బాంధవ్యం.... 41
కాస్త ముందుగా తేరుకున్న బామ్మే అన్నది "అదేంటి పాపం పసిపిల్లలు వాళ్ళొస్తే దాని చదువు , ఉద్యోగానికేం అడ్డు. పిచ్చి మాటలు పిచ్చి ఆలోచనలు.. సంగీత భయపడింది బామ్మ మాటలకు లక్ష్మి ఎలా రియాక్ట్ అవుతుందా అని ..అనూరాధయితే "అదేంటత్తయ్య అలా అనేసారు" అంది .. ఇవన్నీ పట్టించుకోని లక్ష్మి మాత్రం .. "మరే! ఒక బిడ్డ సెటిల్ అయ్యాకే ఇంకో బిడ్డను కనాలి బామ్మా! అది మా జనరేషన్ రూలు ..". "చాల్లే సంబడం... దాన్ని మీ బిడ్డ లాగా చూసుకుంటున్నావు అంతవరకూ బానే ఉంది.. కానీ మీ బిడ్డ మీ బిడ్డే.. ఏ తల్లికైనా సరే ఏ బిడ్డకాబిడ్డే ముద్దు.. అయినా మొదటి బిడ్డను కాదనకూడదు. మందుల ప్రభావం బిడ్డల మీద పడుతుంది.." "కావాలంటే గబ గబా ఇద్దరిని కనేసి ఆపరేషన్ చేయించుకో మేం పెంచుతాం .నువ్వు హాయిగా ఆఫీస్ కెళ్ళు." "మరే బామ్మా !ఆశ దోశ..వదినా చూడండి .... బామ్మ అన్నీ ఎలా డిసైడ్ చేసేస్తున్నారు అదేదో వారి చేతుల్లో ఉన్నట్టు" అంటూ జవాబివ్వకుండా లోపలికెళ్ళింది.. "అత్తయ్యా ఆ అమ్మాయి ఈజీగా తీసుకుంది కాబట్టి సరిపోయింది ..లేకపోతే.. అంటూ ఏదో అనబోయిన అనూరాధను అడ్డుకుంది బామ్మ .. "అసలేంటి నీ ఉద్దేశ్యం? మాటి మాటికి ఈ కాలం పిల్లలు ,ఈ కాలం పిల్లలు అంటున్నావు. ఏం ఈ కాలం పిల్లలు పెళ్ళిళ్ళుచేసుకోవటం లేదా ? పిల్లలను కనడం లేదా ? ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి , ఆ అమ్మాయి చక్కగా మాట్లాడుతుంటే మీరంతా ఎందుకు ఆ అమ్మాయిని ఈ కాలం పిల్ల అని దూరం పెడుతున్నారు ఈ కాలం పిల్లాడిని మరి మీ కాలం పిల్ల పెళ్ళి చేసుకుంటుందా.?". "చదువుకున్న పిల్లలు కాస్త సిగ్గు పడతారేమో, మన ప్రశ్నలు కాస్త మోటుగా అనిపిస్తాయేమో కానీ, పిల్లలను కనడం నిజమే కదా.. చిన్న పిల్లలు వాళ్ళకు చదువు, ఉద్యోగం తప్ప వేరే అనుభవం లేదు. అన్నీ తెలిసిన మనం చెప్పక పోతేనే తప్పు.. " "ముహుర్తం చూసి దంపత్తాంబూలాలు ఇప్పించి పిల్లలు పుట్టాలని అందరితో ఆశీర్వాదం ఇప్పించాము.. మరి వారందరి ఆశీర్వాదం కల్లలు చేద్దామా? పిల్లలు పుట్టకుండా చేసుకుంటారా?..." "అసలు ఆ అమ్మాయిని గమనించావా? నెల తప్పింది ..తనకు ఇంకా తెలీదేమో.. నేను పెద్దదాన్నికదా కనిపెట్టాను.. కావాలంటే అడగండి లేదా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళండి అని కాస్త సీరియస్ గానే అన్నారు.. ఎవరూ ఏం మాట్లాడలేదు . అనూరాధ సంగీత వైపు చూసింది "సరే నేననడుగుతాలే.." అంది సంగీత సంగీత లోపల కెళ్ళింది. లక్ష్మీ ,ప్రవల్లిక కబుర్లు చెప్పుకుంటున్నారు. "ఊ ఏంటి ! కబుర్లయ్యాయా? ఇంటికెళదామా ?" అంది ప్రవల్లికతో సంగీత.. "అలాగే పద.." అంది.. "అన్నట్టు లక్ష్మీ మనం ఈ హాలిడేస్ లో ఎక్కడికైనా వెళదామా నీకు మధ్యలో ఏ ఇబ్బందీ లేకపోతే next week దుర్గ గుడికెెళదాం ." "అలాగే వదినా నాకేం ప్రాబ్లెమ్ లేదు అయినా నాకు Pcod problem కొంచం irregular.." "Ok అయితే program వేసుకుందాం మరి" అని ప్రవల్లికతో ఇంటికెళ్ళింది. "తెల్లవారి పద్మకు ఫోన్ చేసింది సంగీత, పరిస్థితి ఇలా ఉంది వదినా బామ్మేమో నాకు అనుమానంగా ఉంది మీకు చూపించమంటుంది లక్ష్మి ప్రాబ్లమ్ అది .. ఏంచేయమంటారు.". "అందులో చేయడానికేం ఉంది వదినా! కిట్ కొని urine sample తో pregnancy test చేసుకోమనండి.. ఫరవాలేదు నా దగ్గరకు రావడం కన్నా అది best అంది.." ఇంక తప్పదు బామ్మకోసం ఏదో ఒకటి తనే చేయాలి .అని సాయంత్రం తనే ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు కిట్ కొనుక్కుని వచ్చింది.. మెల్లిగా లక్ష్మిని తన ఇంటికి రమ్మంది.. "వదినా! ఈ రోజు తొందరగా వచ్చి కట్లెట్ చేసాను మీరే రండి " "అది కాదులే అవి తీసుకుని నువ్విక్కడకు రా ఇక్కడ తినొచ్చు" అంది ఎప్పుడూ అలా బలవంతం చేయని వదిన రమ్మనేటప్పటికి వచ్చింది .. ఇద్దరూ కలిసి తిన్న తరువాత సంగీత టీ పెడుతూ మెల్లగా లక్ష్మి తో మాట్లాడుతూ "నీ కిష్టం లేనిదేదైనా నిన్ను నేనడిగితే నీకు బాధ కోపం వస్తుందా? .." "అయ్యో అదేంటి , అది నాకిష్టం లేదని మీకెలా తెలుస్తుంది. అయినా నాకు బాధ కలిగించే, కోపం వచ్చే విషయం మీరు అడగరని నాకు తెలుసుగా వదినా! అయినా అడిగినా నేను feel అవ్వను " చెప్పండి విషయం చెప్పి "plz బామ్మకోసం.". అంది సంగీత "అయ్యో నో ప్రాబ్లెమ్ వదినా.... బామ్మ అనుమానం తీర్చేద్దాం.." అంటూ లోపలికెళ్ళింది.. మనం ఒకటి తలిస్తే భగవంతుడు మరొకటి. తలిచాడు. Test positive వచ్చింది... "అదేంటొదినా పాజిటివ్ వచ్చింది " అంటూ ఆశ్చర్య పోయింది. సంగీత సంతోషం పట్టలేక లక్ష్మి చేతులు పట్టుకుని ఊపేస్తూ ఆనంద పడిపోయింది దగ్గరకు తీసుకుని ముద్దుపెట్టుకుంది.. ఒక్కసారిగా తన గతం గుర్తొచ్చినా తల విదిలించి .. "Congratulations" అని చెప్పింది.. "అదేంటొదినా ఇలా అయ్యింది ప్రవల్లిక exams అయ్యేదాకా అన్నా ఆగాల్సింది".. అంటూ వాపోయింది .. "పిచ్చిపిల్లా దానికీ దీనికీ సంబంధం ఏంటి ? దాన్ని దగ్గరుండి చూసుకుంటున్నావు అంటే దానర్థం నీ సంతోషం దూరం చేసుకుని ఆనందం వదులుకొమ్మని కాదుగా.. " "ఏం బెంగ పెట్టుకోకు పద ముందు బామ్మకు చెబుదాం "అంటూ బయలు దేరారు.. ఇంటి లోపలికి వెళుతూనే బామ్మ దగ్గరకెళ్ళి కాళ్ళకు దండం పెట్టి "మీరు గ్రేట్ బామ్మా! అసలు ఏ టెస్టులు లేకుండా అలా ఎలా చెప్పారు మీకు ఆస్కార్ ఇవ్వాల్సిందే.." అంటుంటే బామ్మకే కాదు ఎవరికీ అర్థం కాలేదు.. సంగీతే అందరితో చెప్పింది. "బామ్మ అనుమానం నిజమయ్యింది మనింట్లోకి బుజ్జి పాపో, బాబో రాబోతున్నాడని..". "నామాట నిలబెట్టుకోలేకపోయాను. సారీ ! అని బుంగమూతి పెట్టుకున్న లక్ష్మిని చూసి అందరూ నవ్వారు.. సశేషం బాంధవ్యం.........42 "పోనీలే ఇంకొకరిని ప్రవల్లిక పెళ్ళయ్యాక కనొచ్చు" అంటూ "అమ్మాయ్ ఇంట్లో ఏదైనా తీపి చేయి అందరికీ" అంటూ అనూరాధకు పురమాయించింది..బామ్మ "ఏరా హర్షా! పెద్ద వాడివవుతున్నావు మరి, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి.. ఆఫీస్ కి ఎలా వెళుతుంది ఆ బస్సుల్లో పడి వెళితే ఎంత జాగ్రత్తగా వెళుతుంది పదిలంగా వెళ్ళి రాగలదా చూసుకో..లేత నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి "అంటూ హర్షకు "లక్ష్మీ నువ్వు కాస్త పరుగులాపి కాళ్ళకు గోరింటాకు పెట్టుకున్నట్టు నడువు.. తెలిసిందా" "అన్నట్టు హరీ ! వాళ్ళ అమ్మా వాళ్ళకు రేపు పొద్దున ఫోన్ చేసి చెప్పు"... అని టక టక అందరికీ ఏంచేయాలో చెప్పేసింది.. బామ్మ.. అంత సంతోషం లోనూ సంగీత కళ్ళలో నీళ్ళు తిరిగాయి..తను ఈ వార్తను ఎలా చెప్పిందో గుర్తుకు తెచ్చుకుంది.. నిజానికి హరిహర్రావుగారు వాళ్ళ అమ్మగారికిచ్చే గౌరవం మర్యాద పెద్దరికం.. బామ్మ అందరినీ ఒకేలా చూసే విధానం వల్ల తన పెద్దరికం నిలుపుకుంటూ అందరి ప్రేమను పొందుతున్నది అని మొదటి సారిగా సంగీత బామ్మ గురించి అనుకుంది... అనూరాధ అందరికీ సేమ్యా పాయసం చేసి కప్పులో పోసుకొచ్చింది.. ఆ యింటి నుండి వచ్చిన ప్రవల్లిక పాయసమా? ఇప్పుడా ? అన్నది.. విషయం తెలుసుకుని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయింది.. మావయ్యను పట్టుకుని గట్టిగా ఊపేసింది. " నాకు పార్టీ ఇవ్వాలి మావయ్యా ?" అంటూ డిమాండ్ చేసింది .. "హాయ్ అత్తా !ఎవరు పుట్టినా నేనే పేరు సెలెక్ట్ చేసేది అంటూ అత్తకు ముందే చెప్పేసింది.". "ఊ !అలాగే ..కానీ కొంచం నోరు తిరిగే పేర్లు పెట్టండి "అని అనూరాధ .. "ఏపేరయినా చక్కగా అదే పేరుతో పిలవాలి కానీ ముద్దు పేర్లు పిలవకండీ " అంటూ బామ్మ.. "బాగుంది ఇప్పుడే తెలిసింది అప్పుడే ఇంత హడావిడినా"అంటూ సంతోషంగా హరిహర్రావుగారు.. మొత్తానికి ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది.. తెల్లవారి ఆదివారమే కదా ఇక్కడే ఉండమన్న లక్ష్మి కోరిక మేరకు సంగీతా వాళ్ళు అక్కడే ఉండిపోయారు.. తెల్లవారి తీపి కబురందుకుని లక్ష్మీ వాళ్ళ అమ్మ నాన్న చెల్లి వచ్చారు పళ్ళు పూలు స్వీట్స్ పట్టుకుని .. ఒకరికొకరు అభినందనలు చెప్పుకున్నారు అందరూ కలసిన ఆ ఇంట సంబరం అంబరాన్నంటింది.. లక్ష్మీ వాళ్ళ అమ్మా వాళ్ళు వెళుతుంటే , "అప్పుడప్పుడూ వచ్చి అమ్మాయిని చూస్తూ ఉండండి బెంగ పెట్టుకుంటుందేమో ...మూడోనెల చలిమిడి ముద్దలు పెట్టి తీసుకెళ్ళండి అంత వరకూ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటామని" బామ్మ చెప్పడంతో "అయ్యో మీరున్నారనే మాకు ధైర్యం కదా అమ్మా ! మీకన్నా బాగా మేం చూసుకోగలమా? మీరు పెద్ద వారు, మీ ఇంట్లో తను భద్రంగా ఉంటుంది "అంటూ తమ కృతజ్ఞతలు చెప్పి వెళ్ళారు.. రోజులు గడుస్తున్నాయి ..లక్ష్మి నాకేం ఫరవాలేదు అంటూ ఉద్యోగానికి వెళుతుంది ..సాయంత్రం హర్ష తీసుకొస్తున్నాడు. లక్ష్మి ధ్యాసంతా ప్రవల్లిక మీదే , ఏ జన్మ బంధమో తెలీదు కానీ ప్రవల్లికను కనిపెట్టుకునే ఉంటుంది .. అది అందరికీ తెలుసు . కానీ ఒక రోజు బామ్మ అడిగింది.. "ఏంటీ అంత ఆరాట పడుతున్నావు దేనికోసం" అంటూ .. " ప్రవల్లిక కోసం బామ్మా రోజూ ఈ పాటికి వచ్చేస్తుంది ఇవాళ ఇంకా రాలేదని చూస్తున్నా.". "వస్తుందిలే అందులో ఎదురు చూడడానికి ఏముంది .ఆయింట్లో చదువుకుంటుందేమో, నెమ్మదిగా వస్తుంది లేేదంటే రాదు దానికి అంత ఆలోచనెందుకు ..నీ గురించి ఆలోచించుకోవాలిప్పుడు తెలిసిందా ? అదంతా లోపల వాళ్ళ మీద ప్రభావం చూపుతాయి " అని మందలించింది .. దాంతో పాపం లక్ష్మి కళ్ళనీళ్ళు పెట్టుకుంది.. "అదేంటమ్మా నేనిప్పుడేమన్నాని...". "రాదు అని ఎందుకన్నారు బామ్మా" "అదేంటమ్మ దానిష్టం అది ....నువ్వలా ఆరాటపడడం నీకే మంచింది కాదు.." అని దగ్గరకు తీసుకుంది.. "లేదు బామ్మా !పాపం చిన్నది కదా ! మేం అందరం మా నాన్నలతో సంతోషంగా ఉన్నాం..మరి తనకెందుకు ఈ బాధ బామ్మా.. నాకెప్పుడూ అదే గుర్తొస్తుంది తను ఒంటరిగా ఉంటే ఏ ఆలోచనలతో మనసు పాడు చేసుకుంటుందో అని భయం ". "అసలు తను ఏ విషయం Open అవ్వదు . అన్నీ మనసులో పెట్టుకుంటుంది అదే నా ఆరాటం బామ్మా అంతే "అంది.. "పిచ్చి పిల్లా అంత ఆలోచించకు" అంది .. హరిహర్రావుగారు కూడా కళ్ళు తుడుచుకున్నారు నిజంగా అంత అవసరమా ఆ పిల్లకు తండ్రి దూరమవడం.. ఇల్లు, సంసారం ,బంగారం లాంటి భార్యా, పండంటి బిడ్డను వదులుకుని ఏం సుఖపడుతున్నాడు.ప్రారబ్ధం కాక పోతే.." అనుకున్నాడు.. 'చాలు అర్ధం చేసుకునే కోడలు దొరికొంది రేపు సంగీత, ప్రవల్లికల భవిష్యత్తు కు ఒక భరోసా దొరికిందని ' అనూరాధ .. ఇలా తలో రకంగా అనుకున్నారు .. అంతలో ప్రవల్లిక, సంగీత రానే వచ్చారు. వస్తూనే "అత్తా ! నీకోసం బటర్ స్కాచ్ ఐస్ క్రీం తెచ్చాం, fruits దొరక లేదని మార్కెట్ దాకా వెళ్ళొచ్చాం ..అన్నం తిన్నావా అత్తా? జ్యూస్ తీయనా?" అని ప్రవల్లిక అనగానే "వద్దురా! ముందు ఐస్ క్రీం తింటాను" అంది .. "చూసావా అమ్మా ! నేను చెప్పానా అత్త ముందు ఐస్ క్రీం తిటుందని.." అంటూ సంతోషంగా చెబుతున్న ప్రవల్లికను అందరూ ఆప్యాయంగా చూసారు... సశేషం
బాంధవ్యం ... 43 ప్రవల్లికకు అత్తను జాగ్రత్తగా చూసుకోవాలని తెలుసు ...అందుకే అత్త మీద ద్రుష్టి పెట్టింది.. అత్త ఆఫీస్ నుండి రాగానే అత్తతో కాలక్షేపం కూడా ఎక్కువయ్యింది.... ఇద్దరూ office విషయాలు కాలేజ్ విషయాలు షేర్ చేసుకుంటున్నారు ..... లక్ష్మిి ఎప్పుడూ ప్రవల్లికను ఎక్కువ మాట్లాడేలా ప్రోత్సహించేది.. మాట్లాడడం వల్ల తన మనసులోని భావాలు తెలుసుకోవచ్చని తాపత్రయ పడేది ... తన ఫ్రండ్స్ గురించి చెప్పమనేది . వాళ్ళ బిహేవియర్ ఎలాంటిదో తెలుసుకోవాలనుకునేది.. ఎందుకంటే ఎవరైనా ప్రవల్లికను హర్ట్ చేస్తున్నారా అని ముందు జాగ్రత్త కోసం.. ఈ ఇంట్లో వాళ్ళెవరికీ వేరే వారిని తూలనాడడం కానీ , వారి గురించి చెడుగా అనుకోవడం కానీ తెలీదు ... కానీ, Trend మారింది సంగీతకు ఈ జనరేషన్ గురించిన అవగాహన తక్కువేమో అని లక్ష్మి అభిప్రాయం.. దాంతో ప్రవల్లిక బాధ్యత తనదని ఫీల్ అవుతుంది .. చూస్తుండగానే లక్ష్మికి 5వ నెల వచ్చింది . అట్టహాసంగా కాకపోయినా సాంప్రదాయంగా సీమంతం చేసారు.. లక్ష్మి పుట్టింటికి వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళింది.. ఒక్కరోజేలే రేపొస్తుంది అన్నది అనూరాధ ప్రవల్లికతో.. లలిత , వనితలను పిలిచినా ఇద్దరూ రాలేదు. ఫోన్ చేస్తే ఊర్లో ఉన్నారని తెలిసింది.. ఎందుకెళ్ళారో వచ్చాక చెబుతారులే అనుకుంది సంగీత.. ఇంట్లో లక్ష్మి లేక సందడే లేదు..ఒక రోజు అన్న లక్ష్మి మూడు రోజులు వెళ్ళి ఆ రోజే వచ్చింది.. అందరూ సరదాగా మాట్లాడుకుంటుంటే ఫోన్ వచ్చింది ... శ్రీధర్ చేసాడు సంగీత కోసం .. ఏంటి ఈ సమయంలో అనుకుంటూ 'హలో ' అంది అక్కడి మాటలు వినగానే 'అయ్యో!ఎప్పుడూ' సరే బయలు దేరుతాను" అని ఫోన్ పెట్టేసింది.. హరిహర్రావుగారి దగ్గర కెళ్ళి విషయం చెప్పింది ఇందాక సాయంత్రం అట ..అయ్యో! మరి నువ్వేమనకుంటున్నావు.. "నేను , హర్ష వెళతాం . మీరు రావద్దు? అంది .. " బాగుండదేమో అమ్మా !" "ఫరవాలేదు నాన్నా ! ముందు వెళ్ళి చూసొస్తాను పరిస్థితిని బట్టి మీరు వద్దురు కానీ" అంటూ సమాధాన పరిచింది.. "సరే పద! అంటూ బయటకు వచ్చారు. బామ్మ దగ్గరకెళ్ళి ," అమ్మా! సంగీతా వాళ్ళ మావగారు పోయారట వెళతానంటుంది". "అయ్యో! ఎప్పుడూ ." "మధ్యాహ్నం అట... వెళతానంటున్నది " "దానిష్టం వెళ్ళనీ...తీసుకెళ్ళు.." "నేను కాదు , హర్షను తీసుకెళతానంటుంది .". "బాగుంటుందా చూడు.." "ఇప్పుడు వద్దులే బామ్మా ! మళ్ళీ తరువాత వెళ్ళి రావచ్చు.". అన్న సంగీతతో "సరే నీఇష్టం .. కానీ ఈ రాత్రి వద్దు పొద్దున వెళ్ళు." అంది.. పొద్దున్నే హర్షను తీసుకుని బయలుదేరింది బస్ లో తమ్ముడితో ఏం మాట్లాడకుండా చాలా గంభీరంగా కూచుంది.. ఈ మధ్య కాలంలో అక్కను అలా చూడని హర్ష కూడా మౌనంగా ఉన్నాడు ఏం మాట్లాడకుండా ... సంగీత మౌనంగా ఉన్నదన్న మాటే కానీ మనసులో సుడిగుండాలు తలలో అగ్ని గోళాలు. ఇన్నేళ్ళ తరువాత గతం అంతా కళ్ళముందు కనబడింది ..ఎన్ని అనుభూతులను చంపుకున్నది. కూతురుని కన్నదే కానీ దాని అచ్చటా ,ముచ్చటలు దాని ఎదుగుదలను ఎప్పుడైనా సరిగ్గా ఆస్వాదించిందా?.పాపను ఆనందంగా ఉంచగలిగిందా అసలు.. " తండ్రి ప్రేమ ఎలాగూ లేదు కనీసం తాతగారు బామ్మలు తమ ప్రేమనైనా ఇవ్వగలిగారా... ... ఏమిటో ఈ జీవితం..... " ఒక తప్పుడు నిర్ణయం నన్నేకాదు నాతో పాటు నా కూతురి జీవితాన్ని కూడా నాశనం చేసింది దానికి తండ్రి ఉండీ లేకుండా చేసింది ". "చనిపోయిన వారి గురించి చెడుగా మాట్లాడ కూడదు కానీ , ఒక మావగారిగా , తండ్రిగా ఏం చేయలేకపోయినా ఒక పెద్దమనిషిగా చేయవలసిన పనులు కూడా చేయలేదు సరికదా న్యాయం ధర్మం గురించి కూడా ఆలోచించలేదు.." అనుకుంటుంటే కళ్ళ నీళ్ళు తిరిగాయి.. అమ్మ నాన్నల అండ , తమ్ముడి ప్రేమ,ముఖ్యంగా బామ్మ ఇచ్చిన ధైర్యం లేకపోతే ఇవాళ ఇలా ఉండగలిగేదాన్నా.. ముఖ్యంగా లక్ష్మి కోడలిగా వచ్చి అందరి నెత్తినా పాలు పోసింది .. తనకా మెచ్యూరిటీ ఎక్కడినుండి వచ్చిందో ప్రవల్లిక బాధ్యత తనదనుకుంటుంది గుడ్డిలో మెల్ల ఆ అద్రుష్టం తనకు దక్కింది.... ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ గమ్యం చేరుకుంది బస్సు.. బస్సు దిగగానే ఎందుకో ఒక లాంటి ఉద్వేగానికి లోనయ్యింది సంగీత.... అడుగులు ముందుకు పడటం లేదు కాళ్ళలో వణుకు..వాళ్ళందరినీ ఎలా చూడాలి, ఎలా పలకరించాలి , ముఖ్యంగా అత్తయ్యను, సతీష్ ని ఎలా .?. తెలీకుండానే తమ్ముడు చేయి ఆసరాగా పట్టుకుంది "అక్కా ఏంటిది వెళదామా రాగలవా ? " అన్నాడు "ఫరవాలేదు" అంటూ ముందుకు కదిలింది.. ఇల్లు చేరారు కానీ ఏ హడావిడి లేదు, చుట్టాలంతా ఏమను కుంటారో అనుకుని వచ్చింది కానీ ఒక్క బంధువూ కనబడలేదు .... 'కరెక్ట్ గానే వచ్చానా ?' అంటూ గడపదగ్గరే ఆగిపోయింది .. ఎవరూ కనబడటం లేదని కాలింగ్ బెల్ నొక్కాడు హర్ష.. ఎవరో ఒకాయన వచ్చారు. ఎవరమ్మా అనడిగితే "సంగీతనండీ" అంది. "లోపలికి రండి" అన్నాడు . ముందు గదిలో పరాయిదానిలా కూచుంది పక్కన హర్ష.. వనిత లలిత వచ్చారు .. వారి చేతులను తన చేతుల్లోకి తీసుకుని "ఏమయ్యింది ?ఎలా జరిగింది వదినా! అనడిగింది.. ఏం లేదు, వయస్సు ప్రభావం వల్ల కొంచం అనారోగ్యం అంతే , expect చేయలేదు అందుకే నీక్కూడా చెప్పలేదు .కానీ మేం వచ్చేసరికే అయిపోయింది. అంతా నిన్నే చేసేసారు.. "అయ్యో చివరి చూపు అందుతుందనుకున్నా" అంది సంగీత .. "అందరూ ఉన్నారు కదా ఆలశ్యం దేనికి అని నిన్ననే చేసారు.. " "అత్తయ్య లేరా ?..:. అమ్మ ఇప్పుడే పడుకుంది రాత్రంతా నిద్ర పోలేదు అంటూ ఏదో చెబుతున్నారు కానీ సంగీత సతీష్ కోసం లోపలికి చూస్తున్నది.. పది నిముషాలు గడిచినా సతీష్ బయటకు రాలేదు.... అంతే అసహనంతో లేచింది.. వాళ్ళు భోంచేయమన్నా వినకుండా బయటకొచ్చింది హర్ష అక్క వెనకాలే వచ్చాడు అయినా హర్షను పట్టించుకోకుండా ముందుకు నడిచింది .. హర్షకు అక్క ప్రవర్తన వింతగానే ఉన్నా ఆమె మానసికస్థితి ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాడు .. ఉన్నట్టుండి వెనక్కు తిరిగిన సంగీత మళ్ళీ ఒకసారి వెళదామా ? అత్తయ్యను చూడకుండా వచ్చాము అంది .. మనసులో సతీష్ ని చూడలనే కోరిక కూడా ఎక్కడో ఉన్నట్టుంది కాబోలు పాపం ..ఎంతైనా ఆడ మనసు... "బాగుండదేమో అక్కా? కావాలంటే నాన్నతో మళ్ళీ రావచ్చు.. "అవునులే అదే మంచిది. కానీ పాపం అత్తయ్య అనిపించింది. అంతే. నాకు ఆకలిగా ఉంది హర్షా.... "సరే! ఎక్కడైనా దగ్గర్లో హోటల్ ఉందేమో అడుగుతాను " అని ముందు కెళ్ళి రిక్షా మాట్లాడుకొచ్చాడు .. పక్క సందులోనే ఉంది.. కొత్తగా కట్టినట్టున్నారు హంగులతో బాగుంది.. భోంచేసి బస్టాండ్ కెళ్ళారు అక్కడ కాస్త స్థిమిత పడింది సంగీత.. అక్కను పలకరించడానికి భయపడ్డాడు హర్ష నాన్నుంటే బాగుండేదేమో అని కూడా అనుకున్నాడు.. "కాసేపు ఉండాల్సిందంటావా హర్షా ! తప్పు చేసానా.?". "లేదక్కా !నీ మనసుకు తోచింది చేసావు.. మనస్సాక్షికి మించింది లేదు. ఇన్నేళ్ళ తరవాత కదా వచ్చింది, అలజడి సహజం ఫరవాలేదు నాలుగు రోజులాగి మళ్ళీ నాన్నతో రావచ్చు" అంటూ నచ్చచెప్పాడు.. "పెద్ద వాడివయ్యావు.. Thanks రా ! అమ్మా నాన్నకు నేనే చెపుతాను నువ్వు ఏం చెప్పకు "అంది .. "అలాగే అక్కా "అన్నాడు ..మాటల్లోనే బస్సు ఆగింది.. బస్సుదిగి ఆటలో ఇంటికొచ్చారు.. సశేషం బాంధవ్యం ... 44 లోపలికొచ్చి ఇద్దరూ స్నానాలు చేసి భోంచేసే దాకా ఎవరూ మాట్లాడలేదు.. "ఏమయ్యిందిట" అని బామ్మ అడగగానే సంగీత చెప్పడం మొదలు పెట్టింది.. "మామూలుగానే హాస్పిటల్ లో జాయిన్ చేసారట షుగర్ ఎక్కువయ్యిందని...పెద్ద సీరియస్ ఏం లేదు పెద్ద వయసు అంతే. వదినా వాళ్ళు వెళ్ళేసరికే ప్రాణం పోయిందిట ఇక అందరూ ఉన్నారు కదా అని అదే రోజు సాయంత్రం చేసారట .. అన్నయ్యా వాళ్ళు బావగారు కనబడ లేదు పైన ఉన్నారేమో మరి.. అత్తయ్య పడుకున్నారు ..ఈన లోపలే ఉన్నారు. పది నిముషాలపైనే కూచున్నాం ఆయనసలు బయటకే రాలేదు నేను వచ్చానని తెలిసి కూడా .". "నాకేంటో అవమానంగా, బాధగా అనిపించింది కోపం రాలేదు . అనవసరంగా తెగిన దారానికి ముడి వేసే ప్రయత్నం చేస్తున్నానేమో అనిపించింది. అన్ని బంధాలను వదలుకుని వెళ్ళిన వారికోసం తాపత్రయ పడుతున్నానా అని ఒక్క నిముషం ఆలోచన వచ్చింది అంతే వచ్చేసానమ్మా ! ఎందుకో నాకుండాలనిపించలేదు" అని ఏడుస్తున్న సంగీతను గబుక్కున పట్టుకుంది అనూరాధ . ఏడుస్తున్న సంగీతను ఎవరూ ఆపలేదు .. కాసేపయ్యాక తనను తానే సంభాళించుకున్న సంగీత కళ్ళుతుడుచుకుని "అత్తయ్యను పలకరించకుండా నేను తప్పుచేసానా? అని అడిగింది నాన్నని .. "లేదమ్మా ! ఆ సమయంలో నీకలా అనిపించింది అంతే అదే చేసావు .. తప్పు ఒప్పులసంగతంటావా ..వారు చేసినవన్నీ ఒప్పులా.. ఇది కూడా అంతే.. మనసులో పెట్టుకుని బాధపడేంత తప్పుకాదులే.." అన్నారు హరిహర్రావుగారు.. "అయినా చిన్న పిల్లాడిని పంపించడమేంటి? ఇన్ని రోజుల తరవాత వెళుతున్నప్పుడు పెద్ద వాడివి నువ్వుండాలి కదా! అది అంత మదన పడుతున్నప్పుడు ఓదార్చడానికి పెద్దవాళ్ళం మనం ఒక్కరం లేము .అది వద్దంటే మాత్రం మన బుద్ధెక్కడ పోయింది .రోజులు , నెలలు కాదు ఇన్ని ఏళ్ళ తరువాత అక్కడికి వెళుతున్నప్పుడు మనం ఆమాత్రం ఊహించుకోవాలి కదా! పిల్ల మనసు ఎలా ఉంటుందా? "అని.. "వాళ్ళతో మాట వస్తుందా? రాదా అన్నది తరువాత, పిల్ల క్షేమంగా వచ్చింది అందుకు సంతోషిద్దాం ఇలాంటి తప్పులు ఇంకెప్పుడూ చేయకండి.. " అని బామ్మ కొడుకును కడిగేసింది. "హరీ! ముందు వాళ్ళకు ఫోన్ చెయ్యి మనం మాట్లాడదాం " అంది.. వెంటనే హరిహర్రావు గారు Phone చేసారు.. జ్యోతి Phone ఎత్తింది ఎలా జరిగింది ఏంటి అని అడిగారు. విషయం చెప్పిందే తప్ప సంగీత వచ్చిన విషయం చెప్పలేదు..... తరువాత హరీష్ తో మాట్లాడాడు. "హా మావయ్యగారు అంతా సడన్ గా జరిగిపోయింది...అక్కయ్య చెప్పింది సంగీత వచ్చిందని , సారీ కలవలేక పోయాం హాస్పిటల్ లో కొంచం పనుండింది. అందుకే అక్కడికి వెళ్ళాల్సివచ్చింది " అని అన్నాడు .. "బామ్మ మాట్లాడతారట " అని అనగానే సరే అన్నాడు బామ్మ ,అనూరాధ ఫోన్ లోనే అందరినీ పలకరించారు .. ఎవరూ సంగీత మాట ఎత్తలేదు వీళ్ళు కూడా ఏం చెప్పలేదు.. హమ్మయ్య ఒక సమస్య తీరింది .. తెల్ల వారినుండి ఎవరి పనులలో వారున్నారు మిగతా కార్య క్రమాలకు వాళ్ళు పిలవలేదు వీళ్ళు వెళ్ళలేదు .. అక్కడికా ఛాప్టర్ క్లోజ్.. ........... ............... .............. ............ ......... నెలలు గడుస్తున్నాయి లక్ష్మీ వాళ్ళ అమ్మా నాన్న వచ్చి లక్ష్మిని పురిటికి తీసుకెళ్ళారు.. అందరిలోని హుషారును లక్ష్మి తనతో తీసుకెళ్ళినట్టు అందరూ రోటీన్ గా ఉన్నారు.. ఒక రోజు వనిత ఫోన్ చేసింది .."అమ్మను తీసుకొచ్చాము నాలుగు రోజులు ఇక్కడ ఉండి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళుతుంది నిన్ను చూడాలనుకుంటుంది రాగలవా ?" అని.. "సరే వదినా !సాయంత్రం వస్తాను " .. అనూరాధకు ఫోన్ చేసి చెప్పి సాయంత్రం వనితా వాళ్ళ ఇంటికి వెళ్ళింది.. లోపలికి వెళ్ళగానే ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది సుచరిత ."ఏమ్మా! బాగున్నావా? పాప బాగుందా "అని అమ్మ నాన్న బామ్మ ను అందరినీ పేరు పేరునా అడిగింది .. సంగీత కళ్ళు చెమర్చాయి .. "ఏంటత్తయ్యా ఇలా అయిపోయారు " అంటూ చిక్కి శల్యమైన సుచరిత చేతులు పట్టుకుని నిమిరింది .. "నాదేం ఉంది తల్లి ! ఊరు పొమ్మటుంది కాడు రమ్మటుంది.. నీ గురించి పాప గురించేనమ్మా నా దిగులంతా... మొండివాడు తనకు తోచదు చెబితే వినడు..మేము ఎంత చెప్పి చూసామో! అసలు మీ మాటే ఎత్తనివ్వడు . ఎవరు బాగు పడ్డట్టు, పోనీ తెగ తెంపులు చేసుకుని వేరే పెళ్ళిళ్ళు చేసుకున్నారా ? అది లేనికాడికి ఇది అవసరమా?.." "ఏం ప్రారబ్ధమో ? ఏం పాపం చేసుకున్నారో? ఇద్దరికిద్దరు ఇలా జీవితం గడుపుతున్నారు . మధ్యలో పిల్ల ఆగమాగం.. ఒక్కసారి చూసిరా బాబూ అంటే వింటాడా...లేదు పోనీ నేను చూస్తానంటే అదీ వినిపించుకోరు తండ్రీ కొడుకులు ఇద్దరి కిద్దరే .."అంటూ ఇన్ని రోజులు మనసులో దాచుకున్నందంతా బయటకు చెప్పింది.. పాపం ఇద్దరు మగవారి మధ్య ఎంత నలిగి పోయిందో.. అనుకుంది సంగీత . ఈ లెక్కన జరగిన సంగతులేమీ అత్తయ్యకు చెప్పలేదనుకుంటా.. అని ఆలోచిస్తున్నదల్లా వనిత పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది .. కాఫీ తాగి ఇంటికొస్తుంటే "చంటిదాన్ని ఒక సారి చూపించమ్మా సంగీతా.. పాపం దాని అచ్చటా ముచ్చటా ఏం చూడనే లేదు " అంటూ తన మెళ్ళో ఉన్న చిన్న గొలుసు తీసి చేతిలో పెట్టింది "పాపకివ్వు " అంటూ ... "అయ్యో ! వద్దత్తయ్యా ప్లీజ్ దానికే ఇవ్వండి " అంటూ అక్కడే పెట్టింది. ...ఎవరెంత చెప్పినా తీసుకోకుండా ఇచ్చేసింది "పాపను తీసుకొస్తాను తనకే ఇవ్వండి ఏమనుకోవద్దత్తయ్యా !అని బయలు దేరింది.. ఇంటికెళ్ళి అందరితో చెప్పింది.. మరునాడు హరి హర్రావుగారు అనూరాధ కూడా వెళ్ళి చూసొచ్చారు.. రాగానే బాధపడ్డారు పాపం ఎలాంటావిడ ఎలా అయిపోయారను కున్నారు .. ఎవరేం చేసేది లేదు... మరునాడు లక్ష్మిని హాస్పిటల్ లో చేర్పించారని ఫోన్ వచ్చింది... సశేషంబాంధవ్యం ... 45 హర్ష సంగీత ముందు హాస్పిటల్ కి వెళ్ళారు. వెనకాల అనూరాధ , హరిహర్రావుగారు వెళ్ళారు బామ్మ ఇంట్లోనే ఉంది ప్రవల్లిక కోసం... వీళ్ళు వెళ్ళేసరికి లక్ష్మీ వాళ్ళ అమ్మ ,నాన్న ,చెల్లి అందరూ అక్కడే ఉన్నారు.. సాయంత్రం వరకూ చూసారు . పౌర్ణమి రోజు పున్నమి చంద్రుడిలా చంద్రుడి కళలతో చక్కని మగ పిల్లాడు పుట్టాడు..... ముద్దుగా బొద్దుగా ఉన్న బాబు అందరికీ నచ్చేసాడు.. విషయం తెలిసి ప్రవల్లిక కూడా పరుగున వచ్చింది .. అందరూ కలిసి బాబును వదలలేక వదల లేక వెళ్ళారు .అనూరాధ మటుకు అక్కడే లక్ష్మీ వాళ్ళ అమ్మకు తోడుగా ఉండి పోయింది .. లక్ష్మీ వాళ్ళు బారసాల కాస్త ఘనంగానే చేద్దామనుకున్నారు దహోత్రుడు పుట్టాడు మరి వారి ఆనందానికి అవధులు లేవు.. హరిహర్రావుగారికి చెప్పేసారు ముందే మీ చుట్టాలందరినీ పిలుచుకోమని.. వారు చెప్పారు కదా అని పిలవడం బాగుంటుందా అని తమకు మరీ దగ్గరవారినే పిలిచారు హరిహర్రావుగారు. . సంగీత ప్రవల్లికను తీసుకుని వెళ్ళి వనిత అనిత వాళ్ళను పిలుద్దామనుకుంది .. అత్తయ్యకు ప్రవల్లికనును చూపించాలని బయలుదేరి ముందుగా వనిత వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మాట్లడుతున్నదన్న మాటే కానీ అత్తయ్య కోసం చూస్తున్నది. అది గమనించిన వనిత "అమ్మలేదు అన్నయ్యా వాళ్ళ ఇంటికి వెళ్ళింది.నీకోసం చాలా చూసింది..అనుకున్న దానికన్నా ముందే అన్నయ్య వచ్చి తీసుకెళ్ళాడు".. అంటూ చెప్పింది.. "ఓ అలాగా! హాస్పిటల్ హడావిడి లో రాలేక పోయా మళ్ళీ వచ్చినప్పుడు చెప్పండి వదినా వస్తాను. బారసాలకు మటుకు రండి " అని చెప్పి లలిత వాళ్ళ ఇంటికి బయలుదేరారు .. ఇంటికి వెళ్ళగానే ముందు మోహన్ ఉన్నారు... ప్రవల్లికను దగ్గర కూచో పెట్టుకుని "ఎలా చదువుతున్నావు , అన్ని ఎంట్రెన్స్ exams రాయాలి , మంచి option Select చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు తీసుకునే నీ నిర్ణయం నీ భవిష్యత్తుకు పునాది.... తెలిసిందా" అంటూ చెప్పారు.. ప్రవల్లిక అత్త దగ్గరికి లోపలకు వెళ్ళగానే సంగీతతో అన్నాడు.. "ఎందులో సీట్ వచ్చినా మేం fees కడతాం నువ్వు దిగులు పడకు. " అంటూ ధైర్యం చెప్పారు.. "ఫరవాలేదు అన్నయ్యా Bank Loan తీసుకోవాలనుకుంటున్నాను ఎవరికీ బర్డెన్ వద్దు.. అందుకోసం సాయం చేస్తే చాలు అని అంది " "చూద్దాం ముందు exams అవ్వనీ .." ఇద్దరినీ పిలిచి మరీ మరీ రమ్మని ఇంటికి బయలుదేరింది .. "మీ అత్తగారున్నారిక్కడ పిలవక పోతే బాగుండదేమో అమ్మా అన్నది " . అనూరాధ "అలగే పిలిచి రండి దాన్నెందుకు అడగడం అన్న తల్లితో రేపెళతాం " అన్నాడు హరిహర్రావు... తెల్లవారి ఇద్దరు భార్యాభర్తలు కలిసి వెళ్ళి సుచరితను పలకరించి పిలిచి వచ్చారు... అనుకున్న రోజు రానే వచ్చింది. అందరూ లక్ష్మీ వాళ్ళ అమ్మా వాళ్ళింటికి వెళ్ళారు .ఎప్పుడో పెళ్ళి లో చూసిన ఇరువైపుల బంధువులు సరదా సరదా కబుర్లతో సందడి చేసారు.. ప్రవల్లిక ,లక్ష్మీ, వాళ్ళ చెల్లెలు లక్ష్మిగాయత్రి ఇద్దరూ ఒకే లాంటి డ్రస్సులతో అందరిని ఆకర్షిస్తూ పలకరిస్తూ అంతా తామై తిరుగు తున్నారు . నామకరణం మొదలయ్యింది. పిల్లలిద్దరూ పేరు సెలక్షన్ లో బిజీగా ఉన్నారు ఒకరు చెప్పిన పేరు ఇంకొకకరికి నచ్చటం లేదు చివరికి సంగీత చెప్పేసింది... "చంద్ర హాస్ " అని .. "అబ్బ చాలా బాగుందమ్మా! "అంటూ పిల్లలిద్దరూ ముక్త కంఠంతో అన్నారు.. పౌర్ణమి రోజు పుట్టిన చిట్టితండ్రికి ఆ పేరు నచ్చినట్టుంది బోసి నవ్వులు నవ్వాడు లలిత వనిత ఇద్దరే వచ్చారు... అమ్మ ఇచ్చిదంటూ చిన్న బంగారు ఉంగరం, అన్నయ్య ఇచ్చాడంటూ వెండి గిన్నె తెచ్చారు... వాళ్ళు రాలేదుగా ఎందుకు అంటే అలా కాదులే తీసుకుంటే అమ్మ సంతోషిస్తుంది .. పెళ్ళికి రాలేదని అత్తయ్య హర్ష వాళ్ళకు కూడా బట్టలు పంపింది. పాపం ఇంత ప్రేమను ఇన్నాళ్ళూ ఎక్కడ దాచుకుందో? అనుకుంటూ తీసుకుంది సంగీత.. అందరూ వెళ్ళాక బామ్మగారన్నారు "నెలలోపల ఒకరోజు అమ్మాయిని పంపించండి అని.." అలాగే అన్నారు లక్ష్మి వాళ్ళ అమ్మగారు ఒక్కరోజు కోసమే వచ్చాడని తెలిసినా చంటి వాడిని వదల లేక వదలలేక పంపించారు.. "చక్కగా చదువుకుని పరీక్షలు రాయి అప్పటికి వచ్చేస్తాం హాయిగా ఆడుకుందువు గానీ " అని వెళ్ళింది లక్ష్మి.. Exams Time సీరియస్ గా చదువుకుంటున్నది ప్రవల్లిక. .. ఆరోజు మొదటి పరీక్ష పొద్దున్నే లేచి దేవుడికి పూజచేసి తీర్థం ఇచ్చి పెరగన్నం పెట్టి పంపించింది .. హర్ష రోజూ సెంటర్ దగ్గర డ్రాప్ చేయడం హరిహర్రావు గారు తీసుకురావడం అలా ప్రవల్లిక పరీక్షలన్నీ విజయ వంతంగా పూర్తి చేసింది.. ఒక్కసారి అత్తను బాబును చూస్తానని చెప్పి మావయ్యతో ఆసాయంత్రం లక్ష్మి దగ్గరకెళ్ళింది కానీ హర్ష ఒక్కడే వచ్చాడు.. అక్కడే ఉంటానంది బాబుతో ఆడుకుంటూ.. "సరే ఒక పూట రిలాక్స్ అవుతే మళ్ళీ Fresh గా చదవడం మొదలు పెడుతుంది " అన్న తమ్ముడితో "సరే కానీలే ఉండనీ .." ప్రవల్లిక లక్ష్మి వాళ్ళింటి నుండి వచ్చినప్పటి నుండీ బాబు గురించిన కబుర్లే , తెల్లవారినుండీ సీరియస్ గా చదవడం మొదలు పెట్టింది. EM Cet AIEEE IIT మూడు పరీక్షలు రాసేసింది.. ఈ లోపున inter results వచ్చాయి .. 97% తో పాస్ అయ్యింది .కొంచం బాధ పడింది 98 % రాలేదని ..అందరూ సంబర పడ్డారు.. మూడు Entrance exams లో కూడా మంచి మార్కులు తెచ్చు కుంది.. విషయం తెలిసిన ప్రవల్లికను చూడాలని సుచరిత లలిత వాళ్ళ ఇంటికొచ్చి, సంగీతకు కబురంపారు.. సంగీత ఆ సాయంత్రం ప్రవల్లికను తీసుకుని లలిత వాళ్ళ ఇంటికి వెళ్ళింది...ప్రవల్లిక ముందు ఇబ్బంది పడ్డా తరవాత సద్దుకుని అడిగిన వాటికన్నీ సమాధానాలు చెప్పింది.. కబుర్లు మటుకు కొన్ని మాత్రమే చెప్పింది..... మోహన్ అడిగాడు ఎక్కడ చేర్పిస్తున్నావని.. " IIT, AIEEE ఈ రెండింటిలో చేర్పిస్తే బయటకెళ్ళాలి, బయటకు పంపించడం నాకిష్టం లేదు. అందుకని ఇక్కడే B.Tech లో చేర్పిస్తాను " అంది .. "అయితే కౌన్సిలింగ్ date చెబితే Cash కడతాను. " " వద్దండీ Bank loan Apply చేస్తున్నాను కాస్త Help చేయమంది " 'సరే నీ ఇష్టం మరి ఏదైన అవసరమైతే అస్సలు మొహమాట పడకు' అన్నారు.. " ప్రవల్లికవస్తుంటే ఆపి "ఇదిగో తల్లీ నువ్వు మంచి మార్కులతో పాసయ్యావుగా నీకో గిఫ్ట్ " అంటూ తన దగ్గరే దాచిపెట్టిన గొలుసు తీసి ప్రవల్లిక మెళ్ళో వేసింది .. ఎవరూ ఏం మాట్లాడలేదు.. లలితనడిగి ఒక కవరు ప్రవల్లిక చేతిలో పెట్టింది. ఎందుకని అడిగితే ఏదైనా కొనుక్కోమంది.. కాసేపు కూచుని బయలు దేరారు... ఇంటి కెళ్ళాక చర్చలు అన్నింటిలో మంచి మార్కులు వచ్చాయి అన్నింటిలో సీటు వస్తుంది .. పాపం ప్రవల్లిక తన ఇష్టాన్ని ఎవరికీ చెప్పలేదు అమ్మ తనకేది మంచిదని తోస్తే అది చేస్తుందని తెలుసు.. కానీ హర్ష మాత్రం "అన్ని exams రాయించి మరి ఇక్కడ చేర్పించడం ఏం బాగా లేదక్కా " అన్నాడు "బయటకు పంపించడం నాకు ఇష్టం లేదు , అదీ వేరే వారి డబ్బులతో చదవించడం కూడా నాకు నచ్చదు "అని ఖచ్చింతంగా చెప్పింది.. కౌన్సిలింగ్ రోజు రానే వచ్చింది "తండ్రి ఇచ్చిన డబ్బులతో fees కట్టేసింది . భగవంతుడా ఒక బాధ్యత తీరింది.. " ఇక మిగతాది దాని చేతిలో ఉంది.. బాగా చదివి మంచి ఉద్యోగంలో చేరితే చాలు .." దాన్ని అర్థం చేసుకుని , తండ్రి ప్రేమ కూడా అందించి ,బాగా చూసుకునే భర్త వస్తే నా కన్నా అద్రుష్టవంతులుండరు.. రోజులు పరిగెడుతున్నాయి..ఇంట్లో బాబు అల్లరి, లక్ష్మి సందడి తో మళ్ళీ అందరిలో ఉత్సాహం వచ్చేసింది.. ఆడుతూ పాడుతూ ప్రవల్లిక B Tech రెండో సంవత్సరంలోకి అడుగు పెట్టింది.. ఒక రోజు సుచరితగారు పోయారని వార్త .. ఉన్న ఊళ్ళోనే కాబట్టి అందరూ వెళ్ళారు.. కొన్నేళ్ళ తరవాత సతీష్ ని చూసారందరూ కానీ చిత్రంగా ఎవరికీ ఏ feeling కలగ లేదు ... అందరూ చాలా Casual గా తీసుకున్నారు హరిహర్రావుగారే హరీష్ తో పాటు సతీష్ ని కూడా పలకరించారు.. ప్రవల్లిక తండ్రిని ఎవరో తెలియనట్టే చూసింది .. Emotional కాలేదు హమ్మయ్య అనుకుంటూ ఇంటికొచ్చారు... సశేషం... బాంధవ్యం ... 46 సంగీతకు చాలా బాధగా ఉంది సుచరితగారితో మాట్లాడాక సంగీత అనుమానాలన్నీ దూరమయ్యాయి.. ఇంత జరుగుతున్నా అత్తయ్య మాట్లాడ లేదనీ, సతీష్ కిి ఒక తల్లిగా ఏమి చెప్పలేదనుకుంది, కానీ చెప్పలేని స్థితి లో ఉందని తెలుసుకోలేక పోయింది... పాపం మనసులో ఎంత ప్రేమను దాచుకున్నదో. అత్తయ్యను కలిసిన సంతోషం కొన్నాళ్ళు కూడా నిలవలేదు. మేం ఇద్దరం కలిసుంటే హాయిగా సేవ చేసుకునే దాన్ని , కానీ నాకా అవకాశం కూడా ఇవ్వలేదు , ఎందుకో ప్రవల్లిక exams అయ్యాక నాలుగు రోజులు అత్తయ్యను ఇక్కడ ఉంచుకోవాలనుకున్నా అడగడానికి మొహమాటం అనిపించింది.. సంగీతకు "అడిగినా బాగుండేదేమో కరువుతీరా కబుర్లు చెప్పుకునే వాళ్ళం.." అనుకుంది పెళ్ళి అయిన కొత్తలో పాపం ఎంత వెనకేసుకొచ్చేవారు నన్ను.. అందుకే ఏదైనా మనసులో అనుకున్న వెంటనే చేసేయాలి.. లేక పోతే చాలా బాధ పడాల్సి వస్తుంది . నయం, ప్రవల్లికను తీసుకుని వెళ్ళి చూపించాను లేదంటే ! జీవితాంతం తప్పుచేసిన దానిలా ఉండాల్సి వచ్చేది.. అని వాపోయింది సంగీత అందుకే చివరి కార్యక్రమాలన్నింటికీ దగ్గరుంది ఆశీర్వచనం అయ్యాక జంటగా ఆశీర్వాదం తీసుకోమన్నారు ప్రవల్లికతో కలిసి తీసుకుంది చివరి మూడు రోజులు అక్కడికి వెళ్ళివస్తున్నా సతీష్ , సంగీత ఒకరినొకరు పలకరించుకోలేదు.. ప్రవల్లిక కూడా అత్తలతోనే ఉంది .. కూతురుని కూడా పలకరించే ప్రయత్నం చేయలేదు సతీష్ ఎంత పాషాణమో మరి.. ఇంక ఆయన గురించి ఆలోచన అనవసరం అని నిశ్చయించు కుంది ......................................... అన్ని కార్యక్రమాలయిన రెండు రోజుల తరువాత సతీష్ ఊరికి బయలుదేరబోతుంటే హరీష్ ఉండమన్నాడు ఒక్కడివీ ఏం ఉంటావక్కడ ఇక్కడ నాలుగు రోజులుండి వెళ్ళమని .. లేదన్నయ్యా!ఎప్పుడైనా అంతేగా ,ఒక్కడినే ఉండాలిగా ... అప్పుడప్పుడు వస్తానని వెళ్ళాడు.. సతీష్ కి ఇంట్లో తోచేదికాదు. ఎవ్వరింటికీ వెళ్ళేరకం కూడా కాదు, వంట, భోజనం ఇంట్లో TV తో కాలక్షేపం.. వెళితే పిన్ని వాళ్ళింటికి అంతే .. ఎప్పడైన హైదరాబాదు రావడం అందరినీ కలిసి వెళ్ళడం.. ె అలా రోజులు గడిపేస్తున్నాడు .................................................... ఇక్కడ ఆరోనెల బాబును వదిలి లక్ష్మి కూడా ఉద్యోగానికి వెళుతుండడంతో అనూరాధ,బామ్మ ఇద్దరూ బిజీ అయిపోయారు.. రోజూ కాలేజ్ కి వెళుతూ చూడడం వచ్చాక కాసేపు బాబుతో ఆడుకోవడం అలవాటయ్యింది ప్రవల్లికకు .. ఆదివారం వస్తే అందరూ అక్కడే ... ఆ రోజు ప్రవల్లిక పుట్టిన రోజు ఎప్పుడూ ఇంట్లో సరదాగా అందరితో చేసుకునేది. ఈ సారి కాలేజ్ ఫ్రెండ్స్ తో కలిసి బయట చేసుకుంటానంది.. అలాగే రాత్రి అందరికీ భోజనాలిక్కడే తొందరగా రా అని పంపించింది... సాయంత్రం ఆఫీస్ నుండి తొందరగా వచ్చింది అప్పటికే అనూరాధ గారు ప్రయత్నాలు మొదలు పెట్టారు 7.30 కల్లా వంట రెడీ అయిపోయింది ఇంతలో లక్ష్మీ ఒక బాక్స్ హర్ష ఒక బాక్స్ పట్టుకుని వచ్చారు .. "ఏంటవి " అనడిగింది 'ఒకటి కేక్ ఇంకోటి దానికి కంప్యూటర్' అని చెప్పారు. "ఇప్పుడెందుకురా " "ఇప్పుడే అవసరమక్కా"అన్నాడు వారి ప్రేమ ఆప్యాయతలవి, కాదనడం ఎందుకని ఊరుకుంది.. సరదా కబుర్లతో ఆరోజే కాదు మరో సంవత్సరం గడిచి ప్రవల్లిక మూడో సంవత్సరం లోకి వచ్చింది.. వచ్చే సంవత్సరం చివరి సంవత్సరం అనీ ఈ సారి కాలేజ్ వార్షికోత్సవంలో అందరినీ తప్పకుండా పార్టిసిపేట్ చేయమన్నారట..... జానపదన్రుత్యం ఎంచుకున్నారు ప్రవల్లిక టీమ్ .. లక్ష్మీ సహాయం తో డాన్స్ నేర్చుకున్నారు.. అనుకున్న రోజు రానే వచ్చింది ప్రవల్లిక ముందు వెళ్ళింది, అందరూ తరువాత వెళ్ళారు.. బామ్మకెంత ఆనందమో "అమ్మా పాప కాలేజ్ ఎంత బాగుందే నాకు చాలా నచ్చింది " అని తెగ సంబర పడిపోయింది.. ప్రవల్లిక వాళ్ళ డాన్స్ మొదలుకాగానే అరుపులు కేకలతో పిల్లలు ఒకటే అల్లరి .. బాగా enjoy చేసారు అందరూ .. వాళ్ళ performance కే బహుమతి వచ్చింది అదొక అదనపు ఆనందం..Cultural Program అయ్యాక సభ మొదలు పెట్టారు.. Last year మార్కులు తెచ్చుకున్నవాళ్ళకు Gold medals ఇస్తూ Parents పిలిచి వారిని కూడా అభినందించారు... తరువాత ఆరోజు చేసిన Cultural Programme కి 1st Prize వచ్చిన డాన్స్ Team Captain ప్రవల్లికను పిలుస్తూ వారి తల్లిదండ్రులను స్టేజ్ పైకి పిలిచారు సంగీత పైకి వెళ్ళింది బహుమతి ఇస్తూ మీ నాన్నగారు రాలేదా అని అనడిగారు చీఫ్ గెస్ట్.. "లేదండి ఆయన జాబ్ వేరే ఊళ్ళో ,అందుకే కాలేకపోయారు అన్నది సంగీత . Programme అంతా అయిన తరువాత ఇంటికి బయలు దేరారు.. సడన్ గా ప్రవల్లిక కామ్ అయిపోయింది ఎందుకో చూచాయగా తెలిసినా సంగీత మాట్లాడలేదు .. ఇంటికొచ్చాక కూడా కామ్ గా ఉంది . బాధా, కోపమా సంగీతకు అర్థం కాలేదు అలా అని తనూ అడగలేదు .. చెప్పనీ చూద్దాం అని ఊరుకుంది.. కానీ ప్రవల్లిక తనే సద్దుకుంది.. చాలా రోజులయ్యింది కదా అని ఆ రోజు లలితా వాళ్ళ ఇంటికి వెళ్ళింది ప్రవల్లిక చదువు కాలేజ్ డే గురించి అన్నీ చెప్పింది. అవీ ఇవీ మాట్లాడుతుంటే .... లలితే సతీష్ గురించి చెప్పింది " చాలా చిక్కిపోయాడు, వంటచేసుకోలేక ఒక లెక్చరర్ని PG గా పెట్టు కున్నాడు, ఇద్దరూ కలిసి వండుకుని తింటున్నారట .అమ్మ పోయిన కొత్త లో వారానికి రెండు సార్లు వచ్చాడు. ఇప్పుడు నెలలో ఒకాసారి వస్తున్నాడు. మనసులో ఏముందో ఎవరికీ చెప్పడు. ఏం మారలేదు ,ఏమన్నా నేనింతే అంటాడు తనదొకటే బెంగ అంతే " అన్నది లలిత ఆయనకా జీవితం నచ్చినప్పుడు , అలా ఉండాలని ఉన్నప్పుడు మనమేం చేస్తాం" అన్నది సంగీత "అంతేలే.." కాసేపయ్యాక "సరే వదినా ! వెళ్ళొస్తాను అని బయలుదేరింది.. సశేషం బాంధవ్యం ... 47 చంద్రహాస్ అచ్చట్లు ,ముచ్చట్లు ముద్దు ముద్దు మాటలు , అందరిలో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి అందరూ ఆనందంగా ఆరోగ్యకరమైన వాతావరణంలో చక్కగా తమ తమ పనులు చేసుకుంటున్నారు.. చిన్నప్పటినుండి తక్కువ మాట్లాడుతూ ఎక్కువ గమనించే ప్రవల్లిక తమ ఇంట్లో నలుగురి ఆడవాళ్ళ వ్యక్తిత్వాలను పుణికి పుచ్చుకుంది .. లక్ష్మి వచ్చాక ప్రవల్లికలో చాలా మార్పు వచ్చింది .. మావయ్యను , అత్తను చూసాక భార్యాభర్తలంటే ఇలా ఉంటారని తెలిసింది .. బాబును అందరూ ముద్దు చేయడం చూసాక తానేం కోల్పోయిందో తెలుసుకుంది.. తనకోసం అమ్మ చేసిన త్యాగం తెలిసింది . అమ్మమ్మ వాళ్ళు లేకపోతే మేమెలా ? అన్న ఆలోచనకే వణికి పోయేది .. అసలు ఎక్కడా ఎవరూ అమ్మగురించి చెడుగా అనుకోవడం తెలీదు... అంత మంచి అమ్మ నాకు ఉండడం నా అద్రుష్టం కదూ అని చాలా సార్లు అనుకునేది... "అమ్మకోసం ఏమైనా చేస్తాను నాకు ఉద్యోగం దొరికాక అమ్మను ఉద్యోగం మానిపించి తనే చూసుకోవాలి .." ఇలా సాగేవి తన ఆలోచనలు పాపం పిచ్చిపిల్ల పైకి కనబడేది కాదు,ఎక్కడా తొణికేది కాదు ...కానీ మనసులో బోలెడు ఆలోచనలు పెట్టుకుంది.. ఎప్పుడూ ఎక్కడా ఎవరితో అనలేదు .. చివరకు అమ్మతో కూడా తన మనసులో మాట చెప్పలేదు చాలా గంభీరంగా ఉండేది... ప్రవల్లికను తెలుసు కోవడం సంగీతకు కూడా సాధ్య పడలేదు..అలా అని తల్లికి వ్యతిరేకంగా తల్లిని కాదని ఏపనీ చేసింది లేదు అందంతో పాటు అందమైన వ్యక్తిత్వం ఆ అమ్మాయి సొంతం .... చదువులో సరస్వతి , తన పనేదో తానుగా ఉండే ప్రవల్లిక అంటే కాలేజీలో స్నేహితులకే కాక, అధ్యాపకులకు, ఇటు బంధువుల్లో కూడా అందరికీ ఇష్టమే .. అలాంటి పిల్ల ఇప్పుడు నాలుగో సంవత్సరం లోకి అడుగు పెట్టింది.. ఇంతకు ముందులాగా ప్రతి రోజూ కాలేజి కి వెళ్ళాల్సిన అవసరం లేదు, అందుకని బాబుతో ఆడుకోవడం ఎక్కువయ్యింది.. " అమ్మమ్మ కాస్త మెత్తనయినా , బామ్మది Strong Personality " అని బామ్మ మాటల ద్వారా తెలుసుకోగలుగుతున్నది.. "పరిస్థితులను ఎదురుకోవడానికి ఆత్మ విశ్వాసం ఉంటే చాలు చదువుతో సంబంధం లేదు " అని అర్థం చేసుకుంది .. అత్తలాగా అందరినీ ప్రేమించగలిగితే అందరూ Happy గా ఉండొచ్చుకదా.. అని అనుకుంది.. అలా ఆఇద్దరూ ప్రవల్లికను చాలా ప్రభావితం చేసారు.. నిజమే పిల్లలు ఎప్పుడు ఎవరి దగ్గర ఏం నేర్చుకుంటారో, పెద్దల మాటల ప్రభావం వారి మీద ఎలా ఉంటుందో చెప్పలేం . ఇంత మంది మంచి వారి మధ్య పెరగడం ప్రవల్లిక అద్రుష్టం.. ఆరోజు ఆఫీస్ లో చాలా పనుందని లేట్ గా వస్తానని చెప్పి వెళ్ళింది సంగీత. ..పనిలో పడి తినడం కూడా మరిచి పోయింది. 4గంటలకు ప్రవల్లిక కాలేజీ నుండి Phone చేసింది " Camps కి వచ్చిన Company interview లో 3 రౌండ్లలో Select అయ్యాను ఇంకో రౌండుందమ్మా లేటవుతుంది నువ్వు వస్తావా? అనడిగింది .. "సరే బయలు దేరుతున్నాను " అని ఫోన్ పెట్టేసి ఆఫీస్ లో పర్మిషన్ తీసుకుని బయలు దేరింది... మెహిదీ పట్నం చేరుకుని అక్కడ హోటలో వడలు పాక్ చేయించుకుని రెండు ఆపిల్స్ కొనుక్కుని బయలుదేరింది.. కాలేజి అంతా నిర్మానుష్యం గా ఉంది సెక్యూరిటీ నడిగితే మెయిన్ బిల్డింగ్ లో అని చెప్పాడు .. వెళ్ళేసరికి పిల్లలున్నారు ప్రవల్లిక కనబడలేదు. ముందుకెళితే పక్కనున్న రూమ్ లోంచి బయటకొచ్చింది మొహం నీరసంగా అలసటగా కనిపించింది.. "ఏమయింది నాన్నా!" అనడిగింది .. "నా పేరు పిలవలేదమ్మ నేను final round లో సెలెక్ట్ కాలేదు.. పద వెళదాం " అంది "అలాగే వెళదాంలే ! నీరసంగా ఉన్నావు ముందు టిఫిన్ తిను, తిన్న తరువాత వెళదాం " అంది .. "వద్దమ్మా ! అంటున్నా వినకుండా పార్శిల్ విప్పింది ఆకలి మీద ఉందేమో గబ గబ తినేసింది.. బాటల్ లో నీళ్ళు లేవు.. "నేను తేనా ?" అన్న తల్లితో " నీకు తెలీదు కాస్త దూరం వెళ్ళాలి నేను తెచ్చుకుంటా" అని వెళ్ళింది.. ప్రవల్లిక వెళ్ళాక సంగీత మెల్లిగా పరిసరాలు పరికించి చూసింది నలుగురు అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే ఉన్నారు. వారంతా ప్రవల్లిక బ్రాంచ్ వారు.. వారు సెలెక్టయ్యిన వాళ్ళనుకుంటాను పిల్లల కళ్ళల్లో ఆ ఆనందం స్పష్టంగా కనబడుతోంది.. ఇంతలో లోపలినుండి కాలేజ్ HR వచ్చారు .. " OK Girls 5 గురు ఉన్నారు కదా! వాళ్ళు ఒక్కొక్కరిని పిలుస్తారు వెళ్ళండి అందరికీ ఆఫర్ లెటర్ ఇస్తారు" అని చెప్పారు.. 5 గురు లేరు ఇందాకటి నుండి నలుగురే కనపడుతున్నారు మరింకో అమ్మాయి ఎవరో అనుకుంటున్న సంగీత "where is ప్రవల్లిక?" అన్నమాటతో ఉలిక్కిపడింది.. "HR దగ్గర కెళ్ళి ప్రవల్లిక సెలెక్టెడా Sir " అనడిగింది "అవునండీ తన పేరు 1St announce చేసాం కదా! " అన్నారు.. ఇంతలో ప్రవల్లిక రానే వచ్చింది .. తన పేరు పిలవగానే లోపలి కెళ్ళింది. ఒక పది హేను నిముషాల తరువాత చేతిలో ఆఫర్ లెటర్ తో సంతోషంగా వచ్చింది .. సంగీతను గట్టిగా పట్టుకుని "selected అమ్మా అంది "..." అవును నాన్నా! చూసావా ఇంటికి వెళితే ఏం మిస్సయ్యే దానివో.... అయినా నీ పేరు అనౌన్స్ చేసినప్పుడు ఎక్కడున్నావు? .." "ఇక్కడే ఉన్నానమ్మా! మరి ఎలా మిస్ అయ్యానో తెలీదు " అంది .. "Ok అంతా బాగానే జరిగింది కదా ! పద వెళదాం" అని బయలు దేరింది.. ఇంటికొస్తూనే ప్రవల్లిక సంతోషంగా అందరికీ చెప్పింది ఆ రాత్రే సంగీత కూడా ఆడపడుచులిద్దరికీ ఫోన్ చేసి చెప్పింది. .అందరికీ విపరీతమైన ఆనందం కలిగింది.. సంగీతా ! నీ కష్టానికి ఫలితం దక్కింది చాలా సంతోషమమ్మా అందరం ఒక రోజు కలుద్దాం ప్రవల్లికకు మా అభినందనలు చెప్పమ్మ అన్నారు.. లలిత వనిత లిద్దరూ .. సతీష్ ,సంగీతల మధ్య బంధం ఎలా ఉన్నా. ఆడపడుచులు సంగీతను తమ ఇంటి మనిషిగా , చెల్లిగానే చూస్తారు... అందుకే సంగీత ప్రతిదీ వారితో పంచుకోవాలనుకుంటుంది.. అందరి కోరిక మేరకు ఆరాత్రి హరిహర్రావుగారింట్లోనే ఉండి పోయారు సంగీత ప్రవల్లిక.... సశేషంబాంధవ్యం ... 48 పొద్దున లేచినప్పటి నుండీ ఒకటే ఫోన్లు అందరూ అభినందనలతో ముంచెత్తుతున్నారు.. ప్రవల్లికకు కాలేజ్ లేదు, సంగీతను కూడా పోవద్దని గొడవ. .. కానీ సంగీతకు office లో పని చాలా ఉంది వెళ్ళాలి. "ఏం కాదు ? అడిగి చూడమ్మా!" అంది.. "ఆఫీస్ తెరిచాక, మెల్లిగా Phone చేసింది. "సర్ పాపకు Campus Selection లో జాబ్ వచ్చింది" పాపకు కాలేజ్ కి సెలవిచ్చారు నన్నుకూడా ఇంట్లో ఉండమని అంటుంది, మీరు పర్మిషన్ ఇస్తే .".. "అయ్యయ్యో ! నో ప్రాబ్లెమ్, Enjoy, Party Time .. పాపకు నా అభినందనలు చెప్పమ్మా!" అని phone పెట్టేసారు... Hey! అంటూ లక్ష్మీ ప్రవల్లిక అరుపులు.. ఊహించని ఫోన్ హరీష్ నుండి.. "Congratulations బంగారం. బాగున్నావా? చాలా సంతోషం.. పెద్దదాని వయ్యావు ఇక ఇప్పుడు అమ్మను నువ్వు చూసుకోవాలి" అంటూ కాసేపు మాట్లాడి Phone పెట్టేసారు ఇంతలో మోహన్ ఫోన్ చేసారు "Congratulations తల్లీ! " "Thanku మావయ్యా" "ఆ ఇంటికి ఫోన్ చేసాను ఎవరూ తీయక పోతే ఇక్కడికి చేసాను.కాలేజ్ లేదా తల్లీ! " "లేదు మావయ్యా ! నిన్న చాలా లేట్ అయ్యిందని ఈ రోజు సెలవు ఇచ్చారు.." "ఓ!అయితే నేను కాసేపాగి phone చేస్తా" అని పెట్టే సారు.. తరువాత శ్రీధర్ phone చేసాడు .. "హాయ్ తల్లి .. Congratulations.. ఏం చేస్తున్నావు ?" "ఇంట్లోనే ఉన్నాను మావయ్యా! అమ్మ కూడా ఉంది " "OK అయితే పార్టీ టైమ్.. Let us enjoy.." "అమ్మనడుగుతా " "no no నేను మళ్ళీ phone చేస్తానని " పెట్టేసాడు. "అదేంటమ్మా! మావయ్యలిద్దరూ అలా అనేసారు ఒక్కలాగే .." "ఏమో! చూద్దాంలే "అంది కాసేపయ్యాక మోహన్ ఫోన్ చేసాడు.. సంగీతతో మాట్లాడాడు. "అందరం కలిసి Dinner కి Hotel కి వెళదామని Plan వేసాము ఆ విషయమే చెప్పాలని ఫోన్ చేసాను " "నాన్నగారికి ఫోన్ ఇస్తావా అని హరిహర్రావుగారికి కూడా చెప్పాడు సరదాగా ఈ సంతోష సమయంలో ప్రవల్లిక కోసం అందరం కలుద్దాం బాబాయ్ గారు" అంటే , 'ఆయన సరే మీ యిష్టం 'అన్నారు.. సాయంత్రం అందరూ కలిసే వెళ్ళారు . ముందుగానే tables రిజర్వ్ చేయడం వల్ల ఎదురు చూసే పని లేకపోయింది.. "MS చదవనన్నావు కానీ లేకపోతే నీకు సీట్ వచ్చేదే"అన్నాడు శ్రీధర్... నాకు ఇష్టంలేదు మావయ్యా , ఇక్కడే ఉండి అమ్మను చూసుకోవాలని అంతే .. "Ok Good decision" అని అన్నారందరు ఇంతలో US నుండి పిల్లలందరూ ఫోన్ చేసి wish చేసారు.. ప్రవల్లిక Future plans గురించిన సరదా సరదా కబుర్లతో ఆ రాత్రి గడిచింది.. ఇంత సరదా సమయంలో హరీష్ ని పిలవాలని ఉన్నా, జ్యోతి లేకుండా రాడని తెలుసు.. జ్యోతికి వీరితో కలవడం ఇష్టం ఉండదు.. తన స్థానం పదిలపరుచు కోవడానికి తనేంటో చూపించుకోవడానికి ఏదో ఊహించుకుని ఏదో చేసేయాలని అనకుంది కానీ ,తను అనుకున్నది పూర్తిగా తలకిందులైంది. సతీష్ ,సంగీత విడిపోవడం జ్యోతి అసలు ఊహించలేదు.. అందుకే ఇప్పుడు వారి మీద ఎటువంటి ఆసక్తీ లేదు.. కానీ ప్రవల్లిక తమ ఇంటిపిల్ల ,మంచి పిల్ల ,పిల్ల మనసుకు ఎటువంటి బాధ కలుగ కూడదు. అది తన చదువును, భవిష్యత్తు పాడుచేసు కోకూడదని అందరూ సంగీతకు ప్రవల్లికకు దగ్గరయ్యారు. దాంతో జ్యోతి వారిని కూడా కలవడం మానేసింది.. కలసి ఉండడంలోని ఆనందాన్ని కోల్పోతూ వేరే వాటి మీద ఆసక్తిని పెంచుకుంది... ప్రవల్లిక ఇప్పుడు పూర్తిగా చదువు మీద ద్రుష్టి పెట్టింది. పరీక్షల కోసం మిగిలిన మూడు నెలలు శ్రద్ధ పెట్టి చదివింది . distinction లే పాసయ్యింది .. రిజల్ట్స్ వచ్చిన నాలుగు రోజులకు కాలేజికి వెళ్ళింది. స్నేహితులను చూడగానే చెప్పలేని ఆనందం, మళ్ళీ కాసేపు అల్లరి. ఆఫీస్ వాళ్ళు పిలవగానే పిల్లలంతా లోపలికి వెళ్ళారు.. అందరికీ మెమోలు ఇస్తూ ప్రవల్లికా ! నీకు రెండు గోల్డ్ మెడల్స్ అనౌన్స్ చేసారు... నీ అడ్రస్ ఛేంజ్ అవుతే చెప్పాలి ఎందుకంటే annual day function కి invitation వస్తుంది అని చెప్పారు.. చాలా కాజ్యుల్ గా Ok Madam అంది. ఫ్రెండ్సందరూ కాసేపు కబుర్లు చెప్పుకుని ఇంటికి బయలుదేరారు... ఇంటికి వెళ్ళగానే అమ్మ ఉత్తరం ఇచ్చింది.. కంపెనీ నుండి Pan Card, Pass portకి Apply చేసుకోమని అలాగే ICICI Bank లేదా HDFC Bank ఏదైనా ఒక దాంట్లో offer letter చూపించి account Open చేసుకోవాలని చెప్పారు.. వారం రోజులు హర్షతో వెళ్ళిఆ పనులు పూర్తి చేసుకుంది.. అనుకున్న రోజు రానే వచ్చింది October 1St న వచ్చి జాయిన్ అవ్వమన్నారు Hi Tech City Raheja building లో office సంగీత ప్రవల్లికను తీసుకుని బయలుదేరింది formalities పూర్తి చేసుకుని లోపలికి పంపించారు కాసేపే అనుకుంటే సాయంత్రం నాలుగయ్యింది.. అంతవరకూ బయటే చెట్ల కింద కూచున్న సంగీతకు విషయం చెప్పింది. "Transportation form fill up చేయమన్నారు దానికోసం జీతం నుండే cut చేసుకుంటారట. House address చెబితే bus నంబరు ఎక్కడ ఆగేది ఇచ్చారు.." "So ఇవాళ వాళ్ళకు ఆ form ఇస్తే రేపటి నుండి అక్కడ ఆగుతుందని చెప్పారు.. రేపటి నుండి రెగ్యులర్ అని చెప్పారు.." ఇంటి కెళ్ళగానే విషయాలు అందరితో చెప్పింది. ఇంకేం రేపటి నుండి ప్రవల్లిక Soft ware engineer అని కాసేపు సరదాగా నవ్వుకున్నారు.. హరి హర్రావు గారు దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంటూ "బంగారు తల్లి అప్పుడే ఎంత పెద్దదయ్యింది..:" అన్నారు.. "సరి సరి , అప్పుడే నేను 90 ల్లోకి వస్తున్నాను సంబంధాలు చూస్తే దాని పెళ్ళికూడా చూసి పోతాను " అంది బామ్మ .. "పో బామ్మా! పెళ్ళి ఎవరు చేసుకుంటారు. అమ్మను చూసుకోవాలి." "సరేలే అమ్మను చూసుకోవడానికి మేం ఉన్నాం గానీ ఏ ఈడు కా ముచ్చట. పెళ్ళి చేసుకోవాల్సిందే" అంది.. మొదటి జీతం అందుకున్న వెంటనే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అందరితో పాటు అత్తలు మావయ్యలతో సహా అందరికీ బట్టలు కొని ఒక్కొక్కరింటికి వెళ్ళి ఇచ్చి ఆశీర్వాదం తీసుకుని వచ్చారు .. "ఎంత మంచి సంస్కారం నేర్పిస్తున్నావమ్మా ! భగవంతుడి దయవల్ల మంచి భర్త మంచి ఇల్లు దొరకాలి అన్నారు సంగీత తో మోహన్.. "భగవంతుడి ఆశీర్వాదం అన్నయ్యా! మన చేతుల్లో ఏం లేదు..." అంటూ ఇంటికి బయలుదేరారు.. ఆ రోజు ఆదివారం హరిహర్రావుగారింటిలో అందరూ భోంచేసి కూచున్నారు . ప్రవల్లిక బాబును అలా బయటకు తీసుకెళ్ళింది ఇంతలో బామ్మ మాట్లాడడం మొదలు పెట్టారు.. " అమ్మలూ! తరువాత సంగతేంటి" "ఏ విషయం బామ్మా ?" "ప్రవల్లిక గురించే .". ఏముంది! చదువయ్యింది, ఉద్యోగం చేస్తుంది కొన్ని రోజులు చేయనీ.. " "కొన్ని రోజులేంటి రిటైరయ్యైదాకా చేస్తుంది. అది కాదు విషయం , దాని పెళ్ళి గురించి" "తొందరేం ఉంది బామ్మా ! .." "మరదే నేను చెప్పేది . ఎన్ని రోజులిక్కడ ఉంటుంది ఎప్పుడో అప్పుడు పెళ్ళి చేయాల్సిందే కదా.. అదేదో ఇప్పుడెందుకు చేయకూడదు" .. దానికి ఆర్ధిక స్వాతంత్ర్యం వచ్చింది .... అది నా డబ్బు , నా ఇష్టం అనే ఆలోచన, విచ్చలవిడితనం ఎవరికీ రాకూడదు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా పెళ్ళి చేస్తే నాతో పాటు ఇంకొకరున్నారని ఇది వారికోసమని తెలియాలి.. " "అమ్మ ... అమ్మ.. అమ్మకోసం అనే భావన ఆలోచన దాని మనసులో బలంగా ఏర్పడితే దాన్ని తీయడం కష్టం...అంతే కాదు అది దాని భర్త దగ్గర సుఖపడలేదు.. " " నువ్వు ఎవరూ లేని ఒంటరి దానివి కావు? నీకు మేం ఉన్నాం. ఈ ఇంట్లో హర్షతో సమానంగా నీక్కూడా అన్ని హక్కులూ ఉన్నాయి ఆస్తిలో వాటా ఉంది . నీకు భర్తను, దానికి తండ్రిని తీసుకురాలేం కానీ మిమ్మల్ని భద్రంగా చూసుకోగలం.. " "ఇన్నాళ్ళు దేనికోసమైతే కష్టపడ్డావో అది నెరవేరింది, ఇక దాని పెళ్ళికూడా చేస్తే దానికి మంచి జీవితాన్నిచ్చిన దానివవుతావు నాక్కూడా వయసు మీరింది దాని పెళ్ళి చూడటానికేనేమో దేవుడు నాకు ఆయుష్షు ఇచ్చాడు.. పోయే ముందు దాని పెళ్ళిచూస్తే నాక్కూడా నిశ్చింత అన్నది " .. "అదే నాకు భయం బామ్మా మంచిగా సంతోషంగా ఉన్న పిల్లని నరకంలోకి తోయనా?" అని కళ్ళు నీళ్ళు పెట్టుకుంది.. అనూరాధ దగ్గరకు తీసుకుంది ... " అందరి జీవితాలు ఒకేలాగా ఉండవు తల్లీ ఎవరి అద్రుష్టం వాళ్ళది . అప్పుడు నీ విషయంలో మేం వద్దన్నా చేసుకున్నావు . ఇప్పుడలా కాదు, అందరం అన్నీ చూసి , మంచి చెడ్డ తెలుసుకుని ,అందరితో సంప్రదించాకే చేస్తాం " అని హరిహర్రావుగారు భరోసా ఇచ్చారు.. అంతే సంబంధాలు చూడడం మొదలు పెట్టారు .. ప్రవల్లిక జీతం కొంత తనుంచుకుని మిగతాది లోన్ కట్టడం మొదలు పెట్టింది... ఒక రోజు ఇంటికి రాగానే అమ్మమ్మ ఇన్విటేషన్ ఇచ్చింది .. ఏంటా అని చూస్తే కాలేజ్ నుండి వారం రోజుల్లో జరిగే Annual Day function కి రమ్మని .. అదే విషయం అందరితో చెప్పింది సశేషం బాంధవ్యం ... 49 లక్ష్మి రాగానే చెప్పింది " Ooh. Congratulations ప్రవల్లిక మళ్ళీ అందరం రావాలి కదా " .. "అవునత్తా అప్పుడంటే డాన్స్ కానీ ఈ occasion అంటే మీరందరూ ఉండాలి కదా." "అమ్మమ్మ వాళ్ళు ఏమన్నారు, బామ్మ వస్తారా?" "ఇంక అడగలేదత్తా! అడుగుతాను.." "Ok నేను, మావయ్యరెడీ. తాతయ్య అమ్మమ్మ కూడా వస్తారులే Don't Worry." "అత్తా exiting గా ఉంది.". లక్ష్మి నవ్వి దగ్గరకు తీసుకుని ' too emotional ' అంది .. "ఏమో అలా అనిపిస్తుంది" . "ఈ రోజు నా దగ్గరుంటావా పోనీ.. " "వద్దు ,అమ్మదగ్గర పడుకుంటా " అని వెళ్ళింది... ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. ఆఫీస్ కెళితే సమయానికి రాలేనని సెలవు పెట్టింది తల్లితో కూడా సెలవు పెట్టించింది ప్రవల్లిక. అందరూ కలిసి వెళ్ళారు బామ్మ తప్ప వెళ్ళగానే అతిథుల్లా ఆహ్వానించారు .. వారికి కేటాయించిన సీట్లలో కూచోమన్నారు మూడే సీట్లు ఇచ్చారు. అమ్మమ్మ తాతయ్య అమ్మను కూచో పెట్టింది తను వెనకాల మావయ్య వాళ్ళతో కూచుంది .. కల్చరల్ ప్రోగ్రామ్ అయ్యాక సభ మొదలయ్యింది. పది నిముషాల కార్యక్రమం తరువాత బహుమతి కార్యక్రమం మొదలయ్యింది.. ఇద్దరి పేర్ల తరువాత మూడో పేరు ప్రవల్లికది.. సంగీత భయపడుతుంది ఈ సంతోష సమయంలో మొన్నటి లాగా వాళ్ళ నాన్న నడిగితే మళ్ళీ మూడ్ ఆఫ్ చేసుకుంటుందేమోననీ, అందుకే స్టేజ్ మీదకు అమ్మా నాన్నలను పంపించాలి అనుకుంటూ కూచుంది.. కానీ ప్రవల్లికతో పాటు సంగీత సతీష్ ల పేర్లు పిలిచారు. సంగీతకు వెళ్ళక తప్పింది కాదు . ఒకటి కాదు రెండు రెండు మెడల్స్ తీసుకున్న ప్రవల్లికకు అందరూ చప్పట్లతో అభినందనలు తెలిపారు.. నాన్న రాలేదా అని ఎవరూ అడక్క ముందే ఛీఫ్ గెస్ట్ కి మెల్లిగా తల్లిని పరిచయం చేస్తూ చెప్పింది ప్రవల్లిక.. " నేను సింగిల్ పేరంట్ Daughter ని ,అమ్మ నన్ను పెంచింది, చదివించింది So మెడల్స్ అమ్మవి" అని తీయబోయింది .. "తప్పు అది నువ్వు సంపాదించుకున్నవి తీయకు" అంటున్న సంగీతను ఆవిడ పలకరిస్తూ "Great అండి మీరు, మీ అమ్మాయి నిజాన్ని నిర్భయంగా చెప్పేలా పెంచారు Hats off to you both.."అన్నారు కిందకు వచ్చిన కాసేపటికి ఇంటికి బయలుదేరారు తెల్లవారి అనూరాధ పనయ్యాక బామ్మ దగ్గరకొచ్చింది. "ఏంటమ్మాయ్ బాబు పడుకున్నాడా?" అనడిగింది ఈ ఒక్క సంవత్సరం చూస్తే చాలేమో! వచ్చే సంవత్సరం నుండి స్కూల్ కెళతాడు పిచ్చి వెధవ" అంది .. "పడుకున్నాడత్తయ్యా ! మీకో విషయం చెబుదామని వచ్చాను.." "ఏంటి " "నిన్న కాలేజ్ లో మాపక్కన ప్రవల్లిక వాళ్ళ friend వాళ్ళ అమ్మానాన్న కూచున్నారు ఆ అమ్మాయికి కూడా Gold medal వచ్చింది . నిన్న నాతో మాట్లాడుతూ మనమ్మాయిని చూసి అంటూ తమ మధ్య జరిగిన సంభాషణ చెప్పింది. 'మంచి పిల్లండి తెలివైన పిల్ల రెండు మెడల్స్ రావడం చాలా గొప్ప..' "మాఅమ్మాయెప్పుడూ మీ మనవరాలి గురించి చెబుతూనే ఉంటుంది. అంది "ఓ అలాగా !"అన్నాను "మేనరికం ఏమైనా ఉందా లేక బయట సంబంధాలు చూస్తున్నారు? " "ఇంకా ఏం అనుకోలేదండి ,మేనరికం ఉన్నా పెద్ద వాళ్ళు లెండి.." "అవునా మా అమ్మాయికి మేనరికం ఉంది లెండి. ఒక 6 నెలలు ఉద్యోగం చేసాక పెళ్ళి చేసి పంపిస్తాం." అన్నది సౌమ్య వాళ్ళమ్మ రాధిక.. "అవునా?." "అవునండి అబ్బాయి US లో ఉన్నాడు మా చిన్నాడబడుచు కొడుకు.." "మీరెప్పుడు చేస్తారు.." "మాకూ చేయాలనే ఉద్దేశ్యం ఉంది కానీ ఇంకా ఏం అనుకోలేదు" అంది అనూరాధ.. "అలాకాదు కానీ ఒక విషయం చెపుతాను. అందుకే అడిగాను" అంటూ.. ... "మా ఆడపడుచు తోటి కోడలు కొడుకున్నాడు తను కూడా US లోనే , కాకపోతే Soft ware కాదు Mechanical.. మీకు అభ్యంతరం లేకపోతే పోతే చూడండి.. మాఫోన్ నంబర్ ఇది "అని చెప్పారు . "సరే ముందు మీతో చెప్పి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందామని.." "అదేంటమ్మాయ్ నాలుగేళ్ళు కలిసి చదివిన పిల్ల ఒకే ఇంటి కెళ్ళి తోడి కోడళ్ళవుతే బాగానే ఉంటుంది కదూ ! రానీ సంగీతని ఒక మాటడిగి ఫోన్ చేద్దాం " అంది.. బామ్మ. హరిహర్రావుగారు , సంగీత వచ్చాక విషయం చెప్పారు ... "నాన్నా ! ముందు వాళ్ళ నాన్న సంగతి చెప్పండి ఒప్పుకుంటేనే తరువాతవి ఆలోచిద్దాం.." "అలాగే !"అంటూ ఫోన్ కలిపారు.. ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు.. "నేను ప్రవల్లికా వాళ్ళ తాతయ్యను. అంటుండగానే ... "నమస్కారమండి !నేను సౌమ్య వాళ్ళ అమ్మను .. మా వారు రాలేదింకా ..నేను మాట్లాడొచ్చా?.." "ఫరవాలేదు మాట్లాడండి.." "అదే మీరు OK అంటే డిటెయిల్స్ పంపిస్తాను అలాగే మీవి కూడా పంపిస్తే చూపిస్తాను " అంది "ముందు మీకొక విషయం చెప్పాలి.. ప్రవల్లిక వాళ్ళ నాన్నగారూ "అంటూ చెప్పబోతుంటే. " నాకు తెలుసండి మా అమ్మాయి చెబుతుంటుంది అవన్నీ మేమాలోచించం , మాకు పట్టింపులేదు మా ఆడపడుచు కూడా అదే చెప్పారు ఆమాటన్నాకే నేను మీకు చెప్పాను .." "క్లాస్ లో అందరికీ మీ మనవరాలంటే చాలా ఇష్టమట, అందరు మెచ్చిన పిల్ల , చదువులో సరస్వతి కటాక్షం ఉంది ,ముఖ్యంగా ఇద్దరు స్నేహితులు ఒకే కంపెనీలో ఉద్యోగం ఒకేఇంటి కోడళ్ళవుతే ఇంకా బాగుంటుంది కదా... మీరు ఆలోచించుకోండి .. ఈ లోపు నేను డిటెయిల్స్ పంపుతాను.. " అన్నది రాధిక.. సాయంత్రం సంగీత వాళ్ళు అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు.. "అప్పుడేనా అత్తయ్యా !" అంది లక్ష్మీ.. "లేదమ్మా !వాళ్ళు వాళ్ళమ్మాయికి కూడా ఇప్పుడే చేయటంలేదు 6 నెలల తరవాతే ..... ముహుర్తం కుదరాలి , పిల్లలు రావాలి. ఇదంతా జరగడానికి ఒక సంవత్సరం పడుతుంది లే" అన్నది అనూరాధ... "సరే చూద్దాం జాతకాలు కూడా కుదరాలి అమ్మాయి నచ్చాలిగా "అన్న సంగీతతో "ముందు ప్రవల్లికను కూడా ఒకసారి అడగండి" అన్న హరిహర్రావుగారితో "నేనే ఎందుకు మీరంతా ఉన్నారు కదా! మీరే అడగండి "...అంది సంగీత రాత్రి భోజనాలయ్యాక ప్రవల్లికను కూచో పెట్టి సౌమ్య గురించి మాట్లాడ కుండా విషయం చెప్పారు.. "నాకిప్పుడే వద్దమ్మా ! కొన్నాళ్ళు ఇలా ఉండనీయండి " అన్నది . హరిహర్రావుగారుండి "కొన్నాళ్ళంటే ఎన్నాళ్ళు తల్లీ! అన్నీ కుదిరి అనుకునే లోగా 1 Year అవుతుంది.. కాక పోతే ఇంటి కొచ్చిన సంబంధం మొదటిదే వద్దంటే ఎలా.. నువ్వు OKచేస్తే జాతకాలు చూస్తాం.. ముఖ్యమైన విషయం ఏంటి అంటే అబ్బాయి మెకానికల్ , అదినీకు సమ్మతమైతే ముందు కెళతాం. కాదు Soft ware వాళ్ళే కావాలంటే వేరే చూద్దాం.. " "నా ప్రాబ్లెమ్ అది కాదు తాతయ్యా! నాకు అమ్మ గురించే బాధ అమ్మ బాధ్యత నాదే అని వాళ్ళకు చెప్పండి. నాకున్నది సింగిల్ పేరంట్ అన్న విషయం కూడా ఖచ్చితంగా చెప్పండి..అప్పుడు వాళ్ళు ఒప్పు కుంటే చూద్దాం" అంది.. "పిచ్చి మొహమా !వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్ళి చేయమన్నారు.. పెళ్ళికి ముందు అన్నీ OK అని తరవాత చేయనివ్వని వాళ్ళెంతమంది లేరు తనా, మనా అని మనసులో నుండి రావాలి.. బాధ్యత తెలియాలి కానీ మనం చెబితే ఎవరూ వినరు ... అయినా మీఅమ్మను చూసుకునే బాధ్యత మాదని చాలా సార్లు చెప్పానుగా .". "అయినా సరే బామ్మా !వారికి ఒక మాట చెప్పాలి.". అన్న ప్రవల్లికతో పిచ్చిపిల్లా! ప్రతి మగవాడికి 5 గురు తల్లులు 5 గురు తండ్రలు ఉంటారు...... కన్న తల్లి, ,పిల్లనుఇచ్చి కన్యాదానం చేసిన తల్లి అత్తగారు ,మేనత్త, చిన్నమ్మ ,గురుపత్ని...... అలాగే తండ్రి పినతండ్రి ,మావగారు, మేనమామ, గురువు ఎట్టి పరిస్థితి లోనయినా వీరికి సంతానం లేకపోతే వీరందరిని చూసే బాధ్యత ఆ మగవాడిదే.." "అందుకే నువ్వు దిగులుపడకు ,చూసారా సరి లేక పోతే మేంఉన్నాం కదా ... కాన ఆ విషయం చెప్పడం అనవసరం .". "ఇక మీ నాన్న సంగతి మనం చెప్పక ముందే వాళ్ళకు తెలుసు , చల్లకొచ్చి ముంత దాచడం ఎందుగ్గానీ దానికి విషయం చెప్పండర్రా" అన్నది బామ్మ.. అనూరాధే చెప్పడం మొదలు పెట్టింది "మొన్న మీ కాలేజ్ ఫంక్షన్ లో సౌమ్య వాళ్ళ అమ్మ చెప్పారు.. ఈ సంబంధం గురించి అంటూ ఆరోజు వాళ్ళు మాట్లాడు కున్నదంతా చెప్పింది.. సౌమ్య కాబోయే మొగుడికి కజిన్ అన్న మాట ,నువ్వు OK అంటే మాట్లాడుదాం అని చెప్పింది సంగీత. "సరే అయితే సౌమ్యతో మాట్లాడాక చెబుతా.." " కానీ ! నీఇష్టం అమ్మ విషయం తప్ప అబ్బాయి గురించయితే మాట్లాడుకో "అన్న బామ్మతో సరే అంది .. తెల్లవారి కాంటీన్ లో కూచుని లంచ్ చేస్తూ అడుగు దామనుకుంది కానీ సౌమ్యకు తెలుసో లేదో అని ఊరుకుంది..ప్రవల్లికనే గమనిస్తున్న సౌమ్య తన తటపటాయింపు చూసి ర "ఏంటీ ఏదైనా అడగాలనుకుంటున్నావా?" అంది.. "మీ అమ్మ గారు నీకేదైనా చెప్పారా.... అదే ఆంటీ అమ్మమ్మ మాట్లాడుకున్న విషయం తెలుసా.. ఆ మాటకు నవ్వింది సౌమ్య " మా అత్తవచ్చి సంబంధాల గురించి చెబుతుంటే నేనే అమ్మకి నీ గురించి చెప్పా.. " "కాకపోతే నువ్వు నీముఖం గుర్తు రావడం లేదంది.. సరే కాలేజి ఫంక్షన్ లో చూపిస్తానన్నాను .. చూసారు. అమ్మా నాన్నాకు నచ్చావు. అదీ సంగతి... " "నాకెందుకు చెప్పలేదు మరి.." "పెద్దవాళ్ళు మాట్లాడితే బెటర్ కదా! మధ్య లో మనం ఎందుకు అని ఊరుకున్నా .." "కాకపోతే బావ లాగా సాఫ్ట్ వేర్ కాదు కానీ మంచి జాబ్ అని బావ చెప్పాడు. నీకు OK అయితే డీటెయిల్స్ అడుగుతా.. Photo కూడా పంపించమంటాను . సరేనా.." "నాకు జాబ్ ,అందం అవన్నీ ముఖ్యం కాదు అమ్మను ప్రేమగా చూసుకుంటే చాలు.. నా పెళ్ళి నన్నూ అమ్మను వేరు చేయొద్దు , అదే నా బాధ .." "అది మాఇంట్లో చెబుతుంటే ఎవరికీ అర్థం కాదు.. నేనింకా చిన్నపిల్లననే అనుకుంటారు . అఫ్ కోర్స్ కాదనను కానీ బామ్మేమో నేను తొందరగా పెళ్ళి చేసుకుని సెటిల్ అవ్వాలంటుంది.. పెళ్ళి అవుతేనే సెటిల్ అయినట్టా ..నాకు తెలిసి పెళ్ళితోనే అమ్మ స్ట్రగులయ్యింది ." "నేను చిన్న పిల్లనయినా రాత్రి పూట అమ్మ ఏడవడం నాకు తెలుసు.. ఎవ్వరితో ఏమీ చెప్పేది కాదు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అందరూ మాకు మోరల్ సపోర్టుగా ఉంటారు కాబట్టి సరిపోయింది" "అత్తయితే నాకు మంచి friend ఇవన్నీ తనతో చెబితే..అందరికీ life ఒకలాగా ఉండదు కదా పెద్ద వాళ్ళు మన మంచి కోసమే ఆలోచిస్తారంటుంది.." సౌమ్య ప్రవల్లిక చేయిపట్టుకుని " నేను బావనడుగుతాను అతనెలాంటి వాడో నీకున్నభయాలు అనుమానాలన్నీ కూడా చెపుతాను.. Positive గా respond అవుతే OK లేదంటే చూద్దాం.నేను నీకు సపోర్టు గా ఉంటాను..ముందు OK చెప్పు .. జాతకాలు చూడాలి కలవాలి కదా వీటన్నిటికీ టైమ్ పడుతుంది ..ఈ లోపు బావను అడుగుతాను.. ఫోటో కూడా పంపించమంటాను. " "అవన్నీ ఏం వద్దు, అందరితో పాటే నేను కూడా చూస్తాను Just friendly గా ఎలాంటి వాడని తెలిస్తే చాలు.. కొత్త వారైతే ఏం చేయలేను కానీ నువ్వు కాబట్టి తెలుసుకుందామని అంతే " అంది.. "Ok OK అంత ఫీల్ అవ్వకు పద "అంది సౌమ్య.. ఇంటికొచ్చిన ప్రవల్లికనే చూస్తున్నది సంగీత తన మనసును చదవడానికి ప్రయత్నిస్తున్నది కానీ ఏం అడగ లేదు.. Fresh అయ్యాక ప్రవల్లికే సంగీతతో చెప్పింది "నీఇష్టం అమ్మా మీకిష్టమయితే నాకూ ఇష్టమే అని.. " ప్రవల్లికను దగ్గరకు తీసుకుని ముద్దుపెట్టుకుంది ఎందుకో అప్రయత్నంగా ఇద్దరి కళ్ళు చెమర్చాయి.. అలాగే కాసేపు ఉండి పోయారు.. మెల్లిగా ప్రవల్లికే "పద ఆయింటికి అమ్మమ్మా వాళ్ళకు చెబుదాం " అంది .. వెళ్ళగానే సంగీత అమ్మా నాన్నకు ఒప్పుకుంది అన్నట్టుగా సైగ చేసింది... ప్రవల్లిక డైరెక్ట్ గా బామ్మ దగ్గరికెళ్ళింది . "సరే అలాగే కానీ, నాకు పెళ్ళి చేసి దూరంగా పంపించి మా అమ్మను నీ దగ్గర ఉంచుకుంటానంటే నీ ఇష్టం నేనెందుకు కాదనాలి అంది.." "ఓసి భడవా !ఎన్ని మాటలు నేర్చుకున్నావే ". చూసావా అమ్మలు పెళ్ళి అనగానే ఎన్ని మాటలొచ్చాయో .. అంతేలే మన కళ్ళ ముందున్నట్టే ఉంటారు గబుక్కున పెద్ద వాళ్ళయి పోతారు" అంటూ ముని మనవరాలిని దగ్గరకు తీసుకుని అక్కున చేర్చుకుంది... సశేషం..బాంధవ్యం ... 50 అందరూ హమ్మయ్య అని అనుకుంటున్న తరుణంలో .. "నాకిష్టం లేదు " అన్నాడు హర్ష.. అందరూ ఆశ్చర్యంగా చూశారతని వైపు.. "ఏంటి నీకు ఇష్టం లేదు. దాని పెళ్ళా లేక సంబంధమా ?" అనడిగిన తండ్రితో ' రెండూ ' అన్నాడు ""అదేంటి..." అనూరాధ "దాని పెళ్ళికి ఇప్పుడేం తొందరొచ్చింది. కాస్త ఉద్యోగం లో నిలదొక్కున్న తరువాత చేసుకుంటుంది..అయినా మన కళ్ళ ముందర ఉంచుకోకుండా అంత దూరం అవసరమా? అక్క కూడా లేట్ గానే చేసుకుంది కదా.. " "అక్కకు దీనికీ పోలికేవిట్రా ... ఎవరికైనా కల్యాణ ఘడియలొస్తాయి ఆ సమయంలో చేయాలి.. అయినా వాళ్ళంతట వాళ్ళు అడిగారు మనం చూడటం మొదలు పెట్ట లేదుగా.. " అయినా , సంబంధాలంటే వీధులవెంట తిరగడం కాదు. ఇలాగే తెలిసిన వాళ్ళ ద్వారానే వస్తాయి .. చూడడంలో తప్పులేదుగా , చూడగానే అన్నీ కుదరొద్దా .. దాన్ని ఒప్పించడం అయ్యింది మళ్ళీ నువ్వు మొదలు పెట్టావా.. అన్నది అనూరాధ.. "చెప్పనీ వాడిని " అంది బామ్మ.. "ఇంకో రెండేళ్ళ దాకా వద్దు.". "సరే! అలాగే రెండేళ్ళ తరువాతయినా చేయాలి కదా? ఈ రెండేళ్ళు ఏం చేయిద్దామని". "ఏముంది మనింట్లో ఉంటుంది సరదాగా దానికి నచ్చినట్టు .." అంటున్న హర్షతో "అది అవసరమా! అన్నీ కుదిరి పెళ్ళి అయ్యేసరికి ఏడాది పడుతుంది . నువ్వనుకున్నదానికి ఇంకా ఒక్క సంవత్సరమేగా ముందు చేస్తున్నది... పెళ్ళి చేసుకోకా తప్పదు, పిల్లల్ని కనకా తప్పదన్నప్పుడు ఏ వయసుకా ముచ్చట జరిగి తీరాలి ..." "అప్పుడే జీవితం ఒక గాడిన పడి 50 ఏళ్ళు వచ్చే సరికి జీవితంలో స్థిరపడి చేతికందిన పిల్లలతో సుఖపడతారు. తెలిసిందా!ఇంక అంతే.." అని ఖచ్చితంగా చెప్పింది బామ్మ. .. "సరే అయితే! కానీ నాకు దాన్ని అమెరికాకు పంపించడం ఇష్టం లేదు.". అన్నాడు "నాకిష్టమే ".... అందరూ ఆశ్చర్యం గా చూశారు.. అన్నది సంగీత.... "మనం ఏం అనుకోలేదుగా అమెరికా పంపించాలని. సంబంధం వచ్చింది.. నాకు నచ్చింది...అది అక్కడ ఉంటేనే బాగుంటుందని అనుకున్నాను ". అన్నది ... "అదే ఎందుకు మనకు అంత దూరంగా".. అన్నాడు హర్ష .. "మనకు కాదు నాకు".. అని ఖచ్చింతంగా అంది " అదేంటక్కా...". మిగతా వారు కూడా ఆశ్చర్యంగా చూశారు.. ప్రవల్లిక తల్లి దగ్గరకొచ్చి కూచుంది.. సంగీత ప్రవల్లిక భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుంది. "దీని మనసు నా మనసంత గట్టిదో , కాదో తెలీదు కానీ దీని జీవితం ప్రశ్నలతో మొదలవ కూడదు.. వాళ్ళిద్దరూ నాకలా దూరంగా ఉంటే వారి మధ్య నా ప్రసక్తి మాటి మాటికి రాదు, ఒకరినొకరు అర్థం చేసుకుని దగ్గరవుతారు.. " "Intial stage లో ఏర్పడిన ప్రేమ కలకాలం ఉంటుంది.. ఎవరు తప్పుచేసినా ప్రతి వారూ ఆడవారినే అంటారు. అత్తింట్లో , పుట్టింట్లో అందరూ నన్ను అర్థం చేసుకున్నారు కాబట్టి ఈరోజు మేమిలా ఉన్నాం " " కానీ , వాళ్ళు చిన్నపిల్లలు అత్తింటివారు ఏమనక పోయినా వారి బంధువులు ఎప్పుడైనా ఏదైనా అంటే అది తట్టుకోగలదా ?.." "వీళ్ళు ఇక్కడుంటే పండగ, పబ్బం అంటూ పిలవాలి , ఇంటికొస్తే కనిపించేది నేనే అబ్బాయికి తోడు ఇంట్లో ఎవరూ ఉండరు . ఎప్పుడైనా మనసులో ఏ ఆలోచన వచ్చినా ముందు నాకు బాధగా ఉంటుంది .. కీడెంచి మేలెంచాలి.. అందుకే దీనికి కూడా అన్నీ తెలియాలని చెప్పాలని అనుకున్నాను.అదీ దాన్ని ఒక్కదాన్నీ కూచోబెట్టి " .. "కానీ, హర్ష పుణ్యమా అని నా మనసులోది మీ అందరికీ చెప్పే అవకాశం వచ్చింది .. At least Hyderabad లో కాకుండా ఉంటే బాగుండును అనుకున్నాను... భగవంతుడు నా మొరాలకించాడు.." అంటూ "ప్రవల్లిక తల నిమురుతూ " ప్రతి ఆడపిల్లకు ఎన్ని రోజులున్నా ఇది తప్పదమ్మా ! ఎక్కువ రోజులున్న కొద్దీ పుట్టింటి మీద attachment పెరుగుతుంది. అదే అక్కడుంటే భర్త మీద ప్రేమ పెరుగుతుంది ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు...అక్కడికెళ్ళాక నువ్వు పనిలో పడతావు .." "సౌమ్య ఉంది, బావలు , వదినలున్నారు అందరితో సరదాగా ఉండు.. నీ భర్త తో కొత్త జీవితం ప్రారంభించు.. భవిష్యత్తులోకి ఆనందంగా అడుగు పెట్టు " అని ఇంకా ఏదో అనబోతున్న సంగీత దగ్గరకు అందరూ వచ్చారు . సంగీత చేయిపట్టుకుని అనూరాధ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది .. "Sorry అక్కా! " అన్నాడు .. లక్ష్మి సంగీత భుజం మీద చేయి వేసి "వదినా ! మీరు చాలా ధైర్య వంతులు ప్లీజ్" అంది " ఎంత ధైర్యం ఉన్నా పిల్లల దగ్గరకు వచ్చే సరికి అందరూ బేలగా మారతారు లక్ష్మీ " అంది " తల్లీ ! ఇటురా అంటూ హరిహర్రావుగారు పిలిచారు కానీ సంగీత లేచే పరిస్థితి లో లేదు.. ఆయనే దగ్గర కొచ్చారు.. తండ్రి ఒళ్ళో తల పెట్టుకుని ఏడ్చింది.. బామ్మ ప్రవల్లికను దగ్గరకు తీసుకుంది . ప్రవల్లిక కళ్ళ వెంట కూడా కన్నీళ్ళు ధారపాతంగా కారిపోతున్నాయి.. సంతోషంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.. ఎవరూ ఎవరిని ఓదార్చుకునే ప్రయత్నం చేయలేదు.. ఇన్నాళ్ళు కడుపులో దాచుకున్న దుఖం, భయం, ఆందోళన అన్నీ బయటకు వచ్చాయి సంగీతకు ప్రవల్లికను కూచో పెట్టి చెప్పాలనుకుంది కానీ ఇది కూడా మంచికే అయ్యింది . ప్రవల్లికను ఓదార్చే వారింత మంది ఉన్నారు.. అనుకుంది ఇంతలో లక్ష్మి లోపలికెళ్ళి అందరికీ Sweets తెచ్చింది .. అందరికిస్తూ " ఇక మీదట ప్రతి రోజూ ఆనందంగా ఉంటూ ప్రవల్లికకు తీపి జ్ఞాపకంగా మార్చాలి." "థోడే దిన్ కా మెహమాన్ కిసీకి అమానత్ హై " అంది.. "అయ్యో రామా !అత్తా ఇంకా ఏం జరగలేదు" .. "హోతాహై , ఆజ్ నహీతో కల్ అంటూ ప్రవల్లికను ముద్దు పెట్టుకుంది .. బామ్మ ప్రవల్లికను అలాగే పొదివి పెట్టుకుని "భయపడుతున్నావా?" అనడింగింది "లేదు బామ్మా..". "మీ అమ్మ ఇన్నాళ్ళూ తన మనసులో దాచుకున్న వన్నీ బయటకు చెప్పేసింది .. తన భయమేంటో ఇప్పుడు మనందరికీ తెలిసింది కదూ..! అందుకని అమ్మ విషయం కొన్ని రోజులు పక్కన పెట్టి , భర్తతో మొక్కుబడిగా కాదు సంతోషంగా ఉండాలి ..అమ్మ ఇక్కడ మాతో హాయిగా ఉంటుంది.. నీకసలు ఎలాంటి దిగులూ వద్దు " అంది .. "సరి సరి ఏం లేకుండానే ఇంత బిల్డప్పా?" అని వెక్కిరిస్తున్న హర్షతో "అసలు మీ వల్లే కదా ఇదంతా , "బామ్మా! పనిష్మెంట్ ఇవ్వండి రేపందరినీ సినిమాకు తీసికెళ్ళమని " అంటున్న లక్ష్మిని చూసి నవ్వారందరూ.. సశేషం
No comments:
Post a Comment