక్క నిముషం ఆలోచించింది.. తరవాత అడుగుదాంలే అని ఆగింది ..రాత్రి పదయ్యాక అందరూ వెళ్ళి పోయారు, వెళుతూ ఏమైనా తింటావా అనడిగారు, వద్దని చెప్పింది ఎందుకో మరి సంగీతను ఎవరూ బలవంతం చేయలేదు.. హరీష్ ఉంటానన్నా" వద్దు ఫరవాలేదు నేను ఉంటానని " చెప్పింది .. అందరూ వెళ్ళిపోయాక రూమ్ లోకి వచ్చి మంచం పక్కనున్న కుర్చీలో కూచుంది సతీష్ మంచి నిద్రలో ఉన్నాడు. పక్కన ఉన్న కేస్ షీట్ తీసి చూసింది . ఎపిలిప్సీ అని రాసి ఉంది, కొత్త పదం, సిస్టర్ రాగానే అడిగింది అంటే ఏంటీ అని. వాళ్ళు చెప్పిన సమాధానం విని మ్రాన్పడి పోయింది సంగీత అంటే సతీష్ కి అప్పుడప్పుడూ ఫిట్స్ వస్తాయన్న మాట.. తనకెవరూ చెప్పలేదేం ఎందుకు దాచారు .. ఎవరిని అడగాలి ..నువ్వడిగావా మేం చెప్పడానికి అంటే ఏం జవాబిస్తుంది. అందుకని సంగీత ఆ సంగతి వదిలేసింది.. తెల్లవారి అత్తగారు మావగారు వచ్చే దాకా తెలీదు సంగీతకు వాళ్ళు వస్తున్నటు.. ఏంటో ఈసారి అన్నీ వింతలే ... Break Fast చేసి వచ్చారట సతీష్ దగ్గర కూచుని ఉన్నారు.. అత్తయ్య కళ్ళ నీళ్ళు పెట్టుకుంది.. "ఏమయ్యిందమ్మా అసలు " అంటూ అడిగింది జరిగినవన్నీ చెప్పింది సంగీత.. డాక్టర్స్ వచ్చి వెళ్ళారు.. అందరితో మాట్లాడి విషయం తెలుసుకున్నారు చంద్ర శేఖర్ గారు .. అనురాధే సంగీతకు టిఫిన్ పంపిస్తున్నది.. చూస్తూ చూస్తూ నాలుగు రోజులయ్యింది.. ఆరోజు డిస్చార్జ్ చేసారు.. అంబులెన్స్ లో ఇంటికి తీసుకొచ్చారు.. అందరూ కలిసి జాగ్రతగా పడుకో పెట్టారు ..లలిత ముందుగా వచ్చి ఏర్పాట్లన్నీ చేసినట్టుంది . అందరూ మాట్లాడుతూ ఉండగానే సంగీత అందరికీ వంట చేసింది. జ్యోతి కూడా వచ్చింది భోంచేసాక అందరూ వెళ్ళి పోయారు.. ఎవరెలా ఉన్నా భర్త సేవలు తప్పవుకదా.. సంగీత సతీష్ ని లేపుతున్నప్పుడు, Sponge both ఇస్తున్నప్పుడు,వాళ్ళ అమ్మా , నాన్న ముందు కావాలని అరుస్తుండే వాడు, విసుక్కునే వాడు. అన్నీ పంటికింద అదిమిపెట్టి చేసేది . సతీష్ ని చూడడానికి వచ్చే వారికి చేయడం , సతీష్ కి చేయడం ఇదే సరిపోతున్నది సంగీతకు.. ఎలాగోలా నాలుగు వారాలు గడిచాయి అంటే నెలన్న మాట..ఇంక ఆగలేక సతీష్ ,సంగీతను అడిగాడు "నీకు జీతమిస్తారా ఈ నెల ,ఇవ్వకపోతే ఎలాగ వెళ్ళు వెళ్ళు అంటూ ఆఫీస్ కి పంపించాడు... సంగీతకు చాకిరి మరీ ఎక్కువయ్యింది ఇంటి పని, వంటపని, ఆఫీస్ కి వెళ్ళి రావడం .. పాపం ఏమనుకున్నారో లక్ష్మినారాయణగారు సగం జీతం ఇచ్చారు.. ఇంట్లో ఖర్చులెక్కువగా ఉన్నాయి . పాప fees కడితే సరుకులకుండవు,సరుకులు తెస్తే fees కట్టలేదు. అదే మాట ఎవరూ లేకుండా చూసి మెల్లగా సతీష్ కి చెప్పింది .. అంతే గయ్యిన ఇంతెత్తున లేచాడు. " నాదగ్గరెక్కడున్నాయి hospital కి మందులకు అయిపోతున్నాయి, fees సంగతి తర్వాత చూడొచ్చు ముందు సరుకులుతే " అన్నాడు.. సరే అనుకుంది.. ప్రవల్లిక డైరీలో జరిగిన సంగతి రాసి పంపింది..Fees Next month కడతానని.. List రాసి సరుకులు తెచ్చి అన్నీ సర్దింది సతీష్ కి అన్నం పెట్టబోతుంటే "నువ్వొద్దు అమ్మ పెడుతుంది " అని వాళ్ళమ్మ పెడితే తిన్నాడు.. అందరి భోజనాలయ్యి వంటిల్లు సద్ది పడుకోబోతుంటే చంద్రశేఖర్ గారు రూమ్ లోకి పిలిచారు.. దేనికో అని వెళ్ళింది.. చేతిలో నోట్ల కట్ట పెడుతూ "ఇవి ఇంటి ఖర్చులకుంచమ్మా!" అన్నాడు అంత వరకూ బాగానే ఉంది.. తరువాత "వాణ్ణి డబ్బుల కోసం సతాయించకు పోట్లాడకు,ఏమైనా ఉంటే నాకుచెప్పు, నేను చూస్తాను ".. మొన్న నువ్వు పాప ఫీజు కోసం గొడవపడ్డావట కదా! అదే వాడి మనసుకు తగిలి fits వచ్చాయట.. ఏదో మెంటల్ స్ట్రెస్ వల్ల ఇలా అయ్యింది అన్నారు డాక్టర్ గారు, ప్రతి రోజూ ఆగకుండా అడిగేదానివని, సతాయించావని " చెప్పాడు.. "తప్పు కదమ్మా! మాకెవరికి చెప్పినా మేం చూసే వాళ్ళం కదా! ఇప్పుడు చూడు ఎంత ఖర్చు , వాడికెంత ఆయాసం ఇవన్నీ అవసరమా చెప్పు." అసలాయనేం మాట్లడుతున్నాడో సంగీతకు వినపడలేదు, 'ఒక్క fees కోసం గొడవ పడ్డావట ' అని తప్ప.. అంతే కళ్ళ ముందు చీకటి తప్ప ఏం కనిపించడం లేదు ...... సశేషంబాంధవ్యం ... 29
ఎందుకో కళ్ళు తిరిగినట్టున్నాయి. కింద పడబోతూ కుర్చీ మీద చేయివేసి నిలదొక్కుకుంది..చేతిలోంచి జారిపడబోతున్న నోట్లను కిందపడకుండా గట్టిగా పట్టుకుంది ..తిరిగి ఇవ్వడానికి చంద్రశేఖర్ గారి దగ్గరకెళ్ళింది. "ఉండనీయమ్మా అవసరాలకుంచు " అన్నారు.. మెల్లిగా సుచరిత చేతిలోపెట్టి "మీరే వాడండి అత్తయ్యా" అంటూ సతీష్ రూమ్ లోకెళ్ళింది .. మందుల ప్రభావమేమో తొందరగానే పడుకుంటున్నాడుసతీష్. ప్రవల్లిక దగ్గరకెళ్ళి పడుకుంది సంగీత .. పక్కకు తిరిగి చూస్తుంటే గోడ పగుళ్ళుపారి కనిపించింది . అది చూసి నవ్వుకుంది.. కాస్తయినా రిపేర్ చెయ్యకపోతే ఎప్పుడైనా పడిపోయే లాగా ఉంది .. "నిజమే! గోడైనా, కాపురమైనా అంతే కదూ.. ఎన్ని రోజులని తను ఒక్కతే ఆలోచిస్తుంది.ఏది ఎలా అవుతే అలా అవుతుంది " అనుకుంటూ నిద్రలోకి జారుకుంది.. ఆరువారాలు పూర్తయ్యాయి. డాక్టర్ అపాయింట్ మెంట్ తీసుకుని ఆసుపత్రికి వెళ్ళారు . X Ray, scanning కూడా అయ్యాక, చాలా బాగా అతుక్కున్నట్టుగా చెప్పారు డాక్టర్ గారు. మెల్లి మెల్లిగా కూచుంటూ, అప్పుడప్పుడూ నడవమన్నారు. Physiotherapy వద్దన్నారు.. ఏమాట కామాటే చెప్పుకోవాలి పట్టుదలతో 10 రోజుల్లో నడవడం నేర్చుకుని 20 రోజుల్ల పార్క్లో నడవడం మొదలుపెట్టాడు సతీష్. మెల్లిగా నార్మల్ అయ్యాడు ... కానీ! సంగీత కాలేక పోయింది ఆర్థికంగా, మానసికంగా కూడా .. అనవసర ఖర్చులు చాలా వరకు తగ్గించుకుంది.. సతీష్ కి మటుకు అన్నీ వేళకి యధావిధిగా కావలసిందే.. ఈ సంఘటన జరిగాక సతీష్ మరీ గారాలు పోతున్నాడు. అందరూ అలా చంటిపిల్లడిలా చూసుకుంటుంటే సంగీతకెందుకో చాలా అసహజంగా అనిపించింది. " పాపం నేను ప్రవల్లికను కూడా ఇలా చూసుకోవడం లేదుగా" అనుకుంది.. ఆరోజు సాయంత్రం తినడానికి threptin biscuits లేవని సంగీత ఆఫీస్ నుండి రాగానే గొడవ.. "చేతిలో డబ్బులులేక తేలేదు "అని చెప్పిన సంగీతను ఇష్టం వచ్చినట్టు తిట్టాడు.. "డబ్బులు అడిగినన్ని ఇస్తున్నాంగా మరి తేవడానికేంటి. " "నేను డబ్బులు తీసుకోలేదు అత్తయ్య కిచ్చేసాను." "అయితే మటుకు అవి నీకిచ్చినవే కదా .. వద్దనుకుంటే మరి నీడబ్బులతో ఇల్లు సక్రమంగా నడుపు...నాకిప్పుడు బిస్కెట్స్ కావాలి " అని అటుంటే సుచరిత డబ్బులు తెచ్చి ఇచ్చింది. Medical Shop కి వెళ్ళి బిస్కెట్స్ తెచ్చింది .. "ఏం జీవితంనాది భగవంతుడా! అభిమానంతో వారి డబ్బు వద్దనుకుంది.. కానీ అర్థం చేసుకునే వారేరి ..? మన ఆలోచనలును బట్టి , మన రాతను బట్టి మన నిర్ణయాలుంటాయట "నిజమే! ఆ సమయంలో జాతకం కలవడమే ముఖ్యమనుకున్నది సంగీత, కానీ జాతకాలకు గుణగణాలకు పొంతన కుదరటంలేదు .. అసలు భార్యా పిల్లలను గురించి ఆలోచించని మనిషుంటాడా అని ఆలోచిస్తుంటే తన ముందే ఉన్నాడుగా ఇంకెందుకు అనుమానం.. అనుకుని వాపోయింది సంగీత.. ఒక రోజు పొద్దున్నే చంద్ర శేఖర్ గారు " అమ్మా సంగీతా! ఇంక అంతా బాగుపడినట్టే కదా మేం రేపు బయలుదేరుతాం" అని చెప్పారు.. "అయ్యో! అప్పుడేనా " "బాబు అన్ని పనులు చేసుకోగలగుతున్నాడు కదా మేం ఉండి కూడా చేసేదేం లేదు నీకు పని తప్ప" అన్నారు. ఆయన ఏదన్నా నిర్ణయం తీసుకుంటే దాన్నెవరూ మార్చలేరు అందుకే ఏం మాట్లాడకుండా ఉండి పోయింది.. అప్పుడే చంద్ర శేఖర్ వాళ్ళు వెళ్ళి నెలరోజులయ్యింది... "ప్రవల్లిక ఎందుకో చాలా డల్ అయ్యింది టిఫిన్ బాక్స్ కూడా సరిగ్గా తినడం లేదు" అని నాలుగు రోజులనుండీ రోజూ సతీషే సంగీతకు చెబుతున్నాడు.. మళ్ళీ ఒకరోజు తనే.. "రేపటినుండి నేను వెళ్ళి చూస్తాను" అన్నాడు. లలిత , వనిత వాళ్ళుా కూడా ఎందుకో సంగీతతో మాటలు తగ్గించారు.సంగీత కూడా వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించడం లేదు. భర్త సరిగ్గా లేనప్పుడు,భర్త భార్యను ప్రేమగా చూడనప్పుడు ఏ స్త్రీ కైనా భర్త వైపు బంధువుల ఆదరణ తగ్గుతుందేమో, వారి మీద ఇంట్రస్ట్ కూడా ఉండదేమో? సంగీత కూడా వారి గురించిన ఆలోచనలు తగ్గించింది.అంతే కాదు,చుట్టుపక్కల ఏంజరుగుతుందో చూడడం మానేసింది.. ఇల్లు, ఆఫీస్, ప్రవల్లిక చదువు అంతే .. తన జబ్బు విషయం ఎలాగూ తెలిసిందనేమో సతీష్ ప్రవర్తనే మారి పోయింది. సగటు భర్తలాగా... భార్య తన మాటవినాలని, తనకన్నీ చేయాలనీ కోరుకుంటున్నాడు.అందులో ఆనందం పొందుతున్నాడు.. తనొక మగవాడిననే అహంకారం, ఏదైనా చేయగల అధికారం తనకున్నాయని పెట్రేగి పోతున్నాడు, మాటలో కొంత కరుకు దనం వచ్చింది.. ప్రేమతో ఏదైనా చేయవచ్చును అనే విషయం మరిచి పోయాడు... సంగీత వాదించదు, ఎదురుమాట్లడి తన మనసు పాడుచేసుకుని తన సమయం వ్రుధా చేసుకోవాలని అనుకోవడం లేదు ... ప్రవల్లిక పెద్దదవుతున్నది, తన ముందు తండ్రిని చెడుచేయకూడదు, తమ మధ్య పొర పొచ్చాలున్నట్టుగా ప్రవల్లికకు తెలియకూడదని చాలా సహనంగా ఉంటున్నది. కానీ , సతీష్ బలవంతంగా తన కోరికలు తీర్చుకోవడం మటుకు భరించలేక పోతుంది.. ఒక ఆడదానికి ఇంత కన్నా పెద్ద శిక్ష ఏం ఉంటుంది...ప్రేమలేని చోట కోరికెలా పుడుతుంది. ఆడది ఒక యంత్రమా? కావలసినవన్నీ తీర్చడానికి కోరినవన్నీ ఇవ్వడానికి.. మనసులో , శరీరంలో స్పందనలే లేనప్పుడు, శరీరమే సహకరించనప్పుడు అది బలాత్కారమే కదా.. కానీ సంగీత పాపం అతని జబ్బును ద్రుష్టి లో పెట్టుకుని చాలా వరకు సహనంగానే భరిస్తున్నది .. ఒకరోజు ఆఫీస్ నుండి సంగీత రాగానే సతీష్ బయట కెళ్ళాడు ..ఆ వెళ్ళిన వాడు ఇంటికి రాలేదు. ఇక్కడ ఎవరింటికి వెళ్ళినా వచ్చేవాడు. రాలేదంటే ఊరెళ్ళి ఉంటాడు అనుకుంది . కానీ ఎవరికీ చెప్పలేదు.. ప్రవల్లికని ఎక్కడ,ఎలా ఉంచాలా అనుకుంది. కానీ సమస్య చాలా తేలిగ్గా సమసి పోయింది. పొద్దున రెడీ చేసి స్కూల్ లోదింపి సంగీత ఆఫీస్ కి వెళుతున్నది. ప్రవల్లిక స్కూల్ నుండి ఇంటికి రాగానే ట్యూషన్ కి వెళుతుంది . సంగీత రాగానే ఇంటికి తెచ్చుకుంటుంది.. ఎందుకో ఈ రోజు సతీష్ గురించే ఆలోచిస్తుంది సంగీత ..వారం రోజులయ్యింది ఇంకా రాక పోవడమేంటి అని , ఇంతలో ఫోన్ మోగింది జ్యోతి ... సంగీత ' హలో ' అనగానే నాన్ స్టాప్ గా మాటలు మొదలు పెట్టింది "అసలేమనుకంటున్నావు నువ్వు, చాలా గొప్పదానివనా, చేసుకునేటప్పుడు తెలీదా సతీష్ చదువు సంధ్యలు ఏంటో? ఇన్ని రోజులకు అవన్నీ గుర్తొచ్చాయా? మనిషి అనారోగ్యంతో ఉన్నాడని తెలిసి కూడా అవన్నీ గుర్తు చేస్తూ గొడవ పెట్టుకుంటావా తప్పుకాదా? మళ్ళీ ఏమన్నా అయితే నీకేంటి ? డబ్బులు ఎవరివి పోతాయి, ఆయాసం ఎవరికీ .. నాకు చెప్పాడు కాబట్టిసరిపోయింది ". మావయ్యగారికి తెలిస్తే ఏమయ్యేది అని సంగీత జవాబు కోసం చూడకుండా పెట్టేసింది.. ఒక్క నిముషం సంగీతకు ఏం అర్థం కాలేదు. జ్యోతి మాటలకు సతీష్ ఇంట్లో నుండి వెళ్ళి పోవడానికి ఏమైనా కనెక్షన్ ఉందా? అని ఆలోచిస్తున్నది . అంతే అతను వెళ్ళడానికి ముందు రోజు రాత్రి జరిగినది గుర్తొచ్చింది. తనకు ఒంట్లో బాగోలేక తను సతీష్ ని దగ్గరకు రానివ్వలేదు, కొంచం గట్టిగానే చెప్పింది.. అంటే అసలు విషయందాచి ఇలా చెప్పాడన్న మాట, ఆహా ! ఏంమనిషి తనమీద సింపతీ కలగాలని ఇలా కూడా అబద్దాలాడొచ్చని తెలిసింది. వెరీ గుడ్ ఏం చెప్పుకుంటారో చెప్పుకోని మీటింగులుపెట్టడం వీళ్ళకు అలవాటే కదా? అప్పుడు సిగ్గు,శరం అన్నీ వదిలి అందరి ముందు జరిగినవన్నీ చెబుతాను అనుకుంది.. సశేషం .. (Note.. ఎవరికీ చెప్పలేని ,చెప్పుకోలేని కొన్ని సమస్యల వల్ల జీవితాలు అల్లకల్లోలం అయిపోతాయి. ఇక్కడ ఈ సంఘటనతో సంగీత జీవితం ఏ మలుపు తిరుగుతుందో తెలీదు కానీ కథకు ఇదే కీలకమైమది అందుకనే ఈ అంశం ప్రస్తావించాల్సి వచ్చింది Sorry) బాంధవ్యం ... 30
అనురాధకు ఫోన్ చేసి అమ్మ నేను రాత్రి వస్తున్నాను అని చెప్పింది సంగీత.. సాయంత్రం ఆఫీస్ నుండి రాగానే బాగ్ లో బట్టలు సర్దుకుని ప్రవల్లికను తీసుకుని వాళ్ళ అమ్మా వాళ్ళఇంటికి బయలు దేరింది . "అమ్మా నాన్న ఎక్కడ " అని అడుగుతున్న ప్రవల్లికకు ," నానమ్మా వాళ్ళ దగ్గరికి వెళ్లారు మనం అమ్మమ్మ వాళ్ళదగ్గరికి వెళుతున్నాం రేపు శనివారం కదా! రేపు, ఎల్లుండి నీకు సెలవు కదా అందుకని సరేనా.. " "సరే! మళ్ళీ నాన్న వచ్చినప్పుడు రావాలా? " "లేదులే Monday వచ్చేద్దాం ..సరేనా " "Ok అంది ప్రవల్లిక.. " ఇంటికెళ్ళగానే అందరూ ఆప్యాయంగా పలకరించారు. కాసేపు అమ్మను హత్తుకుని కూచుంది. హర్ష పాపను తీసుకుని బయటకెళ్ళాడు... "ఏంటమ్మ చాలా చిక్కిపోయావు, నీ గురించి కూడా నువ్వు చూసుకోవాలిగా "అన్న అమ్మను నవ్వుతూ చూసింది... హరిహర్రావుగారు కూడా "నవ్వడం కాదు ఆఫీస్ కెళ్ళాలి, ఇల్లు చూసుకోవాలిగా! అందుకైనా బలంగా ఉండాలి కదమ్మా" అన్నారు. చాలా రోజుల తరువాత కన్న వారి ప్రేమ రుచి చూసింది. కొసరి కొసరి అన్నం తినిపించారు.. పాప హర్ష దగ్గర పడుకుంది.. సంగీత బామ్మ దగ్గర పడుకుంది , రాత్రంతా బామ్మ పెళ్ళిముచ్చట్లు చెప్పించుకుని విన్నది. "అన్నన్ని నెలలు, ఏళ్ళు మీ పుట్టింటికి వెళ్ళకుండా ఎలా ఉండే వాళ్ళు , మీకేం అనిపించేది కాదా బామ్మా ?"అనడిగింది. " మా కసలు తీరికెక్కడిది. అక్కడ వాళ్ళను చూసుకోవడానికి మా వదినలు, మరదళ్ళు ఉంటారు. మాకది పరాయిల్లు లాగనే ఉండేది, చిన్నప్పుడే ఇక్కడి కొచ్చేసాం కదా !" అన్నది.. ఎంత నమ్మకం కదా వీళ్ళకు తమ భర్త మీద అత్తవారింటి బంధువుల మీద అనుకుంది.. తెల్లవారి అమ్మ అన్నీ చేసిపెడితే హాయిగా ఆఫీస్ కి వెళ్ళింది .. సాయంత్రం వస్తూ అమ్మకు, బామ్మకు ఇష్టమైన స్వీట్స్ , నాన్నకిష్టమని సమోసాలు తెచ్చింది .. ఏంటో! తన, పర భేదం మొట్టమొదటి సారిగా ఫీల్ అయ్యింది..సంగీతకు కొండంత బలం వచ్చినట్టనిపించింది.. తెల్లవారి ఆదివారం అనూరాధ సంగీతకిష్టమని ఆవడలు, బామ్మ ముద్దకూర, పచ్చి పులుసు చేసింది.. సాయంత్రం హర్ష అడిగాడని సంగీత అందరికీ ఆలూబోండాలు చేసింది అందరూ కూచుని మాట్లాడు కుంటున్నారు. ఉన్నట్టుండి" సాయంత్రం వెళతానమ్మా "అంది "ఎందుకు సతీష్ లేడు కదా? వచ్చేదాకా ఉండొచ్చు కదమ్మా "అని బామ్మ అంది "లేదులే మళ్ళీ వస్తాను" .. బయట కెళుతున్న హర్షను చూస్తూ "తొందరగా రా హర్షా! మళ్ళీ నేను వెళ్ళాలి .. " అంది సంగీత . "బయటే ఉంటానక్కా! నువ్వు పిలవగానే వస్తా"అన్నాడు హరి హర్రావుగారు పాపతో ఆడుతున్నారు.. మిగతా ముగ్గురూ మాట్లాడుకుంటున్నారు . ఇంతలో హర్ష గబ గబా లోపలికి వచ్చాడు. "అక్కా బావగారు ఎక్కడున్నారు" అనడిగాడు. "ఎందుకు? " " పెద్ద బావగారొచ్చారు అడుగుతున్నారు ". లోపలికి తీసుకురా! అని హరి హర్రావుగారు అంటున్నారు వెంటనే సంగీత గబగబా బయట కొచ్చింది. " ఏంటి బావగారూ! ఏమైంది ?" అనడిగింది. " ఏంలేదమ్మా !ఇంటికెళితే తాళం ఉంది, ఇక్కడి కొచ్చారేమో అని వచ్చాను.నేను ఊర్లో లేను పొద్దున్నే వచ్చాను వాడితో పనుండింది" .. "ఆయన కూడా ఊరెళ్ళారు బావగారు " సరేలేమ్మా! నువ్వు లోపలికెళ్ళు నేను వెళతాను " అన్నాడు. "సరే "అని లోపలి కొచ్చింది. అరగంటైనా హర్ష రాలేదు. సంగీతకు గాభరా మొదలయ్యింది. ఇంటికి వెళ్ళాలన్న ధ్యాసపోయింది. రాత్రి 9గంటలకు వచ్చాడు హర్ష.. అందరూ అన్నం తినేదాకా ఆగాడు. పడుకున్న పాపని రూమ్ లో పడుకోపెట్టి వచ్చింది అనూరాధ. అప్పటికే హర్ష అక్కను నిలదీస్తున్నాడు.. "చెప్పక్కా! పెద్ద బావగారు కొంత చెప్పారు నీ నోటి నుండి వినాలని నేననుకుంటున్నాను.." "ఏముంది ఏంలేదు చిన్న గొడవేదో జరిగింది చెప్పా పెట్టకుండా ఇంట్లోనుండి వెళ్ళి పోయారు నేను ఆఫీస్ నుండి రాగానే..ఇన్ని రోజులయ్యింది కదా అత్తయ్యా వాళ్ళ దగ్గరకెళ్ళారనుకున్నా అంతే నాకు తెలుసు" అంది.. "ఎక్కడికీ వెళ్ళలేదు బావగారి వాళ్ళింట్లో ఉన్నారట. పొద్దున బావగారు చూసారట ఊరికే వచ్చారేమో అనుకుంటే పైన రూమ్ లో బావగారి బాగు ,బట్టలు కనబడ్డాయట " " ఏంటి సంగతి "అనడిగితే "ఏం లేదు ఊరికేనే " అన్నారట "మరి ఇవి ఇక్కడెందుకని అడిగితే సాయత్రం వచ్చేసరికి అన్నీ తీసుకుని వెళ్ళారట. ఇంటికొచ్చారేమోనని వెళితే, తాళం చూసి ఇక్కడి కొచ్చారట అదే అడిగారు." "ఏదో జరిగినట్టున్నది వాడు చెప్పలేదు,అందుకే వచ్చాను ఏం జరిగిందో కనుక్కుందామని కానీ సంగీత బానే ఉంది మరి problem ఎక్కడ " అన్నారు.. హర్ష మాట్లాడుతూనే ఉన్నాడు కానీ సంగీత బాగ్ దగ్గర ఆగింది. ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళలేదు అంటే నేను ఆఫీస్ కి వెళ్ళినప్పుడు వచ్చి తీసుకెళ్ళాడన్న మాట. అదీ ఇక్కడే రెండు కిలో మీటర్ల దూరంలో ఉండి కూడా, నన్ను వదిలేసినా,పాపను చూడ్డానికి కూడా రాలేదు.ఎంత కఠినుడు అని ఆలోచిస్తుంటే కళ్ళెంబడి నీళ్ళు కారి పోతున్నాయి . గాభరా పడుతూ బామ్మా అనూరాధ ఒక్కసారి సంగీత దగ్గర కొచ్చారు.. ఏమ్మా! ఏమయ్యింది? అని అడుగుతున్న బామ్మ ఒళ్ళో పడుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.. ఎవ్వరూ ఏం మాట్లాడ లేదు.ఉధ్రుతంగా వచ్చే ఏడుపు ఆగేదాకా Calm గా ఉన్నారు .. "ఏడుస్తూనే అడిగింది, బామ్మా! నేనేం పాపం చేసాను బామ్మా " "ఎందుకమ్మ అంత పెద్దమాటలు ఏమయ్యింది? " ఇక హర్ష ఆగలేక పోయాడు. "అక్కా ఇంక చాలు మాకు పిచ్చెక్కుతుంది విషయం చెప్పు.. " అందరి మనసులో అదే ఉన్నా కానీ హర్ష అడిగేసాడు. "అవునమ్మా! చెప్పమ్మా ! ఏం జరిగిందో.. " అని అందరూ అడుగుతుంటే సంగీతకు ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియడంలేదు. హరిహర్రావుగారు దగ్గర కూచొని సంగీత తల మీద చెయ్యివేసి " చెప్పమ్మా నీకు మేమంతా ఉన్నాం నువ్వు అనాధవు కాదుగా, నీకేం కష్టం వచ్చినా మాకొచ్చినట్టే కదమ్మా "అని అనగానే మెల్లిగా జరిగిన వన్నీ చెప్పడం మొదలు పెట్టింది బామ్మకు కోపంతో ముక్కు పుటాలదురుతున్నాయి, అనూరాధ కళ్ళెంబడి నీళ్ళు కారిపోతున్నాయి, హర్ష కు కోపం వచ్చినప్పుడల్లా చేత్తో బల్ల మీద కొడుతున్నాడు, హరి హర్రావుగారు పిడికిలి బిగించారు.. "ఏమ్మా నువ్వు అనాధవని నువ్వనుకున్నావా? వాళ్ళనుకున్నారా? వాళ్ళనేమీ అనను కానీ , "ఇంత జరుగుతున్నా నువ్వు మాకు ఏం చెప్పలేదూ అంటే నువ్వు మమ్మల్ని పరాయిని చేసావన్న మాట, లేదా! నీకు మేం లేమనుకున్నావా? చెప్పు! ఏదేవుడు చెప్పాడు నీకు నిన్ను ఇవన్నీ సహించమని" అని గట్టిగా అరిచారు. "ఆ!! . సంఘసేవికురాలు అనుకుంది,లోకాన్ని ఉద్ధరించాలనుకుంది" అని అంత కంటే గట్టిగా అరిచాడు.. హర్ష చెప్పమ్మా !అంది బామ్మ . "ఏంచెప్పను బామ్మా! నా మొగుడికి నేనంటే ఇష్టం లేదని చెప్పనా? నేనేం తప్పచేసాను, నాతప్పేంటమ్మా? ..వాళ్ళ ముగ్గురు కంటే నేనేం తక్కువ బామ్మా? అని అంటున్న సంగీతతో " అన్నీ ఎక్కువే తల్లి అందుకే భరించలేక పోయారు" అంది బామ్మ .. "ఆయన్ని పెళ్ళి చేసుకోవడమే నీ తప్పు. చెబితే విన్నావా?సతీసావిత్రిననుకున్నావు.పెళ్ళి చేసుకుని ఉద్ధరించడానికి బయలుదేరావు ,చిలక్కి చెప్పినట్టు చెప్పాం నేనూ , నాన్న . మాకు తెలుసు కదా మగవారి ఆటిట్యూడ్స్. మేమప్పుడే అనుకున్నాం ఆ మొహం చూసి ఏ పనీ చేయడని వింటేనా?.. లేదు! నేను చేస్తాను అని ఎగిరావుగా చెయ్యి,చేస్తే మటుకు నీకు ఏందక్కింది, కూలి దానివయ్యావక్కడ ..నీకు నీ పనికి ఏమైనా గౌరవం దక్కిందా? ఆ ముసలాయన ... "హర్షా !" అంటూ అనూరాధ అడ్డుకుంది "ఆగమ్మా ! నువ్వు మాట్లాడకు మీరే చేసారిదంతా . ఇదేమన్నా లవ్ మారేజా అక్క పట్టుబడితే మటుకు చేయడానికి. ఏం నాలుగు రోజులాగితే మంచి సంబంధం వచ్చేది కాదా ?" అంటూ ఆగకుండా ఇన్నాళ్ళూ ఆపుకున్న కచ్చంతా తీర్చుకున్నాడు హర్ష పోనీ లేమ్మా! ఇప్పుడు జరిగిన గొడవేంటి అని అడిగింది అనురాధ. చెప్పాలా? వద్దా అని ఆలోచించింది .హర్షను చూసి ఆగింది. కానీ, బామ్మ బలవంతం చేయడంతో చెప్పడం మొదలు పెట్టింది .. తనను బలవంత పెట్టేవాడని , ఆరోజు నేను ఖచ్చితంగా వద్దన్నాని వెళ్ళి పోయారమ్మా! ఇంత కంటే నేనేం అనలేదు అని ఏడ్చింది. "అమ్మా ! నిన్ను, నీ అభిమానాన్ని చంపుకున్నావా " అన్నారు హరిహర్రావుగారు. లేదు నాన్నా! అక్క తన అభిమానాన్ని,మన ఆత్మ గౌరవాన్ని ,పరువును అమ్ముకుంది. "ఎందుకురా అంత పెద్దపెద్ద మాటలు అది అసలే బాధ పడుతుంటే". "అననీ బామ్మా! వాళ్ళు కూడా బాధతోనే అంటున్నారు కదా ! "అంది ఏడుస్తూ. అనురాధ సంగీత తలనిమురుతూ అడిగింది "ఎందుకు నాన్నా నిన్ను నువ్వు తాకట్టు పెట్టుకున్నావు". "ఏమో అమ్మా ! తనడిగినవన్నీ ఇస్తే నయినా నాతో ప్రేమగా ఉంటాడనుకున్నానమ్మా .కానీ అదికూడా ఒక బయొలాజికల్ నీడ్ అమ్మా , అంతే ! ఏమాత్రం ప్రేమ ఉండదమ్మ , వద్దంటే పశువులా ప్రవర్తిస్తాడు" అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న సంగీతను పట్టుకుని "అయ్యో పిచ్చి తల్లి!ఎంత నరకం .. అనుభవిస్తున్నావమ్మా" అన్నది బామ్మ .. హరి హర్రావుగారు కూడా పరుగున వచ్చి సంగీతను అక్కున చేర్చుకున్నాడు. హర్ష కూడా అక్క దగ్గరకొచ్చి ఒళ్ళో పడుకున్నాడు. ఎవరూ మాట్లాడటం లేదు నిశ్శబ్దంలోనే ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు. సశేషం
No comments:
Post a Comment