బాంధవ్యం....... 31

ఆ రాత్రి  భారంగా గడిచింది.. 

తెల్లవారి పనులు రోజులాగా చకచకా సాగలేదు 
పాపను స్కూల్ కి  పంపి  అందరూ  నెమ్మదిగా  భోంచేసారు ..
 సంగీత  ఆఫీస్ కి వెళ్ళే  మూడ్ లో  లేదు.
  అందరు కూడా  వద్దని అన్నారు .. ముందు  ముందు  ఏంచేయాలో  కూడా  తోచడం  లేదు. సమస్యను ఎలా  పరిష్కరించాలన్నదే  తమ  ముందున్న  ప్రశ్న.. 

హారిహర్రావుగారికయితే  సంగీత అక్కడికి వెళ్ళడం సుతరాము  ఇష్టము లేదు.. 

 "రోజూ  చస్తూ బతకడం  అవసరం  లేదు.
  నా కూతురు నా ఇంట్లోనే ఉంటుంది " అని  ఖచ్చితంగా  చెబుతున్నారు..

బామ్మ  మటుకు  పాప  గురించి  ఆలోచిస్తున్నది పాపకు తండ్రిని  దూరం  చేయకూడదని ..

అనూరాధ  ముందు  సంగీత  ఆలోచనేంటో తెలసుకోమని అంటున్నది.. 

ఇంతలో  హరి హరహర్రావుగారు ఫోన్ చేయగానే సంగీత  వాళ్ళ పిన్నీ  బాబాయ్  వచ్చారు .

పాపం మంజుల  సంగీతను  పట్టుకుని  ఏడ్చింది.. 
"నేను  బాగానే  ఉన్నాను పిన్ని   ఇప్పుడు నా మనసు  ప్రశాంతంగా ఉంది .."

"ఏంచేెద్దామను కుంటున్నావు మరి, నీ నిర్ణయం  ఏదైనా  మేం  నీతోనే  ఉంటాం  నెమ్మదిగా ఆలోచించి  చెప్పు"  అంది  మంజుల ..

"అమ్మా సంగీతా! వేడి మీద, కోపంలో నిర్ణయాలు  తీసుకోకూడదమ్మా." అన్న బాబాయ్ తో

"లేదు  బాబాయ్!  ఇప్పుడు  నిజంగానే  నిర్ణయం  తీసుకోవలసిన సమయం  వచ్చింది.. 
అతను ఇలా కోపం తెచ్చుకుని   ప్రతిసారి  ఇల్లు  వదిలి  వెళ్ళిపోతాడు . అందరికీ  టెన్షనే  బాబాయ్ ,
మిగతా వారెవరితో  నాకు  ప్రాబ్లమ్ లేదు. ."...

"అదేంటే! అసలువాడితోనే అంత పెద్ద  
ప్రాబ్లం ఉంటే  "

"ఏమో  పిన్నీ! మిగతా అందరూ మంచివారు, ప్రేమగా  చూసుకుంటారు.  నాకన్నా ముందే  వారు  నా పరిస్థితిని  తెలుసుకుని సహకరిస్తారు. 
నా  బాధను అర్ధం చేసుకుంటారు , అందుకే ఇన్ని  రోజులూ మీకు  ఏం చెప్పలేక పోయాను.."

"ఎవరో ఒకరి మీద  ప్రేమాభిమానాల  వల్ల  సంసారాలు  చక్కబడవు , ఆలోచించుకో " అన్నారు హరి హర్రావు గారు.. 

"కానీ అన్నయ్యా! వాళ్ళ అభిప్రాయం కూడా  తెలుసుకుందాం.. "

"అవునమ్మా ! నేను ఇవాళ రాత్రికి  ఇంటికి  వెళతాను, ఒకవేళ  అందరూ  కలిసి  ఆయన్ని  ఇంటికి  పంపిస్తే?ఆయన వచ్చినప్పుడు నేను లేకపోతే మళ్ళీ నన్నే అంటారు  కదా.. "

"అయ్యో  పిచ్చిపిల్లా!  అడగడానికి అనడానికి  ఏం  మిగిలింది గనక.."

"ఇప్పుడు నీ ముందున్న సమస్య .....
అతన్ని  మార్చుకొని  జీవితాంతం  అతనితో  ఉంటావా? లేక  ఇక్కడి  కొస్తావా? "అని ..
అన్నది  మంజుల... 

"అతను మారడం అనే ప్రశ్నే లేదు . అతన్ని  భరించే ఓపిక నాకుండాలి , పాప ముందు  గొడవలు   కాకుండా చూసుకోవాలి.  అది అతని  వైపునుండే వస్తాయి, నావైపు నుండి రాకుండా చూసుకోగలను."

" కానీ నేనేం చేయను,  పాప పెద్దదవుతున్నది  తన ముందు  ఏం మాట్లాడినా  ఆ ప్రభావం  దాని  మీద  ఉంటుంది ..కదా" 

"అంత  అర్థం  చేసుకునే మనిషని  నేననుకోను  .
అందుకనే  వాళ్ళంతా  అతన్ని  అలా  వదిలేసారు  
పాపను  ఇక్కడ  కొన్నాళ్ళుంచు  పోనీ " అన్నది  అనురాధ ....

కానీలే....  అవన్నీ  తరువాత  మాటలు  ముందు  వాళ్ళేం అంటారో చూద్దాం."  అన్నారు  హరిహర్రావుగారు 

"అవును  నాన్నా!  నేను  మా ఇంటికి  వెళ్ళి ఉంటేనే  వారంతా  మాట్లాడగలరు.. ఈ  రోజు రాత్రి  వెళతానమ్మా  అని  చెప్పింది  .

"సరే కానీ అన్నయ్యా! ఏదో  ఒకటి  ముందుకు రావాలి  కదా.. పంపిద్దాం, సతీషే  వస్తాడేమో?"  

"అతను  వచ్చాక  మామూలుగా ఉండడం కాదు ,  
మన అమ్మాయితో ఎలా  ఉండాలో, ఉండకూడదో  వాళ్ళ  పెద్దవాళ్ళతోనే  చెప్పిద్దాం"  అందరూ  కలిసి 
అలా  అనుకుని  ఒక  నిర్ణయానికి వచ్చారు ..

ఆరాత్రి  హరిహర్రావుగారు  వాళ్ళు  జాగర్తలు  చెప్పి సంగీతను,పాపను  దింపేసి  వెళ్ళారు.. 

రెండు రోజులు గడిచినా సతీష్  జాడ  లేదు.. 

ఒక రోజు  శ్రీధర్ సంగీతా వాళ్ళ ఆఫీస్ కి వచ్చాడు...

"ఎలా  ఉన్నారు? ఏంటి విశేషాలు అని  అడుగుతూ. సతీష్  బాగున్నాడా ? ఈ మధ్య  ఫోన్లులేవు తన  దగ్గర నుండి " అన్నాడు 

"పదిరోజులనుండి ఇంట్లో  లేరన్నయ్యా !ఊరెళ్ళారు "

"ఏఊరు?"

"అత్తయ్య  వాళ్ళ దగ్గరకే"

"లేదే! నువ్వేదో  పొరబడుతున్నావు, వాళ్ళు ఇక్కడే  ఉన్నాడను కుంటున్నారు.. Some thing wrong."

"ఏమైనా  దాస్తున్నావా ?"అన్నాడు  చనువుగా.

తను  ఇంట్లోంచి వెళ్ళడం  హరీష్  రావడం  అన్నీ  చెప్పింది.
"అయితే  అక్కడి  నుండి  ఇంటికి  రాలేదా? మరెక్కడికి  వెళ్ళి నట్టు..సరే  నేను  కనుక్కుని ఫోన్  చేస్తాలేమ్మా  " అని  వెళ్ళిపోయాడు .

సంగీత ఆరోజు కాస్త  తొందరగానే  ఇంటికొచ్చింది.
చాలా  గాభరా పడుతుంది. ఎక్కడికి  వెళ్ళినట్టు?  క్షేమంగానే  ఉన్నారు  కదా  అని  టెన్షన్  పడుతూ  కూచుంది శ్రీధర్ ఫోన్ కోసం ఎదురు చూస్తూ.. 

నాన్నకు  ఫోన్  చేద్దాం, అనుకుంది  కానీ  వీళ్ళేం చెబుతారో  వినాలి  కదా! తరువాత  చెప్పొచ్చు  అనుకుంది.. రాత్రి  8.30 వరకు చూసి  ప్రవల్లికకు  అన్నం తినిపించి  పడకో  పెట్టింది.  తనకు  తినాలని  లేక  పోయినా  కాస్త  తిని  తలపులేస్తుంటే  కాలింగ్ బెల్  మోగింది  హమ్మయ్య  వచ్చారన్న మాట  అనుకుంటూ తలుపు  తీసింది  ..

లలిత  హరీష్  శ్రీధర్  వనిత  నలుగురూ  వచ్చారు 
గాభరా  పడింది సంగీత  .

"ఏం వదినా  ఏమైనా  ప్రాబ్లమా " అంది

 " ఏం లేదులే కూచో "అని  సంగీతను  కూచో  పెట్టి  తను  పక్కన  కూచుంది  లలిత.. 

హరీషే  మొదలు  పెట్టాడు  "అసలు  వాడెప్పుడు  వెళ్ళాడు  ఆరోజు  ఏంజరిగింది అని.."

శ్రీధర్ కి  చెప్పినవే అన్నీ  మళ్ళీ  మొదటినుండీ  చెప్పింది ....

ఇంత  కన్నా  ఎక్కువేం  లేదుగా?  ఫరవాలేదు 
 free గా  చెప్పు. చెబితే  సాల్వ్  చేయడం  ఈజీ  అన్నాడు...

ఇంక  దాచి  లాభం  లేదని  తల  వంచుకుని 
" ఆ రాత్రి  రానివ్వలేదని  కోపం వచ్చింది, అంతే అంత కంటే  ఎక్కువేం లేదు... "

అందరూ  కాసేపు  నిశ్శబ్దంగా  ఉన్నారు .

"సరే  ఎక్కడున్నాడో తెలీటం లేదు, ఫ్రెండ్స్  అందరికీ చెప్పాం. గాభరా ఏంలేదు,   నాలుగు రోజులయితే  వాడే  వస్తాడు.   నువ్వు  ఇక్కడుంటావా లేక  అమ్మా వాళ్ళింటికి వెళతావా" అన్నాడు  హరీష్.

" చూస్తా "అంది 

" కాదులే  అక్కడే ఉండు " అని  లలిత  కూడా  చెప్పింది .

" రేపెళతా  లెండి " అన్నది..  కానీ  వెళ్ళలేదు.. 

మరో  నాలుగు  రోజులు  గడిచాయి.. 

 ఒక  రోజు   హరీష్  అనుకోకుండా  మధ్యాహ్నం ఇంటి  కొచ్చేసరికి జ్యోతి  సతీష్ కంచంలో  అన్నం పెడుతున్నది .. హరీష్ ని చూసిన  సతీష్  ఉలికిపడ్డాడు..

 లేవబోతుంటే "ఫరవాలేదు తిను" అన్నాడు.హరీష్  కూడా  తిన్నాక  బయట  కూచున్నారు...

" వెళతానన్నయ్యా  "అన్నాడు 

"ఎక్కడికి  ఇంటికేనా  లేక  ఊరికా " అని  అడుగుతున్న  హరీష్ ని   
"లేదు  మా ఫ్రండ్  వాళ్ళ  ఇంట్లో  ఉంటున్నా"

 "అదేం  "

"అంతేలే "

"అంటే...  ఉంటే మీ ఇంట్లో ఉండు లేదా  
అమ్మా  వాళ్ళ దగ్గర  ఉండు  అంతే  కానీ   మధ్యలో  ఎవరిదగ్గరో  ఉండడం ఎందుకు..

 "సరే " అన్నాడు 

"ఎక్కడికి  "

"చూస్తా "

 "చూడడం కాదు  చెప్పు  "

"ఒకసారి  ఊరికెళ్ళి  వస్తా"

"పద  అయితే  నేను  బస్ స్టాండ్  లో  దిగబెడతా " అని  బలవంతంగా బస్సెక్కించి  వచ్చాడు.. 

"చేరాక  నాన్నతో  ఫోన్ చేయించు" అన్నాడు .

చంద్రశేఖర్  గారు ఫోన్  చేసారు  చేరినట్టు.  

నాలుగు  రోజులు  చోటు మారితే  తనే  సద్దుకంంటాడని అందరూ  అనుకున్నారు ..

హరీష్  సంగీతకు ఫోన్  చేసి  అదే చెప్పాడు .
 
నాలుగు  రోజులు  పోయాక ఎలాగూ  వస్తాడు  కదా  అంత దానికెందుకు అని  ఇక్కడే తమ ఇంట్లో ఉండి  పోయింది  సంగీత ..

ఒక రోజు  పొద్దున్నే   సతీష్  వాళ్ళ బాబాయ్  సంగీత దగ్గరకు వచ్చాడు.  క్షేమ  సమాచారాలడిగి  టీ తాగి మెల్లిగా  అడిగాడు.

" అసలు  మీ మధ్య  ఏమయ్యిందమ్మా ?" అని.. 
ఆశ్చర్య పోయింది  సంగీత....

ఈన  కెవరు  చెప్పారు,  అసలు ఈ విషయం అంత  పెద్ద  ఇష్యూనా ... ఇది మా ఇద్దరికీ  సంబంధించింది,  ఒక  మాట  మేం  అనుకుంటే  సద్దుకు  పోయే  దానికి  ఇంత  రాద్ధాంతమా ? అదే  ఆయనతో  చెప్పింది.. 

"లేదమ్మా  !ఇది  పెద్దవాళ్ళదాకా  పోయింది, అందుకే నిన్ను  అడుగుతున్నాను,  All  The  Best "అని చెప్పి  వెళ్ళి  పోయారు..

'అసలేం  జరగుతుంది  ఫామిలీ  మాటర్  కూడా  కాదు ? పచ్చిగా మాట్లాడాలంటే, మా పడకగది  విషయం,దానికింత  రచ్చ చేయాలా?' అనుకుంది మనసంతా  పాడయ్యింది. 

ఆఫీస్ కి వెళ్ళాలనిపించ లేదు పాపొచ్చాక  తీసుకుని  అమ్మావాళ్ళింటికి  వెళ్ళింది... ఏదో  జరిగింది అని అందరికీ  తెలిసిపోయింది  ఏమిటన్నదే  సంగీత  చెప్పాలి.. 

భోజనాలయ్యే వరకు అస్సలు ఎవ్వరేం మాట్లాడ  లేదు .

భోజనాలయ్యాక  "హర్షా! పాపను గదిలోకి  తీసుకెళ్ళు " అని  సంగీతే  పంపించింది.. తరువాత ఈ  వారం రోజుల  నుండి  జరిగినవి  చెబుతూ  పెద్దగా  ఏడ్చింది ...

 "అసలేం  జరగుతుంది  నాన్నా!  మా మధ్య  ఏం  జరిగిందని  ఈ విషయం  పెద్ద వాళ్ళ  దాకా  పోవడానికి...అసలేమనుకుంటున్నారు వీళ్ళు .."

"తప్పు మనదమ్మా! నువ్వు  రాగానే  మేమే  చెబితే  అయిపోయేది, కానీ చూద్దాంలే ,  అబ్బాయి  రానీ  అని  ఊరుకున్నాం కదూ అది తప్పయిపోయింది. వాళ్ళు  గ్రౌండ్  ప్రిపేర్  చేసుకున్నారు.. "

"కానీ, మనల్ని పిలవనీ, ఏం మాట్లాడతారో చూద్దాం" అన్నారు.. 

ఇంకో రెండు రోజులలో ఎదురు చూసిన  సంఘటన  జరగనే  జరిగింది ..చంద్రశేఖర్ గారు,హరిహర్రావు గారికి  ఫోన్  చేసి  
"మా అబ్బాయి  హైదరాబాదు రానంటున్నాడు   బాబుకక్కడ  సేఫ్టీ  లేదట. అందుకని  మీ కిష్టమయితే  అమ్మాయిని , మనవరాలిని ఇక్కడికి  పంపించండి  లేదా  మీదగ్గరే ఉంచుకోండి "అని  ఫోన్  పెట్టేసారు  
హరి  హర్రావు  గారు  మాత్రం  ఫోన్ ని అలాగే  పట్టుకుని  నించుండి  పోయారు ..

సశేషం

బాంధవ్యం........32

"ఏమయ్యిందినాన్న ?."

"ఏమయ్యిందండి .".

సంగీత ,అనూరాధ  ఇద్దరూ  ఒకేసారి  వచ్చారు 
సంగీత తండ్రిని  పట్టుకుంది అనురాధ  ఫోన్   క్రెడిల్  చేసి  వచ్చింది.. 

"ఎవరు  నాన్నా?  ఏమయ్యింది? ." అనడుగుతున్న సంగీతకు

ఏమని చెబుతాడు , నీ మౌనం ఎదుటి వాళ్ళకు  ఆయుధం అయ్యిందనా ? నీ సహనం  వారిని  సాయుధులను  చేసిందనా?..ఆ తండ్రి  గుండె  తల్లడిల్లుతున్నది,  మనసు  రోదిస్తున్నది,
కళ్ళవెంబడి  నీళ్ళు  కారి పోతున్నాయి 
అప్రయత్నంగా  కింద  కూలబడి  పోయాడు....

"నాన్నా!"  అని  అరిచింది... 

"నాకేం ఫరవాలేదు,  నీ గురించే బాధమ్మా !"

"ఏమన్నారు నాన్నా!" ....

"ఏమంటారు, వాళ్ళ అబ్బాయికి ఇక్కడ  ఉంటే   సేఫ్టీ  లేదట,  అక్కడే  ఉంటాడట, కావాలనుకుంటే  నిన్నే  అక్కడికి  పంపించమన్నారు " అంటూ ఏడవడం  మొదలు  పెట్టారు.. 

నాన్నా ! వద్దు  నాన్నా! అంత  బాధపడొద్దు,  దాని గురించి  తరవాత  ఆలోచిద్దాం"  అంది  ..

"నాబాధ  అదికాదమ్మా! వెళితే  వెళతావు లేదంటే  ఇక్కడుంటావు ...కానీ  ఏమయ్యిందో  చూడమ్మా! నువ్వు తప్పు మీద తప్పు ఎలా చేస్తున్నావో?
 నీతో  పాటు మేం కూడా అలాగే  చేస్తున్నాం  కదా!  ,
ఇప్పుడు వాళ్ళెలా మనల్ని డిఫెన్స్ లో పడేసారో చూడు.. నీ మంచితనం  ఏం  పనికొచ్చింది.". 

"నీ కన్నా  తక్కువ చదువుకున్నా చేసుకుంటే  సంబంధాలు దొరకక  అన్నారు. నువ్వు  ఉద్యోగం  చేస్తే  హాయిగ  ఎంజాయ్  చేసాడు. నువ్వు ఎవరిని  ఉద్ధరించినట్టు.. ఇప్పుడు  అనుకుని  లాభం  లేదమ్మా ?.."

"నా అల్లుడిని  విమర్శించకూడదు , కాళ్ళు కడిగి విష్ణుమూర్తి  స్వరూపమని అనుకుని నమ్మి నిన్ను ఇచ్చి  పెళ్ళి చేసానమ్మా ...".

"కానీ అప్పుడే చెప్పానా ఈ సంబంధం  వద్దని.. 
ఒక  మగవాడి  సైకాలజీ  మగవాడు  గుర్తు పట్టినంతగా  మీ ఆడవారు తెలుసుకోలేరమ్మా"...

"పరమ బద్ధకస్తుడిలాగా కనిపించాడు, అతనికి  ఒక  వ్యక్తిత్వం ఉన్నట్టుగా కనిపించలేదు.  ఏ ప్రశ్న  అడిగినా జవాబు చెప్పడానికి  పక్క వాళ్ళ మొహం  చూసాడు....అప్పుడే  అనుకున్నా  నీకు  తగడని " .

కానీ , రాసిపెట్టి ఉంది , భగవన్నిర్ణయం అనుకున్నా ,
నువ్వు  ఉద్యోగం చేసి ఇల్లునడిపిస్తున్నా నేను బాధ పడలేదు . భార్యా,భర్తా అన్నాక  కష్టం , సుఖం ఇద్దరూ కలిసిపంచుకోవాలనుకున్నాను,
ఇంటిపనులు ఇద్దరు కలిసి  
చేసుకోవాలనుకున్నాను.. "

"ఆస్తి  అంతా  వాళ్ళ  అబ్బాయి  పేరుమీద  రాసారని నువ్వు చెబుతుంటే మాత్రం  బాధపడ్డాను. ఏం ,
 కొద్దో  గొప్పో  పాపపేరు  మీద  రాస్తే  రేపు  దాని  భవిష్యత్తుకి  పనికొస్తుంది అన్న ఆలోచన  లేకుండా  తన  కొడుకు  బాగోగులు  చూసుకున్న  
ఆ పెద్దమనిషి  స్వార్థం  చూసి  అప్పుడే  గౌరవం  పోయింది .".

"కానీ  ఈ మాట చెప్పాక అసహ్యం  వేస్తుంది.. 

ఈ 7ఏళ్ళలో  నువ్వు  సాధించింది  ఏమిటో  మాకన్నా  నీకే ఎక్కువ  తెలుసు.. నీ జీవితం నీది,
 నీ ఇష్టం , మేం  అందుకు ఏనాడు అడ్డుచెప్పలేదు  చివరకు  పెళ్ళి  విషయంలో కూడా"

"కానీ  ఇప్పుడు  నీకో  కూతురుంది  దాని  భవిష్యత్తు గురించి  ఆలోచించే బాధ్యత  నాక్కూడా ఉంది ..
బిడ్డను  కనంగానే  తల్లిదండ్రులవుతారు  అంతే  కానీ పుట్టిన  బిడ్డ  పిలిచే  దాకా అమ్మా నాన్నలు కాలేరు 
అతను  తండ్రి  మాత్రమే  నాన్న  కాలేడు....

 "  ఆడపిల్ల రేపు దాన్ని ఎవరు పెళ్ళిచేసుకుంటారో  అని  నేనాలోచించడం  లేదు . ..
కానీ  ఆ వాతావరణంలో  పాప  పెరిగి పెద్దవుతే   ఎలా  ఉంటుందా  అని  ఆలోచిస్తున్నాను.."

"విషయం నీ విజ్ఞతకే  వదిలేస్తున్నాను . ఆలోచించి మంచి  నిర్ణయం తీసుకుంటావనుకుంటున్నాను...

 రేపు  భవిష్యత్తులో వెనక్కి  తిరిగి  చూసుకుంటే 
 నీ పెళ్ళి  లాగా  కాకుండా  మంచి  నిర్ణయం  తీసుకున్నాను అనుకునేలా  ఆలోచించుకో " అన్నారు 

ఇంక  ఆ టాపిక్  గురించి  ఎవరూ  మాట్లాడలేదు.. 

ఆ రోజే  కాదు ఇంకో పది  రోజులు గడిచినా దాని గురించి ఆలోచించే  సమయం  ఎవరికీ  దొరక లేదు ఆ అవసరం  కనబడలేదు...

తండ్రి  ఇచ్చిన  సపోర్ట్   సంగీతలో  ఆత్మ విశ్వాసం ఇంకా  పెంచింది..ఏం  జరగనట్టుగానే  ఆఫీస్ కి వెళ్ళి  వస్తుంది . పాప గురించిన  బెంగ  కొంత  తీరింది  అమ్మ, నాన్న,  హర్ష చూసుకుంటున్నారు.. 

కానీ  అక్కడ  సతీష్ కి పిచ్చెక్కుతున్నది. 
నాన్న  చేసిన  వార్నింగ్  వీరి మీద  ఏం  పనిచేయక పోవడం అన్నది  భరించలేక  పోతున్నాడు ..
మామూలుగా  అయితే  సంగీతను , పాపను తీసుకుని  వాళ్ళ నాన్న రావాలి,కానీ రాలేదు అంటే ఏం  జరుగుతుందక్కడ..  అక్కకు  ఫోన్  చేసాడు  

"ఇక్కడికయితే  రాలేదు బాబూ, మాకేం  తెలీదు మరి 
అని  ఫోన్  పెట్టేసింది. ..
ఎందుకో  మరి జరుగుతున్నది  లలితకు  నచ్చటం  లేదు   లలితకే  కాదు  అటు  వనితకు  కూడా.  
 సాఫీగా  జరుగుతున్న కాపురాన్ని చేతులారా  పాడుచేసుకోవడం అంటే  ఇదే .. కానీ ఎవరూ  ఎవరికీ ఏమీ  చెప్పలేరు ...

చంద్రశేఖర్ గారు  అందరికీ  అలా  ఒక  గీత  గీసేసారు... ఇంక   వేరే  గత్యంతరం  లేక  వదినకు  ఫోన్  చేసాడు సతీష్......"వదినా  ఏం చేయ  మంటావని.?". 

" ఏంచేయడమేంటి ? మీ నాన్నగారికి  చెప్పు  మనింట్లో ఉందా  లేక  వాళ్ళ  అమ్మ  వాళ్ళింట్లో  ఉందా కనుక్కోమను, మనింట్లో ఉందంటే  నీ దగ్గరకు  వస్తుంది  రావాలి  తప్పదు". అని  జ్యోతి చెప్పింది.

సతీష్  ఇంక  ఆ ప్రయత్నం లో  ఉన్నాడు. 

"నాన్నగారు  హైదరాబాదు  వెళతాను " అన్నాడు ...

"ఎందుకు  పాపను  చూస్తావా ?"..

"అవును."..

 "మరి  అక్కడే ఉంటావా ? వాళ్ళకేమో అలా చెప్ప మన్నావుకదా.." 

"ఊహు  ఉండను.."

"మరి  ఇప్పుడు నువ్వు  వెళ్ళటంలో అర్థం ఏమిటి ,
వాళ్ళు ఇంకా ఇక్కడికి  రాలేదని  అనుకుంటున్నావా?..వస్తారు,  రాకెక్కడికి  పోతారు, ఓపిక  పట్టాలి   నేను మాట్లాడుతాలే " .. అన్నారు ..

తోడల్లుడిని పిలిపించి మాట్లాడి  హైదరాబాదుకు పంపించారు.. 

ఆయన వస్తూనే సతీష్  ఇచ్చిన  నంబరుకు ఫోన్  చేసాడు  అనురాధ  తీసి  హరిహర్రావుగారికిచ్చింది... 

"నమస్కారం సర్,  నేను  సతీష్  వాళ్ళ బాబాయ్ ని   మాట్లాడుతున్నాను.  నేను  హైదరాబాదు వచ్చాను 
 మీతో  మీ అమ్మాయి  విషయం  ఒకసారి  మాట్లాడదామని, మీకభ్యంతరంలేకపోతే  మా అమ్మాయి వాళ్ళింటికి  వస్తారా " అని అడిగారు .

 "సరేనండి " అని ఫోన్ పెట్టేసి విషయం  ఇంట్లో  చెప్పాడు.  ఏం చెప్పమంటారు"  అని  అడిగాడు 

" నేను కూడా  వస్తాను  నాన్నా " ..

"బాగుంటుందా ! ఆయన  నన్ను రమ్మన్నారు. "

"కానీ విషయం నాది , నేను కూడా ఉండాలి కదా"

 పదండి  అంటూ నలుగురు  బయలు  దేరారు.. 
వాళ్ళ  అడ్రస్  పట్టుకుని  వెళితే  అది  పద్మ  వాళ్ళ  ఇల్లు...లోపలికి  రమ్మని  కూచో పెట్టింది  పద్మ .. ఇంతలో వాళ్ళ  నాన్నగారొచ్చి పరిచయం  చేసుకున్నారు 

" పెళ్ళిలో  చూసాం  మళ్ళీ  చూడలేదు"అంటూ  

ఆతరవాత  నెమ్మదిగా  పద్మ  వాళ్ళ  మావగారొచ్చారు.సంగీత  కాసేపటి వరకూ లలితా వాళ్ళకోసం ఎదురు చూస్తూ ఉంది .  కానీ  వారెవ్వరూ  రాలేదు  అంటే  నిజంగానే  వాళ్ళంతా  మాట్లాడరా వీరితోనేనా  నేను  మాట్లాడేది అని  అనుకుంది ..
ఇంతలో  సతీష్ వాళ్ళ. బాబాయ్ వెంకటేశ్వరరావు గారే  మొదలు  పెట్టారు 
"ఏమనుకున్నారు  బావగారు   అమ్మాయిని  ఎప్పుడు  పంపిస్తారు"  అని.. 

"అమ్మాయి  ఇష్టం తనెప్పుడంటే  అప్పుడే  అనుకున్నాం .".

"ఏమ్మా !ఏమనుకున్నావు  మరి".

"ఇంకా  ఏమనుకోలేదండి"

"అదేంటి "

" ఆయన ! అంటే నా భర్త ,చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయి ఎక్కడో   ఉన్నాడు.ఇంకెవరో  
మా నాన్నకు ఫోన్  చేసి మీ అమ్మాయిని ఇక్కడికి  పంపించండి  లేదా  అక్కడే  ఉంచుకోండి  అంటారు ..
ఇది  పద్ధతేనా? మీరందరూ ఒప్పుకుంటారా ?"

"అదేంటమ్మా! వాళ్ళ  నాన్నగారేగా  అన్నది " ...

"అయితే  మటుకు  ఆయన  పెద్దమనిషయితే  ఇలాగేనా అడిగేది , మాట్లాడేది? ఒక  అమ్మాయి  పెళ్ళి చేసుకుని , తన వారందరినీ  వదిలి అత్తవారింటికి  వెళ్ళిందంటే  ఎంత  గుడ్డినమ్మకంతో  వెళుతుంది.. ఇక్కడ నాన్నను  వదిలి వస్తుదంటే  అక్కడ ఇంకో నాన్న  ఉన్నారనే కదా ."..

"తమ్ముడు తనవాడైనా ధర్మం  చెప్పమన్నారు.. 
అసలు  ఎటువంటి  కారణం  చెప్పకుండా  అలాఎలా  రమ్మంటారు. "
"పోనీ  వద్దామనుకున్నా, రావలన్నా  పాప  స్కూల్ , నా ఆఫీస్ , కొన్ని  కమిట్ మెంట్స్  ఉంటాయి కదా  అవన్నీ  చూసుకోవద్దా ?అవన్నీ  వాళ్ళకు  తెలీదని  నేనెలా అనుకుంటాను.." 

"అయినా! ఆయన వచ్చి ఇక్కడ నేనుండలేను,  మనం  మన ఊర్లో  ఉందాం  పద  అంటే  నేను  రానంటానా?". 

"పెద్దవాళ్ళు కూడా అసలు  విషయమేంటో  తెలుసుకోకుండా,  నన్ను  ఒక్కమాట అడగకుండా ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారు.." 

"మీకు  నా గురించి ఏం తెలుసు మావయ్యగారు, కనీసం  మా మధ్య  ఏంజరిగిందో  కూడా  తెలీదు కదా,  తెలిసినా వాళ్ళు చెప్పిందే  కానీ  నా వర్షన్  తెలీదుగా."..... 
 
"అలాంటప్పుడు  మీతో  ఏం చెప్పను  చెప్పండి.  వాళ్ళు కూడా  అందరు  వచ్చి  మాట్లాడినప్పుడు,    అప్పుడు  వాళ్ళందరి ముందరా నా నిర్ణయం  చెబుతాను ..ఏమనుకోవద్దు 🙏🙏"

" వెళ్ళొస్తాం " అని అందరినీ  బయలుదేరదీసింది... 

సశేషం

బాంధవ్యం..... 33

ఇంటి  కొస్తుంటే  దారిలో  అనూరాధ  అన్నది. 

"ఆయన్ని పట్టుకుని అంత  మాటన్నావు  తల్లీ ఏమైనా  అనుకుంటే.. "

"అనుకోనీ  అమ్మా  ! ఇన్నాళ్ళూ వాళ్ళంటున్న మాటలకు  నాకు  బాధ కలగలేదా? మానసికంగా చాలా  బాధపడ్డానమ్మా. అసలు  ఎవరికి  చెప్పాలో ఎలా  చెప్పుకోవాలో  ఏమని  చెప్పుకోవాలో కూడా తెలీనంత  వత్తిడిలో  ఉండే దాన్ని..."
"ఆ సమయంలో నాకు మీరంతా ఉన్నారన్న  ధ్యాస  కూడా వచ్చేది కాదు ఉన్న పళంగా చచ్చి  పోవాలనిపించేది.." 

"ఎందుకు అతనికి నేనంటే ఇష్టం లేదు ఎందుకు   అతనికి నా మీద  నమ్మకం  లేదు.. ఇదే  ఆలోచించే  దాన్ని..నో డౌట్  ...అతను నన్నువాడుకుంటున్నాడనిపించేది "

 "పొద్దునంతా ఎలా ఉన్నా రాత్రి మటుకు నేనేదో  తన ఆస్తి లాగా నా మీద పెత్తనం చేసేవాడు, పక్కనే పడుకున్న పాపకోసం అన్నీ  భరించే దానిని.." 

"అతన్ని పెళ్ళి చేసుకుని అతన్ని ఉద్ధరించానని నేనేం అనడం లేదు .. కానీ  అతన్ని పెళ్ళి  చేసుకుని  అతనకి  విలువ నిచ్చి సంఘంలో  ఒక  మనిషిగా,  తండ్రిగా  నిలబెట్టాను  కదా!"
"బయటకెక్కడికి  వెళ్ళినా అతని చేతిలో డబ్బులు  పెట్టి అతనితో ఖర్చుపెట్టించేదాన్ని , అతను  చిన్నబోతాడని నన్ను నేను చిన్నదాన్నిగా చేసుకనే  దాన్ని..పాప ముందు గొడవ పెట్టుకోవద్దు , అది  ఫీల్  అవుతుంది,  దాని మీద చెడు ప్రభావం చూపిస్తుంది  అని  బతిమాలుకునేదాన్ని .."

 "అది  అలుసుగా   చేసుకుని  నా బలహీనతతో  ఆడుకునే వాడు..నేను ఏదైనా అంటానని ,ఎదురు జవాబు చెబుతానని తెలిస్తే, ఇంట్లోంచి వెళ్ళి  పోవడమో  లేదా  ఆరోగ్యం పాడవడమో  జరుగుతుండేది.అంతే  అందరికీ  అతని  మీద  సింపతి  పెరిగేది"
"నేనంటూ  ఒకదాన్ని ఉన్నానని , ఆయనకేమైనా అయితే  నాకూ  బాధేనని   పట్టించుకునే  నాధుడే  ఉండడక్కడ.. అసలు నేనెవరినో, అక్కడ ఎందుకు ఉంటున్నానో, నా ఉనికేంటో కూడా  మరిచి  పోయానమ్మా..లేదు అలా చేసారు.. వేరే  ఆలోచన  లేకుండా ,  రాకుండా  చూసారు. "

"రెండు రోజులు  బాగుంటే  మూడో  రోజు  గొడవ ..
ఇంట్లో  జరిగేవన్నీ అందరికీ  చెప్పుకోవడం ఈయన  బలహీనత..అంతే  ఎవరేం అనే  వారో తెలీదు ..
ఇవన్నీ  ఒక  ఎత్తయితే , అతనికి నా మీద  ప్రేమ  లేక  పోవడమన్నది  నన్ను చాలా  క్షోభ  పెడుతుందమ్మా!. ఇన్నేళ్ళయినా  నామీద  నమ్మకం కుదరకపోతే  నాకెంత  బాధగా  ఉంటుంది.. "
"అతను నా భర్తమ్మా !అతన్ని మనస్ఫూర్తిగా
 ఇష్టపడ్డానమ్మా! అతనికేదైనా అయితే నా మనసు  
విల విల లాడేది,  అతన్ని  దగ్గరకు తీసుకోవాలనిపించేది..కానీ  అతను నన్నొక  నర్సులాగానే చూసాడేమో అనిపిస్తుంది..."

 "అయినా  ఫరవాలేదు, కానీ ఎందుకమ్మా మాటి మాటికి  మమ్మల్ని వదిలేసి పోతాడు .. ఏం  నేనాయనకు తగనా..  అంటూ  అనూరాధ  ఒళ్ళో  తలపెట్టుకుని ఏడ్చింది  . 

"అందరూ  నిశ్శబ్దంగా వింటున్నారు.  అందరి  కళ్ళ నుండి ధారాపాతంగా కళ్ళనీళ్ళకారిపోతున్నాయి..
సంగీతే  కళ్ళు తుడుచుకుని  మళ్ళీ  చెప్పడం  మొదలు  పెట్టింది.. ఈ సారి  కారణం  వేరమ్మా  సిగ్గు  విడిచి ఏం చెబుతాడో చూద్దాం  అనుకున్నా  .."

"కానీ ఇంత అసహ్యంగా నా మీద నిందవేయడం  భరించలేక పోతున్నానమ్మా ! ఆయన్ని  అంత  గౌరవంగా  చూస్తే  అవమానిస్తున్నానని  చెబుతాడా ?."
"ఇంక  నా జీవితానికి  నా బ్రతుక్కు  అర్థం ఏముందమ్మా?..నేను బ్రతికున్నా చచ్చిన దానితో  సమానం."

 "మళ్ళీ  ఇక్కడికొచ్చాక  తెలిసింది  నేనేం  కోల్పోయానో? .. చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ 
 చేస్తే  మూర్ఖులంటారు.. అందుకనే  చేసిన  తప్పు  దిద్దుకోవాలమ్మా  భగవంతుడు  నాకా  అవకాశం  ఇచ్చాడు.. మీరందరూ  ఉన్నారన్న  ధైర్యం  ఉంది  .  ఎలా  జరిగేది  అలా  జరగక  మానదు .."

"నేను  మామూలుగానే ఉన్నానమ్మా నువ్వేం  
బాధపడకు. నాన్నా!  మీరు కూడా  నిశ్చింతగా ఉండండి   అంది.." 

"లేదమ్మా!నాకేం  బెంగ లేదు,నీ మనసు  ఇప్పుడు   కడిగిన  ముత్యం లాగా ఉంది , మంచి  చెడ్డా కనబడుతున్నాయి ... అందుకే  నిర్ణయం  నీకే వదిలేసాను.. అన్నారు హరి హర్రావుగారు.. 

ఇంతలో ఇల్లొచ్చింది.. 
అదే రోజు రాత్రి  మళ్ళీ వాళ్ళ బాబాయ్  ఫోన్  చేసారు ' ఊరినుండి  వాళ్ళంతా వస్తున్నారు  రేపు  మధ్యాహ్నం  2 గంటలకు  రమ్మని ' ...  "అలాగే" అన్నారు.. 

ఆ రాత్రి తనకూతురు  మీద  నమ్మకంతో హాయిగా  పడుకున్నారు హరి హర్రావుగారు.. 

ఏ చింతా లేకుండా  నిశ్చింతగా  పడుకుంది  సంగీత..

 రేపు  వచ్చే  వెలగుల రేడు  కోసం  ఎదురు  చూస్తూ  అనూరాధ.. 

సశేషం

బాంధవ్యం..... 34

వింతలేం  జరగలేదు  సూర్యుడు  పశ్చిమాన  ఉదయించలేదు  మామూలుగానే  తెల్లవారింది. 

ఇంట్లో  ఎవరికీ  ఎటువంటి  ఆందోళన  లేదు  అందరూ  మామూలుగా  పనులు  చేసుకుంటున్నారు ..

అమ్మ  నాన్నకు  చెప్పాక  సంగీత మనసు  కూడా  తేలిక  పడింది. 

ప్రవల్లికను  స్కూల్ కి పంపించాక ఇంట్లో  అందరికీ  తనే  వంట చేసింది ...అందరూ ఆనందంగా భోంచేసారు. 

 అనురాధ  కూతురునే  చూస్తుంది  ఎక్కడైనా  బాధ  దాచుకోవడానికి అతి  ఉత్సాహం చూపించడం లేదు  కదా  అని ..

 అదే  మాట హరి హర్రరావుగారుతో అంటే
 "ఒక్కొక్కరు ఒక్కో లాగా ప్రతిస్పందిస్తారు.
 ఒక్కో లాగా  సంభాళించుకుంటారు ఎవరి పద్ధతి  వారిది" అని  లోపలి  కెళ్ళారు..

1.30కి సంగీత హరి హర్రావుగారితో  పాటు  అనూరాధ  హర్ష కూడా  బయలు దేరారు ..

 అనురాధ సంగీత చేయిపట్టుకుంది  సంగీత  తండ్రి  చేయిపట్టుకుంది .. 

అమ్మ  నాన్నలిచ్చిన  సంస్కారం, ధైర్యం, 
 ఆత్మ విశ్వాసం  వెంటరాగా  ముందుకు  అడుగు  వేసింది.. 

అన్న  టైముకు  చేరుకున్నారు.. 
ఇంటినిండా చాలా  జనాలున్నారు,  ఎవరో  ఎందుకొచ్చారో  అర్థం కాలేదు  ..

ఇంతలో  పద్మ  వచ్చింది ..

"మా వారి కజిన్స్ వచ్చారు మీరు  ఆ రూములో కూచోండి నాన్నా పెదనాన్న  వస్తారు " అని  పక్క  రూములో కూచో  పెట్టింది.. 

5 నిమషాలయ్యాక  వేంకటేశ్వర్ రావుగారు  వచ్చారు
 ఆయన  కుశలం  అడిగేలోపల  చంద్రశేఖర్ రావు గారు , ఆ వెనకాలే  ఇంకో  నడివయసాయన  వచ్చారు ..
ఇంకెవరూ తమ ఇంటి  వారు  రాలేదు. అంటే  వీరితోనే తను మాట్లాడాలి  చెప్పుకోవాలి..  

నాన్న  మొహం చూసింది సంగీత, ఫరవాలేదు  చెప్పమ్మా అన్నట్టు  తలూపారు. 
ఇంతలో  చంద్రశేఖర్  గారే డైరెక్ట్ గా విషయంలోకి  వస్తూ  అడిగారు ..

"ఎప్పుడొస్తున్నావు నువ్వు "అని  

ఎక్కడికి అని  అడగలేదు కానీ " నేను  రావటం లేదు  మావయ్యా" అని ఒక్కనిముషం  ఆగింది.. 

అందరూ  ఆశ్చర్యంతో చూస్తుండగానే  
"ఆయన్ని  వచ్చి  తీసుకెళ్ళమనండి " అంది.. 

చంద్రశేఖర్రావుగారు కూడా ఏం మాట్లాడకుండా 
" సరే బాబును పంపిస్తాను " అన్నారు  అంతే.. 

ఏదేదో  ఊహించుకుని వస్తే సమస్య  ఇంత  తొందరగా  సమసి పోయిందా అని   అనుకున్నారు  .. 

 "వెళ్ళి  వస్తాం బావగారు"  అని హరిహర్రావుగారు లేవబోతుంటే పద్మ  కాఫీలు పట్టుకొచ్చి ఇచ్చింది ..

మెల్లగా  తాగుతున్నారు అందరూ... 
ఉన్నట్టుండి సంగీత  చంద్రశేఖర్ గారి నడిగింది ..

"అసలు  నేను ఊరికెందుకు  రావాలి  మావయ్యా ?" అని.. 

   "అదేంటి  చెప్పానుగా..". 

" బాబిక్కడ  In secured గా ఫీలవుతున్నాడు " అని.. 

"మరి  నేనక్కడికి వస్తే  మీరు security ఇస్తారా?".

"నీకెందుకు  సెక్యూరిటీ? నువ్వు  చాలా  తెలివిగలదానివి ..నిన్ను  నువ్వు  రక్షించుకోగలవు ".

"మా అమ్మాయి తెలివిగలదని చెప్పిందా లేక మీరను  కుంటున్నారా?. "అని  హరిహర్రావుగారు అడిగారు

"అనుకోవడమేముంది  ఎంత  తెలివి  గలది  కాకపోతే  అబ్బాయి  కోరిక  తీర్చడానికి డబ్బులడుగుతుంది?.."

సంగీత  అవాక్కయ్యింది  .ఈ విషయం  కూడా  తండ్రికి  చెబుతారా ఎవరైనా.. ఉక్రోషం వచ్చింది  కోపం బాధతో  లోపలనుండి  దుఖం  తన్నుకొస్తున్నది.. 

"అదేంటి  బావగారు!  అవి  వాళ్ళ ప్రైవేట్  విషయాలు,  అక్కడ  100 మాటలు  మాట్లాడుకుంటారు,  అవి  వారి సొంత  విషయాలు,  ఆ మాట  అన్న  సందర్భమేంటో  మనకు  తెలీదు  కదా బావగారు.." 

"ఓకే !మరి డబ్బులిస్తేనే కానీ మీ ఇంటికి  రాను,  
నీతో  ఉండను  అనడం ... మీ అమ్మ వాళ్ళుంటే  నేనుండను అనడం , వాళ్ళ  దగ్గరికి   వీళ్ళ దగ్గరికి  వెళ్ళొద్దని   కంట్రోల్  చేయడం బాగుందా?" 
 ఇన్ని  చేసినా  మా వాడు  అన్ని  భరించి  ఇక్కడ  ఉండవలసిన  అవసరం ఉందా? ఇంకా  మేం  మంచి  వాళ్ళం  కాబట్టి  అమ్మాయిని  ఏమనకుండా  మాఇంటికి  రమ్మంటున్నాం".. అన్నారు..

సంగీత తో  సహా  మిగతా  వారంతా  కూడా  బిత్తరపోయారు...
"అసలు  ఆయన వేసే నిందలకు  ఏమని  జవాబు  చెప్పాలి.  ఎవరు  తెలివి కలవారు తనా ? ఆయనా    ఇన్ని  అబద్ధాలు  తన మీద  చెప్పి  అక్కడనుండి తమాషా  చూస్తున్నాడన్న  మాట"..

ఉద్రేకంగా మాట్లాడబోతున్న సంగీతను  చేయి  పట్టి  ఆపారు  హరిహర్రావుగారు.. 

"Ok Sir ! మీ ఎలిగేషన్స్ అన్నీ నిజమనుకుందాం, మరి మా అమ్మాయి అక్కడికి  వచ్చినా   ఇవన్నీ  చేయదని  మీకు నమ్మకమేంటి ? .." 

"ఎందుకంటే  అక్కడ  మీరుండరు  కాబట్టి  "..

"అంటే  ఇన్ని  రోజులు  ఇక్కడ  మేము  అమ్మాయిని 
సమర్థించామనా..  అసలు  ఇన్నిరోజులు అక్కడ ఏం జరిగిందో  కూడా  మాకు  తెలీదు.. "

"ఆమాటే  చెబుతారు  అంతకంటే  ఎక్కువ ఏం చెబుతారు మీరు బావగారు.". అన్నారు చంద్ర శేఖర్ రావుగారు వ్యగ్యంగా.. 

అనురాధకంతా  అయోమయంగా ఉంది '.అసలే  మనకుంటే  ఏమవుతుంది..' సంగీత  చెయ్యి  పట్టుకుంది సంగీతకు ఉక్రోషంతో  కళ్ళనీళ్ళు  వస్తున్నాయి , మావగారు వాళ్ళ నాన్నను  మాటలతో  అవమానించడం  నచ్చలేదు. 
ఇంకా ఇంకా  అనడం  సహించ  లేక పోయింది కుర్చీలోంచి లేచింది ..

"Yes!  అవన్నీ నేనే అన్నాను .  అలా అన్నానని  మీదగ్గర ఏదైనా  ప్రూఫ్ఉందా?.మీతో  చెప్పిన  ఆ పెద్దమనిషి  ఏడి.?".

"మీరంతా  నాతో  ఎప్పుడు మాట్లాడినా    ఇద్దరినీ ఎదురెదురుగా కూచోపెట్టి  మాట్లాడలేదు . ఇద్దరి విషయాలు వినలేదు, అలాంటప్పుడు one side విని  ఎలా  జస్టిస్  చేస్తారు? వీరంతా  కొత్త వారు  వీరి ముందు నన్ను  చెడ్డ దాన్ని  చేస్తారా? ..నేను  మీ కోడలిని  కాదా  అలా శత్రువును  చేసి  మాట్లడతారేమిటి  మావయ్యా .."

" మీకు  చెప్పలేదేమో  కానీ  వదినా  వాళ్ళకు అన్నీ తెలుసు. మనవాళ్ళు ఎవరూ  లేకుండా,  అసలు  ఈయన  లేకుండా   ఏం  మాట్లాడుకుంటాం. 
పెద్ద వారనీ,  నన్ను  కన్విన్స్ చేస్తూ జవాబు  చెబుతారని ఆశిస్తూ అడిగానే కానీ, ఇలా మా నాన్నను  అవమానిస్తారని అనుకోలేదు.."

 "I am  Sorry,   ఇప్పుడు నేను చెబుతున్నాను 
మీ అబ్బాయిని  మీ దగ్గరే ఉంచుకోండి. "అంటూ  ముందుకు  నడిచింది  ..

వేంకటేశ్వర్రావుగారు మధ్యలో అడ్డుకుని "అమ్మాయ్! అదేంటమ్మా,  నీ మాట మన్నించి  పెద్దాయన  వచ్చారు మాట్లాడాలి  కదా!.." 

"క్షమించండి మావయ్య గారు, వారు పెద్దవారిలాగానే మాట్లాడటం  లేదు కదా? .."

 "ఏంటమ్మా!  ఏమయ్యింది,అని అడిగారా? లేదుకదా, పైగా  ఎన్ని  మాటలంటున్నారు..మీకు  తెలుసా? కడుపుతో  ఉన్న  నన్ను ఆయన  మంచం  మీంచి  లాగి  కింద  పడేసారు " 

"నేను  ఎవరికీ  చెప్ప లేదు.  ఏదో కోపంలో  చేసారని   అనుకున్నానే తప్ప  మీకెవరికీ  కంప్లెయింట్   చేయలేదు, చివరకు మా అమ్మా నాన్నకు  కూడా. ఆయన  మీద  చెడు  అభిప్రాయం ఎవరికీ  రాకూడదని ఊరుకున్నాను . అలాంటిది నన్ను ఇన్ని  మాటలంటారా ?"
".ఆయనెలా  ఉన్నా, ఈ కుటుంబం  అంతా  నాకుందనుకున్నాను .అలాంటిది ఈ రోజు నన్ను  ఒంటరి  దాన్ని   చేసి   ఇన్ని  మాటలంటున్నారు. నేను కూడా జవాబివ్వగలను కానీ మీరు  పెద్దవారు,   మీకు  తెలీదు, ఆయనేం  చెప్పారో  అదే  నమ్ముతున్నారు "
"పరాయి పిల్లను కాబట్టి నా మాట మీద నమ్మకం  ఉండదు, ఫరవాలేదు  లెండి  నేను  మంచిదాన్నని  చెప్పు  కోవడం  లేదు, చెడ్డదాన్నే,మంచిదాన్నవ్వాలని కూడా నాకులేదు  ఆలోచించుకోవాల్సింది కూడా ఏం లేదు".
వస్తామండి.  🙏

అంటూ  గబ  గబా  ముందుకు నడిచింది 
వెనకాల మిగతావారు  అనుసరించారు.

సశేషం


బాంధవ్యం...... 35

 ఇల్లు చేరే దాకా అందరూ నిశ్శబ్దంగా  మాట్లాడకుండా కూచున్నారు.....

ఇంటికి  రాగానే  సంగీత  గదిలో  కెళ్ళి  తలుపేసుకుంది బామ్మ  పిలుస్తున్నా  వినకుండా... 

హరిహర్రావుగారు  కూడా  మాట్లాడకుండా  కుర్చీలో  కూచున్నారు... 

అనూరాధ  వంటింట్లోకెళ్ళింది...

ఏం జరిగింది అన్నట్టుగా  అందరినీ  పరికించి చూస్తున్న  బామ్మతో 

 " అందరినీ  నాలుగు  మాటలని పంపించారు బామ్మా. నోరుమూసుకుని  వచ్చాం "....అన్నాడు హర్ష.. 

"అదేంట్రా.."

"అవును  బామ్మా!  మన సతీసావిత్రి  అతి మంచితనం  ఇంత  వరకూ  తెచ్చింది.. "

"అసలేం  జరిగిందో  చెబుతారా?.."

"ఏం జరుగుతుంది, ఇన్నాళ్ళూ అది నోరు  మూసుకుని ఇప్పుడు  అందరి  నోరూ  మూయించింది. వారూ, వీరూ రోజుకొకరు ఈ తొక్కలో  మీటింగులవసరమా ? Yes or No  చెప్పకుండా ..."

"హర్షా!..."

"మీరు  ఊరుకోండి  నాన్నా!"...
 
"ఏంచేస్తాం ఇప్పుడు , తన మీద దాడి  జరిగినప్పుడు  అది  మనకు చెప్తే  మనది పైచేయుండేది....
కానీ ఇప్పుడు వారు  మన మీద  నిందలేస్తున్నారు , నింద  నిజం  చేస్తారు  అదే ఆలోచిస్తున్నా.. 
కాసేపు అందరూ కామ్ గా ఉండండి.. "

గదిలో  సంగీత  గుండెలవిసేలా  ఏడుస్తున్నది....
"ఎంత  మోసపోయాను ,ఎంత  దోచుకున్నాడు నన్ను...ఛీ ఎంత  సిగ్గులేని బతుకు నాది.ఎవరైనా చెడ్డ వాళ్ళుంటారు, కసాయి వాళ్ళుంటారు ,
కొట్టి , తిట్టే వాళ్ళుంటారు. కానీ ఈ తేనె పూసిన  కత్తిలాంటి  వారు ఎక్కడా  కనబడరు.." 

"ఎంత  మోసం, మంచిగా నటిస్తూ,  అందరిలో  మంచిగా  కనిపిస్తూ,  తాను మంచవుతూ  అన్ని  విధాలుగా నన్ను  వాడుకుని ఇలా వెనకాల నన్ను  చెడ్డదాన్ని  చేస్తాడా? "అని  జరిగినవన్నీ  గుర్తుచేసుకుంటూ  ఏడిచింది... 

హర్ష , హరిహర్రావుగారు ఇద్దరూ నెమ్మదిగా సంగీతతో తలుపు తీయించి లోపలికొచ్చారు.. 
సంగీతకు చెరో  పక్కన  కూచున్నారు .

హరిహర్రావుగారు.. సంగీత  తల మీద  చేయి  వేసి 

"అమ్మలూ  ఎంత  ఏడవాలనిపిస్తే అంత  ఏడువు. 
నీ కడుపులో ఉన్న దుఖం, కళ్ళలో ఉన్న  నీళ్ళు ఇంకి  పోయే  దాకా  ఏడువు నేనాపను . కానీ  ఈ రోజు  తరువాత  నువ్వు  ఎప్పుడూ ఏడవకూడదు,
 నీ కళ్ళలో  నీళ్ళు  కనపడకూడదు ..
నీ  గమ్యం  ప్రవల్లిక   మాత్రమే ! తన భవిష్యత్తును  తీర్చిదిద్దడమే.. అన్నారు. 

"అవునక్కా! ఇంక అసలు అన్నీ మరిచిపో అక్కా!  నీకు  మేమందరం ఉన్నాం ...నువ్వు  జీవితంలో   ముందుకు  వెళ్ళు,  గతం  ఉందని  మరిచిపో". అన్నాడు హర్ష 

"ఒక్కటి  మటుకు గుర్తుపెట్టుకో, ప్రతిచోట  మంచితనం  పనికురాదు తల్లి... నీ మీద  దాడి  జరిగినప్పుడు  ఎదుటి వారి  మీద  దాడి  చేయక  పోయినా  నిన్ను  రక్షించుకునే ప్రయత్నమన్నా  చేసుకోవాలికదా  తల్లీ".

" నీ ఫీలింగ్స్ ని నేను  హర్ట్ చేయనమ్మా ...కానీ  నువ్వు  చేసినదంతా  బూడిదలో  పోసిన  పన్నీరయ్యింది కదమ్మా.. ఆడపిల్లవి,  నీ భర్త ,
 నీ ఇల్లు  అనుకున్నావు,  వీలయినంత వరకు  గౌరవప్రదంగా  ఉండాలనుకున్నావు,  మర్యాదగా ప్రవర్తించావు, కానీ  ఎదుటివారు వాటికి అర్హులు కారమ్మా .. అనర్హులను  అందలం  ఎక్కించావు , పుస్తకాలు  చదువుకున్నావే కానీ మనుషులను  చదవలేక  పోయావు.. అదే మా బాధ , ఇక ముందు జాగ్రత్తగా ఉండు. ఏది జరిగినా మాతో పంచుకోవడం నేర్చుకో " అని చెప్పి  బయటకెళ్ళబోతుంటే  ...

తండ్రి  చేయి , తమ్ముడి  చేయి  పట్టుకుని  

 "లేదు నాన్నా ! మీకు  మాటిస్తున్నాను ఇంకెప్పుడూ  ఏడవను  మీరుండగా  నాకే  భయం  లేదు.."

"మేముండగా కాదు,  మేము లేకపోయినా  కూడా   ఉండాలి . .. పద! కళ్ళుతుడుచుకో... అన్నారు

 ముగ్గురూ  కలిసి  బామ్మ  దగ్గరకొచ్చారు..
ఈలోపు  అనూరాధ ద్వారా  అంతా  తెలుసుకున్న 
బామ్మ.. 

"అమ్మలూ !నీకేం భయంలేదమ్మా,మేమంతా నీ వెంటే ఉన్నాం. నీ బాధ, దుఖం  దాచుకుని  అక్కడ ఉండాల్సిన అవసరం  లేదు " అని  సంగీతను  దగ్గరకు  తీసుకుంది.. 

ఇక్కడ  వేంకటేశ్వర్రావుగారు  చంద్రశేఖర్ గారితో..

" అదేంటన్నగారు !అలా మాట్లాడారు  కొంచం  ఓపిక  పట్టుంటే  అమ్మాయిని  ఒప్పించే  వాళ్ళం కదా.". 

"ఏంచేయనయ్యా ! ఆ అమ్మాయి  అలా అడుగుతుంటే కోపంరాదా . నాకీ  వయసులో  ఇవన్నీ  అవసరమా?  మేముంటే  తను రానన్నది   అంటే ఊరికెళ్ళి  పోయాం కదా! నా పెళ్ళాం  నన్ను  డబ్బుుల  సంపాదించమన్నది  అంటే  ఆస్తి  ఇచ్చాం  కదా .... ఇప్పుడు  వాడు  నేనక్కడుండను  నా మీద  ఎప్పుడైనా పోలీసు  కేసు  పెడుతుంది  అంటే  నేనేం  చేస్తాను  అసలే వాడు పేషంట్. వాడి  మాట  వినాలికదా. మరా  అమ్మాయి ఇన్ని చేసి కూడా  
ఏం తెలియనట్టు  అడుగుతుంటే  చెప్పకేం చేయను.. నా వల్ల కాదయ్యా మెల్లగా  మాట్లాడడం "..

:అన్నగారు!  ఇలాంటి వాటిని  కాస్త  ఓపికగా  డీల్ చేయాలి  కదా.." 

"నాకంత ఓపిక  లేదు ,  నేను మాట్లాడను,  మీరే  ఏదో  ఒకటి  చేసుకోండి   రేపు  నేను  వెళ్ళి  పోతాను"  అని  అన్నారు.. 

ఊరెళ్ళిన ఆయనకు  సతీష్  ఎదురొచ్చాడు.. 

 "ఏం  జరగ లేదు  నీమీద  ఆ అమ్మాయి ...
 ఆమె  మీద  నువ్వు  ఇలా  అనుకుంటూ ఎంత  కాలం  ఉంటారు. నువ్వు వచ్చి  తీసుకొస్తే  కానీ రాదట   మరి  నువ్వే ఆలోచించుకో " అని  లోపలికెళ్ళిపోయారు.. 

రోజులు గడుస్తున్నాయి , ఎవరెక్కడున్నరో అక్కడే ఉన్నారు..   ఎవరి పనులు  వారు  చేసుకుంటూ  
కానీ  సతీష్ కలా ఉండడం  నచ్చటం  లేదు  
ఏదో  ఒకటి  చేయాలి   హైదరాబాదు కు వెళ్ళాలి   సంగీత  లేక  పోతే  బాగా  లేదు అనుకుంటున్నాడు.. 

సంగీత  కూడా అదే ఆలోచిస్తుంది విషయం తేలకుండా ఇక్కడ  ఎన్ని  రోజులుండాలి  
ఆ ఇంట్లోనుంచి  తనసామాన్లన్నీ తెచ్చుకోవాలి  మనది కాని  ఇంట్లో  ఎలా ఉంచుతుంది  అదే  చెప్పింది  తల్లితో 

 "రెండు  రోజులు  అక్కడుండి సామాను  తెచ్చుకుంటానని"..

"ఇప్పుడెందుకమ్మా! నాలుగు  రోజులాగి  వెళ్ళు  తొందరేముంది .."

"ఎప్పుడైనా  వెళ్ళాలి  కదమ్మా !  వాళ్ళనుండి 
 మాట రాక  ముందే  తెచ్చుకుంటాను.   అని 
 ఆ రాత్రి  అక్కడికే  వెళతానని  అక్కడుంటానని పాపను స్కూల్ నుండి  అక్కడికే తీసుకు పోతానని చెప్పి  వెళ్ళింది... 

తానొకటి  తలిస్తే  దైవమొకటి  తలచాడట.. 
ఈ  మార్పు  ఎక్కడికో.... చూడాలి 

సశేషం

బాంధవ్యం......... 36

సాయంత్రం  పర్మీషన్  తీసుకుని రేపు  లీవ్ తీసుకుంటానని చెప్పి పాప  వచ్చే  టైమ్ కి ఇంటికొచ్చింది..

వస్తూ  తాను తెచ్చిన కూరలతో  గబ గబా వంట  చేసింది ..

 చాలా  రోజులుగా మూసి  ఉన్న  ఇంటిని  కాస్త  బాగు  చేసి  గదిలో  కొచ్చింది  పాపను పడుకోపెడదామని...... 

"అమ్మా ! నాన్న  ఏడి? "అనడిగింది  
" బామ్మ దగ్గరున్నాడమ్మ.."

  "ఎప్పుడొస్తాడు మరి ?"..

"వస్తారు , అక్కడ  పనుంది  కదా  ఆ పనయ్యాక  వస్తారు  పడుకో "...

 పాప  పడుకున్నా పాప మాటలు  సంగీతలో  ఆలోచనలు  రేకెత్తిస్తున్నాయి....."పాపను  తండ్రి నుండి వేరు  చేసే  హక్కు  తనకుందా ?
ఎన్ని  రోజులు  ఇలా  మభ్యపెట్టి  పాపను  నమ్మిస్తుంది. తను  చేసేది  కరెక్టేనా? తన  నిర్ణయం  సరయినదేనా? ..పెద్దయ్యాక  పాపకు  సంజాయిషీ  ఇచ్చుకునే అవసరం  తలదించుకునే  పరిస్థితి  రాదు  కదా ? .."

"భగవంతుడా!  ఏం చేయాలో నువ్వే  నిర్ణయించు,  ఆలోచించే  శక్తి  నాకు  లేదు.."  అని  పడుకుంది.. 

తెల్లవారి  పాపను  స్కూల్  కి పంపించింది  

 సామాన్లు  పాక్  చేద్దామనుకుంది  కానీ  బీరువాలో  బట్టలు  తన  సర్టిఫికేట్ లు మాత్రమే  సర్దుకుంది .. 
తన సామాన్లు రాత్రి  కార్టన్ లో  పెట్టాలనుకుంది..

 కానీ  ప్రవల్లిక పెట్టనివ్వలేదు "ఎక్కడికమ్మా ఇవన్నీ" అంది 
అమ్మమ్మ  వాళ్ళ ఇంటికని  చెప్పలేకపోయింది.. 

"ఊరికమ్మా !మనం  కూడా  నాన్న దగ్గరకెళదాం.. అంది  సంగీత... 

"అదేంటి  నాన్న  ఇక్కడికి  రాడా ? వస్తాడన్నావు కదా. ?"

"రాకపోతే  మనం  వెళదామా ?"అంది.. 

"వద్దు  వద్దు  నా స్కూల్  నా ఫ్రెండ్స్  నేను  రాను నాన్నే  ఇక్కడి  కొస్తాడన్నావు కదా .".

"వస్తాడు...మరి  నాన్న  వచ్చేదాకా అమ్మమ్మ  వాళ్ళ ఇంట్లో  ఉందామా?".. 

"వద్దు మనం  లేకపోతే నాన్న  మళ్ళీ  వెళ్ళి పోతాడేమో ?...ఇక్కడే  ఉందాం " అంది.. 

"సరే  ఇక్కడే  ఉందాం  లే పడుకో"  అని పడుకో పెట్టింది ......

బాంధవుడు  సరిగ్గా  లేక  పోయినా  బంధం  మటుకు  చాలా  గట్టిగానే  ఉన్నట్టుంది  అని  నవ్వుకుని  పడుకుంది.. 

తెల్లవారి  అనూరాధకు  ఫోన్ చేసి  విషయం  చెప్పింది...'ఏంచేయమంటావు ' అని.. 

"చంటిపిల్ల  దాని  మనసు  నొప్పించకమ్మా! 
 ఆ ఇంటికి వెళ్ళగానే  తన ఇంటికి  వచ్చానన్న  ఫీలింగ్ వచ్చిందేమో పోనీ  రెండు  రోజులుండిరా " అన్నది ...
"తోడుకోసం  ఎరన్నా  రావాలా?"

"వద్దమ్మా !ఫరవాలేదు" అంది.. 

రెండు  రోజులాగి సతీష్ కూడా  హైదరాబాదు  వచ్చాడు. అక్కదగ్గరకెళ్ళి అక్కడే  భోంచేసి   సాయంత్రం  మెల్లగా  ఇంటికెళ్ళాడు తాళం  తీసి  ఉంది ....దొంగలు పడలేదు కదా ? అని  కాసేపు  ఇంటివైపు  చూసాడు  ఇంట్లో  మనుషులున్నట్టు అనిపించింది. 
ఎవరైనా  చూస్తారేమో  అని  వెనుతిరిగాడు. 

అక్కకు  చెప్పాడు ఇంటికెళుతున్నానని  మళ్ళీ  అక్క దగ్గరికి  వెళ్ళలేడు.. అన్నయ్య  అక్కడికి  రావద్దన్నాడు. 

ఇక  మిగిలింది  చెల్లి . వనిత  వాళ్ళింటికి  వెళ్ళాడు 
భోజనాలయ్యాక  పడుకోబోతుంటే  వనిత  అడిగింది .
 "అక్కయ్యకు  ఇంటికెళతానని  చెప్పావట..  వెళ్ళలేదా?"

"అక్కడ  సంగీత వాళ్ళు ఉన్నారు."

లేదే ! వాళ్ళ అమ్మా వాళ్ళింట్లో ఉన్నారు కదా !...

"కాదు  ఇక్కడే  ఉన్నారు ."..

"మరి  మంచిదేగా! ఏ గొడవా  లేదు."
 
"అదేంటి  నేనెట్లా  వెళతాను"..

"నీ ఇంటికి  నువ్వు  వెళుతున్నావు, అందులో  తప్పేం  ఉంది .....

"నీకు  తెలీదు.  సరేలే !  నేను రేపు పొద్దున్నే  లేచి  వెళతాను"..  అని  పడుకున్నాడు.. 

 అంతే ! తెల్లవారి  లేచి  ఊరికెళ్ళిపోయాడు.. మళ్ళీ 
 అడ్రస్  లేడు..వచ్చినా  అక్కా చెల్లెళ్ళ దగ్గరకి  రావడం  వెళ్ళి పోవడం. ..ఒక్కసారి  కూడా  కూతురిని  చూడాలని  అనుకోలేదు.. 

సంగీత  కూడా  పాప మనసు బాధ  పెట్టాలను  కోలేదు. పాపనొదిలి  తన సుఖం  తాను  చూసుకునేంత  స్వార్థపరురాలు  కాదు కదా....
అందుకే  అదే  ఇంట్లో  అలాగే  ఉంది.  పెద్దలకు  ఏం  చెప్పిందో  అదే  మాట  మీద  స్టాండ్  అయ్యింది....

  ఆయన్ని వచ్చి తీసుకెళ్ళమంది అందుకని  అక్కడే  భర్త  ఇంట్లోనే  ఉంది.. ఆలోచనలనుండి
 తప్పించుకోవడానికా అన్నట్టు పనిలో పడింది..  
శ్రద్ధ  పెట్టి  పని నేర్చుకుని పని  చేస్తున్నది. 
ఇప్పుడు ఆఫీసులో  ఫైల్స్ అన్నీ  తన  అధీనంలో  ఉంటాయి.  క్లయింట్స్ కెప్పుడు  ఏం ప్రిపేర్  చేయాలో   అన్నీ  తనే  చూసుకుంటుంది  ....

నిజం చెప్పాలంటే తన మీద  చాలా మంది  స్టాఫ్  ఆధార  పడి  ఉన్నారు... అందరికీ అవసరమైన  పనులు  తనే చూస్తుంది. ..

ప్రవల్లిక  కూడా  Classలో  1st rank  student School లో  అన్నింటిలో Participate చేయడమే  కాకుండా  బహుమతులు  కూడా అందుకుంటున్నది.. 

ఆది వారాలు,  శలవు రోజులు  అమ్మమ్మ  వాళ్ళ  ఇంటికే  కాకుండా  అత్తలింటికి  కూడా  తీసుకెళుతుంది సంగీత ..  

పాపను  ఏబంధం  నుండి  దూరం  చేయవద్దని .. వాళ్ళు కూడా  సంగీతను , పాపను  ఎప్పటిలాగానే  ఆదరిస్తున్నారు... 

 కానీ  ఊరుకుంటే ఊరా, పేరా?. అని 

 ఇవన్నీ  నచ్చని  సతీష్  ఒక  రోజు వాళ్ళ  అక్కకు  చెప్పాడు   తన  TV   తాను  ఊరికి  తీసుకెళతానని .

"అలాగే " అంది ..
 
"కాదు!  ఇక్కడ  తెచ్చిపెట్టమని చెప్పు. ఇక్కడి నుండి తీసుకెళతాను "అన్నాడు.. 

"నేను చెప్పను"  అంది  లలిత  ..

మొత్తానికి  అది  శ్రీధర్  ద్వారా  సంగీతకు తెలిసింది..
 "వచ్చి తీసుకెళ్ళమనండి నాకేం  అభ్యంతరం  లేదు " అని ..

కానీ సతీష్ రాలేదు.. ఆ రోజు  అమ్మా వాళ్ళింటికి  వెళ్ళి  విషయం  చెప్పింది అందరితో.. 

ఈ రోజు  TV అన్నాడు ,రేపు ఫ్రిడ్జ్  అంటాడు,
 ఆ తరువాత నాఇల్లంటాడు. అందుకని  ఇల్లు  వదిలేయడమే  బెటరేమో  అమ్మా .. అన్న సంగీతతో

"నేనప్పుడే చెప్పానా?" అంది  అనూరాధ ..

తండ్రి వచ్చాక చెప్పింది తనకో  ఇల్లు చూడమని 

 " ఏం  ఇక్కడుండవా ?" అన్నారు.. 

" లేదు నాన్నా! మీకు  దగ్గరగానే చూడండి" .. అన్నది 

వాళ్ళు  ఆ ప్రయత్నంలో ఉండగానే  శ్రీధర్ ఆఫీస్  కి  వచ్చినప్పుడు  చెబితే..  

"వద్దమ్మా !  అలాంటి  ప్రయత్నం  చేయకు?  నువ్వు  ఎలా  ఉన్నావో  అలాగే  ఉండు.  వాళ్ళను   అననీ  ఆ మాట..  అప్పుడు  చూద్దాం .. నీ కొచ్చిన  నష్టం  లేదు  . రేపు  పాప  పెద్దయ్యాక నువ్వు  నాన్న నుండి  వేరుచేసావనే అభిప్రాయం   ఏర్పడ కూడదు  కదా!" అన్నారు..  

సంగీత  కూడా  అదీ నిజమే  అనుకుని  
 ఆ ప్రయత్నం  మానుకుంది.. మళ్ళీ  TV  మాట  రాలేదు ..

అలగే రోజులు గడుస్తున్నాయి.
..................................         

ఒక రోజు  మధ్యాహ్నం  స్కూల్  నుండి  ఫోన్ వచ్చింది..   మీ అమ్మాయి  Matured అయ్యింది  వచ్చి తీసుకెళ్ళ మని.. 

 గబ గబ ఫోన్  పెట్టేసి  స్కూల్  కి  బయలుదేరింది... 

సశేషం.

(   Note: ఇక్కడితో కథ సమాప్తం అనుకున్నాను..
కానీ అందరూ ఇంకా రాయండి అన్నప్పుడు ఇంకా ఏం రాయనా అని ఆలోచించాను. మనకు ప్రతి కథ ఇంత వరకూ తెలుసు. కానీ ఒక single parent పిల్లలను ఎలా పెంచుతుంది ఎలా కష్టపడుతుందో చెప్పాలనిపించింది . ఇక తరువాత కథ ఆ దిశగా)


బాంధవ్యం...... 37

స్కూల్  కి వెళ్ళి Principal గారిని  కలిసింది  సంగీత 
తనకిలా  phone  వచ్చిందని  చెప్పగానే  సర్  ఆయానిచ్చి పంపించారు .....

 పాపను Staff  రూమ్ లో  కూచో  పెట్టారు..  సంగీత  వెళ్ళి దగ్గరకు  తీసుకోగానే  కాస్త  ఉద్విగ్నతకు  లోనయ్యింది ప్రవల్లిక... 
ఒక  Phone  చేసుకుంటానని Permission అడిగి   తల్లికి  విషయం  చెప్పింది..

  "ముందు  ఇక్కడికి  తీసుకురా! మిగతాది  తరువాత చూద్దాం"  అని అనూరాధ  Phone  పెట్టేసింది. 
.
సంగీత  వచ్చే  లోపు  హరి హర్రావుగారిని  పంపించి  కావలసిన వన్నీ  తెప్పించింది..  బామ్మ  మిగతా ఏర్పాట్లు   చేసింది.. సంగీత  వాళ్ళు  వచ్చేటప్పటికి  నలుగురు  పేరంటాళ్ళు  కూడా  వచ్చేసారు  ...
తరువాత జరగ వలసిన తతంగం  అంతా   బామ్మ  అనూరాధ గారు దగ్గరుండి  జరిపించారు.. 

అందరూ  వెళ్ళి  పోయాక  సంగీత  నిస్త్రాణగా  కూచుంది ...  "అదేంటమ్మా   మొన్ననేగా 11 వచ్చాయి ,అప్పుడేనా ?ఇంత  తొందరగా  పెద్దదవుతుంటే  ఎలా ? "అని కళ్ళ  నీళ్ళు  పెట్టుకుంది.. 

"తప్పమ్మా!  ప్రక్రుతి సహజంగా వచ్చేవి , మన  చేతుల్లో  ఏముంది?  దాన్ని  చూసుకోవాలి ,నువ్వే  బెంబేలు పడితే ఎలా? కొంచం  సర్దుకుని మీ అత్తగారికి ,మావగారికి, సతీష్  కి ఫోన్  చేసి  చెప్పు.. 
తరువాత  ఇక్కడ వీళ్ళ  ముగ్గురుకీ  కూడా చెప్పు  అన్నది బామ్మ.. 

అరగంట  ఆగి  అందరికీ  Phone చేసింది  అత్తగారు  'మేం రాలేము  లేమ్మా! 'అన్నారు.  సతీష్ కి, మీ  మావగారికి నేను  చెబుతాలే అని  Phone  పెట్టేసింది.. 

ఆడపడుచులు, తోడికోడలు , అభినందనలు తెలిపారు.  వచ్చి చూస్తారనే నమ్మకం  కలగ లేదు.. 
అనూరాధ  హడావిడికి  సంతోషానికి హద్దు లేదు  బామ్మ  గారితో  కలిసి ప్రణాలికలు వేస్తున్నది ..
సంగీత  అడ్డుతగిలింది.. 

"వద్దమ్మా ! వాళ్ళు  రానప్పుడు  హడావిడి  చేయకు  మళ్ళీ  అది స్కూల్  కి వెళ్ళాలి.. "

"అమ్మలూ!  ఇది  అమ్మమ్మ చేసే  పండగ ,చిట్టితల్లి  రేపు  పెద్దయ్యాక నాకేం చేయలేదని బాధ  పడకూడదు కదా! ఇది  నీకు సంబంధించిన విషయం కాదు, నువ్వు  కామ్ గా ఉండు, వీలుంటే సెలవు  పెట్టు  అంది ..
 
"పండగలు ,పబ్బాలు,  ఫంక్షన్ లూ  కాదమ్మా,అది  సంతోషంగా  ఉండడం  కావాలి " అన్న సంగీతో

 "సరి సరి  నీతో వాదించే  టైములేదు కానీ ,
రా అన్నానికి " అంటూ  పిలిచింది ...

ఆ రాత్రి పాప  దగ్గర  అనూరాధ  పడకుంది... 
సంగీతకు  నిద్ర  పట్టడంలేదు.  ఇది  చిన్న  కార్యక్రమం...   కానీ, రేపు పెళ్ళి సంగతి ..
నాకేం  బాధలేదు ఉన్న  విషయం చెబితే నచ్చిన వారు చేసుకుంటారు ....కాని  చిట్టితల్లి  దాని  మనసులో  ఏం ఫీల్ అవుతుందో నాన్న కోసం.. 

ఇది  తెలిసీ  తెలియని  వయసు  నాన్న  వస్తాడనుకుంటుంది పిచ్చిది,
భగవంతుండా  చేయని  తప్పుకు  ఇంత  శిక్షా  ఏ గొడవలులేని  కాపురంలో  ఇన్ని  కలతలా..... 
అని  ఆలోచిస్తూ  చాలా సేపు  ఏడ్చి  పడుకుంది..

తెల్లవారి  లేవగానే  అనూరాధ  "ఆఫీస్ కి సెలవు పెట్టావా?" అనడిగింది ... 
"ఆ"అంది   
పద  అయితే  త్వరగా రెడీ అవ్వు   shoppingకి వెళ్ళాలి. పాప దగ్గర  బామ్మ  ఉంటారు  అంది  
వాళ్ళ  ఉత్సాహాన్ని  కాదనలేక  పోయింది 

 భోజనాలు  కాగానే  అమ్మమ్మ ,తాతయ్య  సంగీత ముగ్గురు  బయలుదేరారు.  ముందు పట్టులంగా  కొన్నారు.  తరువాత  బంగారం  షాప్  కి వెళ్ళి  నెక్లెస్ కొన్నారు. సంగీత  తన  తరఫున  పాపకు  జుంకాలు   కొన్నది  

అనూరాధ  తనకోసం  చీర  కొంటుంటే  వద్దని  గొడవ  చేసింది సంగీత.   కానీ ఇది  మేంచేసే  పండగ  నువ్వు  అడ్డు  చెప్పకూడదు,  నీపని  సెలెక్షన్ మాత్రమే  అని  సంగీతకు  చీర అనూరాధ, అమ్మమ్మకు  చీర  సంగీత తీసుకుని  ఇంటికి  వచ్చారు  సాయంత్రం  అందరినీ పిలవమంది    ...

వద్దమ్మా !అసలువాళ్ళులేకుండా  మిగతావారంతా  అవసరమా  అంది . అమ్మలూ పిలిచిచూడు వస్తారేమో?పిలవలేదని మళ్ళీవాళ్ళు అనుకోకూడదు ..

 "అదేంటమ్మా!  దాని  భవిష్యత్తు బాగుండాలి  కానీ ఇవన్నీ ముఖ్యమా " ..

"దేనికదే " అమ్మలూ  ..

" నేను  ఇప్పుడు  వాళ్ళకు  ఫోన్  చేయను  రేపు  ఇళ్ళకెళ్ళి చెబుతాను"
"అలాగే నీ ఇష్టం "అని  మిగతా వారందంరికీ  ఫోన్  చేసి  చెప్పారు  అనూరాధ హరి హర్రావు గారు.. 

తెల్లవారి భోజనంచేసి పిలుపులకు  బయలుదేరింది 
సంగీత  ముందు దగ్గరోనే  ఉన్న  వనిత  వాళ్ళింటికి  వెళ్ళింది...విషయం  ముందే తెలుసుకాబట్టి   సంగీతను అక్కున  చేర్చుకుని  

"చాలా  సంతోషం  సంగీతా! నిజంగా  సంతోషంగా  ఉంది  . దాంతో  పాటు  నువ్వు  పెద్దదానివయ్యావు".. అంటూ సంబర పడింది.. 

బొట్టుపెట్టి" తప్పకుండా  రండి  ప్రవల్లిక  సంతోష  పడుతుంది " అంటూ  బయలుదేరింది .

లలితా వాళ్ళింటికి వెళ్ళింది.. 

ఇంట్లో లలిత ,మోహన్  ఇద్దరూ  ఉన్నారు.. 
సంగీత  వెళ్ళేటప్పటికి భోజనం  చేస్తున్నారు ..

"రా రా!  అంటూ  పిలిచి  , మేం  ఇప్పుడే  మొదలు  పెట్టాం  భోంచేయ్యి " అంటు  పక్కనే  బోర్లించి  ఉన్న  కంచం తీసి  వడ్డన  మొదలు పెట్టింది  

నేను  భోంచేసి  వచ్చానన్నా  వినకుండా " ఇవాళ  నీకిష్టమైన  టమాటా ఆవకాయ,  ఉల్లికారం ఉంది" అంటూ  ఆప్యాయంగా  వడ్డిస్తుంటే కాదన  లేక  పోయింది సంగీత. 
లలిత  ఆప్యాయత  ఆపేక్షల  ముందు  ఎవరైనా  లొంగి  పోవాల్సిందే....ఆకలి  లేకపోయినా  తిన్నది.. 
భోజనాలయ్యాక బయటకొచ్చి  కూచున్నారుముగ్గరు 

ఎందు కొచ్చిందో  చెబుతూ  లలితకు  బొట్టుపెట్టింది..
రెండు  నిముషాలయ్యాక  మోహన్  సంగీతను  అడిగాడు సతీష్ కి తెలుసా అని.. 

చెప్పానన్నయ్యా !అత్తయ్యకు Phone  చేసాను లాళ్ళు  ఇంట్లో  లేరు నేను చెపుతాను అన్నారు , మేం  ఇద్దరం  రాలేమని అన్నారు.. 

"సతీష్ వస్తాడా మరి " అన్న  మోహన్ తో 

"తెలీదు ?మళ్ళీ  ఇవాళ  ఫోన్  చేస్తాను". అంది  సంగీత

"మీ నాన్నగారు  చాలా  తప్పు  చేస్తున్నారేమో  అనిపిస్తుంది లలితా! మీరైనా  చెప్పాల్సింది."

"అసలు  మా  దాకా  రానిస్తే  కదా  
మొత్తం  నాన్నగారు  బాబాయ్  గారే  మాట్లాడారు 
ఏం జరిగిందో  మాక్కూడా  తెలీదు... ఏం జరిగింది  సంగీతా  ?" అని  అడిగిన  లలితకు 
జరిగింది  అంతా  చెప్పింది  ..

"అదేంటి అలా టాపిక్ ని చర్చను మధ్యలో ఎలా వదిలేస్తారు "అన్నాడు  మోహన్.. 

"నాకే  బాధ  కలిగి  కోపం  వచ్చి  వచ్చే సానన్నయ్యా  అంది.."

"అయినా  పెద్ద  వాళ్ళు  వాళ్ళకుండాలి కదా!..ఇలా  ముగ్గురి  జీవితాలను అలాఎలా గాలికొదిలేస్తారు అన్నాడు  మోహన్... 

కాసేపాగి  మెల్లగా  అన్నది  సంగీత... 

"ఇప్పటి  వరకూ  ఎవరికీ  చెప్పలేదు, చెప్పొద్దనకున్నాను కూడా ,అమ్మా నాన్నకు చెబితే బాధ పడతారని  వాళ్ళకసలు  తెలియనీయలేదు." అంటూ  చెప్పడం మొదలు  పెట్టింది.... 

"తెల్లవారి  చిన్నమావయ్య గారు ఆఫీస్ కి  ఫోన్  చేసారు .'మధ్యాహం  లంచ్ టైమ్ లో పర్మిషన్  తీసుకుని  రాగలవామ్మా ఎవరూ  వద్దు  మనం  ముగ్గురమే  కూచుందాం, నువ్వేమనుకుంటున్నావో,  నీ మనసులో ఏముందో  అన్నీ  దాపరికం  లేకుండా మీ నాన్నతో  చెప్పినట్టు  చెప్పమ్మా అన్నారు .".

"అలా అన్నారని  కాకపోయినా  ఏం  జరిగిందో   Third Person కి  తెలిస్తే ఆలోచించే విధానం లో కొంత మార్పుంటుంది Judge  చేయడం  కూడా కొంచం   వేరే  విధంగా  ఉంటుందని వెళ్ళాను... 

ఇంట్లో మావయ్య చిన్నమావయ్యగారు ఇద్దరే  ఉన్నారు.. 

కూచోమ్మా  !అంటూ   ఆయన కూచున్నారు.. 
చిన్న  మావయ్యగారు అడిగారు ..

"అసలు నువ్వు  ఊరికెందుకు  వెళ్ళనంటున్నావు" అని ...
"నేను  రానని  అనడం  లేదు , ఆయన వచ్చి తీసుకెళ్ళాలి, మేం ఆయన వెంట  ఊరికెళ్ళాలి  అని  చెబుతున్నాను"
" అప్పుడు తప్పకుండా  వస్తాను.ఆయన  కోసం  కాకపోయినా పెద్ద వాళ్ళకోసమయినా వస్తాను.. 
హాయిగా  అత్తయ్యకు  మావయ్యకు  సేవ చేస్తూ  చక్కగా వండి  పెడతాను.  వాళ్ళను కనిపెట్టు కుంటూ ఉంటాను ,ప్రతిఫలంగా నాకేమీ  వద్దు  నాకూతురిని  చదివిస్తే చాలు నాక్కూడా  ఈ ఉద్యోగం బాధ్యతలనుండి  కాస్త  విశ్రాంతి  కావాలని  పిస్తున్నది.. "అని చెప్పగానే 

"అదెలా కుదురుతుంది అక్కడి  కొచ్చినా కూడా నువ్వు  ఉద్యోగం  చేయాలి " ..అని మావయ్య 

"ఎక్కడ  ?ఎవరు  చూపిస్తారు. 

"నేను  చూపిస్తానమ్మా  !అని  చిన్నమావయ్య గారు అన్నారు 

"అంటే  నేను ఈ ఊరొదిలి , నేను  చేస్తున్న  ఇంత  మంచి  ఉద్యోగం  వదిలి ,పాప  చదువుతున్న  అంత  మంచి  స్కూల్  ని  వదిలి , ఆ ఊరికొచ్చి కూడా  నేనే  ఉద్యోగం  చేసి  నన్ను  నేను  పోషించు కోవాలా ? అనడిగాను. 

వ్రతం  చెడ్డా ,ఫలం  దక్కాలిగా వదినా ! అదే  మాట  చెప్పాను ..

"అదేం  కుదరదమ్మా  !నేను  రిటైర్  అయ్యి  చాలా రోజులయ్యింది  నాకున్న ఆస్తిని   ఇద్దరికీ ఇచ్చేసాను నాకొచ్చే పెన్షన్  లో  మరో  ఇద్దరిని  పోషించలేను"

 (అలాఅంటున్న ఆయన్ని  చూస్తే  కంపరం  పుట్టింది  సంగీతకు ..)

 ఆ మాట  అనకుండా  విషయం చెబుతుంటే  ...

"అలా అన్నారా  మావయ్య ? ఇంత  Selfish గా ఎప్పుడు  మారి  పోయారు.." అని మోహన్  చాలా  ఆశ్చర్యపోయాడు  లలిత  ఏం  మాట్లాడ  లేకపోయింది ..

"మరి  ఆయన రమ్మన్నారు  కదా  ఆయన్ని  పోషించమనండి. "అన్నాను 

"అక్కడికి వచ్చాక వాడిని  నువ్వే అడుగు " అన్నారు..

"వచ్చాక  అడిగేదేముంది . అన్నీ  మాట్లాడుకున్న  తరవాతే  వస్తాను . నాకూ  నా కూతురి జీవితానికి కూడా  గారంటీ  కావాలి  కదా ?

"అదేంటీ?గారంటీ  ఏంటి.".

"అవును  మావయ్యా ! మీ అబ్బాయి జీవితానికి  సేఫ్టీ  అవసరమయినప్పడు  మా  జీవితాలకు  గారంటీ  అవసరం  కదా.." 

"ఏదైనా వస్తువు కొంటేనే  గారంటీ  అడుగుతాం 
మధ్యలో  ఏమన్నా  అవుతే  Shop  వాడు  మర్యాదగా వచ్చి  దాన్ని  రిపేర్  చేయడమో  పార్ట్  పోతే  రీప్లేస్  చేయడమో  చేస్తాడు ."

"అలాంటిది ముక్కోటి  దేవతల సాక్షిగా, వేదమంత్రాల మధ్య , బంధువుల సమక్షంలో  పెళ్ళి  కూతురు తండ్రికి   'మీ అమ్మాయిని  బాగా  చూసుకుంటానని, భార్య ను  సంప్రదించి  ఆమె  అనుమతితో,   సహకారంతో దైవకార్యాలు లౌకికమైన అన్ని  పనులు తాను సంపాదించిన  ద్రవ్యంతో చేస్తానని  ప్రమాణం  చేస్తాడు మగవాడు.. 
మరిదేంటి  మావయ్యా ఆయన ఇలా  చేసారు.."

"మా నాన్న  తన  డబ్బులతో చదివించిన చదువు,  మా నాన్న తను సంపాదించిన డబ్బుతో  చేసిన  పెళ్ళి ,వారు  కని , పెంచి  పెద్దదాన్ని  చేసి  పెళ్ళి  పేరుతో  అత్తవారింటికి పంపిస్తే,   తండ్రి ఇచ్చిన భరోసాతో , కట్టుకున్న వాడి మీద నమ్మకం తో  ఆయన  చిటికెనవేలు  పట్టుకుని  ఆయనతో  గుడ్డి గా వెళితే ,పెళ్ళామనే  ఒక్క  మాటతో   అధికారం  చెలాయిస్తూ అన్ని రకాల  ఆకలిని  తీర్చుకుంటూ   పెళ్ళాం ఆకలిని  మరిచిపోతే ఎలా?... 

"మేమే  ఉద్యోగం చేసి ,మేమే పిల్లలను కని, వారి పోషణ  భారం కూడా  మేమే  భరించే  కాడికి  ఇంక  అత్తవారిల్లు  ఎందుకు?  అప్పుడు అబ్బాయే  మా ఇంటికి  రావాలి కదా మావయ్యా.. 

"అదేంటమ్మా!  అలా మాట్లాడతావు. "

"అవును  మావయ్యా!   నాన్న  ఇక్కడ లేరనే  నేనివాళ  మాట్లాడుతున్నాను  దయచేసి  నన్ను  చెప్పనివ్వండి  ..ఇది  నాలాంటి   చాలా  మంది  ఆడ  పిల్లల  వేదన.. 

"క్షేత్రం  స్త్రీదని, విత్తనాలు జల్లి  తనకనవసరమని వెళ్ళిపోతాడా  మగవాడు. అంతా  దైవా దీనం  వర్షం  పడ్డరోజే  నారుకు  నీరు.. చీడ పట్టినా   కలుపుమొక్కలు  పెరిగినా  భూమిదే  భారం .. అన్నట్టు ప్రవర్తిస్తారు అంతేగా "...

"కానీ ఒక  మంచి  రైతు  అయితే, నారుకు నీరు పెట్టి కలుపు  తీసి  పైరు  పెరిగే  దాకా  కాపలా  ఉండి చీడ పట్టకుండా  జాగ్రత్తగా కాపాడుకుంటూ  పంటను  ఇంటికి  చేరుస్తాడు..మరి  మీ అబ్బాయి  నుండి  నాకు ఆ భరోసా  ఉందా?  మీరిస్తారా చెప్పండి.. అప్పుడు  తప్పకుండా  వస్తాను. "..

కానీ  అక్కడికొచ్చాక  కూడా  నేనే  సంపాదించి  పెట్టాలంటే  అది కాస్త  ఆలోచించాలి..
నేను  ఎక్కడికీ  వెళ్ళను,  మనింట్లోనే  ఉంటాను.  ఆయనిష్టం ఎప్పుడు వచ్చినా  అతని  కోసం  మేం  ఎదురు  చూస్తుంటాం ..

"బాబు  రాడమ్మా!   వాడు  నీదగ్గరకొస్తే  నువ్వు  పోలీస్  కేస్  పెడతాను, కోర్టులో  కేస్  వేస్తానన్నావట  అందుకే  రావడానికి  భయపడుతున్నాడు.. 

"సరే  మావయ్యా! భయం  పోయి , నామీద  నమ్మకం కలిగినప్పుడే   రానివ్వండి.." 

"అంతేనా  అమ్మా  "
అవును  చిన్న మావయ్యగారు,   పెద్దవారు మీ ముందు  చాలా  పెద్ద మాటలు  మాట్లాడాను, మీరు  నన్ను  నాన్న అనుకుని  చెప్పమన్నారు,  నాన్నకు  కూడా  చెప్పలేని నా బాధ  వ్యధ అంతా మీకు చెప్పాను.. క్షమించండి  తప్పుగా  మాట్లాడితే  వస్తాను  🙏
అని ఇంటికి  వచ్చాను వదినా  అంది  ...

మోహన్  కళ్ళు  చెమర్చాయి  లలిత  సంగీతను   దగ్గరకు  తీసుకుంది  ..
"వదినా !మీరేమనుకోకపోతే ఆయన్ని  ఒకసారి  సైకియాట్రిస్ట్  కి చూపించండి " అంది 

మోహన్  కూడా   " కౌన్సిలింగ్  కి  తీసుకెళ్ళాలని  హరీష్  కి  చెప్పాలనుకున్నాను" అన్నాడు. 

"అవును  వదినా !...

" నేను  కూడా  ప్రవల్లిక  పెద్దదవ్వాలని చూసాను, అది పెద్దదయ్యింది, దానికి  కూడా నా నిర్ణయం చెప్పే  సమయం  వచ్చింది ..అని  దీర్ఘంగా  చూస్తూ  చెప్పింది...... 

సశేషం..

బాంధవ్యం......... 38

అనుకున్న  రోజు  రానే  వచ్చింది...తలంటి పోసిజడ వేసి,   కొత్తబట్టలు  వేయగానే  ప్రవల్లికలో  కొట్టొచ్చిన  మార్పు  కనబడింది.. వయసు  తెచ్చిన పెద్దరికం తో  అందంగా కనబడుతుంటే  ఎవ్వరూ  కళ్ళు  తిప్పుకోలేదు.... 

అమ్మమ్మ దిష్టితీసింది. 

సంగీత ఎటువంటి ఆశ పెట్టుకోలేదు వాళ్ళకోసం, వస్తారని  ఎదురు చూడలేదు లేదు. 
కానీ  పాపం  అనురాధే ఎదురు చూసి  చూసి  అడిగారు  .

"రావచ్చుకదే! కుందనపు బొమ్మ లాగుంది .ఒక సారి  చూడాలి కదా ! పాపం  అది  తండ్రి  కోసం  ఎంత  ఎదురు  చూస్తుందో "అన్నది.. 

"అంత  మంచితనమే ఉంటే అనుకునేందుకేముందమ్మ....మనం  ఈ విషయం ఇంక ఇక్కడే వదిలేద్దాం ..పద " అంటూ  బయటకు  దారి తీసింది ...

బంధువులంతా రావడం మొదలు  పెట్టారు.. 
సంగీత  అందరినీ  చాలా ఆప్యాయంగా ఆహ్వానించింది అందరితో చాలా  సరదాగా  మాట్లాడింది ..

బామ్మ  చెబుతుంటే  అమ్మమ్మ  పాపకన్ని  ముచ్చట్లూ జరిపించింది..  పూల జడ  వేయక  పోయారా 
 అన్నారెవరో   వెంటనే  జడ చుట్టూ  పూలదండ  చుట్టింది  అనూరాధ.. 
పట్టులంగాలో  అమ్మ  అమ్మమ్మ ఇచ్చిన  నగలతో  మెరిసి  పోతున్నది  ..

"సంగీతా!నీ కూతురు  పెద్దయితే చక్కగా అందంగా తయారవుతుందే"  అన్నారు  వచ్చిన  వారందరు..
నిజంగానే  మురిసిపోయింది  ..సంగీత 

"ఎంత  దురద్రుష్టవంతుడు  ..
కన్న కూతురు  జీవితంలో   ఇంకో  అధ్యాయం మొదలయ్యింది.. ముందులాగా  ఎత్తుకుని  ముద్దాడగలడా ,ఇంకా  కొన్ని  రోజులయితే   
ముద్దు  మురిపాలేమీ ఉండవు పక్కన   కూచుని  మాట్లాడాలంతే .. అన్ని   ముచ్చట్లు  వదులుకుంటున్నాడు.." అని మనసులో  వాపోయింది  సంగీత.. 

అందరి  భోజనాలయ్యాక తాంబూలాలిచ్చింది   సంగీత.. అందరూ  పాపను  ఆశీర్వదించి  వెళ్ళారు... అనూరాధ  పాపకు  మళ్ళీ  దిష్టి  తీసింది.. పాప  మనసులో  ఏముందో  చెప్పదు. కానీ  గుంభనంగానే  కూచుంది... 

అందరూ  వెళ్ళాక   లలిత  ఫోన్  చేసింది " బాబు  రాకుండా  మేం రావడం  బాగుండదని రాలేదు 
 సంగీతా,మాకు ఎంత  రావాలని  ఉన్నా  మనసు  దిటవు  చేసుకుని  కూచున్నాం" అంది...

 "ఫరవాలేదొదిన!మీరంతా లేరనే  తప్ప  అమ్మా నాన్న  అన్నీ  చక్కగా  చేసారు.." 

"ఫోటోలు  తీసారా ?"

"ఆ హర్ష  తీసాడు"

"వీలుచూసుకుని పాపను తీసుకుని  రా " అంది 
లలిత.

"సరే వదినా! అని ఫోన్ పెట్టేసింది...

రాత్రి  భోజనాలయ్యాక ప్రవల్లికను  దగ్గరకు  తీసుకుని  పడుకుంది సంగీత....
చెప్పాలి ,ఇదే సమయం  ఇప్పుడు  కాకపోతే  ఇంక  చెప్పడం కష్టం అనుకుంది.. 

"పడుకున్నావాతల్లీ! "  అనడిగింది.. 

"ఊహూ " అంది.. 

"నీకేమనిపించింది  ఇవాళ   బాగుందా".. 

"ఊ బాగుంది. కానీ !అని  ఆగి పోయింది.

"కానీ  ఏంటి  నాన్నా  చెప్పు.. "

"నాన్న  రాలేదెందుకు,  నాన్న సరే  అత్తా వాళ్ళు  కూడా  రాలేదు  కదా  నువ్వు  పిలవ  లేదా?" అనడిగింది.. 

"పిలిచానమ్మ!  కానీ వాళ్ళు  నాన్న దగ్గరికి  వెళ్ళారు నాన్నను  తీసుకు  రావడానికి.." 

"మరి"

"నాన్న రానన్నాడట..నాన్నకు  ఒంట్లో  బాగా  లేదుకదా ,అందుకని  వాళ్ళ అమ్మ  నాన్న  దగ్గరుంటారట. తాతయ్య  friend డాక్టర్ కదా  నాన్నను  చూసుకుంటారు"..

"ఎప్పుడొస్తాడు ?" మరి..

"తెలీదు , వస్తే  వస్తాడు  లేదా రాడు  
మరి  మనం  అక్కడి  కెళదామా ?".

"వద్దమ్మా !నాకు ఈ స్కూల్  , టీచర్స్  , friends  అంతా  ఇక్కడే  బాగుంది ..నాన్న  వస్తాడులే"  అంది.. 

"మరి  మనం  ఆ ఇంట్లో  ఉండకూడదు  ఇక్కడ  
అమ్మమ్మా వాళ్ళ ఇంటి  దగ్గర  వేరే  ఇల్లు  చూసుకుని  ఉందాం"  అంది  ..

ఎందుకూ  అని  అడగక పోయినా....

"ఎందుకంటే నువ్వు పెద్దదానివయ్యవు కదా అక్కడ  ఎవరూ  లేకుండా ఒక్క దానివి ఉండకూడదు"..

"అమ్మమ్మ  వాళ్ళదగ్గర  కూడా  ఉండకూడదా ? అంది .
" లేదు  మావయ్య  పెళ్ళి  అవుతుంది  అత్త  వస్తుంది కదా .... అప్పుడు  ఇల్లు  సరిపోదు కదా అందుకని  ఇక్కడే వేరే  ఇంట్లో ఉందాం  సరేనా"  అంది.......

పాపకేమర్థమయ్యిందో తెలీదు కానీ  సంగీత  మనసులో భారం  దింపుకుంది..
చూడాలి  రేపటి  రియాక్షన్ అని  పడుకుంది
తెల్లవారి  కూడా  సెలవు పెట్టింది ..

ఇల్లు  కావాలి  ఈ చుట్టు  పక్కల  అని అందరికీ చెప్పింది.. ఆ తరువాత  ఆయింటి కెళ్ళి  తనకు  కావలసిన  వన్నీ  బాగుల్లో  సర్దుకుంది.. 
కొన్ని అట్ట బాక్స్  లో  పెట్టుకుంది.. 
బాగ్స్  ఆటోలో  పెట్టుకుని  ఇంటికి  తీసుకొచ్చింది..

వారం  రోజుల  తరవాత   అద్రుష్టం  బాగుండి  అనూరాధ వాళ్ళకు  రెండిళ్ళవతలే ఇల్లు  దొరికింది..
చాలా సంతోష పడ్డారందరూ... 
వెంటనే హర్షతో  వెళ్ళి  అడ్వాన్స్  ఇచ్చి  వచ్చింది.. నాలుగు  రోజుల తరువాత  మంచి  రోజని  చెప్పారు ...
తెల్లవారి  లలిత వాళ్ళ ఇంటికి వెళ్ళి తన  నిర్ణయం చెప్పింది.. 
"అదేంటి  సంగీతా ! అంత  సడన్  గా  నిర్ణయం తీసుకున్నావు".. 

"లేదు  వదినా ! సడన్ గా ఏం కాదు  ఎప్పుడో  తీసుకున్నాను. కానీ  అమ్మలు అన్నింటికీ   సిద్ధపడేదాకా  అని  ఆగాను .ఇక  సమయం వచ్చింది 6 1/2 సంవత్సరాలు  పిచ్చి వాళ్ళలా  ఎదురు  చూసాం నేనూ  అది.. అసలు ఆ మనిషికి  తన  భార్య,  తన  కూతురు  అన్న  భావనే  లేదు 
 బాధ్యత  అటుంచండి మేము  తన వారిమి,  తనకు  సొంతం  అన్న ధ్యాస  కూడా  లేదు  
అసలు ఎవరి బాధ్యతా తీసుకోడు,ఎవరి మీద  ప్రేమా  లేదు. ఫక్తు  తన  అవసరాలు  ఎక్కడ తీరుతాయనుకుంటారో అక్కడికి వెళతారు  అక్కడ ఉంటారు.. అది  ఎవరిల్లు ? వాళ్ళేమనుకుంటారు అన్నది  అనవసరం. "

"మీకోసం  పరుగెత్తుకుని  ఇక్కడికి వస్తారు,  కానీ  ఇది  అక్క  అత్తవారిల్లు అని  బావగారుంటారని, అతనికిష్టమా ? కాదా  అన్నధ్యాస కూడా   ఉండదు..
  వారు  మంచివారు కాబట్టి  సరిపోయింది లేదంటే ".

"సంగీతా ! మా పెళ్ళికి బాబు  చిన్నవాడు  అందుకనే  మీ అన్నయ్య ఇప్పటికీ అలాగే  చూస్తారు..
వదిన కూడా అంతే  తను  వచ్చినప్పుడు బాబు 
 చిన్న వాడు అందుకనే  మాకేం  అనిపించదు.  కాకపోతే  నీ ఫీలింగ్స్ ని  అర్థం  చేసుకున్నాం.." 

"ఇంకోసారి  ఆలోచించు. నువ్విక్కడుంటే  స్వతంత్రంగా  రాగలడు " ..

"వదినా ! అలా  అనే  ఇన్ని  రోజులున్నాను అమ్మలుకు  ఏం తెలియ కూడదని  మీ అందరిళ్ళకి  వస్తున్నాను.. కానీ   తండ్రిని  తేలేను,  తండ్రి  ప్రేమ  ఇవ్వలేను.." 

"ఆయనకు తన తల్లి తండ్రి  కావాలి కానీ  తను కన్న  కూతురికి తండ్రి  ప్రేమని  ఇవ్వలేరా?  ..అసలు  
ఈ వయసులో  కూడా ఇంకా  తనకు  తాను చిన్న పిల్లాడిననుకునే  మనిషికి  పెళ్ళి  చేయకుండా  ఉండాల్సింది ". 

"ఎందుకంటే   ప్రతి  మనిషి తనను  తాను  పెళ్ళికి సమాయత్తం  చేసుకోవాలి ..పెళ్ళి  అంటే  ఏంటో   తెలుసుకున్న వాళ్ళు  మాత్రమే  పెళ్ళి  చేసుకోవాలి ..
లేదా  చేసుకున్నాకయినా తెలుసుకోవాలి.." 

"హాస్టల్ లో రెండేళ్ళు ఉన్న వారు  కూడా  ఫ్రెండ్స్  అయిపోయి వదలలేక వదలలేక వెళతారు ..
అలాంటిది  ఈన  నాకు  ఒక  మంచి  friend  కూడా  కాలేక  పోయారు  అదే నాబాధ. "...

 " పాప  పెద్దదయ్యింది.  . ఒంటరిగా  వదలలేను  కదా ఎవరి దగ్గరో ఒకరు  పెద్దవారి దగ్గర  ఉండాలి కదా అని  ఇటొచ్చాను....బాధ  పడకండి వదినా ! ఇల్లేగా వదిలి పోతున్నాను  మనుషులను  కాదుగా అన్నది.. "

"TV,  fridge,  మంచం   ఈ మూడే  తీసుకెళుతున్నాను. గొడవ  పడితే  డబ్బులిస్తానని  చెప్పండి.. 
"అత్తయ్యకు  మావయ్యకు  కూడా చెప్పండి...  వస్తాను  మళ్ళీ  కలుస్తాను" అంటూ  బయలుదేరింది.. 

"ప్రవల్లిక  స్కూల్ కి  వెళ్ళాక  ఆ యింటికెళ్ళి  అక్కడ  తను రోజూ పూజ చేసుకునే  అమ్మవారి  విగ్రహం  మిగతా  దేవుళ్ళ  విగ్రహాలన్నీ తీసుకుంది  పటాలను  అక్కడే  వదిలింది..  ముందుగా దేవుళ్ళను స్టౌ తీసుకుని వచ్చి   దేవుళ్ళను సర్ది   పాలు  పొంగించి  పాయసం  చేసి  పూజయ్యాక  నైవేద్యం  పెట్టింది ..

వదినకు చెప్పినా TV  Fridge  తేవాలా  వద్దా  అని ఆలోచించుకుంది  కానీ   electronic  వస్తువులు   పాడవుతాయని  తీసుకెళ్ళడానికే  నిర్ణయించుకుంది  ..

ప్రవల్లిక కు  మంచం  బాగా  అలవాటయ్యింది  అందుకని  మంచం  తీసుకెళుతున్నాని చెప్పింది 
అవన్నీ హర్ష  వాన్  లో  వేసుకొచ్చాడు... 

అందరూ  కలిసి  గబగబా  ఇల్లు  సర్దారు.. 
అనూరాధ  వంట  చేసింది  ..బామ్మ  తప్ప  అందరూ  ఇక్కడే  భోంచేసారు... రాత్రి  వద్దన్నా  వినకుండా  అనూరాధ  ఇక్కడే  పడుకుంది... 

బాధలో  కూడా  కొంత  ఉపశమనం.. 

మెల్ల  మెల్లగా  కొత్త  ఇంటికి  కొత్త  వాతావరణానికి  అలవాటు  పడుతున్నారు. ప్రతి  మనిషికి  మరుపు  అవసరం  ..

కాలానికి  మరిపించే  గుణం  ఉంది..లేక  పోతే  మనిషి  బ్రతకడం  అసంభవం.. 
అందుకే  ప్రవల్లిక మనసు  పొరల్లో మెల్లి  మెల్లిగా  తండ్రి  చిత్రం   మసకబారడం  మొదలు  పెట్టింది... 

కాలం  ఇంకా  ఏం  మార్పు  తెస్తుందో  చూడాలి... 

సశేషం

బాంధవ్యం..... 39

కాలం  ఎవరి కోసం  ఆగదుగా ....

ప్రవల్లిక  10 th  First Class లో పాసయ్యింది. 
హర్ష ,ప్రవల్లికకు  ఇంటర్మీడియట్   fees తానే  కడతానన్నాడు. ఎందుకన్నా  వినలేదు..  మిగతా ఖర్చులు  నువ్వు  చూసుకో  అక్కా  అన్నాడు.. 

అనూరాధ గారు  కూడా  "పోనీలే కట్టనీ అమ్మా !" అంది  మారు  మాట్లాడకుండా  ఊరుకుంది...
ఎవరి  ఆపేక్ష  వారిది... 

ఉద్యగం వచ్చింది  కదా  ఇంకా ఎందుకు ఆలశ్యం హర్షకి పెళ్ళి  చేయాలని  బామ్మ రోజూ గొడవ పెడుతోంది. హరహర్రావుగారు కూడా  సంబంధాలు  చూస్తున్నారు..

లక్ష్మీసుధ  ..

 వాళ్ళ  అమ్మా  నాన్నకు ఇద్దరు ఆడపిల్లలు పెద్దమ్మాయి లక్ష్మీసుధ SBI లో పనిచేస్తుంది, చిన్నమ్మాయి  MBA  చదువుతుంది.. 

జాతకాలు కుదిరాయి, చక్కగా ,సాంప్రదాయంగా ఉందనుకున్నారు.. మంచి  కుటుంబం ,  అందరూ  కలివిడిగా  ఉన్నారు..  ఒకరికొకరు  నచ్చారు.. 

 హరిహర్రావుగారు  అమ్మాయి  వాళ్ళ  నాన్నగారు  వెళ్ళి నిశ్చితార్థానికీ , పెళ్ళికి ముహుర్తాలు  పెట్టించు  కొచ్చారు....

పది రోజుల్లో  నిశ్చితార్థం నెలరోజుల్లో పెళ్ళి  అంతా  హడావిడిగా జరిగి  పోతున్నది.. 

ఒక రోజు మధ్యాహ్నం హర్ష సంగీతకు ఫోన్  చేసాడు.. ఏంట్రా  అంది

"సాయంత్రం  నేనూ  లక్ష్మీ  వస్తున్నాం , తను  నిన్ను  కలవాలనుకుంటున్నది".. 

"నన్నా!  ఎందుకు?  .. Shopping  పనా? .

"ఏమో  తెలీదు " ..

"సరే 6 గం లకు రండి.  మరి తను తిరిగి ఎలా  వెళుతుంది?"
" నేను  దింపుతాలే" అన్నాడు 
"సరే  రండి "..

అమ్మా  వాళ్ళకు  చెప్పాలా  వద్దా,  అసలెందుకు  వస్తుందో  తెలీదు.. సరే  రానీ  వచ్చాక  అప్పుడు  చూద్దామని  గబ గబ పని  ముగించి  ఇంటికొచ్చింది.. 
ప్రవల్లిక  ఇంటికి రాలేదింకా ... అమ్మా వాళ్ళ ఇంట్లో ఏమైనా ఉందో  తెలీదు ... టీ తాగి  వాళ్ళకి  కూడా  రెడీగా  పెట్టి ఉంచింది  ..
ఇంతలో  వాళ్ళు  రానే  వచ్చారు.. 

ముచ్చటైన  జంట  అని  మనసులో  అనుకుంటూ  "రండి  రండి " అని  లోపలికి  ఆహ్వానించింది.. 

హర్ష  కూచున్నాడు.  సంగీత  కూడా  కూచోబోతున్నది.. అంతే  లక్ష్మీ  వచ్చి  ఎటువంటి  సంకోచం లేకుండా సంగీతను గట్టిగా వాటేసుకుంది...

"మీరు  గ్రేట్  వదినా! చాలా గ్రేట్  అంటూ  రెండు  చేతులు  పట్టుకుని  ఊపేస్తూ  నిజంగా చాలా గ్రేట్ మీరు..."ఆనందాశ్చర్యాలతో  అంటున్న ఆమె  కళ్ళలో  మెరుపులు ..

"ఎందుకు"  అంది సంగీత....

హర్ష  కల్పించుకుని" ఏంలేదక్కా! నీగురించి  వివరంగా చెప్పాను అదీ సంగతి"  అంటూ  విషయం  చెప్పాడు.. 

సంబంధం  కుదరగానే  హరిహర్రావుగారు   లక్ష్మీ  వాళ్ళ  నాన్నగారు సుధాకర్ గారికి  అమ్మాయి  ఇక్కడ...  అల్లుడు  ఊళ్ళో ఉంటారు  కలిసుండరని అప్పుడే  చెప్పాడు. 
"అంటే " హర్షను  ప్రశ్నార్ధకంగా  చూసింది.. 

"మనింటికి వచ్చే  అమ్మాయికి  నీగురించి  మొత్తం  తెలియాలి  కదా  అక్కా, ఎవరైనా నిన్ను  చెడుగా అనుకుంటే  నేను భరించలేను " అన్నాడు..
 
సంగీత  నవ్వి  తమ్ముడిని  దగ్గరకు  తీసుకుని   ఇద్దరి  మధ్య లో కూచుంది... 

"ఒకరన్నారని చెడ్డ  వాళ్ళు , ఇంకొకరన్నారని మంచి వారవుతారా  హర్షా ? ఎవరేమన్నా  వారి  వ్యక్తిత్వం  వారికుంటుందిగా  అవన్నీ  నేను  పట్టించుకోను.. "

లక్ష్మీ  చేతిని  చేతిలోకి  తీసుకుంది... 
"నువ్వు  నన్ను  చెడ్డ  అనుకున్నా నేను  బాధ పడను  ఎందుకంటావా  అది  నీఅభిప్రాయం.. దానికి  నేను  బాధ్యురాలిను కాను  కదా, మంచివాళ్ళెప్పుడూ  ఏమీ  తెలుసుకోకుండా తొందరగా  ఒక  అభిప్రాయానికి రారు?..అంతే  కదా!  లక్ష్మీ" అంది .

"అంతే వదినా  అంతే" ... మిమ్మల్ని  ఒక  మాటడగనా  ఏమనుకోవద్దు..."

"ఫరవాలేదు అడుగు "...... 

"మీరు  మళ్ళీ  పెళ్ళి  ఎందుకు  చేసుకోలేదు?". 

"పెళ్ళా!అసలు మాకు డైవర్స్ కూడా  కాలేదు  ..

"అవునా !అదేంటి  "..

"అంతే డైవర్స్ ఎందుకు?...  తీసుకుని  ఏం  చేస్తాం.
మా ఇద్దరికీ  మళ్ళీ  పెళ్ళి  చేసుకోవాలని కోరిక  లేదుగా .."
"పెళ్ళి ఒక ప్రమాణం, ఒక  బాధ్యత , ఒక  నమ్మకం  ఇందులో  ఎవరు  విస్మరించినా  పిల్లల  బాధ్యత ఇంకొకరికి  తప్పనిసరి కదా వారిని  బాధ పెట్టే  హక్కు  తల్లిదండ్రులిద్దరికీ లేదు. అందుకనే  పిల్లలున్న వారు  వారిని  గాలికి  వదిలి  తమ  సుఖం తాము చూసుకోకూడదు. ఇది నా పర్సనల్  అభిప్రాయం".. 

అయితే  మీరు  మరీ  గ్రేట్  అంటూ  కాసేపు కబుర్లు  చెప్పి  వెళ్ళింది హర్షతో, 

నిశ్చితార్థం  మామూలుగానే   జరిపారు  పెళ్ళి  దగ్గర లోనే  ఉందని.. 

ఇక  ఇంట్లో  పెళ్ళి సందడి మొదలయ్యింది  పెళ్ళి  పనులు కోసం సంగీత  వాళ్ళ పిన్ని  బాబాయ్  అందరూ  వచ్చారు .. అనూరాధ మాటి మాటికి   సంగీత మొహమే  చూస్తుంది...

 అర్ధమయిన  సంగీత  "అమ్మా  నేను  బాగానే  ఉన్నాను.  చాలా సంతోషంగా కూడా ఉన్నాను. నా తమ్ముడి పెళ్ళమ్మా ! అందుకని  నువ్వేం  ఆలోచించకని  ధైర్యం చెప్పింది."..

అనూరాధ  కొంత  నిశ్చింతగా  feel  అయ్యింది .
"పెళ్ళికి  మీ వాళ్ళను  పిలుద్దాం,  ఇది  లాస్ట్  ఛాన్స్  వస్తే  వస్తారు  లేదంటే  పోనీ  అన్నారు హరిహర్రావుగారు. 

"సరే నాన్నా మీ ఇష్టం " అంది  

అందరినీ  పిలిచి  వచ్చారు. 

వనిత శ్రీధర్ ,లలిత  మోహన్  వచ్చారు  మిగతా  ఎవరూ రాలేదు... అక్కడికే  అందరూ  సంతోష  పడ్డారు..  

పెళ్ళిలో  సందడంతా సంగీత  ప్రవల్లికలదే  
ఇంటికి ఇంకో కొత్త  మనిషి  వస్తుంటే  ఆనందం  అంతా  ఇంతా కాదు.. 
అక్కతో  వచ్చిన చెల్లెలు  కూడా  అందరికీ   నచ్చింది   సరదాగా  అందరితో  కలిసి  పోయింది.. ప్రవల్లిక తను  మంచి  ఫ్రెండ్స్ అయిపోయారు.. 
ప్రవల్లిక ఆనందాన్ని  చూసి అటు  అత్తలు మావయ్యలు కూడా  సంతోషించారు... 

లక్ష్మీ  కాపురానికి వచ్చింది  ..వస్తూనే  ముందు   ప్రవల్లిక  బాధ్యతలు  తీసుకుంది..తోడబుట్టిన వారు  లేకపోతే  చాలా loanly గా feel  అవుతారు. Teens లో ఉన్న ఆడపిల్లలు  తండ్రి ప్రేమ కోరుకుంటారు..  అది లక్ష్మి కి తెలుసు...

  అందుకే  ఆఫీస్ నుండి  వస్తూనే  ప్రవల్లికతోనే  ఉండేది .  ప్రవల్లికను  సంగీత వాళ్ళ ఇంటికి  తీసుకెళ్ళేది.  అమ్మ  అలసిపోయి వస్తుంది  కదా  అందుకని  మనం  వంటచేద్దాం  అంటూ  రాత్రి పూట  కుక్కర్  పెట్టడం  తనకు  నచ్చిన  కూరలతో   వేపుళ్ళు  చేయడం  నేర్పించింది.. 
నిజంగానే  సంగీత  కూడా  సంతోష  పడింది  ..

"అవును  కదూ  ప్రవల్లిక  పెద్దదవుతుంది . ఆడపిల్ల  అన్నీ  నేర్పించాలి  కదా   చాలా  మంచి  పని  చేస్తున్నావు లక్ష్మీ "అంది  సంగీత.. 

"అయ్యోవదినా  పెళ్ళిమాట  తరువాత.. మనమ్మాయి  రేపు  MS చేయడానికి   US వెళితే  అక్కడ  ఎవరూ  ఉండరు  తనే  చేసుకోవాలి  తెలిసిందా ?" అంది  ..

ఎంత  మంచి  పిల్ల  ఎంత  Positive  thinking  Future  Plans  ప్రవల్లికకు  ముందే  హింట్  ఇస్తున్నది..  

"Thanku  లక్ష్మీ "అంది.. 

హర్షా  వాళ్ళు  సరదాగా  ఎక్కడి కెళ్ళినా  ప్రవల్లిక  ఉండాల్సిందే .. లక్ష్మికి సంగీతం  వచ్చు అప్పుడప్పుడూ లక్ష్మి  పాడుతుంటే   ప్రవల్లిక  డాన్స్  చేసేది..    చదువులో  సాయం  చేసేది... 

అనూరాధా ,బామ్మా చాలా ఆనందంగా  ఉన్నారు ..
 తాము  కల్లో  కూడా   అనుకోలేదు   ఇలా  ఇంతలా  కలిసిపోయే  అమ్మాయి  ముఖ్యంగా  సంగీతా వాళ్ళను  ఇలా  కనిపెట్టుకుని  ఉండే అమ్మాయి వస్తుందని , హరి హర్రావుగారు  కూడా  నిశ్చింతగా  ఉన్నారు.. 

ఇక  అందరి  ద్రుష్టి  ప్రవల్లిక మీదే  పిచ్చిపిల్ల  ఎంత  సంతోషంగా ఉందో  ..మనస్పూర్తిగా  నవ్వుతున్నది  ఆడుతున్నది  .ప్రవల్లిక  ఇలా  కూడా  ఉండగలదు  అని  అందరికీ తెలిసింది.. ముఖ్యంగా  తన  జీవితంలో  నాన్నా  లేడు  అని  మరిచి  పోతున్నది.....

ఇది  మంచి  పరిణామమే కదా.. 

సశేషం

బాంధవ్యం......... 40

బామ్మ !పాపం మనవడి  పెళ్ళి  చూసి  పోదాం  అనుకుంది.   కానీ సంతోషం  సగం  బలం  మనవరాలు  వచ్చిన  వేళావిశేషం   ముని మనవడిని కూడా  చూడాలని  ఆశ  పడింది .

 ఆ రోజు లక్ష్మిని కాస్త  అనుమానంగా చూసిన  బామ్మ  కోడలికి చెప్పింది..  ఒకసారి  కనుక్కోమని...

  "అత్తయ్యా  ఈకాలం  పిల్లలను  మనం  అడక్కూడదు వాళ్ళే చెబుతారు "అంటున్న  కోడలిని  ఆశ్చర్యంగా చూసింది బామ్మ..ఇలా కాదని  సంగీతకు  చెప్పింది.. 

"పో బామ్మా! తననే  చెప్పనీ " అంది  

అయినా అలా ఒకసారి పద్మ దగ్గరకు తీసుకెళ్ళమని చెప్పింది.బామ్మ మాట  కాదనలేక  సరే  అని  తెల్లవారి  సాయంత్రం  ముందు  లలిత  దగ్గరకు   వెళ్ళాలని  లలితతో  మాట్లాడాకే   పద్మ  దగ్గరకు  వెళ్ళాలని నిర్ణ యించుకుని  ప్రవల్లికను  అడిగింది  "వస్తావా " అని... 

 "లేదమ్మా ! రికార్డ్  సబ్మిట్ చేయాలని " అంది.. 

"అయ్యో  వదినా ! నేనొస్తాను కదా సరదాగా  అందరిని  కలుస్తాను   అంటూ  అత్తగారి  పర్మిషన్  తీసుకుని  బయలుదేరింది.. వెళుతున్నదే  లక్ష్మి  కోసం  మరి  తనముందు ఎలా  మాట్లాడాలా   అనుకుంటూ  బయటకు  నడిచింది.. 

 దారంతా మాట్లాడుతూనే  ఉన్నది లక్ష్మి ..
"వదినా మీ ఆడపడుచులు మీ అంత  మంచివారా  ..మీతో  ఎలా  ఉంటారు ,
మిమ్మల్ని  ఎవరు వదులుకుంటారులెండి " అంటూ  బోలెడు ప్రశ్నలు  తనే వేసుకుంటూ  తనే  జవాబు  చెప్పుకుంటూ  కూచుంది.. 

'నిజంగా ఇంట్లో  ఎంత  సందడి  తెచ్చిందో..
మన ముభావానికి  విచారానికి ఎలా ఒకరు  కారణమో ...సందడికీ  సంతోషానికి కూడా  అలాగే  ఒకరు కారణమౌతారనుకుంటా...
తమ్ముడే  కాదు   ఇంట్లో  అందరి  సంతోషానికి  కారణమయ్యింది . తనే  ఇప్పుడు అన్నింటికీ కేంద్ర  బిందువయ్యింది.. అని అనుకుంది 

   ఇల్లు  రానే  వచ్చింది  లక్ష్మి  చేయి  పట్టుకుని లోపలికి  నడిచింది..లలిత  కొంచం  ఆశ్చర్యపోయినా  సంతోషంతో  ఆహ్వానించింది.. 
ఎందుకంటే  ప్రవల్లికతో  వస్తానని  చెప్పింది..
 సడన్ గా  లక్ష్మిని  చూసి... కొత్తపిల్ల కదా  అని ..

కానీ  లక్ష్మి  అసలు  కొత్తపిల్ల లాగా ఉంటే  కదా.. 
అక్కయ్య, అక్కయ్య  అంటూ  కబర్లు ...
టిఫిన్ వద్దని..ఇంటికి వెళ్ళి  భోంచేయాలిగా అక్కయ్యా ,టీ తాగుతాం,  వదిన ఇప్పుడు టీ తాగారంటే  రాత్రి ఏం  తినరింక..  అంటూ  .
సంగీత  తరఫున  కూడా  తనే  వకాల్తా  పుచ్చుకుంది  ..

లలిత  సంగీత  ఇద్దరూ నవ్వేసారు.... 

నేను  టీ పెడతాను  మీరు పక్కన  నించుని   చూడండి  అంటూ  టీ పెట్టింది..కప్పుల్లో  పోస్తూ మీరు  కూచోండి  నేను  తెస్తాను  అంది ..

కుర్చీలో  కూచుంటూ" వదినా  లక్ష్మిని  పద్మ వదినకు  చూపించాలని అనుకున్నాం అందుకే  మీతో ముందుగా చెబుదామని  వచ్చాను"

 "అలాగే  ఫోన్  చేసి చెబుతాను  వెళ్ళండి" అంది  లలిత  ...

టీ తాగుతూ  "అక్కయ్యా  మీరెంత  మంచి  వాళ్ళు  వదిన్ని  ఎంత  ప్రేమగా  చూసుకుంటున్నారు ..
ప్రవల్లికను ఎంత  Caring  గా చూసుకుంటారు  కానీ  ఎప్పుడూ  వదినే  రావాలా ...మీరు  కూడా  అప్పుడప్పుడూ  వదినా వాళ్ళింటికి  వస్తుండొచ్చు కదా .."

"వేరే  ఉద్దేశ్యం  ఏంలేదు, మీరు కూడా  వస్తుంటే  ప్రవల్లికకు  కాస్త   moral  support గా ఉంటుంది  మీరంతా  తన  family  అనుకుంటుంది... 
టీనేజ్  కదా .. ఇప్పుడు  ఎవరి  మీదైనా  ఏలాంటి  అభిప్రాయం  ఏర్పడుతుందో అదే  జీవితాంతం  ఉంటుందంటారు .."

" తన  ఆలోచనలు  healthy గా ఉండి  బాగా  చదవాలని నా కోరిక   అంత  కంటే  ఏం లేదు..
 ఆదివారం  మీకు  వేరే  ఏ పనులు  లేకపోతే   వదినా  వాళ్ళింటికి  లంచ్ కి రండి  చిన్నక్కయ్యను కూడా పిలుస్తాం."అంది 

లలిత  లక్ష్మి భుజం  మీద  చేయివేసి  "తప్పకుండా! అత్తలం  ముగ్గురం ఉన్నాంగా  తనను  చూసుకోవడానికి"  అంది   ..

ఇంటికి  బయలు  దేరి వస్తుంటే సంగీత   లక్ష్మి   చేయి  తన  చేతిలోకి  తీసుకుంది..
"Thanku  లక్ష్మీ.! బహుశా  నాకు  చెల్లెలు  ఉన్నా  
నీలాగా  చూసుకుంటుందను కోను.. 

"పెద్ద  చిన్నా  కాదు  ఇక్కడ... పరిస్థితులు ఆకళింపు చేసుకుని నడవడం, ఆలోచనలు కంట్రోల్ లో పెట్టడం వ్యక్తిగతంగా  ఎవరినీ  ఆక్షేపించక  పోవడం ,  ఈ సహనం, ఈ నైపుణ్యం,చాలా కొద్ది మందిలో   ఉంటుంది తెలుసా ? "
"నేను  చాలా  అద్రుష్టవంతురాలిని   ..నువ్వు  మా ఇంటికి వచ్చిన మాంత్రికుడి దండంలాంటి దానివి   ఇలా  మా  బాధలన్నీ  తీసేసి  మా ముఖాల్లో  నవ్వులు  పూయించావు  ".

"పోండి  వదినా !మీరు  మరీ "అంటూ నవ్వింది.. 

 ఇల్లు చేరగానే  లక్ష్మి ముందు  బామ్మ దగ్గరకు పరుగెత్తింది  ..ఆదివారం  భోజనాల  సంగతి  చెప్పింది  So మనందరికి  కూడా  వదినా వాళ్ళ ఇంట్లో  భోజనాలు  అంటూ  చిన్న  పిల్లల
ా  సంబర  పడింది  .. ప్రవల్లికకు చెప్పకుండా సర్ప్రైజ్  ఇద్దాం అనుకున్నారు
ఆదివారం రానే   వచ్చింది  ..

బామ్మ  తో సహా  అందరూ  సంగీతా వాళ్ళ  ఇంటికి  వెళ్ళారు వంటలో  సాయం  చేయడానికి.. 
ఆవడలు , బొబ్బట్లు ,కేసరిబాత్ , ఆలూబజ్జీ , అన్నం  దోసకాయపప్పు,  టమాటో ఆవకాయ , బీన్స్  కూర, సాంబార్ ,పెరుగు ,అప్పడాలు,  మెనూ  ప్రవల్లిక  డిసైడ్  చేసింది..  

అన్నీ  రెడీ చేసి  కూచున్నారు.. 
11 , 11.30 కల్లా   నలుగురూ  వచ్చారు.. 

ప్రవల్లిక  ఆనందానికి  అంతేలేదు  వారొస్తున్నారని  తెలీని ప్రవల్లిక  చాలా  ఆనంద పడింది  

ఇద్దరత్తలు ప్రవల్లిక  కోసం బట్టలు  వాచ్  వానిటీ  బాగ్  తెచ్చారు.శ్రీధర్ ఒక కవర్ ఇచ్చి  నీక్కావలసినవి  కొనుక్కో  తల్లీ అన్నాడు  . 

భోజనాల  టేబుల్ దగ్గర మావయ్యలిద్దరూ  ప్రవల్లికను  మధ్యలో  కూచో పెట్టుకున్నారు 
అనూరాధ , లక్ష్మి  అందరికీ  కొసరి  కొసరి  వడ్డించారు ..

"అమ్మా లక్ష్మీ  నీ కబుర్లతోనే  కడుపు  నిండింది  తల్లీ  అని  మోహన్  అనడంతో  అందరూ నవ్వారు.. 

సరదాగా  అందరూ  సాయంత్రం  దాకా  గడిపి  టీ తాగి  వెళ్ళారు... ప్రవల్లిక ముఖంలో  ఆనందం  అందరి ద్రుష్టిలో  పడింది..  అది  గమనించిన  బామ్మ  లక్ష్మిని  దగ్గరకు తీసుకుంది. 

"చాలా  మంచి  పనిచేసావమ్మా !అని హరిహర్రావుగారన్నారు.. 

"మాకొక  మనవడిని ఇస్తే  మేం ఇంకా  సంతోషిస్తాం".. అన్నారు  బామ్మ.. 

ఇంక అందరికీ  చెప్పే  సమయం  వచ్చిందనుకుంది  లక్ష్మి .అందుకే  అందరున్నారు  కదా  అని  చెప్పేసింది..

"ప్రవల్లిక చదువయ్యి  ఉద్యోగం  వచ్చే  దాకా  మేం  పిల్లలు  వద్దనుకున్నాం " అని.. 

"అందేంటి " అని  సంగీత  అడిగింది
  
మిగతా  అందరూ  ఆశ్చర్యంతో చూస్తుండి  పోయారు ..

సశేషం...

No comments: